21, డిసెంబర్ 2017, గురువారం

విదేశాలలో ఉద్యోగ పర్వం!

చాలామంది సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నవాళ్ళకి, లేకపోతే బయటి  దేశాలలో ఇతర ఉద్యోగాలలో పనిచేసే వాళ్ళకి తరచూ ఎదురయ్యే ప్రశ్న - ఏమి నేర్చుకొంటే వెంటనే ఉత్తర అమెరికాలోనో, యూరోపులోనో, ఆస్ట్రేలియాలోనో ఉద్యోగం వస్తుంది అని? త్వరపడి ఇంత చిన్న ప్రశ్నకి సమాధానం తెలియదా అనకండి. అడిగేవాళ్ళు నిజంగా తెలియక అడిగితే  ఇబ్బంది లేదు. అదే తెలిసి అడిగారనుకోండి, ఇది బ్రహ్మ పదార్ధం కంటే క్లిష్టమైన ప్రశ్న. ఇంకో మధ్య రకం వాళ్ళు అంటే అటు ఇటు చెందని వాళ్ళుంటారు. వాళ్ళు అడిగితే ఎలాగో ఒకలా సమాధానం చెప్పొచ్చు. 

ప్రతివాడికి విద్యార్ధి దశనుంచి, ఉద్యోగస్తుడయ్యే క్రమంలో కొద్దో గొప్పో సమస్యలుంటాయి. వాటిని దాటుకుని ఏదో ఒక ఉద్యోగంలో చేరి మెల్లిగా ఒక్కో మెట్టు ఎక్కి చివరికి పదవి విరమణ చేస్తాడు. ఈ పరిణామంలో ఎన్నో దశలు, వాటిలో కష్టాలు నష్టాలు చవి చూసి ఎంతో కొంత నేర్చుకుని, అనుభవం, ధనం సంపాదించి ఉద్యోగరుణం తీర్చుకొంటాడు. అలాగే ఆ దారిలో ఎందరి నుంచే సహాయం పొంది, తానూ సుఖపడి, మరికొందరికి తన చేయి అందించి వాళ్ళని పైకి తీసుకొచ్చి మనిషిగా తన కర్తవ్యం కూడా నెరవేరుస్తాడు. అందులో కొన్ని వింత అనుభవాలు ఎదురవుతాయి. ఎవరు స్వతహాగా ఇంకొకరిని పనికట్టుకొని నిరుత్సాహపరుస్తారని నేననుకోను. కానీ కొన్ని అనుభవాల తర్వాత మన పంథా మారుతుందేమో. కొన్ని సార్లు ప్రశ్నలు అడిగే వాళ్ళ లక్ష్యం ఏమిటో కూడా అర్థం కాదు. గూగుల్ తల్లి ప్రవేశం జరిగిన తరువాత, ఈ తరహా ప్రశ్నలు అడుగుతారా అని మీకనిపించవచ్చు. కానీ అడిగేవాళ్ళు ఉన్నారు.

సరియైన అర్హతలు, చదువు ఉండి అసలు ఏమి తెలియని వాళ్ళు: 

ప్రశ్న: బావ, ఇప్పుడు ఏది మార్కెట్లో హాట్గా ఉంది?
జవాబు: ఏదైనా ఒక రిలేషనల్ డేటాబేస్, ఒక వెబ్ బేస్డ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ తెలిస్తే ఎక్కడో అక్కడ జాబ్లో చేరొచ్చు.
ప్రశ్న: అయితే ఒరాకిల్, సీక్వెల్, మైసీక్వెల్ లలో ఏది నేర్చుకుంటే బావుంటుంది?
 ఏదైనా ఒకటి బాగా నేర్చుకొంటే చాలు
ప్రశ్న: అయితే ఒరాకిల్ నేర్చుకుంటే ఫర్వాలేదా?
జవాబు: ఆఁ  అది సరిపోతుంది.
ప్రశ్న: ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఏదైతే బావుంటుంది?
జవాబు: జావా, సి#, సి++ వీటిలో ఏదైనా ఒకటి బాగానే ఉంటుంది.
ప్రశ్న: వీటిలో ఏది సులభం?
జవాబు: మొదటి రెండిట్లో ఏదైనా ఒకటి కొంత శ్రమతో నేర్చుకోవచ్చు,

వీటితో ఆ జీవుడు ఏదైనా తెలుసుకొని, నేర్చుకొని, బాగుపడితే అంత కన్నా కావలసినది ఏమి ఉంది.

సరియైన అర్హతలు, చదువు ఉండి అన్నీ తెలిసిన వాళ్ళు: 

ప్రశ్న:అన్నా, ఇప్పుడు ఏది మార్కెట్లో హాట్గా ఉంది (అంటే అతి తక్కువ నైపుణ్యంతో అతి ఎక్కువ జీతం సంపాదించడం ఎలా అని అన్వయం చేసుకోవాలి) ?
జవాబు: ఏదైనా ఒక రిలేషనల్ డేటాబేస్, ఒక వెబ్ బేస్డ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ తెలిస్తే ఎక్కడో అక్కడ జాబ్లో చేరొచ్చు.
ప్రశ్న: అయితే ఒరాకిల్, సీక్వెల్, మైసీక్వెల్ లలో ఏది నేర్చుకుంటే బావుంటుంది?
జవాబు: ఏదైనా ఒకటి బాగా నేర్చుకొంటే చాలు
ప్రశ్న: అయితే ఒరాకిల్ నేర్చుకుంటే ఫర్వాలేదా?
జవాబు: ఆఁ  అది సరిపోతుంది.
ప్రశ్న: అయితే సీక్వెల్, మైసీక్వెలకి జాబ్ రాదంటావు?
జవాబు: లేదు. వాటికైనా వస్తుంది. కొన్ని రకాల జంటలకి ఉన్న ప్రాముఖ్యం మరికొన్నింటికి ఉండదు. అంతే కానీ ఇదే నేర్చుకొంటేనే జాబ్ దొరుకుతుందని నాఉద్దేశం కాదు.
ప్రశ్న: ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఏదైతే బావుంటుంది?
జవాబు: జావా, సి#, సి++ వీటిలో ఏదైనా ఒకటి బాగానే ఉంటుంది.
ప్రశ్న: అదేంటి మొన్న మా కజిన్ పైథాన్, రూబీకి మార్కెట్ బావుంది మిగిలినవాటికి జాబ్స్ కొన్నే ఉన్నాయన్నారు?
జవాబు: ఒక్కో చోట ఉన్న పరిశ్రమలని బట్టి డిమాండ్ ఒక్కో రకంగా ఉంటుంది. వీటికి ఎక్కువ, వాటికి తక్కువ అనుకోవక్కరలేదు. ఏదైనా ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ సరిగ్గా నేర్చుకొంటే మిగిలినవి సులభంగానే గ్రహించవచ్చు అందుకని వాటి గురించి అంత చర్చ అక్కరలేదు.
ప్రశ్న: ఏది నేర్చుకొంటే ఎక్కువ జీతము వస్తుంది?
జవాబు: (నా మనస్సులో...  ముందు ప్రశ్నకి సమాధానం చూడరా మూర్ఖుడా!). ఇది ప్రదేశాన్ని బట్టి, కంపెనీని బట్టి మరి కొన్ని కారణాల వల్ల ఒక్కోచోట ఒక్కోలా ఉంటుంది.
ప్రశ్న: నీకు వీటి గురించి అంత బాగా తెలియదనుకొంటా?
జవాబు: అవును. (మనస్సులో...  జీతంతో పాటు కాఫీ టిఫిన్ పెట్టి, కాళ్ళు చేతులు నొక్కుతారా అని అడగలేదు)

హమ్మయ్య, వీడు ఇక్కడ నన్ను వదిలేసాడు కాబట్టి బ్రతికిపోయాను. లేదంటే నేను భూలోకంలోనే నరకలోక శిక్షలన్నీ ఇప్పుడే అనుభవించేవాడిని. ఇదే బాపతు మనకి (అంటే బయట ఉద్యోగాలు చేసే వాళ్ళకి) డబ్బులు ఎలా సులభంగా సంపాదించాలి, పైకి ఎలా యెగప్రాకాలి, విదేశీ పౌరసత్వం ఎలా వెంటనే సంపాదించుకోవాలి లాంటి కిటుకులు చాలా ఉచితంగా ఇస్తారు.

అన్నీ కొంచెం కొంచెం తెలిసిన వాళ్ళు:

వీళ్ళు పై తరగతిలో వాళ్ళలా లౌక్యం లేకుండా అటువంటి ప్రశ్నలే అడుగుతారు. వీళ్ళకి చెప్పటం, ఒప్పించటం కొంచెం సులభమే.

ఏమి తెలియని సామాన్యులు: 

సోడా షాప్ ఓనర్(సోషాఓ): నువ్వు ఎక్కడ ఉంటావు?
నేను: సీడర్ రాపిడ్స్, అయోవా, అమెరికా.
సోషాఓ: అదెక్కడ?
నేను: చికాగో నుంచి పశ్చిమానికి 4 గంటల కారుప్రయాణం.
సోషాఓ: మా దూరపు బంధువు చికాగోలోనే ఉంటాడు.
నేను: చికాగోలో ఎక్కడ ఉంటాడు?
సోషాఓ: ఏమో చికాగోలో ఉంటాడు. నీ జీతమెంత (నాకు తెలుసు మీరైతే ఈ ప్రశ్న అడగరు, కానీ ముందే చెప్పా కదా, సామాన్యుడికి ఈ బాధ లేదు) ?
నేను:  (మనస్సులో... లెక్కలు) సుమారుగా సంవత్సరానికి 17 లక్షల రూపాయలు.
సోషాఓ: అబ్బో ఒక పదిహేను లక్షలయినా మిగలవా?
నేను: మిగలవు. యేవో రకరకాల ఖర్చుల చిట్టా విప్పి చెప్పేను.  (అతనికి అర్థం అయిన్దనుకోను).
సోషాఓ: సరే నన్ను కూడా నీతో తీసుకోపోరాదా? ఏఉద్యోగమైన చేస్తా.
నేను: ఎవరిని పడితే వాళ్ళని ఎప్పుడు పడితే అప్పుడు తీసుకొని పోలేము. దానికి పెద్ద తతంగం ఉంది.
సోషాఓ: అయితే నీప్రయత్నం మొదలుపెట్టు, యెంత త్వరగా వీలయితే అంత త్వరగా తీసుకునిపో..
నేను: సరే, చూస్తాను.

ఇది తెలియని అమాయకత్వం కాబట్టి సర్దుకుపోవచ్చు. ఒకవేళ సమాధానం చెప్పలేదనుకోండి, కళ్ళు నెత్తికెక్కాయంటారు. చెప్పారనుకోండి, వాళ్ళకు నచ్చదు కాబట్టి, వీడికి చేతకాదంటారు. ఏదైనా గట్టిగా మాట్లాడితే మదమెక్కిందంటారు. దీనికి మధ్యేమార్గం లేదు. ఇటువంటివే మన పెరట్లో పెరిగే డబ్బుల చెట్ల గురించి, కాలేజీల గురించి, పెళ్లి సంబంధాల గురించి, వ్యాపారాల గురించి ప్రశ్నలు వస్తూనే ఉంటాయి. ఊరికినే ఉండగలిగితే ఉత్తమం, లేకపోతే ఎలాతప్పుకు తిరగాలి అన్న మీ అనుభవాలు టపాలలో వ్రాసేయండి.  మేము చదువుకొని ఆనందిస్తాము. 

29, నవంబర్ 2017, బుధవారం

Aping the whites

ముందుగా శీర్షికని ఇంగ్లీషులో వ్రాసినందుకు ఏమి అనుకోకండి. తెల్లవాళ్ళని మక్కికి మక్కి అనుకరించడానికి అని చెప్పటానికి వచ్చిన తిప్పలవి. తెలుసుకొన్న కొన్ని సంగతులు యేభాష సరిగ్గా రాని నాలాంటి వాళ్ళు తెలుగులో చెప్పాలని అనుకోవటం సాహసం అనిపిస్తుంది, అంతలోనే వ్రాయాలన్న పూనిక ముందుకు నడిపిస్తూ ఉంటుంది.  ఆ ప్రయోగం యేభాషలో మొదట నాకు తెలిసిందో దాన్నే యథాతధంగా వాడటం మంచిదనిపించింది. ముఖ్యంగా ఒక భాషాప్రయోగం మూలం తాలూకు అర్థం, బలం, ప్రభావం ఏమాత్రం చెడకుండా, తగ్గకుండా చెప్పాలంటే  అదే భాషలో అవే పదాల సముదాయంతో చెప్పటమే ఒక్కోసారి సరైన మార్గం.

పూర్వము ఏకొద్దిమందో తప్పితే, ఎక్కువమంది ఏ ఊరిలో పుడితే ఆవూరులోనే పెరిగి, అక్కడే జీవితమంతా గడిపి అక్కడే తనువు చాలించటం జరుగుతూ ఉండేది. బహుశా గ్రామాలలో స్వయం సమృద్ధి వల్ల  బయటికి వెళ్లే అవసరం ఉండేది కాదేమో! ఆ తర్వాత కొంత కాలానికి తాలూకా పరిధిలో, జిల్లా పరిధిలో వ్యవహారాలు నడిచేవి. ఆతర్వాత మెల్లగా రాష్ట్రస్థాయికి చేరుకొన్నాయి. మెల్లగా బ్రిటిష్ వాళ్ళ పుణ్యామా అని, బస్సులు, రైళ్లు ఏర్పడి, ప్రజల తిరిగే సామర్థ్యం పెరిగి అన్ని చోట్లకి వెళ్ళటం, ఇతర ప్రాంతాల అలవాట్లు నేర్చుకోవటం, వాటిని వారి స్వంత ప్రాంతాలలోకి తీసుకురావటం జరిగాయి. దీంతో మార్పు అనివార్యమయింది. అన్ని మార్పులు మంచివే అయితే నేనిది వ్రాయనక్కరలేదు. ప్రస్తుత పరిస్థితులలో ప్రపంచం అన్ని విధాలుగా చిన్నదవుతోంది. దూరాలు దగ్గరవుతున్నాయి. ఎక్కువ భాషలు నేర్చుకొనే అవకాశాలు పెరిగి, నేర్చుకొనే వాళ్ళు పెరుగుతున్నారు. వాటితో అనేక దేశాలకి వెళ్లే అవకాశాలని సద్వినియోగం చేసుకొనే వాళ్ళు పెరిగారు. అక్కడికి వెళ్లి స్థిరపడి, ఉద్యోగాలు వ్యాపారాలు చేసేవాళ్ళు పెరిగారు.  అక్కడి వాళ్ళు ఇక్కడికి, ఇక్కడ వాళ్ళు అక్కడికి వెళ్లడం రావడం మామూలయిపోయింది. అన్ని దేశాల తినుబండారాలు అన్ని దేశాల నగరాల్లో, పట్టణాలలో, ఇప్పుడు చిన్న ఊళ్ళలో అందుబాటులోకొచ్చాయి. అలాగే కట్టే బట్టలు, ఫ్యాషన్లు, పాషన్లు, తినే తిళ్ళు, చదివే చదువు, నాగరికత అన్ని ఈరాకపోకలతో ప్రభావితం అవటం మొదలయ్యాయి. చాలా మార్పులు స్వాగతించదగ్గవే. కొన్ని మాత్రం తప్పని సరిగా అభ్యంతరకరమే.

పశ్చిమదేశాలలో  చాలా చోట్ల స్వతంత్రం హింస సహాయంతో సంపాదించినది. వాళ్ళ దైనందిన విషయాల్లోనూ, దృక్పథంలోనూ చాలా విషయాలు దానితోనూ, మధ్య యుగాలలో వాళ్ళ మతంలో వచ్చిన మార్పులతోను బాగా ముడివేసుకొన్నాయనిపిస్తుంది.  తెల్లవాళ్ళకి కుటుంబవ్యవస్థ లేదు, వాళ్ళకి పెళ్లి మీద నమ్మకం లేదు, వాళ్ళకి చదువు రాక మన వాళ్ళని ఉద్యోగాలలోకి తీసుకొంటున్నారు,  వాళ్ళకి స్వప్రయోజనం తప్ప మరోటి లేదు, వాళ్ళు పచ్చి మాంసం తింటారు, ఎప్పుడు మద్యం మత్తులో ఉంటారు, పిల్లల పెంపకంలో జాగ్రత్తలు తీసుకోరు ఇలా మరికొన్ని అభిప్రాయాలు చాల మంది భారతీయుల్లో తరచూ వింటూ ఉంటాము. ఈమాటలు పూర్తిగా సత్యం కాదు. ఎందుకంటే ఈ తరహా ధోరణులు మన సంఘంలోనూ  (ఆమాటకొస్తే అన్ని సంఘాలలోనూ, అన్ని దేశాలలోను, అన్ని వేళల ఉన్నాయి, ఉంటాయి, ఎక్కువ తక్కువలే తేడా) ఉన్నాయి. కాకపోతే నిష్పత్తుల విషయంలో వాళ్ళు మనకంటే కాస్త ఎక్కువ చెడు వైపే ఉన్నారు.  బయట నుంచి మనం చెడు ఎంత ఉందనుకొంటున్నామో, లోపల అంతకు కొన్ని రెట్లు మంచి కూడా ఉంది. అన్నిటిలోకి ముఖ్యంగా న్యాయము, చట్టము సంఘంలో ఉన్నసామాన్యులు అందరికి అందుబాటులో ఉండటం విశేషమైన సంగతి. ఇదికాకుండా, అన్య మతాలు, దేశాలు, తెగల వారిని గౌరవించటం, ప్రక్కనవాళ్ళకి సహాయం చేయటం, యోగ్యత ఉన్నవాళ్ళని అందలం ఎక్కించటం, పరిసరాల పరిశుభ్రత, ఆస్తుల పరిరక్షణ, ప్రజలకి సంబందించిన అన్ని ప్రభుత్వ విషయాలని పారదర్శకంగా ఉంచటం, ఎంతటి వారినైనా సహేతుకంగా విమర్శించే  హక్కు, ఎంతటి వారి నైనా తప్పు చేస్తే కోర్టుకి లాగి న్యాయ విచారణ చేయటం, ప్రభుత్వ కార్యాలయాలలో పనులు పద్దతి ప్రకారం జరగటం జరిపించుకోగలగటం, అధికారంలో ఉన్నవాళ్ళని చూసి ప్రజలు భయపడకపోవటం లాంటివి కొన్ని. వీటిలో కూడా గతకొద్ది సంవత్సరాలుగా కొంత మార్పు వస్తోంది. దురదృష్టవశాత్తు అది చెడువైపుకి పయనం కావటం గమనించవలసిన విషయం. చెడు గురించి ఎంతైనా చెప్పొచ్చు, కానీ అది ఈ వ్యాసానికి ప్రస్తుతం అవసరం కానందున, అలాగే మన మీడియా నిత్యం ఊదరగొట్టేస్తుంది కాబట్టి దాన్నివదిలేస్తున్నాను.

ఇక మనవాళ్ళ దగ్గరకొద్దాము. ముందే అన్నట్టు ఈ విచారణ హెచ్చుతగ్గుల మీదే కానీ పూర్తిగా ఉన్నాయా లేదా అన్న చర్చ గురించి కాదు.  మనకి వేరే వాటితో ప్రమేయం లేకుండా మనవైనవి మాత్రమే అయిన సమస్యలు చాలా ఉన్నాయి. వీటికి తోడు పశ్చిమంనుంచి దిగుమతి చేసుకొని మనకి హానిచేస్తున్న వాటి గురించి ముచ్చటించుకుందాము. అమ్మ దినం, నాన్న దినం, ప్రేమికుల (వాలెంటైన్స్) దినం ఇవన్నీ మనకు కావలసిన దినాలా? పొద్దున్న లేస్తే  మనకి అమ్మని, నాన్నని తలుచుకొని రోజుంటుందా? ఇప్పుడున్న సాధనాల సహాయంతొ, యెంత దూరంగా ఉన్నా వారానికోమాటు వాళ్ళతో మాట్లాడతాము కదా! చక్కగా మంచి, చెడు చూసి పెళ్లిళ్లు చేసే చోట, సహజీవనము, డేటింగ్, పెళ్ళికి ముందు ప్రేమలు మన సంఘానికి అవసరమా? తుమ్మితే ఊడిపోయే ఈ సంబంధాలలో మళ్ళీ ప్రేమికుల దినము ఒకటి పెట్టుకుని పండగ చేసుకోవటం అర్థరహితం. వీటి మూలంగా కుటుంబ సంబంధాలు దెబ్బ తిని, వీధికెక్కి కొట్టుకుని ఆపై కోర్టులకెక్కే వాళ్ళు తరచూ మనకి తారసపడుతూనే ఉంటారు. పొరపాటున ఈతరహా ప్రేమికుల మధ్య పెళ్ళయితే, పెళ్లయినంత త్వరగాను విడాకుల లైన్లలో నిలబడుతున్నారు. ఈ పాపం ఎవరిది? సినిమా వాళ్ళు నిత్యం జనాలకి ఏదో ఒక  క్రొత్త వింత చూపెట్టడం అనే పరిశ్రమలో ఉన్నారు కాబట్టి, మనకి అతికినా అతకక పోయినా ఏదో ఒకటి చూపెడుతుంటారు. అది తెలియని యువత గుడ్డిగా అనుకరించి ప్రమాదాల్ని కొని తెచ్చుకుంటున్నారు. ఉదాహరణకి తలల మీద జుట్టుని రకరకాలుగా తరిగి, వింతైన ఆకారాలతో వెళ్లే మగ కుర్రకారుని నేను హైదరాబాద్ లో చూసాను. ట్రాఫిక్ పోలీసులకి వీళ్ళని చూస్తే బకరా దొరికిందని ఆపడం కొన్ని సార్లు చూసాను. ఆపిన తర్వాత కథ మీకు సుపరిచితం. ఇంకా చాలీ చాలని బట్టలతో బయటికి వచ్చే వాళ్ళు, వాళ్ళని చూపులతో తడిమేవాళ్ళు, వీటితో ఇబ్బందులలోకి  వెళ్లే వాళ్ళు, అఘాయిత్యాలకు గురయ్యేవాళ్ళు  కోకొల్లలు.  అలాగే ఈ అవతారాలతో గుళ్ళల్లో ప్రత్యక్షం, ఇంకేముంది ఆపైన చెప్పుకోవడానికి?  తిండి దగ్గరకొద్దాం. ఇంట్లో తాజాగా కూరగాయలతో ఆరోగ్యకరమైన పదార్థాలు చేసుకొని తినటం అతిత్వరలో అంతరించిపోయే కళల్లో ఒకటి. లడ్లు, సున్ని ఉండలు, కాజాలు ఇలాంటి తినుబండారాలన్నీ మోటు, బోరు. బర్గర్లు, పీజ్జాలు, చాకోలెట్లు, కూల్ డ్రింకులు ముద్దు. దీనికి తోడు వేళాపాళా లేని ఆహారపుటలవాట్లు ప్రబలుతున్నాయి. దీంతో అరవై, డబ్భై సంవత్సరాలలో వచ్చే రోగాలు ఇరవైల్లోనే వచ్చి, మిగిలిన జీవితాలు మందులతో లాగించవలసివస్తోంది. ఇవాళ ఫైనాన్సియల్ ఎక్సప్రెస్లో ఒక వార్త వచ్చింది.  రోడ్ల మీద తినే తిళ్ళలో బర్గర్లు, సమోసాలలో ఏది మెరుగన్న విషయం పరిశీలించి,  రసాయనాలు వాడి నిల్వవుండేలా చేసే బర్గర్ల కన్నా దేశీసమోసాలు ఆరోగ్యానికి మంచివని తేల్చారు. పెరిగే రోగాలతో వచ్చే జనాలని రక్షించటానికి ఉద్యోగులు, మందులు, వైద్యం ఇతరాత్రా రూపేణా ప్రభుత్వం ఎంత ఖర్చు చేయాలో ఆలోచించండి.  వీటిలో చాలా మటుకు మనం అరువుతెచ్చుకున్నవి. ఇవి మన జీవితచట్రంలో సరిగ్గా ఇమడనివి.  నేను స్పృజించినవి కొన్నే, అయినా ఇవి చాలు ప్రమాదఘంటికల తీవ్రత తెలియచేయడానికి.

మన పూర్వులు దార్శనికులు, ముందు చూపుతో మనకున్న పరిస్థితులకు అనుగుణంగా కొన్ని పద్దతులను ఏర్పాటు చేశారు.  మన వాటికి దూరం జరుగుతూ, పశ్చిమ/తెల్ల వాళ్ళ  పద్దతులకు  దగ్గరయి వాటిని గుడ్డిగా అనుకరిస్తే మన భవిష్యత్తు ఆగమ్యగోచరంగా తయారవుతుంది. మంచిని ఎవరి  నుంచైనా,ఎక్కడి నుంచైనా గ్రహించడంలో అభ్యంతరం ఉండదు. తెలిసి మనకి అక్కరకు రాని వాటిని స్వీకరించటంలో అంతరార్థం అర్థం అవ్వదు.  వ్యక్తి స్వతంత్రం కంటే సమాజ శ్రేయస్సు, ప్రజాభద్రత ముఖ్యమనుకొన్న భారతీయ సమాజానికి ఇవన్నీ మునుముందున్న పెను సవాళ్లు. మనం మేలుకుని ఈవిపత్తు నుంచి తప్పించుకొనే ఉపాయం చేయకపోతే భారతీయ సంస్కృతీ అనేది క్రీ.శ. 2000 ప్రాంతంలో ఉండేదట అనే  కాలం ఎంతో దూరంలో లేదు.

26, అక్టోబర్ 2017, గురువారం

కొన్ని నిజాలు/అబద్దాలు?

శ్రీరామాయణంలో రాముల వారు అరణ్యానికి బయలుదేరే సమయంలో ఒక చిన్న విశేషం గురించి చెప్పుకుందాము. దశరథుడు రాముణ్ణి అడవికి వెళ్ళొద్దని పలు విధాలుగా ప్రాధేయపడతాడు. రాముడు తండ్రికి నమస్కరించి, మీ మాటని ఆచరణలో పెట్టడమే నా ధర్మమని చెప్పి సెలవు తీసుకొని అంతఃపురంలోంచి బయలు దేరుతాడు. బయటికి వచ్చి సుమంతుణ్ణి రథాన్ని తీసుకు రమ్మని, సీతాలక్ష్మణులతో కలసి రథంలో బయలుదేరుతాడు. ఇంతలో దశరథుడు మేడమీది నుంచి రాముణ్ణి వెళ్లవద్దని కోరుతాడు. అలాగే సుమంతుణ్ణి రథం ముందుకు తీసుకువెళ్ళద్దని ఆజ్ఞాపిస్తాడు. అయితే రాముడు ముందుకే రథాన్ని నడపమని సుమంతుడికి చెప్తే, సుమంతుడు అలా చేస్తే రాజాజ్ఞని ధిక్కరించినట్టవుతుందని రాముడికి చెబుతాడు. రాముడు రథచక్రాల ధ్వనిలో రాజు మాట వినిపించలేదని చెప్పమని చెబుతాడు. సుమంతుడు అది అబద్దం చెప్పటం కాదా అని ప్రశ్నిస్తే, రాముడు ఒక పెద్ద సత్యాన్ని కాపాడటం కోసం ఒక చిన్న నిరపకారమైన అబద్దం చెప్పటం తప్పు  కాదని చెబుతాడు. ఇది త్రేతాయుగపు ధర్మసూక్ష్మం.  

మహాభారతంలో కురుక్షేత్రంలో యుద్ధం హోరాహోరీగా జరుగుతోంది. గురుదేవులు ద్రోణుల వారి స్వైర విహారానికి పాండవుల పనుపున పోరాడుతున్న వీరులు పిట్టలలా నేల కూలుతున్నారు. ఆయనని నిలువరించడం ఎలాగో పాండవులకు అర్థం కాలేదు. మాములుగానే తరుణోపాయం కోసం కృష్ణభగవానుణ్ణి ప్రార్థించారు. ఆయన ఆచార్యుడి బలహీనతని పాండవులకు వివరించి, మరు రోజు యుద్ధం ఎలా చెయ్యాలో చెప్పాడు. అనుకొన్న విధంగా ధర్మరాజు "అశ్వథామ హతః కుంజరః" అని అనటం, పాండవ సైన్యం జయభేరులు మ్రోగించటం,  ఆ రణగొణధ్వనిలో ద్రోణాచార్యులు పై వాక్యంలోని చివరి భాగం సరిగ్గా వినకపోవడం, తత్ఫలితంగా ఆయన అస్త్ర సన్యాసం చేయటం, ధృష్టద్యుమ్నుడు ఆయన్ని హతమార్చటం వెంట వెంటనే జరిగిపోయాయి. ధర్మరాజుకి ఇదంతా ఇష్టం లేకపోయినా కృష్ణపరమాత్మకి ఎదురు చెప్పలేక ఆయన చెప్పిన వ్యూహం అమలుచేయటం జరిగింది. తదనంతరం స్వర్గారోహణ పర్వంలో పైపనికి తగిన శిక్ష అనుభవించేడు అన్నది మరో ద్వాపర యుగపు కథ. 

ఈమధ్యన లింక్డీన్.కామ్ (www.linkedin.com) అన్న వెబ్సైటులో మాతో పనిచేసి వెళ్ళిపోయిన ఒక తోటి ఉద్యోగి దరఖాస్తు చూశాను.  ఈ సంస్థ అన్ని రకాల ఉద్యోగులకి క్రొత్త అవకాశాలని చూపెట్టడానికి, ఇతర సంస్థలు ఇక్కడనుంచి కావలసిన వాళ్ళని ఎంచుకోవడానికి అనువైన ప్రదేశం అని ప్రచారం చేసుకొంటుంది. నచ్చిన ఉద్యోగులు వారికి సంబందించిన కొంత సమాచారం ఇక్కడ పొందుపరుస్తారు.  నేను పైన చెప్పినాయన మరోచోట డైరెక్టర్గా ఉన్నత స్థానంలో ఉన్న వ్యక్తి, తెలివైన వాడు, సామర్థ్యం ఉన్న యువకుడు. అంత వరకు తప్పేమి లేదు. అయితే ఉన్న అనుభవమంతా క్రింది స్థాయి నుంచి వచ్చినట్టు కాకుండా, చేరడమే ఉన్నత ఉద్యోగిగా చేరినట్టు వ్రాసాడు. అతను చేరటం ట్రైనీగా  మాతో చేరి త్వరత్వరగా ఉద్యోగంలో ఎదిగాడు.  కానీ అదంతా దాచేసి ఏమి ఎవరికి తెలియనట్టు  క్రొత్త చోట మెట్లుఎక్కాలని చూస్తున్నట్టు తెలిసింది. పరిశీలించి చూస్తే ఈ తత్త్వం బాగా యువతలో వృద్ధి చెందుతున్నట్లు అనిపిస్తోంది. దీని వల్ల నిజంగా అనుభవం, నైపుణ్యమున్నవాడికి నష్టం కాదా? లేని అనుభవంతో సంస్థలో అత్యున్నతస్థానంలో ఉండి వీళ్ళు ఎవరికి ఉపకారం చేయగలరు?

కొన్ని వారాల క్రితం వరంగల్ జిల్లా కలెక్టర్ ఆమ్రపాలిగారు ఏదో సందర్భంలో ఉద్యోగాలకి ప్రయత్నించే  ఆశావహులు దరఖాస్తుల్లో కొన్ని లేని హంగుల్ని చేర్చటంలో తప్పులేదని వాక్రుచ్చారు. అది కాస్తా పత్రికల్లో కొంత రాద్ధాంతానికి దారి తీసింది. నిరుద్యోగులు ఏదో ఒక వృత్తిలో చేరటానికి, కుదురుకోవటానికి ఆవిడ స్వతంత్రించి ఇచ్చిన సలహా పనికొస్తుంది. చిత్రమేమిటంటే అన్ని సంస్థలు మనం ఇస్తున్న విషయాలు ప్రమాణపూర్వకముగా నిజమని ధ్రువపత్రాలు తీసుకొంటాయి.  అవి నిజం కానీ పక్షంలో మన ఉద్యోగాలు పీకేయడానికి వాటికి హక్కు ఉంది. చట్టపరంగా నేరం కూడాను. అయినా అలా చేసే వాళ్లకి కొదవలేదు. కారుణ్యదృక్పథంతో చూస్తే నిరుద్యోగులు ఏదో విధంగా జీవితంలో స్థిరపడటంలో పెద్ద అభ్యంతరం కనపడదు. అదే పని కొంత అనుభవమున్న వాళ్ళు చేస్తే అనైతికంగాను, ఎబ్బెట్టుగాను, మోసంగాను అనిపిస్తుంది. ఇది కలియుగంలో కథ (మాయ) ఏమో? 

22, సెప్టెంబర్ 2017, శుక్రవారం

పిచ్చి - అతి పిచ్చి

ఒక్కోడికి ఒక్కో పిచ్చి/వ్యసనం ఉంటుంది. మీకస్సలు ఏ పిచ్చి లేదా (మీరు ఈ గ్రహవాసులు కారేమో!)? అయితే ఇక్కడ చదవడం ఆపేసి, ఈ పేజీ మూసేసి వెళ్లిపోండి. డబ్బు పిచ్చి, సినిమా పిచ్చి, కీర్తి పిచ్చి, సీరియల్స్ పిచ్చి, నాటకాల పిచ్చి, ప్రక్కనవాడి తలపై చెయ్యి పెట్టె పిచ్చి, సుత్తేసే పిచ్చి, క్రికెట్ పిచ్చి, పందేల పిచ్చి, క్రమశిక్షణ పిచ్చి, చదివే పిచ్చి ఇలాంటివి కొన్ని. చివరిది పిచ్చేలా అవుతుంది అని అడక్కండి, అనవసరమైనవి చదివి బుర్ర పాడిచేసుకొన్నా, ఎక్కువ చదివి ఏమీ నేర్చుకోకపోయినా అది పిచ్చే. మరికొన్ని బయటికి చెప్తే బావుండదు. అన్ని పిచ్చిలు (ఈ బహువచన ప్రయోగం నాకే నచ్చలేదు, అయినా మీకర్థం అయ్యింది కాబట్టి సర్థుకుపోదాము) ప్రాణాంతకం కాదు, అందువల్ల అన్నింటిని ఒకే గాటన కట్టెయ్యక్కరలేదు. ఎక్కువ భాగం ఆ పిచ్చి ఉన్న వాడిని, వాడి కుటుంబాన్ని బాధిస్తాయి. కొన్ని పిచ్చిలు ధన, మానాలనీ హరించి, వాడిని ఏకాకిని చేస్తాయి.  మిగిలినవి సమాజంలో వారితో బాంధవ్యాలున్న వాళ్ళ జీవితాలని అతలాకుతలం చేస్తాయి.పిచ్చి(లు) మితంగా వాటి పరిమితుల్లోఉంటె సామాన్యులుగా సమాజంలోని మిగిలిన వాళ్ళతో సహజీవనం చేస్తాము.

1982లో భారతదేశంలో మనకి మొదటిసారి ఆసియా క్రీడలు జరిగాయి. మన ప్రజలు ఎక్కువమంది టీవీలు కొనుక్కొని, ఆపోటీలు చూసి బాగుపడిపోతారని కలర్ టీవీల మీద, సీఆర్టీ (CRT - cathode ray tube) పరికరాలమీద దిగుమతి సుంకం బాగా తగ్గించేశారు.  మా ఊళ్లోకి మొట్ట మొదటి టీవీ 1983 లో వచ్చింది. మాఇంట్లోకి రావడానికి మరో 6 ఏళ్ళు పట్టింది. అప్పట్లో దేశం మొత్తం మీద  నాలుగు కేంద్రాల నుంచి ప్రసారం జరిగేది. దక్షిణాదిన మద్రాసు నుంచి వచ్చే అరవ కార్యక్రమాలు సరిగ్గా అందని సిగ్నల్స్ వల్ల, ఒకళ్ళు ఇంటి మీద ఆంటిన్నా (antenna) పట్టుకుని కదిపితే, మిగిలిన వాళ్ళు కనిపించని వినిపించని అర్థం కానీవి చూసే వాళ్ళు. ఎప్పుడైనా తెలుగు సినిమా (వారానికి ఒకటి వేసేవాళ్ళనుకొంటా) వేస్తె టీవీ ఉన్న వాళ్ళ ఇల్లు జనంతో నిండిపోయేది. హైదరాబాద్ నుంచి తెలుగు ప్రసారాలు ప్రారంభం అయినా తర్వాత కథ అందరికి తెలిసిందే. దూరదర్శన్తో, మిగిలిన ప్రైవేట్ చాన్నెల్స్తో మన ప్రగతి చూసి మనం మురిసిపోవలిసిందే. టీవీలు వచ్చిన తర్వాత, వాటితో పాటు పుట్టుకొచ్చిన కార్పొరేట్ స్కూళ్ళు వాటితో మన పిల్లలలో  వచ్చిన మార్పులు అందరికి విదితమే. ఆటా లేదు, పాటా లేదు. చదువు, చదువు, చదువు. లేదా టీవీ, కంప్యూటర్, వీడియో, టాబ్లెట్ గేమ్స్ ఇవితప్ప వేరే లోకం లేదు. దీనితో పిల్లలకి మిగతా పిల్లలతో సంబంధాలు అంతంత మాత్రంగా ఉన్నాయి. 90వ దశకంలో పిల్లలుగా ఉండి  ఇప్పుడు పెద్దలైన వాళ్ళ జీవితాలే ఇందుకు నిదర్శనం.

మాకుటుంబానికి  తెలిసిన ఒక మలయాళీ క్రైస్తవ కుటుంబంలో ఇంటిపెద్ద బాగా క్రమశిక్షణతో కూడిన మనిషి. ఇంటిల్లిపాది ఆయన పెట్టిన నియమాలకు అనుగుణంగా నడిచిపోయేది. ఇల్లు, స్కూలు, చర్చి, ఇవి కాకుండా మరో చోట వాళ్ళ పిల్లల్ని చూడటం అసాధ్యం. పెద్దబ్బాయి తండ్రి ఏమి చేబితే అదే చేసే వాడు. స్కూలు పుస్తకాలు చదుకోవడం, బైబిల్ పఠనం అవే  వ్యాపకాలు.   సినిమాలు, బయట మిగతా పిల్లలతో ఆటలాడటం నిషిద్ధం. పక్కా ఆదర్శజీవి. రెండోవాడు వాళ్ళ నాన్నతో దోబూచులాడేవాడు. పదోతరగతి దాకా ఇద్దరు బాగా చదివేరు. ఇంటరులోకి వెళ్ళేటప్పటికి కొత్తగా వచ్చిన స్వతంత్రంతో రెండోవాడు దారి తప్పి సినిమాలు విరగచూసాడు. ఫలితం చెప్పుకోనక్కరలేదు. ఇటువంటి వాళ్ళు కొంతమంది పదో తరగతి దాకా నిర్బంధ హాస్టళ్లల్లో ఉండి చదివి వచ్చి, ఇంటర్లో వచ్చిన వెసులుబాటుతో సినిమాలతో కొట్టుకుపోయిన వాళ్ళు నాకు ఎరుక. పెద్దవాడు సరియైన దోవలో వెళ్లి జీవితంలో చక్కగా స్థిరపడ్డాడు. మరో స్నేహితుడున్నాడు. అతనికి ఇద్దరు పిల్లలు. స్కూల్ చదువుల్లో ఉన్నారు. వాళ్ళకి ఎక్కువ భాగం టీవీ నిషిద్ధం. కంప్యూటర్ వీడియో ఆటలు కూడా పరిమితంగా ఆడనిస్తారు. అయినా పెద్దవాడేమో ఒక్క కొలిక్కి వచ్చి మంచి కాలేజీకి వెళ్ళబోతున్నాడు. రెండోవాడు ఏదోరకంగా ఆటలవైపు తప్పించుకుపోయే ప్రయత్నాలు మానలేదు. మాకు, మాపిల్లలకి ఈబెడద తప్పలేదు.

ఇంతకి చెప్పొచ్చేదేమిటంటే ఏదైనా మితంగా ఉంటె, తింటే, చేస్తే ఇబ్బంది లేదు.  లేక పోతే  మన జీవితం చిన్నాభిన్నం అవుతుంది. ఒక్కోసారి కొన్ని విషయాలు చదివినప్పుడు మనమెటు ప్రయాణం చేస్తున్నామో అర్థం కాదు. మనలో చాలామంది చిన్నప్పుడు చీపురు పుల్లలతో, చిన్న కొమ్మల పుల్లల్తో బాణాలు చేసి ఆడుకొన్నవాళ్ళమే. సంతల్లో తుపాకీ బొమ్మలు కొనుక్కొని మిగిలిన పిల్లల్ని కాల్చినట్టు ఉత్తుత్తి ఆటలు ఆడాము. అలా అని ఇప్పుడు పెద్దవి, నిజమైనబాణాలతో, నిజమైన తుపాకులతో జనాలమీద పడి చంపట్లేదు కదా! అవే ఆటలు యిప్పుడు పిల్లలు కంప్యూటర్లలో వీడియోలలో ఆడటం చాలా ప్రమాదకరమని మనస్తత్వ శాస్త్రజ్ఞులు హెచ్చరిస్తున్నారు. ఒక తరంలో తప్పు కానిది మరో తరానికి వచ్చేటప్పటికి పెద్ద తప్పు అయ్యికూర్చుంది. మంచి చెడు ఎప్పుడు ఉన్నాయి. చెడు పాళ్ళు గతంలో కంటే ఇప్పుడు పెరిగినట్టు మీకనిపిస్తోందా? మునుపటికంటే ఆటవిక ప్రవృత్తి పెరిగినట్టనిపిస్తోందా? లోపం ఎక్కడుంది?

ఆమ్వే వాడు - క్రొత్త బూచాడు!

మేము కొత్తగా అమెరికా వచ్చిన రోజుల్లో (ఇది పాతికేళ్ల క్రితం సంగతి),  మా సీనియర్లు ఏది చెయ్యాలో ఏది చెయ్యకూడదో చెప్తుండేవాళ్లు. బయటకెళ్ళినపుడు ఎవరైనా ఇండియన్స్ మీ దగ్గరకి వచ్చి పరిచయం చేసుకుంటే కొంచెం పరాక్కుగా ఉండమని హెచ్చరిస్తుండేవాళ్లు. కొన్ని విని ఆచరించే వాళ్ళం, కొన్నేమో వీళ్ళేదో మనకి కథలు చెప్తున్నారని నవ్వి ఊరుకొనేవాళ్ళం.  విద్యార్థులుగా ఉన్నప్పుడు చేతిలో డబ్బులాడక గుట్టు చప్పుడు కాకుండా ఉండేవాళ్ళం. పనిలో పని ఎక్కడికైనా వెళ్ళినపుడు ఎవరైనా భారతీయ మొహాలు (అమెరికాలో దేశీలు, ఫిరంగులు అన్నవి ప్రాచ్యులు, అప్రాచ్యులు అన్నవాటికి సమానార్థాల్లో వాడే పదాలు - మాయాబజారులో అస్మదీయులు, తస్మదీయులు లాగ) కనిపిస్తే మొహం వాచిపోయి ఏదో విధంగా మాటలు కలిపేవాళ్ళము. అందునా తెలుగు మాట వినిపిస్తే పరవశించి పోయి,  వాళ్ళని పరిచయం చేసుకొని కాసేపు మాట్లాడి వెళ్ళేవాళ్ళం. అందువల్ల కాస్త బెంగ తీరినట్టుగా అనిపించేది.

చదువులయ్యాయనిపించి, కొంత కాలం ఉద్యోగాల వేట తర్వాత ఒక క్రొత్త పట్టణంలో ఏదో ఉద్యోగంలో ఇరుక్కున్నాను. అప్పుడు చేతిలో కారు, డబ్బులుండేటప్పటికి తిరగడం మొదలెట్టాను (జల్సాల కోసం కాదు, కొంత ఏమి తోచక, కొంత క్రొత్త స్నేహాలు ఇంకా కుదరక). అలా ఒక్కొక్కసారి మాల్స్ వైపు వెళ్లి ఏమి కొనకుండా తిరిగిరావటం జరిగేది. ఇది పూర్తిగా విండో షాపింగ్ కూడా కాదు. ఏదో  కాలక్షేపానికి తిరగడం, ఆకలి వేస్తె ఏదోఒకటి కడుపులోకి పంపటం, కాలాన్ని చంపడం (కిల్లింగ్ టైం, విచిత్రం కాకపోతే కాలం నన్ను చంపుతుంది కానీ నేను దాన్ని చంపటం ఏమిటి?), లేకపోతే  ఏదో ఒక ఇంగ్లిష్ సినిమా చూసి వెనక్కురావటం జరిగేది. అప్పుడప్పుడు క్రొత్త నేస్తాలు ఎవరైనా కూడా ఉండేవాళ్ళు.

ఇలా బయటికి వెళ్లిన ఒకానోక సందర్భంలో, ఒక దేశీ ఒకానొక మంగలి షాపులో కనిపించాడు. మా సంభాషణ ఇలా ఇంగ్లీషులో కొనసాగింది.  వీడు క్రొత్త బూచాడు

అజ్ఞాత: Hi! how are you?
నేను: Good! how are you?
అజ్ఞాత:You look familiar. Did I meet you before?
నేను: No, I have not met you before.
అజ్ఞాత: Oh, ok, I am sorry. You look similar to someone I know. Anyway, my name is Sudhakar and I work for Amex.
నేను: I am Anyagaami and I work for MSS.
అజ్ఞాత: We should meet for tea at my home.
నేను: Sure, we can.

ఇద్దరం ఒకళ్ళ ఫోన్ నెంబర్ మరొకరికి ఇచ్చుకుని అక్కడి నుంచి పనైనా తర్వాత వెళ్ళిపోయాము.  ఒక రోజు అతను కాల్ చేసి, నీకు డబ్బులు బాగా సంపాదించే ఉద్దేశం ఉందా అని అడిగాడు.  ఉందన్నాను. అయితే నా దగ్గర ఒక గొప్ప వ్యాపారానికి సంబంధించి
ఒక రహస్యం ఉంది. నువ్వు మన దేశంవాడివి కాబట్టి నీకు చెబుతాను అన్నాడు. సరే క్లుప్తంగా వ్యవహారమేమిటి అని అడిగాను. నేనొక కంపెనీకి ప్రతినిధి క్రింద పనిచేస్తున్నాను, వాళ్ళు తయారు చేసే నిత్యావసర వస్తువులు నీకు తెలిసిన వాళ్లకి అమ్మి, వాళ్ళని కంపెనీసభ్యుల క్రింద చేర్పించాలి. ప్రతి వస్తువుకి, ప్రతి సభ్యుడికి కంపెనీ కొంత మొత్తం తిరిగి నీకు చెల్లిస్తుంది.  ఆ పని సరిగ్గా చేసుకొంటూ వెళితే, నెలకి అరవై వేల డాలర్లు  దాకా సంపాదించవచ్చు అని చెప్పి ఎవరో కొంత మంది పేర్లు కూడా చెప్పాడు. మనం చేర్పించిన వాళ్ళు మరికొంత మందిని చేర్పించి, మరిన్నీ వస్తువులు అమ్మితే ఇంకా మనం జీవితంలో పని చెయ్యక్కరలేదు. ఊరికినే కూర్చొని డబ్బులు లెక్కపెట్టుకోవడమే అని అరచేతిలో వైకుంఠం చూపెట్టాడు.

ఇటువంటి కథ నా సీనియర్లు ముందే చెప్పటం వల్ల, నేను ఏదో కారణం చెప్పి తప్పించుకొన్నాను. కథ తాలూకు స్క్రిప్ట్ ఇంచుమించుగా అదే బాణీలో సాగుతుంది. నిన్నెక్కడో చూసాను, లేదా నువ్వు ఇంతకూ ముందే నాకు తెలుసు తరహా. కానీ వీళ్ళ లోగుట్టు తెలియని వాళ్ళు, చదువుకొన్న వాళ్లు కూడా ఈ ఉచ్చులో ఇరుక్కుని విలవిలలాడినవారు నాకు తెలుసు. ఈ చిత్రాలన్నింటికి మూలవిరాట్టు కంపెనీ - ఆమ్వే (Amway). ఆ తర్వాత కాలంలో ఇది ఇండియాలో కూడా వ్యాపారం మొదలెట్టింది. దీన్ని పోలిన కంపెనీలు కూడా వీధికి  రెండు చొప్పున బయలుదేరాయి. మాబంధువులావిడ ఒకరు దీంట్లో చేరి మా అమ్మానాన్నలని బలవంతము చేసి మొహమాట పెట్టి, కొన్ని వస్తువులమ్మింది. కొన్నాళ్లయ్యాకా జనాలు తెలివిమీరి ఆవిడకి డబ్బు ఎక్కొట్టటం మొదలెట్టారు. దాంతో ఒక మంచి రోజు చూసుకొని  ఆవిడ ఆ వ్యాపారం కాస్తా మూసేసింది.  ఇలాంటి గొలుసుకట్టు, పిరమిడ్ వ్యాపారాలు ఎన్ని ప్రజలని మోసం చేసినా, ఎన్ని కేసులు వేసినా, కంపెనీ స్థాపకులు దివ్యంగా వెలిగిపోతుంటారు (విజయ మాల్యా లాగ). సామాన్యులు ఇల్లు గుల్ల చేసుకొంటారు. ఎంతైనా మనిషిలో ఆశ ఎంత చెడ్డదో? అందుకని ఎవరైనా సులభంగా డబ్బులు దొరికే మార్గం చెప్తామంటే అక్కడి నుంచి వెంటనే మాయమవ్వండి లేదా వారి చేతిలో మీరు మాయమవటం ఖాయం. 

31, ఆగస్టు 2017, గురువారం

సుధా మూర్తి గారి చీరలు

మనసుని కోతితో తరచూ పోలుస్తూ ఉంటారు. ఎందువల్లో అది నాకంత సరైన ఉపమానం అనిపించదు.  కోతులు ఏదైనా తినేటప్పుడో,  పిల్లలికి పాలిచ్చేటపుడో, పేలు తీస్తూనో మనకంటే స్థిరంగా, కుదురుగా ఉన్నాయనిపిస్తుంది. ఎక్కడినుంచి యేముప్పొస్తుందా అని ఇంకా కాస్త మెలకువగా, జాగ్రత్తగా కూడా ఉంటాయి. సరే కోతిలోంచి మనిషి బయలుదేరేడు కాబట్టి ఇంకా కొన్ని లక్షణాలు పూర్తిగా పోలేదేమో? అట్లాంటి మనసుని నియంత్రించి కొంత లాభం, పురుషార్థాలు పొందాలని మనిషి చేయని ప్రయత్నం లేదేమో? మన పరిణామక్రమంలో మన పూర్వులు కొంత పరిశోధన చేసి  కొన్ని మార్గదర్శకాలు చేశారు.  మనస్సుని బుజ్జగించి, బ్రతిమాలి మన మార్గంలోకి తెచ్చుకోవాలి కానీ, బలవంతంగా మాత్రం కాదన్నది ప్రాథమిక సూత్రం.  మనస్సుని ఎలా దారికి తెచ్చుకోవాలి అన్న దానికి చాలా పద్దతులున్నాయి. వాటిలో  మన సనాతన ధర్మం నుంచి ఒకటి ఇక్కడ ప్రస్తావిస్తున్నాను.

మా మనస్సు మేము చెప్పినట్టే విని మా స్వాధీనములోనే ఉంది అనుకుంటే మిగిలిన క్రింది భాగం మీకు పనికిరాదు. అన్ని ఆశ్రమాలు జీవితంలో అనుభవించి, కష్టాలు అధిగమించి, మనం చేయవలసిన కర్తవ్యాలు నిర్వర్తించి, చివరికి శరీరం వదలి వెళ్ళేటపుడు బాధ పడకుండా వెళ్ళిపోవాలి (ఏకారణానికైనా) అనుకుంటే మనసు మన అధీనంలో ఉండటం ఎంతైనా అవసరం.  జీవితం యొక్క పరమార్థాలలో ఇదొకటి అని నేను నమ్ముతాను. కాశీకి వెళ్ళినపుడు మనవాళ్లు ఏదైనా మనస్సుకి బాగా నచ్చిన పండునో కూరగాయనో వదిలిపెట్టేయటం ఒక సంప్రదాయం. బహుశా వయసులో ఉన్నపుడు ఈ పని చేయరేమో? లేకపోతే వయసయ్యేదాకా కాశీ  వెళ్లరేమో?   ఈ రెంటిలోను ప్రయోజనం తక్కువ. ఎందుకంటే యెంత త్వరగా ఆపని చేస్తే సాధనకి (ఆ వస్తువుకి దూరంగా ఉండటం సాధ్యమవుతుంది) అంత  ఉపయోగం. నోరు కట్టుకొంటే మెల్లగా అది మనస్సుని ప్రభావితం చేస్తుంది అన్నది అంతఃసూత్రమేమో? క్రమంగా మనసు మీద నియంత్రణ సాధ్యం అవుతుంది. సాధనమున కూరు పనులు ధరలోన ... ఇది నాకు తెలిసిన సంగతి.

కొద్ధి రోజుల  క్రితం సుధామూర్తి గారు చీరలు కొనటం అన్న ప్రక్రియని కాశీలో ఇరవై ఒక్క సంవత్సరాల క్రిందట వదిలేశారు అన్న వార్త వచ్చింది. చిన్న వార్తే, కానీ చదివితే చాల ఆసక్తికరంగా ఉంది. ఆవిడెవరో తెలియకపోతే ఇక్కడ లంకె దగ్గర ఇంగ్లీషులో విషయం గ్రహించవచ్చు.  ఆవిడ రోజూ ఎన్ని చీరలు మార్చినా , ఒక రోజు కట్టినవి మళ్ళి జీవితంలో కట్టకపోయినా అతి సులువుగా రోజులు వెళ్లబుచ్చగలిగిన ధనవంతురాలైన వ్యక్తి.   మరి ఆ నిర్ణయం ఎందుకు తీసుకొన్నారు? ఒకటి - ఎక్కడి నుంచి బయలుదేరేమో (మూలాలు మర్చిపోకుండా) గుర్తెరిగి మాములు సాధారణ  వ్యక్తిలా బ్రతకాలని కోరుకోవటం, రెండు - డబ్బుల కంటే విలువైనవి మనస్సుని అదుపులో పెట్టుకొంటే సంపాదించవచ్చు అని  గ్రహించటం వల్లా. ఆవిడ సాంఘిక సేవ, రచనలు మాత్రమే ఎరిగున్న నేను, ఇది చదివిన తర్వాత ఆవిడ కి 'ఫిదా' అయిపోయాను.  నీతా అంబానీ గారి ఫోన్ ఖరీదు ఇరవై అయిదు కోట్ల రూపాయలు అన్న వార్త ఒకటి చక్కర్లు కొడుతోంది. అది నిజం అని అనుకొంటే - సుధామూర్తి గారు ఏవిలువలని ప్రోత్సహిస్తున్నారో నేను చెప్పక్కరలేదు.

కొస మాట:  పైన చెప్పినవన్నీ పెద్దలు, గురువులు ఎప్పుడో చెప్పినవే.  మనస్సుకి నచ్చిన విషయం కాబట్టి మరోసారి స్పృశించాను. భవిష్యత్తులో వ్రాసే వాటికి కూడా ఇవే ఆధారం.


15, జూన్ 2017, గురువారం

గొల్లపూడిగారి జీవనకాలం

శ్రీ గొల్లపూడి మారుతీరావు గారు తెలియని వ్యక్తి తెలుగుదేశంలో అరుదు. వారిని మళ్ళి పరిచయం చేయటం ఆయనెవరో తెలియని ఆ కొద్దిమంది కోసం మాత్రమే. ఆయన చేయి తిరిగిన రచయిత, నాటక కర్త, నటుడు. ఇవి కాక మరి కొన్ని రంగాల్లో ప్రవేశం కూడా ఉంది. బాగా చదువుకొన్న మనిషి. లోకాన్ని, ప్రపంచాన్ని కలయతిరిగిన మనిషి. మనందరిలాగా మనలోనే ఉన్న చాలా నేలబారుమనిషి* కానీ అసాధారణమైన మనిషి. వారు వ్రాసిన ఎన్నో విషయాలు, ఎన్నో ప్రశ్నలు వారి కలంలోంచి జారిపడి మనలని  ఉక్కిరిబిక్కిరి చేసి,ఉత్తేజపరిచి, కార్యోన్ముఖులని చేయటానికి మాత్రమే బయటికి వచ్చేయేమో అనిపిస్తుంది. ఆయన నటించిన "ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య" చూస్తే, ప్రేక్షకుడికి ఆయన బయట కనిపిస్తే తందామనిపిస్తుంది. అది ఆయన మొదటి సినిమా నటుడిగా. అంటే విలన్ గా ఎంత  బాగా నటించారో అర్థం అవుతుంది. వారు కొన్ని దశాబ్దాలుగా "జీవనకాలం" అనే కాలమ్ వ్రాస్తున్నారు.

నేను అప్పుడప్పుడు ఏదో ఒకటి అర ఆయన  కథల్ని,వ్యాసాల్ని చదవటమే కానీ వారి సాహిత్యం నాకు అంతగా పరిచయం లేదు. ఈ మధ్యన ఏదో  విషయంగా, ఆయన బ్లాగులోకి వెళ్లి అక్కడనుంచి ఈ కాలాన్ని(column) పట్టుకొన్నాను. కౌముది పత్రిక వాళ్ళు సెప్టెంబర్ 15 2008 నుంచి ఇవాళ్టి దాకా గొల్లపూడి గారి అన్ని వ్యాసాల్ని ఇక్కడ భద్రపరచేరు. కోతికి కొబ్బరికాయ దొరికినట్టు వెంటనే చదవటం మొదలుపెట్టి, ఒక వారంలో అన్ని వ్యాసాలూ చదివేను. ఇలా చదవడంలో కొన్ని ఇబ్బందులున్నాయి. మళ్ళి మళ్ళి చెప్పిన సంగతులు, వ్యక్తుల ప్రస్తావన కొంతమందికి నచ్చకపోవచ్చు. వాటిని క్లుప్తంగా మీతో పంచుకుందామని ఈ నాలుగు ముక్కలు. గొల్లపూడిగారి వ్యాసాల్ని స్థూలంగా 1. ప్రస్తుత అవినీతి రాజకీయాలు, నాయకులు, ప్రపంచ నాయకులు, 2. భాష, సంగీతం,  గ్రంథాలు, రచయితలు,సంస్కృతి 3. క్రికెట్, క్రీడలు, రేడియో, సినిమాలు, నటులు, 4. పర్యావరణం, వర్తమాన విషయాలు, కీర్తిశేషులు అని నాలుగు భాగాలుగా చూడొచ్చు. దగ్గరదగ్గర సగానికి పైగా వ్యాసాల్నిమొదటిభాగానికి, మిగిలిన సగాన్ని మూడు భాగాలుగా మిగిలిన మూడు విషయవస్తువులకు పంచారు.

రాజకీయాల్లో ప్రస్తుత నాయకుల గురించి, వాళ్ళ హామీల బూతు మాటల* గురించి, వాళ్ళ వారసత్వాల గురించి, వాళ్ళ అస్థిరత్వం (ఒక పార్టీతో ఉండకపోవటం) గురించి, వాళ్ళ అవినీతి గురించి మీరు చదివితే గాని శ్రీ గొల్లపూడి ప్రతిభ అవగతం కాదు. గడచిన 60 సంవత్సరాలలో మన ప్రగతి, స్వాతంత్య్రం వచ్చినపుడున్న నాయకులు, ఇప్పటి నాయకులు, ఆ నాయకుల వంచకత్వం ఎంతో పదునైన కలంతో చీల్చి చెండాడేరు. ముఖ్యంగా మన క్రొత్త గాంధీలు, నిధులు (నల్లకళ్లజోళ్లవంశం), తెలుగునేల మీది రాజకీయ వంశాల గురించి వారి వ్యాఖ్యలు చదివితే, అయ్యో మనం ఎటువంటి నాయకుల పాలనలో ఉన్నాం, ఏమి పొందుతున్నామో స్పష్టం అవుతుంది. పై రాజకీయ వంశాలలో వాళ్ళు కాకుండా ఓ కల్మాడీ, ఓ రాజా, ఓ శిబుసొరేన్, ఓ మధు కోడా, ఓ లల్లూ, ఓ ములాయం, ఓ మాయావతి, ఓ జయలలిత, ఓ మమతల గురించి ఆయన చెప్పిన కబుర్లు వింటే, వీళ్ళు  మళ్ళీ మళ్ళీ ఎలా ఎన్నికలలో గెలిచి ప్రభుత్వాలు ఏర్పాటు చేస్తున్నారో అర్థం అవుతుంది. తరచూ మహాత్మా గాంధీ గారినో, నెల్సన్ మండేలా గారినో ఎందుకు గుర్తు చేస్తున్నారో తెలుసుకొంటే పాఠకుడు గతం నుంచి ఏమి నేర్చుకోవాలి అన్నది తెలుస్తుంది.

తెలుగు భాష గొప్పదనం, కర్ణాటక సంగీతంలో దాని పాత్ర, ఓ త్యాగయ్య కృషి, ఓ పోతన గారి భాగవతాన్ని మనం ఎందుకు చదివి ఆపద్యాలని  మననం చేసుకోవాలో చెప్పారు. ముఖ్యంగా ఆయన తరంలో రచయితలు మన సాహిత్యాన్ని, ప్రపంచ సాహిత్యాన్ని ఎంత అధ్యయనం చేసి తరువాత వారి కృషి చేశారో వారు చెప్పిన ఉదాహరణలలో  గమనించవచ్చు. అలాగే మన సంప్రదాయాలు, మతం, ధర్మం, సంస్కృతి, సంగీతం, భాష ఒక దానితో మరొకటి ఎలా పెనవేసుకొని ఉన్నాయో తెలియాలన్నా, క్రొత్త పదాలు తెలుసుకోవాలన్నా (ఉదా: విపర్యం, లాయకీ, మరి కొన్ని అప్పుడే మరిచి పోయాను. ఉత్తరాంధ్ర వాళ్ళకి ఇవి తెలిసే ఉంటాయి.) ఆయన వ్యాసాలు చదవాలి. క్రికెట్ గురించి నేను స్పృశించదలచుకోలేదు (మన జాతీయ క్రీడ ఏమిటి? ఇది ఎంతమందికి తెలిసే అవకాశం ఉంది?), దాని గురించి వ్రాసే వాళ్ళు, ప్రచారం చేసేవాళ్ళు, డబ్బులిచ్చేవాళ్ళు చాలా మంది ఉన్నారు. అయితే ఆటగాళ్లు, వాళ్ళ మీద ఆట మీద వ్యాపారాల నీడ ఇవి ఆయన ఎంచుకొన్న వస్తువులు. ప్రపంచంలో ఫుట్బాల్ ఆటగాళ్ల ప్రభావం, వాళ్ళ అభిమానుల ఆశలు, మన దేశంలో ఆటల ప్రోత్సాహము, వాటి భవిష్యత్తు బాగా వివరించారు.

గొల్లపూడి గారు రచయితగా సినిమా రంగంలోకి వచ్చి ఆ తర్వాత నటుడయ్యారు.  ఆయనకున్న సుదీర్ఘమైన అనుభవం వల్ల , సినీ వ్యక్తులతో ఉన్న అనుబంధం వల్ల ఈ వస్తువు గురించి ఆయన వ్రాసిన అన్ని వ్యాసాలూ ప్రత్యేకమైనవే.  ముఖ్యంగా నాగేశ్వరరావు, రామారావు గార్లతో అయన పని చేసిన ఉదంతాలు చదువరులకు బాగా నచ్చుతాయి. అలాగే వివిధ సమకాలీకులతో ఆయన అనుభవాలు కూడా. కీర్తిశేషులు గురించి ఆయన వ్రాసినవన్నీ నామనస్సుకు నచ్చినవే. సినిమాలు, మిగిలిన అన్ని రంగాలలోని ప్రసిద్దుల గురించి పరుషంగా మాట్లాడవలసి వచ్చినా ఎక్కడ నోరు జారకుండాఎంతో మర్యాదతో (ఆయనకి ఇష్టం లేకపోయినా అని నాకనిపించింది) హుందాగా వ్రాయటం నాకెంతో నచ్చింది.  వేటూరి, శ్రీశ్రీ, రావిశాస్త్రి, విశ్వనాథ్ గార్ల  గురించి ఆయన చెప్పిన కబుర్లు ఆహ్లాదకరంగా ఉన్నాయి. మన వనరులని సరిగ్గా (ప్రకృతి, మానవ) వాడుకోక, దుర్వినియోగం చేస్తూ పోతే పర్యవసానాలు ఎలా ఉంటాయో కళ్ళకి కట్టినట్టు చూపెట్టారు.

చివరిగా నా మాటలు కొన్ని చెప్పి ఇక్కడితో ముగిస్తా.  అవినీతి గురించి ఎంతో ఆవేదన పడ్డ ఆయన మనస్సు ఎంతో దుఃఖపడిఉంటుంది. ఎన్నో సందర్భాలలో దాన్ని లేవనెత్తారు. మెజార్టీలని అణగత్రొక్కి, మైనారిటీలని నెత్తి మీద పెట్టుకొనే రాజకీయులని ఎన్నో సార్లు ఆయన ఖండించారు. కంచి పీఠాధిపతిని కారాగారం పాలు చేస్తే ఆయన తప్ప మరే ప్రముఖ వ్యక్తి గళం విప్పలేదు. ఆదర్శాల గురించి, స్వార్థ రహిత నాయకుల గురించి చెప్పిందే మళ్ళి, మళ్ళి చెప్పడం ద్వారా యువతలో ఒక్కరు మారినా, వాళ్ళు దేశానికి మార్గదర్శనం చేస్తారేమో అని ఆశపడ్డారు. వీటన్నింటిలోను మన సంసృతిని, ధర్మాన్ని రంగరించి అందరికి సులువుగా అర్థం అయ్యేలా విడమరచి చెప్పారు. చివరిగా ఆయన బలహీనతల్ని నిర్భయంగా ఒప్పుకొంటూ, నిజం చెప్పడానికి అయినవారిని కూడా విమర్శించటానికి వెనుకాడలేదు.  వీటన్నింటికి జరిగే పరిణామాలకి వెరవలేదు.  ఇవి చాలు గొల్లపూడి గారిని సామాన్యమైన మనిషి అంటూనే, అసాధారణమైన వ్యక్తి అనటానికి.

* ఇవి గొల్లపూడి వారి ట్రేడ్మార్క్ పదాలు, వారికి కృతజ్ఞతలతో.. 

11, మే 2017, గురువారం

రావిశాస్త్రి, శ్రీశ్రీ, విశ్వనాథ, గాంధీ గార్ల సారుప్యం

రావిశాస్త్రి, శ్రీశ్రీ, విశ్వనాథ, గాంధీ - వీళ్ళ పేర్లు తెలియని తెలుగు వాళ్లుంటారని నేననుకోను. ఒక వేళ తెలియకపోతే తెలుసుకోవడం ఈ రోజుల్లో అంత కష్టం కాదు. క్లుప్తంగా.....

రావిశాస్త్రి - రాచకొండ విశ్వనాథశాస్త్రి  - రచయిత, న్యాయవాది, వామభావపక్షవాది.
శ్రీశ్రీ - శ్రీరంగం శ్రీనివాసరావు -  కవి, రచయిత, వామభావపక్షవాది, విరసం స్థాపకులలో ఒకరు.
విశ్వనాథ - విశ్వనాథ సత్యనారాయణ -  కవి, రచయిత, మొదటి తెలుగు జ్ఞానపీఠ బహుమతి గ్రహీత, ఉపాధ్యాయుడు.
గాంధీ - మోహనదాస్ కరంచంద్ గాంధీ - భారత జాతిపిత,  రచయిత, న్యాయవాది.

మొదటి ముగ్గురు తెలుగువాళ్లయితే, చివరి ఆయన గుజరాతీ. మొదటి ఇద్దరు మంచి స్నేహితులు. శ్రీశ్రీ, విశ్వనాథ గార్లకి ఒకరంటే మరొకరికి గొప్ప అభిమానం, గౌరవం ఉండేవి.  ఒకళ్ళ కవిత్వంతో  మరొకరిని ఉత్సాహపరచి, ఉద్రేకపరచి క్రొత్త రచనలను చేసే విధంగా ప్రోత్సహించి మనలని అలరించిన వారే. వీరంతా రచనావ్యాసంగంలో చేయి తిరిగిన వారే. అందరు ప్రజల కోసం సొంత లాభం వదిలిపెట్టి నిస్వార్థంగా సేవ చేసిన వారే. ఎవరికి వారు అశేష ప్రజల అభిమానాన్ని, ఎందరో పాఠకుల ఆదరణని పొందిన వారే. వాళ్ళ సమకాలీకుల దగ్గర నుంచి ఎక్కువ విమర్శలని, తక్కువ ఆదరణని పొందిన వారే.

ఇంత చేసి వాళ్లెవరు నాకు తెలిసి వ్యక్తిగతంగా చెడ్డ వారు కాదు. వారి గురించిన పరిచయ వాక్యాలు కూడా కొంత మందికి కోపం తెప్పించవచ్చు. అయితే నాకు తెలిసినదేమిటి అన్న ప్రశ్న వస్తుంది. అందులోకే వస్తున్నాను. వారు నాకు వారి రచనల ద్వారానే పరిచయం. అన్ని రచనలు చదివాను అని చెప్పను కానీ చదివిన మేరకు వాళ్ళ గురించి ఒక అంచనాకి వచ్చాను. కవి సహజంగా ప్రజాబంధువయిఉంటాడు, వాళ్లకున్న సమస్యలను కష్టాలను చూసి స్పందించి రచనలు చేస్తాడు. అందువల్ల పైపెద్దలంతా ప్రజలకి ఎంతో కొంత ప్రయోజనం ఒనగూర్చే పనులే చేశారు కానీ, ప్రజాకంటకమైన పనులేమీ చెయ్యలేదు. వాళ్ళు ఆశించిన ప్రయోజనం రాకపోయినా వాళ్ళ ప్రయత్న లోపం ఎంత మాత్రం లేదు. అందరు ధృడ సంకల్పం, ఉన్నత వ్యక్తిత్వం ఉన్న వారు, లేకపోతే సమాజం వారిపట్ల ప్రవర్తించిన తీరుకి  వాళ్ళు ఏనాడో చెల్లాచెదురయ్యేవాళ్ళు, జనం గుండెల్లో ఇంత కాలం చోటు చేసుకోవటం కల్ల. ఈ భాగం వాళ్ళ ప్రజాజీవితంకి సంబంధించినది మాత్రమే.

రావిశాస్త్రి గారికి బంధువయినా ఒక ఆవిడ అన్నదాని ప్రకారం ఆయన తాగుడు, పరస్త్రీ వ్యసనాల వల్ల ఆయన కుటుంబం నానా అవస్థలు పడిందని. అలాగే శ్రీశ్రీ గారి వ్యసనాల వల్ల ఆయన భార్యలు సుఖపడినట్టు నాకనిపించలేదు. విశ్వనాథ వారు తనకి ఉన్నా లేకపోయినా అందరికి దానాలిచ్చి మొత్తం కుటుంబాన్ని నిర్లక్ష్యం చేశారని, ఇంట్లో ఆడవారిని సరిగ్గా చూడలేదని వారి కుటుంబంతో పరిచయమున్న ఒకావిడ చెప్పారు. గాంధీ గారి ప్రజాసేవ వల్ల ఆయన పిల్లలు ఎవరూ ఆయనని ఆదరించలేదన్నది జగమెరిగిన సత్యం. ఇవన్నీ వారి వ్యక్తిగత జీవితాలు అయినా అందరికి బహిర్గతమయిన నిజాలే.

ఇంట గెలిచి రచ్చ గెలవమని ఒక నానుడి. పైన చెప్పిన వాళ్ళందరికి వారి వారి కర్తవ్యం, విద్యుక్త ధర్మం తెలియకపోవడం అన్న సమస్యే లేదు. మరి కుటుంబాన్ని వదిలి, దేశసేవ మీద దృష్టి పెట్టటంలో ఉద్దేశం ఏమిటి? సగటు మనుషులుగా మనం వారి ఔన్నత్యాన్ని ప్రక్కనపెట్టి వారి బలహీనతలను రచ్చకెక్కించటం సబబేనా? వాటిని మాత్రమే పరిగణించి, మనం కూడా వారు చేశారు కాబట్టి మేము చేస్తున్నాము అనటం అందమా? లేక వారు చేసిన సేవల ఫలితంగా వాటిని మాత్రమే చూసి మిగిలిన వాటిని తిరస్కరించాలా? కాలేజీ రోజుల్లో వీటి మీద గంటలు గంటలు చర్చలు చేసే వాళ్ళం. వాటిల్లో మేము చేసిన తీర్మానాలు మాత్రం అడక్కండి.



17, మార్చి 2017, శుక్రవారం

బ్లాగుల్లో నేనెందుకు వ్రాస్తున్నాను?

నేను డిగ్రీ పూర్తి చేసుకొని ఉద్యోగం వెతుక్కోవటానికి హైదరాబాద్లో ఉన్నరోజుల్లో, అప్పుడప్పుడు అఫ్జల్ గంజ్లో ఉన్న స్టేట్ లైబ్రరీకి వెళ్లి కాసేపు కాలక్షేపం చేసేవాడిని. అప్పటిదాకా చిన్నఊళ్ళల్లో ఉన్న చిన్న లైబ్రరీల్లో చదివిన నాకు, అంత పెద్ద లైబ్రరీ మొట్టమొదటిసారి చూసేటప్పటికి ఒళ్ళు స్పృహ తెలియలేదు. ప్రత్యేకంగా తెలుగు పుస్తకాలు ఒక పెద్ద గది నిండా పదో, పన్నెండో అరలలో  చక్కగా సర్దబడి కళ్ళకి చాలా ఇంపుగా వుండేవి. అప్పట్లో అరవై రూపాయలు డిపాజిట్ తీసుకొని, రెండు పుస్తకాలు రెండు మూడు వారాలుంచుకొని చదవటానికి  అద్దెకి ఇచ్చేవాళ్లు. ఆరోజుల్ని, ఆరోజుల్లో చదివిన కొన్ని పుస్తకాలు తలచుకొంటే చాలా బెంగగా ఉంటుంది. ఆతర్వాత ఉస్మానియా యూనివర్సిటీ లైబ్రరీకి వెళ్లినా, అక్కడ ఇంకా ఎక్కువ పుస్తకాలు చూసిన, స్టేట్ లైబ్రరీ ఇచ్చిన ఆనందం మళ్ళీ ఆస్టిన్, టెక్సాస్ లోని లిండన్ జాన్సన్ లైబ్రరీలో తెలుగు పుస్తకాలు చూసే దాకా రాలేదు.  చివర చెప్పిన లైబ్రరీలో సౌత్ ఈస్ట్ ఆసియాకి సంబంధించిన చాలా భాషల్లో పుస్తకాలున్నాయి. అప్పట్లో ఆదాయం ఇంకా లేనపుడు, అమ్మ నాన్న ఇచ్చిన డబ్బులతో పుస్తకాలు కొనడానికి చేతులు రాక, వాటి కేసి దిగులుగా చూస్తూ వెళ్లిన రోజులు (కోఠి, ఆబిడ్స్ లో ఆదివారం వీధుల మీద పుస్తకాల అమ్మకాలు చూసే ఉంటారు) ఇంకా గుర్తే.  అప్పట్లో చూసిన కొన్ని అపురూపమైన పుస్తకాలు ఇప్పుడు కొనుక్కుందామనుకొన్నా దొరకని పరిస్థితి మీలో చాలా మందికి అనుభవైక్యమే. క్రొత్త పుస్తకాల వాసన, ఎవ్వరి దగ్గర దొరకని పాత పుస్తకం మనకి దొరకడం, దానిలో ఒక్కొక్క పేజీ త్రిప్పుతూ ఆ తన్మయత్వంలో మునిగితేలటం ఇవన్నీ నోటితోనే, కాగితం మీదో చెప్పే విషయాలు కావు. అనుభవించి తెలుసుకోవలసినవి మాత్రమే. 

అప్పుడు చదివిన కొన్ని మంచి పుస్తకాలలో ఒకటి - "నేనెందుకు వ్రాస్తున్నాను" అన్న పుస్తకం. చదివి చాలా కాలం అయ్యింది. అప్పటివరకు ఉన్న కొందరు లబ్దప్రతిష్టులైన రచయితల చేత ఎడిటర్ వారెందుకు వ్రాయటం మొదలెట్టారో ఒక్కోవ్యాసం వ్రాయించి, వాటినన్నింటిని ఒక సంకలనం క్రింద ప్రచురించారు. శ్రీశ్రీ గారు, గొల్లపూడి మారుతీరావు గారు నాకు గుర్తున్న ప్రముఖులు. పుస్తకం సారాంశం ఏమిటంటే - "నీలో ఉన్న భావాలు అందరితో పంచుకోవాలి, వాటికి ఒక శాశ్వతత్వం కల్పించాలి అనుకున్నపుడు వాటికి అక్షర రూపం ఇచ్చి పుస్తకాలుగా చూడాలనుకొంటావు" - అని. ఊటలో ఉన్న జల ఆగలేక బయటికి ఎలా తన్నుకువస్తుందో అలా నీలో ఉన్న మాట, పాట  గుండెల్లో స్థిమితంగా ఉండలేక బయటకి ఉరికి రావటం అన్నమాట. ఈ రచయితలంతా వారి మొదటి పద్యం, కవిత, కథ, వ్యాసం, ఏదైనా అచ్చు వేయటానికి ఎంత శ్రమపడ్డారో , ముద్రణలో కష్టాలు, కాపీల సంఖ్య, అమ్ముకోవటంలో బాధలు, పారితోషికంతో సమస్యలు ఇలా అనేక విషయాలు చర్చించబడ్డాయి. అయితే వాటిలో ఓకే అంశాన్ని - మనం  అచ్చులో అక్షరాలని చూసుకొన్నప్పుడు కలిగే ఆనందం  -  మాత్రమే నేను స్పృజించదలచుకొన్నాను. ఈపుస్తకం మళ్ళీ ఇంకోచోటెక్కడా తారసపడలేదు. దొరికితే మాత్రం తప్పక  చదవాల్సిన పుస్తకం. ముఖ్యంగా ఔత్సాహిక రచయితలకి ఇది మంచి రిఫరెన్స్ పుస్తకం. ప్రత్యేకంగా ఒక రచయిత మాటలని మరొకళ్ళు యథాతధంగా చెప్పటం కష్టం. వారి మాటల్లోనే చదివితే పొందే అలౌకిక ఆనందం చెప్పనలవికాదు. నేను వ్రాయటానికి పైన పేర్కొన్న పెద్దల మాటలు ఒక విధంగా ప్రేరణ అయితే, మరో రకంగా వ్రాసే వాళ్ళ గుంపులో చేరాలన్న చిన్ననాటి ఉబలాటం.

పూర్వపు (ఇంటర్నెట్ లో న్యూస్ గ్రూప్స్ కూడా రాక ముందు రోజుల గురించి - ఇవేమిటో తెలుసుకోవాలంటే ఇక్కడ నొక్కండి) రచయితలకున్నన్ని సాధకబాధకాలు మనకిప్పుడు లేవని నేననుకొంటున్నాను. కనీసం సొంతంగా బ్లాగుల్లో ఉచితంగా వ్రాసుకోవచ్చు. యేభాషలో అయినా వ్రాసుకోవచ్చు. నచ్చితే వ్రాయవచ్చు లేదా ఊరుకోవచ్చు.  ఎవరిని అకారణంగా కించపరచకుండా (ఇది అన్ని వేళల కుదరేదేమో? కొన్ని విషయాలలో కొందరికి మోదం, మరి కొన్నింటి విషయంలో కొందరికి ఖేదం కలగడం సహజమేమో!), ఏదైనా, ఎప్పుడైనా, ఎలాగైనా వ్రాసుకోవచ్చు. పాఠకులని, ప్రచురణ కర్తలని వెతుక్కోవక్కరలేదు. డెడ్ లైన్లు లేవు, పీకల మీద కూర్చునే వాళ్ళు లేరు. అయితే మనం సరదాగా మన కోసం వ్రాసుకున్నంత సేపే. ఒకసారి లాభాపేక్షతో చేసినా, ఆదాయంకోసం చేసినా, పైన చెప్పినవేవి వర్తించవు. అలాగే తెలుగులో వ్రాతల్ని పుస్తకాలుగా మలుచుకొనేవాళ్ళకి పరిస్థితి అంత ఆశాజనకంగా లేదనే అనాలి (ఈ విషయంలో అనుభవజ్ఞులు ఎవరైనా వాళ్ళ అనుభవాలు వ్రాస్తే బావుంటుంది). నాకు పదేళ్ళప్పుడు వ్రాయాలన్న పురుగు కుట్టటం మొదలు పెట్టింది. కానీ బెరుకు, బద్ధకం, భయం లాంటి ఈతిబాధలు చాలా కాలం ఇబ్బంది పెట్టాయి. చివరికి బ్లాగులు అందుబాటులోకొచ్చాక ఒక వృత్తిపరమైన బ్లాగ్ మొదలెట్టాను. వ్రాత అయితే అచ్చులోకొచ్చింది కానీ, అది పూర్తి సంతృప్తినివ్వలేదు. అది కాస్తా చాలా తక్కువ కాలంలోనే అటకఎక్కింది. ఇప్పటికి ముక్కంటి దయవల్ల అన్ని అనుకూలించి కావలసిన చోటికి వచ్చి, నాకు నచ్చినది వ్రాయటం కొంత సాధ్యమైంది. ఇంకా చాలా దూరం ప్రయాణం చేయవలసి ఉంది. 

వ్రాయటం అనే వ్యాపకం, చదవటం లాగే మొట్టమొదటగా మన ఆత్మసంతృప్తి కోసం చేసే పని మాత్రమే అని నా నమ్మకం. ఆ తర్వాత వరుసలో మన భావాలు ఇతరులకి తెలియచేయటం, వారిని మన మార్గాన్ని అనుసరించమని ప్రోత్సహించటం, వారినుంచి విమర్శలను, వ్యాఖ్యలని కోరటం, క్రొత్త విషయాలు నేర్చుకోవటం  లాంటివి.  చక్కగా, పకడ్బందీగా వ్రాయటం వరకే రచయితగా మన పని,  ఆతర్వాత మళ్ళీ భవిష్యత్తులో చూసుకొంటే, ఓహో బావుంది అనుకోవటం లేదా అయ్యో సరిగ్గా వ్రాయలేకపోయానే, ఇంకా బాగా వ్రాసి ఉండొచ్చేమో అనుకోవటం కూడా బాగానేఉంటుంది. ఎక్కువ మంది చదవడం లేదు, ఎక్కువ కామెంట్లు రావటం లేదు అన్నది మీ చేతిలో లేదు. దానిగురించి చింత కూడా అనవసరం. నేను గమనించిన దాని ప్రకారం క్రమం తప్పకుండా, స్థిరంగా, బిగువుగా, సులభంగా,  సరళంగా పాఠకుల హృదయానికి దగ్గరగా ఉండేలా వ్రాసే వారికి (ముఖ్యంగా శైలి, విషయపరిజ్ఞానం, కథనం బాగా ఉంటే) పాఠకుల కొరత లేదు.  ఇక భాష మీద పట్టు, వ్రాసే విషయం మీద అధికారం ఉన్న వాళ్ళ గురించి వేరే ప్రత్యేకంగా చెప్పేదేమిలేదు. చాల మంది మేధావులు, ప్రాజ్ఞులు, అద్భుతంగా వ్రాసే వాళ్ళు బ్లాగులలో ఉన్నారు. పేరు పేరునా చెప్పటం కష్టం కాబట్టి ఆ ప్రయత్నం చెయ్యట్లేదు. నేను మాత్రం అలాంటి వారి వద్ద నుంచి నిరంతరం స్ఫూర్తి  పొందుతూనే ఉంటాను. కొంత మంది బ్లాగ్ రచయితల వెతలు చూసి, చదువరిగా నా అనుభవంతో ఇది వ్రాయాలనిపించింది. నేనేదో పైనుంచి దిగివచ్చిన అవతారమని చెప్పుకోవటం కాదు. నాకు తెలిసినది మీతో పంచుకొని, నన్ను నేను ఉద్దరించుకోవటానికి చేసే ప్రయత్నం మాత్రమే. నేనెందుకు చదువుతాను అన్నది మరో సారి. 

6, మార్చి 2017, సోమవారం

కంప్యూటర్లో తెలుగులిపి రూపకర్తలు

గమనిక:
నేను చదువుకున్నది కంప్యూటర్ సైన్స్ కాదు, ఇక్కడ వ్రాసిన కొన్ని విషయాలు సమగ్రంగా ఉండక పోవచ్చు, తప్పులుండొచ్చు. కానీ సంబంధిత రంగంలో పని చేస్తుండడం వల్ల, కొంత విషయపరిజ్ఞానం ఉండటం వల్ల దీని గురించి వ్రాయదలచుకొన్నాను.  రెండవది తెలుగునాట మనకి ఇంటికి ఇద్దరైనా సాఫ్ట్ వేరు ఇంజినీరులు ఉన్నా, ఆ రంగంలో పరిశోధనల పరంగా చూస్తే మన వంతు పాత్ర చాలా తక్కువ. అలాంటిపరిశోధకులలో పేరేన్నదగిన ఒకరిద్దరు తెలుగువారిని గురించి వ్రాద్దామన్నదే ఈ ప్రయత్నం. ఒకేసమయంలో చాలామంది ఒకే సమస్యమీద ఏక కాలంలో పనిచేసి, పరిష్కారం కనిపెట్టి ఉండవచ్చు. వారందరిని నేను ఇక్కడ ప్రకటనంగా తెలియచేయక పోయినా, వారందరికి నేను కృతజ్ఞుడను (ఈవేళ తెలుగులో నేను ఇక్కడ వ్రాయటానికి వాళ్ళే కారణభూతులు). మూడవది సామాన్య పాఠకులకు వ్రాద్దామని అనుకొన్నా, క్లిష్టమైన తెలియని సంగతులతో కూడినది అవటం వల్ల అందరికి అర్థం కాకపోవచ్చు. ముఖ్యమైన మైలురాళ్ళు, అప్పుడేమి జరిగింది అన్నవాటికే ప్రాముఖ్యతనిచ్చాను. చాలా పదాలు సాంకేతికమైనవి కనుక ఇంగ్లీషులోనే ఉంచేసాను. 



ఇక కథలోకి.... 
కంప్యూటర్ రంగంలో ట్యూరింగ్ అవార్డు అన్నది భౌతిక, రసాయన శాస్త్రాల లాంటి మిగిలిన రంగాల్లో ఇచ్చే నోబెల్ ప్రైజ్ లాంటిది. ఆ బహుమానం 1974లో తీసుకొన్న ప్రముఖుడు డోనాల్డ్ నూత్ (Donald Knuth - DK గారి సొంత సైట్ లింక్). ఈయన స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో  విశ్రాంత అధ్యాపకులు. ఆయన తర్వాత 20 ఏళ్ళకి మన తెలుగు వారైన రాజిరెడ్డిగారు 1994 లో అందుకొన్నారు. మిగిలిన అవార్డు గ్రహీతలను చూడాలనుకొంటే ఇక్కడ నొక్కండి. రాజిరెడ్డిగారి గురించి, ఆయన కార్నిగీ మెల్లన్ యూనివర్సిటీలో ఆర్టిఫిషల్ ఇంటలిజెన్స్ (AI - artificial intelligence) మీద చేసిన పరిశోధనలు, ఆయనని విజిటింగ్ ప్రొఫెసర్ క్రింద మన ప్రభుత్వాలు ఆంధ్రప్రదేశ్ కి రప్పించటం వార్తల్లో చాలామందే చదివివుంటారు. ఇక్కడ నేను వ్రాసే విషయవస్తువు కోసం DK గారి కృషికి మాత్రం పరిమితమవుతాను. 

టెక్ (TeX) అన్న టైప్ సెట్టింగ్ కంప్యూటర్ భాషను తయారు చేసింది DK గారు. దీన్ని  కంప్యూటర్లో రకరకాల ఫాంట్లని వివిధ రకాల ఆకృతుల్లో తయారుచేయటానికి వాడతారు. అలాగే లేసర్ ప్రింటర్స్ లో ప్రింట్ చేసేటప్పుడు డాటాను ఒక ప్రత్యేక పద్దతిలో (postscript రూపంలో) ప్రింటర్ కి పంపుతారు. దానికి కావలసిన సాంకేతికతని కూడా DK గారే తయారుచేశారు. వీటన్నింటిని కలిపి ది ఆర్ట్ అఫ్ కంప్యూటర్ ప్రోగామ్మింగ్ అని నాలుగు సంపుటాలు వ్రాసారు. వీటిని కంప్యూటర్ రంగంలో ఉన్న చాలా మంది భగవద్గీత క్రింద పరిగణిస్తారు. 1990లలో యూనివర్సిటీలలో వీటిని పాఠ్యపుస్తకాలుగా కంప్యూటర్ సైన్స్ విద్యార్థులు వాడేవాళ్లు. అప్పటికి వేరే భాషల్లో వ్రాయటానికి, లెక్కలకి,  పరిశోధనపత్రాలకి సంబందించిన సింబల్సు కంప్యూటర్లో వ్రాయటానికి వీలయ్యేది కాదు. మైక్రోసాఫ్ట్ వర్డ్ ఉన్నాకూడా దానితో అన్ని వీలయ్యేవికాదు, లేదా అది చాలా ఖరీదుండడంచేత ఎక్కువ మంది వాడేవాళ్లు కాదు. అందువల్ల TeXని ఆధారం చేసుకొని LaTeX అని మరో డాక్యుమెంట్ రైటింగ్ సిస్టం కనిపెట్టారు. ఇది ఎక్కువ భాగం సాంకేతిక రంగంలో ఉన్న వాళ్ళు, పరిశోధన విద్యార్థులు వాడుకుంటుండేవాళ్లు. 1991లో లక్ష్మి ముక్కవిల్లి గారు TeluguTeX అనే LaTeX ని పోలిన తెలుగు సాఫ్ట్వేర్ తయారుచేశారు, కానీ దీన్ని వాడటానికి కూడా కొంత సాంకేతిక నైపుణ్యం అవసరం ఉండేది. 

ఈ పూర్వరంగం సంగతులు మీకు చెప్పడానికి చాలా కారణాలున్నాయి. 1990లలోనే అవినాష్ చోప్డే అన్న ఆయన భారతీయ భాషల్ని కంప్యూటర్లో వ్రాయడానికి ITRANS అన్న సిస్టం తయారుచేశారు, ముఖ్యంగా ఆ రోజుల్లో హిందీ పాటల సాహిత్యం దీని సహాయంతో వ్రాసి ఇంటర్నెట్లో పంచుకొనే వాళ్ళ సంఖ్య వందల్లో ఉండేది.  మన కథానాయకులు రంగంలోకి వచ్చేటప్పటికి ఇవి పరిస్థితులు. ఇంచుమించుగా ఇదే సమయంలో తెలుగులో ఈవిధంగా వ్రాయటాన్ని అందుబాటులోకి తెచ్చిన వాళ్ళు శ్రీయుతులు రామరావు కన్నెగంటి (RK - రామ గారి లింక్ ), ఆనంద కిశోర్ (AR), రమణ జువ్వాది (RJ - రమణగారి బ్లాగ్ లింక్). వీళ్లు  రైస్ యూనివర్సిటీలో చదువుకునేటప్పుడు, వాళ్ళ పరిశోధనలో భాగంగా దీన్ని తయారుచేసినట్టు, చదివిన యూనివర్సిటీ మీద ప్రేమతో వాళ్ళు కనిపెట్టిన సిస్టం ఆపేరు పెట్టినట్టు అప్పట్లో చదివాను. చిత్రంగా వీరి గురించి అప్పట్లో చదివిన వ్యాసాలేవి ఇంటర్నెట్లో అందుబాటులో లేవు. ఇంగ్లిష్ అక్షరాల సహాయంతో తెలుగులో వ్రాయటమన్నది రైస్ ట్రాన్స్లిటరేషన్ సిస్టం (Rice Transliteration System) తో బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది అన్నది నిస్సందేహం.  ఇది కూడా మొదట్లో యూనివర్సిటీలలో, పెద్ద కంప్యూటర్ కంపెనీలలో, పరిశోధనలో ఉన్న తెలుగు వాళ్ళు వాడేవాళ్లు.  పైనిచ్చిన లింకుని అనుసరిస్తే, RTS తాలూకు వివరాలు దొరుకుతాయి. చాల కాలం అంటే లేఖిని తయారయ్యేదాకా చాలామంది దీని సాయంతోనే న్యూస్ గ్రూప్స్ లో తెలుగు వ్రాసేవాళ్ళు. ఆ తర్వాత కాలంలో  ఇంటర్నెట్ మీద, డెస్క్టాప్ మీద తెలుగు కోసం చాలా టూల్స్ వచ్చినా ఇది బాగా మనస్సులో నిలిచిపోయింది. వారి వారి రంగాలలో అత్యున్నత స్థాయికి  చేరటమే కాకుండా, తెలుగును  కంప్యూటర్లో వ్రాయటం విస్తృతంగా వ్యాప్తినొందడానికి పునాదిరాయి వేసి, ఔత్సాహిక రచయితలకి మార్గం సుగమం చేసిన వీరి కృషిని తెలుగు వారంతా గుర్తుంచుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది. 

పైన ఇచ్చినవి కాకుండా RTS గురించిన మరో వ్యాసం సౌమ్య గారి బ్లాగ్లో చూడొచ్చు.  మరో ఉపయోగకరమైన లంకె.

27, ఫిబ్రవరి 2017, సోమవారం

నమ్మకం - అప్పారావు కథ (ఇది కథ కాదు, నిజ సంఘటన)

మీ దగ్గర భలే పుస్తకాల కల్లెక్షన్  ఉందే అని ఒక పుస్తకం అడిగి, రెండు మూడు రోజుల్లో చదివిచ్చేస్తాను అని పట్టుకెళతారు. తెలుసున్నవాళ్ళు కదా అని పుస్తకం ఇస్తాం.  అవికాస్తా రెండు మూడు నెలలవుతాయి. ఒకసారి అడిగి చూస్తాం. మాదగ్గరనుంచి ఎవరో పట్టుకెళ్లారని సమాధానం వస్తుంది. ఇంకో రెండు మూడు రోజుల్లో తెచ్చిచ్చేస్తామని మళ్ళీ హామీలు పొంది తిరిగొచ్చేస్తాము. కొద్దీ రోజులు పోయాక రెండోసారి అడుగుతాము. అదే సమాధానం. మూడో సారి అడిగినప్పుడు, మన మెతకతనం చూసి మీరెప్పుడిచ్చారో అనో, పోగొట్టామనో, లేకపోతే వాళ్ళింట్లోనుంచి మరెవరో తస్కరించారనో వార్త వస్తుంది. నాలాంటి వాడికి గుండె గుభిల్లుమంటుంది (అది అపురూపమైనది అయితే గుర్తొచ్చినప్పుడల్లా పాత గాయం రేగి మళ్ళి బాధ మొదలవుతుంది). మనుషుల మీద నమ్మకం ఒక్కసారి దబ్బున కుప్పకూలి, వాళ్లందరికీ దూరంగా గ్రహాంతరవాసం చెయ్యాలనిపిస్తుంది. మీలో చాలా మంది పుస్తకప్రియులు కాబట్టి ఇది వెంటనే పట్టేస్తారు. అలాగే డబ్బులు చేబదులు తీసుకొన్న స్నేహితులు, దగ్గర వాళ్ళ నుండి ఇటువంటి అనుభవం నా తరం, అంతకు ముందు వాళ్ళకి బాగా ఉండే వుంటుంది. ఇప్పటి వాళ్ళకి చాలా వరకు పుస్తకాలు (తరగతివి కాకుండా) కొనే ఆసక్తి, అవసరం లేవు. డబ్బులు కూడా పుష్కలంగా దొరకటంవల్ల (వారసత్వంగా కానీ, ఉద్యోగాల వల్ల కానీ) వాటి అనుభవాలు తక్కువనే అనుకొంటున్నాను. ఇంతకీ చెప్పొచ్చేదేమిటంటే మనుషుల మీద నమ్మకం పోగొట్టుకోడానికి ఎక్కువ ఉదాహరణలు అక్కరలేదు. నమ్మకం పెంచుకోవాలంటేనే కావాలి. అటువంటి సంఘటన ఒకటి  నాకెదురైనది మీముందుంచుతాను.

80వ దశకం చివరిలో నేను విజయవాడలో ఇంజనీరింగ్ హాస్టల్లో ఉండి చదువుకొనే రోజులు.  కొంత తెలియనితనం, కొంత ఏదో పొడిచేద్దాం, కొంత సాహసం చేయాలనే వయస్సు. స్వంత లాభం కొంత మానుకొని పొరుగు వారికి తోడుపడవోయి అన్నది పూర్తిగా ఆదర్శాల లిస్టులో మాత్రమే ఉండని రోజులు. మా మెస్సులో ముఖ్యమైన వంట చేసే ఆయన, ఆయన అనుచర గణం (సహాయకులు) ఒక 20 మంది పెద్ద వాళ్ళు ఉండేవాళ్ళు. వాళ్ళు కాకుండా 9 నుంచి 15 ఏళ్ళ దాకా ఉన్న పిల్లలని చిన్న చిన్న పనులకి వాడుకొనేవాళ్ళు.  ఒరే, బాలకార్మికులని పనిలో పెట్టుకొంటే దాన్నెందుకు ప్రశ్నించలేదని/అడ్డుకోలేదని అడక్కండి.  అప్పుడు అడగలేదు, ఇప్పుడు అడగను. నేను వ్యక్తిగతంగా మాత్రం వాళ్ళని పనిలో చేర్చుకోను. కారణాలు మనకి తెలుసున్నవే. ఈ పిల్లలకి జీతాలుఇచ్చే రోజు, వాళ్ళ అమ్మానాన్నలో లేకపోతే అన్నో మరో బంధువో వచ్చి డబ్బులు తీసుకుని వెళ్లిపోయేవాళ్లు. ఇది కూడా ఇళ్లల్లో పని పిల్లల్ని పెట్టుకొన్న వాళ్లకి అనుభవమే. అప్పుడప్పుడు వాళ్ళల్లో కొంతమంది పాత బట్టల గురించో, చిల్లర డబ్బుల గురించో స్టూడెంట్స్ దగ్గరకి వచ్చి అడిగి తీసుకుని వెళ్ళేవాళ్ళు. అందులో ఒకతను ఎప్పుడు ఏదో ఒక మాట చెప్పి రూపాయి, రెండురూపాయలో పట్టుకుపోయేవాడు. ఎందువల్లో అతను అబద్దాలు చెప్పి పబ్బం గడుపుకొంటున్నాడనిపించేది అయినా డబ్బులుంటే ఇస్తూనేఉండేవాళ్ళం.

ఆరోజుల్లో మాకు మెస్ బిల్ ( తిండికి, హాస్టల్లోఉండటానికి)  400 -  450 రూపాయల మధ్య ఉండేది. ఇంటినుంచి 500 రూపాయలొచ్చేవి. బిల్లు కట్టగా చేతిలో ఉన్న 75 లేక 50 రూపాయలతో నెల ఖర్చులు నడిచిపోయేవి.  బస్సులో వెళ్లి సినిమాలు చూడటానికి,చిరుతిళ్ళకు సరిపోయేవి. ఎలాగో అలాగే సరిపెట్టుకొనేవాడిని. నావెనకాల ఇంకా ఇద్దరికీ నాన్నగారు మెస్సు బిల్లులు కట్టేవాళ్ళు. అందువల్ల చాలకపోవటం అన్న సమస్యే లేదు, ఒకవేళ అలా జరిగితే ఎవరి దగ్గరో తీసుకొని సాధ్యమైనంత త్వరగా వెనక్కి ఇచ్చేసేవాడిని. అప్పట్లో, అప్పారావు అనే 14 ఏళ్ళ కుర్రాడు అందరికి చిన్న పనులు చేసి పెడుతూ సాయంగా ఉండేవాడు.  ఒకరోజు ప్రొద్దున్న హడావిడిగా రూంకి వచ్చి, 100 రూపాయలుంటే ఇవ్వండి మాఅన్నయ్యకియ్యాలి లేకపోతే వాడికి బస్సు వెళ్ళిపోతుంది అని కూర్చున్నాడు. ఈవేళ సాయంత్రానికి జీతాలిస్తారు మళ్ళి ఇచ్చేస్తాను అని అన్నాడు. నాకేమో రెండు రోజుల క్రితం మెస్ బిల్లులు కట్టగా మిగిలిన 110 రూపాయలున్నట్టు గుర్తు. డబ్బులుండి లేవని అబద్దం చెప్పటానికి మనస్కరించలేదు.  సరే 100 రూపాయలిచ్చి, మళ్ళి సాయంత్రానికి ఇచ్చేయి అని మళ్ళి గుర్తుచేసి పంపించాను.

అప్పారావు వెళ్ళిపోయాడు. నాకు బెంగ మొదలైంది. ఇస్తాడా, ఇవ్వడా? ఎవరికైన చెపితే వాళ్ళు తిడతారేమో అని భయం. పనివాళ్ళకి డబ్బులిచ్చినవి ఎప్పుడు తిరిగిరాలేదంటారని ఒక దుగ్ద. రాకపోతే అమ్మానాన్నలకు ఏమి చెప్పి డబ్బులు తెప్పించుకోవాలన్నది మరో ఆలోచన. ఇలా ఎటూ తేలని ఆలోచనలతో ఎలాగో సాయంత్రం దాకా కాలక్షేపం చేసేసాను. రాత్రి భోజనాల వేళ అయ్యింది. మిగిలిన స్నేహితులతో కలిసివెళ్ళి భోజనం చేసాను. అప్పారావు కనిపిస్తాడేమో అని మెస్సులో అన్ని వైపులా చూసాను. అయిపులేడు. అప్పటి దాకా మనస్సు మనస్సులో లేదు, 100 రూపాయలకేనా అనకండి. అదెంత పెద్దమొత్తంలో ఇంతకుముందే చెప్పాను. ఏది ఏమైతే అదే జరుగుతుందని ఇంక రూంకి వచ్చి, వేరే పనుల్లో పడిపోయాను. రాత్రి 10:30 అప్పుడు తలుపు కొట్టిన చప్పుడైంది. వెళ్లి చూస్తే అప్పారావు గుమ్మం ముందున్నాడు. డబ్బులు వెనక్కిచ్చేసాడు. ఇచ్చేస్తూ నాకేసి ఒక చూపు చూసాడు. ఇప్పుడు మనం అనేక భాషల్లో చెప్పే "థాంక్ యు" లు ఎన్నైనా దాని ముందు దిగదుడుపే. వాళ్ళ సూపర్వైజర్ జీతమిచ్చి ఏదో పని చెపితే బయటికి వెళ్ళాడట అందుకని వెంటనే రాలేకపోయాను అని చెప్పాడు. సరే మరేమి పరవాలేదని చెప్పి అతన్ని పంపించేసాను. ఆతర్వాత అతనెప్పుడూ మళ్ళి అప్పు కోసం రాలేదు.  ఎప్పుడు జారిపోతూవుండే మనుషుల మీద నాకుండే నమ్మకాన్ని అప్పారావు ఎంతో పైకెత్తాడు. ఇది జరిగి దగ్గర దగ్గర ముప్పై ఏళ్ళైనా నాకళ్ళకి కట్టినట్లుంది. అప్పారావూ, నీలోని దేవుడికి ఇదే నా నమస్కారం. 

7, ఫిబ్రవరి 2017, మంగళవారం

సినిమాకొస్తా మామ.......... అమెరికాలో

సినిమాల పిచ్చి మనకున్నంతగా (భారతీయులకి)  మరే జాతీయులకి ఉండదేమో! అందునా ఈమధ్యన తెలుగువాళ్ళ పిచ్చి ఒక మెట్టు పైనే ఉన్నట్టుంది. నేను వారిలో నుంచి వచ్చినవాడినే కాబట్టి నాకింకొంచెం ఎక్కువే ఉంది. దీనికి ఉదాహరణలు కావాలని మీరెవరు అడగరు అని నాకు తెలుసు. అయినా కొన్ని చూపెట్టటం ద్వారా నేను చెప్పదలచుకున్నది ఇంకాస్త బాగా చెప్పగలనేమో అన్న ప్రయత్నం ఇది. ఆన్లైను పత్రికలూ చూడండి, ఫలానా వారి ఆడియో ఫంక్షన్కి అడ్డబాబు గారొచ్చారు, ఫలానా వారి వీడియో ఫంక్షన్కి నిలువుబాబు గారొచ్చారు,  ఇది హెడ్లైన్ న్యూస్. సరే పత్రికల వాళ్ళకి సర్క్యూలేషన్ అవసరం, పైపెచ్చు ఉచితంగా చదువుకోనిస్తున్నారు కాబట్టి పత్రికల వాళ్ళని వదిలేద్దాము. పాపం ప్రింటులో  వచ్చే దిన, వార, మాస పత్రికల్లో విషయాలు ఇంతకంటే గొప్పగా ఏమి లేవు. బ్లాగ్గులలో ఎక్కువ మంది చూసేవి, చదివేవి సినిమా కబుర్లున్నవే. తమాషా ఏమిటంటే ఇవి క్రొత్త వార్తలు కూడా కాదు, పత్రికలనుంచి తీసుకొన్నవే. సినిమా తారల వ్యాఖ్యలు, బొమ్మలు, బట్టలు, మాటలు వాటికి దొరికే ప్రాచుర్యం, వారిని అనుసరించి అనుకరించే యువకులు, నాలాంటి వృద్దులు కోకొల్లలు. ఇక మన ఎంటర్టైన్మెంట్, మన పాపులర్ కల్చరు  అంతా  కూడా సినిమాల చుట్టూ పరిభ్రమిస్తుంటాయి. ఇప్పుడు కవులు, సాహితీవేత్తలు సినిమాకి ఉపయుక్తంగా ఉంటే వెలుగులోకొస్తున్నారు, లేకపోతే విశ్వవిద్యాలయాలలో ఎవరికి అక్కరలేని, తెలియని, తెలుగు ఉపాధ్యాయులకింద మిగిలిపోతున్నారు. ఇది సినిమా తప్ప ఇతరరంగాలలో పని చేసే ప్రముఖులందరికి వర్తిస్తుందేమో? నేను చెప్పదలచుకొన్న కథ ఇది కాదని మీకు తెలిసిపోయింది.

అమెరికాలో సినిమాల గురించి గతంలో కొన్ని వ్యాసాలు బ్లాగుల్లో వచ్చాయి. సరే వాటి రచయితలు కొన్ని సంగతులు చెప్పటానికి మొహమాటపడినట్టున్నారు. నేను, మా ఆవిడ, ఇద్దరు పిల్లలు కలిసి మొన్న శనివారం "నేను లోకల్" అన్న నాని సినిమా చూడటానికి వెళ్ళాము. సాయంత్రం 6గంటల ఆటని చూడాలనుకున్న మేము 5:45 కల్లా హాలుదగ్గరకి చేరుకున్నాం. ఎక్కడ లైన్లు లేకపోవటం వల్ల టిక్కట్లు సులభంగా కొనుక్కుని గబగబా లోపలికెళ్ళాం. సినిమా ప్రదర్శిస్తున్న థియేటర్ చిన్నది. కొన్ని థియేటర్లలో టిక్కెట్టుపైన ముద్రించిన నెంబరుగల నిర్దేశించిన సీట్లలో కూర్చోవాలన్న నియమం ఉన్నా, అన్ని థియేటర్లలో  లేదు. వెనకాల ఉన్న వరుసల్లో కొన్నిసీట్లు  నిండిపోయాయి, మిగిలిన ఖాళీలలో రుమాలు. ఇదొక  ఫార్సు. దీని వివరణ తర్వాత చెప్తాను. ముందు మూడు వరుసల్లో సీట్లు మాత్రమే మిగిలాయి. మాకు ముందు సీట్లలో సినిమాచూడగలిగే శక్తిలేదు. వెనకాల సీట్లలోని ఖాళీ వాటిని బెదిరించో, దేబిరించో అందిపుచ్చుకొని సామర్థ్యం లేదు. అందుకని వెనక్కొచ్చి, టిక్కెట్లు తిరిగిచ్చేసి, 9:20 గంటల ఆటకి మళ్ళి టిక్కెట్లు కొనుకొన్నాము. అక్కడ నుంచి బయటపడి, వారానికి కావలసిన నిత్యావసరాల షాపింగ్ పూర్తి చేసుకొని, ఒక రెస్టారెంట్లో కడుపునింపుకొని, మళ్లీ 8:20 కల్లా హాలుదగ్గరకొచ్చేసి, లైనులో నిలబడ్డాము. 8:40కి లోపలి పంపించారు, హాలులో మొట్టమొదట వెళ్లిన వాళ్ళము మేమే. చివరి నుంచి ఒక వరుస వదిలి, దాని తర్వాత వరుస మధ్యలో నాలుగు సీట్లు ఎంచుకుని కూర్చున్నాము.  9:20కి ప్రదర్శన అందరికి మొదలైంది, దాని వెనువెనకాలే నాకూ సినిమా మొదలైంది.

చివరి వరుసలో ఉన్న సీట్లు గోడకి ఆనిచ్చినట్టుండం వల్ల వాటి నడుముభాగం కదలదు. మిగిలిన అన్నివరుసల్లో వెనక్కి ఆనుకుని, కూర్చొనే వీలు ఉంది (recliner) పడక కుర్చీలోలా. సినిమా మొదలవ్వటానికి ముందు ఒక మనిషి మావెనక వరుసలో కొన్ని సీట్ల మీద రుమాలు వేసి, కొన్ని ఫోన్ కాల్స్ చేసి ఎవరినో పిలిచి ఏసీట్లు తాను దాచేడు చెప్పాడు. ఈలోపల ఆమనిషి బయటికి వెళ్లి వచ్చి, తన అనుంగు జనాలని వాళ్ళ వాళ్ళ సీట్లలో చేర్చి తాను మాత్రం నా వెనకాల సీట్లో  చేరాడు. వాళ్లలో కొంత మంది పిల్లలున్నారు, యేవో కావాలంటున్నారు, అటు ఇటు తిరుగుతున్నారు. నా సీటుని వెనకాల వైపునుంచి తగులుతూ నడుస్తున్నారు. పిల్లలు కాబట్టి వాళ్ళ గురించి వేరే ఏమీ ప్రత్యేకంగా చెప్పుకోవటానికి ఏమి లేదు.  నేను కూడా వెనక్కి తల తగలకుండా కూర్చున్నాను. సినిమా మొదలైన తర్వాత, తల ఆనించి కూర్చున్నాను. వెనక మనిషి కాళ్లతో తన పని మొదలెట్టాడు. కాళ్ళు కదిపినప్పుడల్లా తల సీటుకి తగిలి అదురుతోంది. రెండు మూడు సార్లు వెనక్కి తిరిగి చూసేను, ఏమైనా అర్థం చేసుకొంటాడేమో అని. ఖచ్చితంగా దున్నపోతు అంశతో పుట్టిన మనిషి, ఏమి పట్టనట్టు తన పని తాను చేస్తున్నాడు. కొంత సేపైనా తర్వాత, "మీ కాలు నా సీటుకి తగులుతోంది, వెనక్కి తీసుకోండి " అని చెప్పాను. ఒక నిమిషం తర్వాతా మళ్ళి  కథ మామూలే. ఇంటెర్వల్లో మెల్లగా అదే విషయం చెప్పా.  ముందే చెప్పినట్టు దున్నపోతు కదా, "నాకాళ్ళు ఏమి నీ సీటుకి తగల్లేదు, నీ సీటే వెనక్కి వచ్చి నాకాళ్ళకి తగులుతోంది, మిగిలిన వాళ్ళ ఎవరి సీట్లు వెనక్కి రావట్లేదు చూడు" అని దబాయింపు. భర్తృహరి చెప్పిన్నట్టు మూర్ఖుల మనస్సు రంజింపచేయాటానికి నేనెంత వాణ్ని. సినిమా మిగిలిన భాగం అదే విధంగా కొనసాగిందని  తెలియచెయ్యటానికి చాలా సంతోషిస్తున్నాను. ఎందుకంటారా, అదంతే. సినిమా రెండో భాగంలో నాభార్యకి ఇదే అనుభవం అయ్యిందిట, ఇది ఆ దున్నపోతు పనో లేక ఆపక్కనున్నవాళ్ళ పనో చీకట్లో ఆ పెరుమాళ్ళకెరుక.

ఇందుమూలంగా మీకందరికీ తెలిజేయునది ఏమనగా, మన తెలుగు సోదరులు ఏదేశమేగినా, ఎందు కాలిడినా దాన్ని భ్రష్టు పట్టించగలరు అనటానికి పైనచెప్పినది ఒక చిన్న ఉదాహరణ.  ఆమాత్రానికే ఎన్ని లేసి మాటలంటున్నావంటారేమో? ఇంకొన్ని కబుర్లున్నాయి, వాటిని మీతో పంచుకొంటాను. బాహుబలి సినిమా రిలీజ్ అయ్యిన రోజుల్లో దానికి ఇలాగే కుటుంబం అంతా ఒక గంట ముందు సినిమాహాలుకి వెళ్ళాము. టిక్కెట్లు తీసుకొని, లైనులో నుంచున్నాము (గంట ముందు).  మా ముందర, ఒక 30, 40 మంది ఉండి ఉంటారు. లోపలి వెళ్లేసరికి,  వెనకాల వరుస సీట్లలో కొద్ధి మంది ఉన్నా, ఖాళీ వాటి మీద రుమ్మాలు  ఉంది. నిజంగా ఉందనుకునేరు, కాదు. ఇద్దరో అంతకంటే ఎక్కువమందో వరుసకు ఆ చివర ఈ చివర కూర్చుని మధ్యలో సీట్లు ఎవరొచ్చినా మావాళ్ళున్నారు అని వేరేఎవ్వరిని కూర్చోనివ్వరు. మన సోదరులే కదాని మనం దెబ్బలాడం, యాజమాన్యానికి ఫిర్యాదు చెయ్యం. సరే నేరుగా పోలీసులకి చెబుదామంటే, అమెరికా వచ్చి సినిమా సీట్ల గురించి తోటివాళ్లతో ఏమి కుస్తీలులే  అనుకొని వదిలేస్తాము. అదే వాళ్ళ పాలిట వరంగా మారింది. ఇది నా అనుభవం. సరే మేము తెరనుంచి మూడో నాలుగో వరుసలో కూర్చున్నాము. మాపక్కన ఒక పెద్దమనిషి ఫోన్లో తాను ఎక్కడ ఉన్నది ఎలా వస్తే ఆయన పక్కనకి రావొచ్చో బయట ఉన్న వ్యక్తికి ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నాడు. ఇది సినిమా మొదలవ్వటానికి 10 నిమిషాలముందర మొదలయ్యి ఆతర్వాత 15 నిమిషాలు కొనసాగింది. అంత సేపు సినిమాలో ఏమిజరిగిందో అన్నది అంతంత మాత్రపు దృశ్య చిత్రమే కానీ (ముందర కూర్చుని చూస్తే బొమ్మలు అసలే భూతాల్లా కనిపిస్తాయి) , శ్రవణ ప్రసారం మాత్రం ప్రక్కన వాడి ఫోన్ గోలే. మాప్రారబ్దం ఏమిటో మాకే ఈరకమైన శాకిని డాకిని  జాతి పిశాచాలు తగులుతుంటాయి.  పైపెచ్చు ఈ క్రొత్త తెలుగు సినిమాలన్నింటికీ దర్శకుడు, నిర్మాత, హీరో గారి దర్జా, ఠీవీ లని బట్టి టికెట్ రుసుముంటుంది. బాహుబలికి మనిషికి పాతిక డాలర్లు లాగేరు, మా అనుభవం మాత్రం ఇలాఏడ్చింది. అప్పటినుంచి మాపిల్లలు తెలుగు సినిమాలకి రామని గొడవ,  మాకేమో అప్పుడప్పుడైనా హాలులో సినిమాచూడాలన్న పిచ్చి,  వెరసి అందరికి పండగ అయ్యిపోతోంది. 


ఇవి కాకుండా, గట్టిగా మాట్లాడే వాళ్ళు, ఫోన్లు ఆఫ్ చెయ్యని వాళ్ళు, టెక్స్టులు ఈమెయిలు చూసేవాళ్ళు, సినిమాకత ముందే చెప్పేసే వాళ్లు, సినిమాలో పని చేసినవాళ్ల గురించి, అయిపోయిన సీన్ గురించి పక్క వాళ్ళకి చెప్పే వాళ్లు, అమ్మలక్కల ముచ్చట్లు, ఇరుగు పొరుగు చాడీలు చెప్పుకోవడానికి శరీరం పెరిగి  మెదడు పెరగని తెలుగువాళ్లందరికీ  అమెరికాలో సినిమాహాళ్లు చక్కటి కేంద్రస్థానాలు. పిల్లలకి తెలుగుతో ఉన్న పరిచయం తెగకుండా ఉంటుందని, పిల్లల్ని ఇంటి దగ్గర వదలలేక, వదలాలంటే కాపలాకాసే వాళ్ళకి డబ్బులివ్వ మనస్కరించక, వాళ్ళని నమ్మలేక పిల్లలు వద్దన్నా సినిమాకి యీడ్చుకుపోతాం. అందుకని వాళ్ళ అల్లరికి మనమే బాధ్యులు కాబట్టి వాళ్ళని ఏమి అనక్కరలేదని నా అభిప్రాయం. కానీ వాళ్ళ మాతాపితరుల గురించి ఎంతైనా చెప్పుకోవచ్చు. ఇంత సినిమా పిచ్చి ఉన్న నేను మా మొదటి బిడ్డ పుట్టడానికి 4 నెలల ముందర దాకా సినిమా హాళ్లల్లో ( అప్పటి తెలుగు సినిమాలు హాళ్లలో లేని రోజులు) ఇంగ్లీషు సినిమాలు ప్రతీ వారం చూసే వాడిని. అప్పుడు మానేసిన మేము, గత 4 లేక 5 ఏండ్లుగా అప్పుడప్పుడు బయట తెలుగు సినిమాలు చూడటంతో మా సినిమా కష్టాలు మొదలయ్యాయి. ఈ ప్రహసనంలో ముఖ్యమైన విషయం  ఏమిటంటే ఎవరో ఒకరో ఇద్దరో తప్పితే అంతా సాఫ్ట్ వేరు విద్యావంతులే. పేరుకి మెడచుట్టు చాలా పట్టాలుండవచ్చేమో గాని, సంస్కారం ఇసుమంతైనా లేదు. ఇక్కడున్న సంఘంలో మనమెలా మసలుకోవాలన్న స్పృహ లేదు. అందుకే మనవాళ్ళు చదువుకున్నవాడు కంటే చాకలి మేలు అన్నది. ఇక్కడ అమెరికన్స్ మనల్ని ఈసడించుకోవడానికి ఇవి కొన్ని కారణాలు. ఇవన్నీ చిలికి చిలికి గాలివాన అయ్యి, మన ప్రగతిని ఐశ్వర్యాన్ని చూసి అసూయచెంది, భారతీయుల్ని అమెరికాలోంచి బయటకి పంపాలని చూస్తున్నారని మన పత్రికల ఉవాచ. నేను అబద్దం చెబుతున్నాను అనుకొంటే మీకు పరిచయమున్న ఎవరైనా అమెరికాలో 15 ఏళ్ళ కంటే ఎక్కువ సంవత్సరాలుగా  (2000 కు ముందు వచ్చిన వాళ్ళు) ఉంటున్న వ్యక్తుల్ని కనుక్కోండి. నిజం మీకు తెలుస్తుందని తద్వారా మనం మారితే తర్వాత తరాలు నామోషీ, సిగ్గుతో జీవితం ఇక్కడ గడపకుండా తలెత్తుకు తిరిగే రోజులొస్తాయని ఒక దిక్కుమాలిన ఆశ. నాకు ఇండియాలో ఈ విధంగా సినిమాలు చూడటం బాగానే తెలుసు. కానీ అమెరికాలోను అదే కథ పునరావృతం కావటం నచ్చలేదు. నా సోదర, సోదరీమణుల బాధల నుంచి తప్పించుకోవటానికి నాకున్నవి రెండే మార్గాలు. ఒకటి తెలుగు సినిమాలు బహిష్కరించి, ఇంగ్లీషువి మాత్రమే చూడటం. లేదా అన్ని మానేసి గుట్టుచప్పుడు కాకుండా ఇంట్లోనే అందుబాటులో ఉన్నవి చూడటం. 

కొసమెరుపు: మొదటిసారి బాహుబలి సరిగ్గా వినపడక, కనపడక చూశామని అసంతృప్తితో, దగ్గరేఉన్న సినిమాహాలు అచ్చిరావట్లేదని 45 మైళ్ళ దూరంలో ఉన్న ఇంకో హాలుకెళ్ళాం (పిచ్చివాళ్లమని ముందే మనవి చేసుకొన్నాను). అర్ధగంట ముందే లైన్లో ఉండి, లోపలికెళితే అదే సీన్ (మీకు అదే దెబ్బ అనిపించిందా? ఏదో ఏంటోడి సినిమా... ) మళ్ళీ మాకళ్ళకి ఎదురయ్యింది.  ఈసారి కొంత సాహసం చేసి వెనకాలకంతా  వరుసలో ఖాళీల దగ్గర ఉన్న పెద్దమనిషిని అయ్యా మాకు రెండు సీట్లు కావాలి ఇవ్వండి అన్నా. కొంచెంసేపు భార్యతో మంతనాలు ఆడి, ఉన్న నాలుగులో రెండు మాకిచ్చాడు. ధర్మాత్ముడు దయతలిచాడు. తర్వాత నాకథ చెప్పి పరిచయం చేసుకొన్నా. ఆయన పాతికేళ్ల క్రిష్టం విద్యార్థిగా వచ్చి, ఇక్కడ కాపురం చేసుకొంటూ, మొట్టమొదటిసారి తెలుగు సినిమా చూట్టానికి వచ్చాట్ట. నాకథ విన్నతర్వాత ఇటువంటి పిచ్చివాళ్ళుంటారా అన్నట్టు చూశాడాయన.  ఇంత మంది దురాత్ముల గురించి చెప్పి, ఒకమంచి వ్యక్తి గురించి చెప్పక పోవటం దోషం. అందుకనే ఈ చివరి పేరా ఆ శ్రీనివాస్ గారనబడే సహృదయుడి కథతో ముగిస్తున్నాను. ఇదంతా స్వానుభవం, కథ కాదు, అంతా వాస్తవమే.

1, ఫిబ్రవరి 2017, బుధవారం

సమస్యా నువ్వు పారిపోతావా?

గౌరు గోపాలదాసు గురించి తెలియని వారు ఇంటర్నెట్ తో పరిచయం ఉన్న భారతీయులు తక్కువమంది ఉంటారని నేను అనుకొంటున్నాను. ఆయన ఇస్కాన్ ఇండియా లో ప్రముఖ సభ్యుడు. మొన్న ఏమి తోచక ఆయన ముంబై ఐ ఐ టి విద్యార్థులకు చేసిన ఒక ప్రసంగం యూట్యూబ్ లో విన్నాను.  ప్రసంగం పేరు "అద్బుతమైన జీవిత రహస్యాలు - పది బంగారు సూత్రాలు". ప్రసంగమంతా నేటి యువతరాన్ని ఆకట్టుకొనే విధంగా, వాళ్ళ ఆశల్ని, కోరికల్ని భంగపరచకుండా, వాళ్ళ అసాధ్యాలని సుసాధ్యాలు చేసుకోవటం ఎలా అన్నది, నవతరానికి కావలసిన అన్ని రకాల హాస్యంతో కూడిన ఉదాహరణలతో రంగరించి,  గొప్ప ఆధ్యాత్మిక విషయాలను మేళవించి, హిందీ ఇంగ్లిష్ లలో అనర్గళంగా రెండు గంటల పాటు సాగింది. 

ప్రసంగంలో పది ఇంగ్లిష్ పదాలు, వాటి వివరణ, వాటిని ఎలా వాడుకొంటే మనకి జీవితం సఫలం కాగలదన్నది వివరించారు. ఇది అన్ని వయస్సుల వారికి, అన్ని సమయాలలోను పనికివచ్చే సూత్రాలు. దాంట్లోనే ఒకచోట ఒక పదవివరణ కోసం (క్లుప్తంగా చింతకి దూరంగా ఎలా ఉండాలి అన్న సంగతి), ఒక ఫ్లోచార్టును వాడారు. ఫ్లోచార్ట్ అన్నది సైన్స్, ఇంజనీరింగ్ రంగాలలో ఏదైనా కఠినమైన విషయాన్నీ విడమర్చి చెప్పటానికి, సులభంగా అర్థం అవ్వడానికి తరచూ వాడతారు. అది నన్ను బాగా ఆకట్టుకొంది. మీక్కూడా నచ్చుతుందని, దాన్నీనాకు తోచిన విధంగా తెలుగులోకి తర్జుమాచేసి ఇక్కడ పొందుపరుస్తున్నాను. ఇది ఆచరణలో ఆయన చెప్పినంత సులువు కాదు.  అయినాకానీ సమస్యా నువ్వు పారిపోతావా? లేదా? అని అనగలిగే ధైర్యం వస్తుందేమో అని ఈ ప్రయత్నం. 


27, జనవరి 2017, శుక్రవారం

మౌనం వీడండి

మీరు మీ తల్లితండ్రులని ఎందుకు ప్రేమిస్తున్నారు?
మీరు మీ పిల్లలని ఎందుకు ప్రేమిస్తున్నారు?
మీరు మీ బంధువులని ఎందుకు ప్రేమిస్తున్నారు?
మీరు మీ ఇరుగుపొరుగులని  ఎందుకు ఆదరిస్తున్నారు?
మీరు మీ ఉపాధ్యాయులని  ఎందుకు గౌరవిస్తున్నారు?
మీకు మీ మాతృభాష అంటే ఎందుకంత ఇష్టం?
మనం మన సంస్కృతిని ఎందుకు కాపాడుకోవాలి?
మన జీవితపరమార్థం ఏమిటి? దేవుడున్నాడా?
సనాతనధర్మం అంటే ఏమిటి? మన ధర్మం ఏమిటి?
మన కర్తవ్యాలు ఏమిటి? బాధ్యతలేమిటి? మతమంటే ఏమిటి?

ఇలాంటివి సగటు మనిషికి తరచూ లేక ఎప్పుడైనా జీవితంలో వచ్చే అనేక సందేహాలు. నేనూ సగటు మనిషినే. 2009లో ఒక దశలో మనస్సు బాగోలేక కొద్ది రోజులు చాలా అవస్థ పడ్డాను. అదేసమయంలో భారతావనికి వెళ్ళటం, మాఇంట్లో మానాన్నగారు చూస్తున్న ఒక ప్రవచనం  ప్రోగ్రాం టీవీలో చూడటం జరిగింది. మా నాన్నగారు మాట్లాడుతున్న వ్యక్తిని పరిచయం చేసి, ఈయన మన పౌరాణికగ్రంథాల మీద అద్భుతమైన ప్రసంగాలు చేస్తున్నారు, వినమని సలహా ఇచ్చారు. సరే ఆయన గురించి తెలియని వారెవ్వరు? వారు ప్రపంచంలో ఉన్న తెలుగు వాళ్ళందరికీ సుపరిచితమైన బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావుగారు.

వెనక్కి వచ్చేసిన తర్వాత కొన్ని వెబ్సైట్లు వెతికి కొన్ని ప్రవచనాలు డౌన్లోడ్ చేసుకొని వినటం మొదలుపెట్టాను. అదొక అమృతఝరి. వినేకొద్దీ ఇంకావినాలి, వినేకొద్దీ ఇంకా తెలుసుకోవాలి అనే ఉత్సాహం ఇనుమడించింది. వింటున్న కొద్దీ శరీరంలో కంపనాలు, కొన్ని పద్యాలు వింటే గొప్ప సంతోషం గొప్ప అనుభూతి, మరికొన్ని సంగతులకి ఓహో ఇంత అజ్ఞానంలో ఉన్నానని సిగ్గు, నాకున్న భాషాపరిజ్ఞానం ఆ అనుభవాన్ని మాటల్లో చెప్పలేనిది. ఆ మాటలు నాలో నిద్రాణంగా ఉన్న బలాలను పునరుద్దరించాయి, నా బలహీనతలను గుర్తుచెయ్యటం మొదలు పెట్టాయి. కొద్దిరోజుల తర్వాత డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.శ్రీచాగంటి.నెట్ ని కనుక్కోవటంతో గురువుగారితో కలిసి నాప్రయాణం మొదలైంది. రోజు ఏదో ఒక సమయంలో కాసేపు వినటం అలవాటు అయ్యింది. చాలా తెలుగు జాతీయాలు, సామెతలు, నుడికారాలు, క్రొత్త పదాలు,  ప్రామాణికమైన ప్రతిపదార్థాలు, పద్యాలు, శ్లోకాలు, మన సంస్కృతీ, మన వైభవం, మన పూర్వీకులు, మన జాతి గొప్పతనం, వ్యక్తిత్వవికాసం ఇది అది అని లేకుండా సువిశాల భారతదేశం,దాని గొప్పదనం, ప్రజలు గురించి నేను చాలా తక్కువ సమయంలో ఎన్నో విషయాలు తెలుసుకున్నాను. ఒకరకంగా ఇది నాకు మళ్ళీ వయోజనవిద్య.  బడికి వెళ్లకుండా ఇంటిదగ్గరనుంచే అనేక క్రొత్త విషయాలు నేర్చుకొనే అవకాశం కల్పించింది.  అతిత్వరగా నా శోకంలోంచి బయటపడ్డాను.

ఒకసారి గురువుగారి ప్రవచనాల రుచి తెలిస్తే, ఆ ప్రభావంలోంచి బయటికి రావటం చాలా కష్టం. అవి అన్ని కళ్ళకు కట్టినట్లు మీ మనోనేత్రంలో గోచరమవుతాయి. రాముడి గురించి ఆయన చెప్తే, మీరు రాముడిని చూస్తూ రాముడు చెప్పేది వింటున్నట్టు అనిపిస్తుంది. కృష్ష్ణుడు గురించి ఆయన చెప్తే, మీరు కృష్ష్ణుని చూస్తూ కృష్ష్ణుడు చెప్పేది వింటున్నట్టు అనిపిస్తుంది. ఆయా పాత్రలతో మీరు కలసి మెలసి ఆపనులన్నీ, ఆసంభాషణలన్నీ మీరే చేసినట్టుంటుంది. మీరున్న చోటునుండి కదలకుండా, అన్ని ప్రదేశాలు కాలంతో సంబంధం లేకుండా దర్శించేయొచ్చు. నాతరానికి ఒక పెద్దదిక్కుగా, మంచి చెడు తారతమ్యం  చెప్పేవారుగా వారుండటం నేను చేసుకొన్నసుకృతం.  అమ్మ గురించి ఆయన పలు సందర్భాలలో ఇచ్చిన  సందేశం వింటే మీకు గగుర్పాటు కలిగి, ఇన్నిరోజులు ఎందుకు గురువుగారి వాణి వినలేదని బాధ కలుగుతుంది. ఒకసారి మీరు కూడా వినండి, నేను చెప్పేదాంట్లో అతిశయోక్తి లేదని, వినేకొద్దీ తన్మయత్వం, పరవశం పెరిగి మిమ్మల్ని ఎలా కట్టిపడేస్తారో చూడండి. పైన ప్రశ్నలన్నింటికీ మీకు ఈపాటికి సమాధానం దొరికేపోయిఉంటుంది. దొరకలేదా శ్రద్ధగా మళ్ళీ వినండి. మీరు తెలుసుకోండి, మీ సన్నిహితులతో పంచుకోండి.

ఇంత జ్ఞానం సంపాదించుకుని, దాచుకోకుండా ఎందుకు గురువుగారు అందరికి పంచుతున్నారు? అది సంపాదించుకోవటానికి యెంత తపస్సు, సాధన చేశారు? అంత కష్టపడి నేర్చుకొన్నది ఎందుకు ప్రతిఫలాపేక్ష లేకుండా ఊరికే పంచేస్తున్నారు? వీటన్నింటికి కూడా ఆయనే ఒకచోట సమాధానం ఇచ్చారు. జ్ఞానం పంచుకొంటే వృద్ధిచెందుతుంది. అది ఆయన స్వధర్మం కూడా అని. ఒక మనిషి ఇప్పుడున్న పరిస్థితులలో, తన స్వంత లాభం, తన కుటుంబం బాగు మానుకొని, సమాజానికి అశేషమైన కాలం, శ్రమ దానం చేయటం సామాన్యమైన విషయం కాదు. తాను ఏది ధర్మం, కర్తవ్యం అని నమ్మారో దాన్నే చెబుతున్నారు, పాటిస్తున్నారు.  అంటే తానూ నమ్మిన విలువలు తన జీవితంలోనే ఆచరణాత్మకంగా చూపెడుతున్నారు.

ఇంత చేస్తున్న ఆయనకి మనం తిరిగిచ్చినది ఏమిటి? మనస్తాపం, అపనిందలు. తిట్లు, చీవాట్లు, కేసులు. ఇవి అవసరమా? మనలని ఉద్ధరిద్దామనుకొన్న వ్యక్తికి మనమిచ్చే సత్కారం ఇదేనా? ఆయన చెప్పిన విషయాలని అసంబద్దంగా ముక్కలు చేసి జనాలకి అబద్దాలు చెప్పి ఎన్నాళ్ళు పబ్బం చేసుకొంటారు? పూర్తిగా ఒక విషయం మీద ఆయన చెప్పిన పూర్తి పాఠాన్ని వినండి, అవగాహన పెంచుకోండి, మీకు నచ్చిన వారితో పంచుకోండి, మీ జీవితాలని ఆనందమయం చేసుకోండి, ఇతరులని ఆనందస్వరూపుల్నీ చేయండి.  ఒక అభిమానిగా, సనాతన ధర్మం నమ్మేవాడిగా నా ప్రార్థన ఇంతే. మీకిష్టం లేకపోతె వినొద్దు, వారి జోలికెళ్లొద్దు.  అలాకాదు సగమే వింటాం, మాలాంటి ఇతరులు చెప్పే చెప్పుడు కబుర్లు వింటాం, మాకు తెలిసిన మిడిమిడి జ్ఞానంతో ఆయన్ని అది చేస్తాం ఇది చేస్తామంటారా, మీ పాపం మీరు వండుకొంటున్నారు. ఆయనకీ ఏమి అవదు. ఒకసారి ఆయన అన్నట్టు అన్ని మానేసి, ఇంట్లో వారి సతీమణికి చెప్పుకొన్నా వారిద్దరూ తరిస్తారు. ఏమైనా కోల్పోతే అది మనమే. ఇంతటి మహనీయుణ్ణీ  కించపరిచి, అవమానాల పాలు చేసి మనం బాపుకొనేదేమి లేదు పాపం మూటకట్టుకోవటం, మన పతనానికి గోతులు త్రవ్వుకోవటం తప్ప.

నా ఆక్రోశమల్లా  అందరిని బాగుచేద్దామని కాదు, కొందరిలోనైనా వివేకం గుర్తుచేసి ఎందుకు ఒక మంచి మహనీయుని ప్రోత్సాహించాలో, వారికి ఎందుకు అడ్డుపడకుండా ఉండాలో తెలియచేయటానికి. గురువుగారు మన సమకాలీకులవటం మన అదృష్టం.  ఒకే ఒక్క మనిషి నిస్వార్థంగా, సాత్వికంగా, జనరంజకంగా మన సనాతనధర్మ పరిరక్షణకు అనితరమైన కృషిచేస్తుంటే, వారికి చెయ్యిఅందించాలనుకొంటే దీన్ని నలుగురితో పంచుకోండి. వారికి అన్ని విధాలా సహకారం అందించి మీవంతు పాలుపంచుకోండి. మన జాతిలో ఐక్యతని పెంపొందించండి. భావితరాలకు మన విజ్ఞానం పంచే మహాత్ములని దూరం చేసుకోకండి. ఇటువంటి సత్పురుషులని మీ పిల్లలకి పరిచయం చేయండి. కొద్ది మంది చేసే దుష్ప్రచారాన్ని త్రిప్పికొట్టండి, అటువంటి వాదనలు ఖండించండి. మీకు ఉపయోగపడతాయని క్రింద కొన్ని లింకులిస్తున్నాను. 

సర్వేజనాః సుఖినోభవంతు. 
ఓం శాంతిః శాంతిః శాంతిః!!


శ్రీచాగంటి వారి ప్రవచనాలు దొరికే చోటు 

శరత్చంద్రికగారి బ్లాగ్లో గురువుగారి మీద వ్యాసం 

గురువుగారిని  సమర్థిస్తున్న వారికోసం పిటిషన్ 

23, జనవరి 2017, సోమవారం

మరో శకం

డోనాల్డ్ జాన్ ట్రంప్ 45వ దేశాధ్యక్షుడిగా మొన్న శుక్రవారం ప్రమాణస్వీకారం చేశారు. అభిమానులు, కుటుంబం, గతఅధ్యక్షులు వెంట ఉండగా ఉత్సవం అట్టహాసంగా జరిగింది.  ఒకవైపు సంబరాలు, మరో వైపు నిరసన సెగల మధ్య మరో శకం మొదలైయ్యింది. ఆమర్నాడే అమెరికా లోని మహిళాలోకం వాషింగ్టన్ డిసిలో పెద్ద సభ నిర్వహించారు. ఎందరో అభ్యుదయ మహిళలు, నాయకులూ ట్రంప్ పురుషాధిక్యతని , జాత్యాహంకారాన్ని ఖండిస్తూ  ఎన్నో తీర్మానాలు చేశారు. 

ఇవన్నీ చూస్తే ఎన్నికలముందు వీళ్లేందుకు సంఘటితంకాలేదు అన్న ప్రశ్న వస్తుంది. చాలా మంది ధిక్కారస్వరాలు వినిపించారు, కానీ అవిఅన్నీ ట్రంప్ కి వినిపించలేదు. మూడునెలల ముందరిదాకా గెలుస్తారని అనుకొన్న హిల్లరీ ఎలా ఓడిపోయారో, ఇన్ని అవగుణాలున్న ట్రంప్ ఎలా గెలిచారో పెరుమాళ్ళకెరుక. వీటి వెనక పెద్ద కుట్ర ఉన్నట్టుగా వినికిడి. ఇవన్నీ ఊహాగానాలే గాని ఎవరికి ఇతమిద్దంగా తెలియదు. అగ్రరాజ్య ఎన్నికలు పారదర్శకంగా జరుగుతాయి అన్నది కుందేటికొమ్ములా తయారయ్యాయి. 

ఎందుకో మనుషుల్లో జంతు ప్రవృత్తీ  పూర్తిగా సమసిపోలేదనిపిస్తుంది. నాచుట్టూ ఉన్న జనాలని పరిశీలిస్తే, ముఖ్యంగా తెల్లవాళ్ళని. వాళ్ళల్లో ఎక్కువమందికి ట్రంప్ లో వాళ్ళ దైవం కనిపించేదేమో అనిపిస్తుంది. ఒకే సమాజంలో ఉండే సమాచార సాధనాల్లో ఒకే వార్తకి వీళ్ళు ఇంకోలా స్పందించటం చిత్రంగా ఉంది. ట్రంప్ స్వదేశిరక్షణ విధానాల్లో తప్పేమీలేదు. కానీ మాది తప్ప మిగిలిన జాతులన్నీ నిమ్నమైనవిగా బాహాటంగా ప్రకటిస్తే దానికి వీళ్ళు మద్దతు ఎలా ఇచ్చారో అర్థంగాదు. పైపెచ్చు వీళ్ళు మిగిలిన దేశాల వాళ్లకి నీతి సందేశాలు. 

తమిళనాట జల్లికట్టుకి చట్టబద్దత కల్పించేశారు. కేంద్రం మెడలు వంచారన్నారు, సినిమా హీరోలు సంఘీభావం తెలియచేసారు, మన సంస్కృతీ అన్నారు.  సినిమాల్లో జంతువులని వాడితే అహింసా మార్గంలో వాడాము అని  ధృవీకరణలు. బావుంది. మరి అన్ని జిల్లాల్లో సంస్కృతి పేరు చెప్పి అన్ని పదుల జీవాలని హింసించటాన్ని ఏమంటారు. పైపెచ్చు వీళ్ళని చూసి మన యువత ప్రత్యేక రాష్ట్ర ప్యాకేజి తెస్తామని విశాఖపట్టణంలో ఆందోళన మొదలెట్టబోతున్నారు. దీని వల్ల సామాన్యులకి ఇబ్బంది, కొంచెం తప్పుదారి పడితే వాళ్ళకి విద్యాసంవత్సరం పోవటం తప్ప ఏమొస్తుంది. నిజంగా చెయ్యగలిగినది ఎన్నికలలో అది తెచ్చే నాయకత్వాన్ని ఎన్నుకోవటం, అది వెంటనే కుదరదు కాబట్టి ఉన్న ప్రభుత్వం మీద వత్తిడి తెమ్మని స్థానిక నాయకులని ముందుకు తోయడం తప్ప. 

16, జనవరి 2017, సోమవారం

చిరు విజ్ఞప్తి

చిరు విజ్ఞప్తి: బ్లాగును చదివే విధంగా తయారుచేయటం ఎలా?

మీలో అందరు సాంకేతిక నిపుణులు అవ్వొచ్చు కాక పోవచ్చు. కానీ కొన్ని చిన్న చిన్న మార్పులు చెయ్యటం ద్వారా మీ బ్లాగ్ ని ఎక్కువ మంది సులభంగా చదివి ఆనందించే వీలుంటుంది (ప్రత్యేకంగా - readability). సహృదయులైన బ్లాగరులు వీటిని స్వీకరిస్తారని ఆశిస్తున్నాను. రెండో బ్లాగులోనే సలహాలకి వచ్చేసాడా అని పెదవి విరవవద్దు. నేను ఇంటర్నెట్ మొదలైన దగ్గరనుంచి అన్నింటిని ఫాలో అవుతున్నాను. 


1. ఫోటోలు, మిరుమిట్లుగొల్పే రంగులు, కదిలే బొమ్మలు, రకరకాల పరిమాణాల్లో ఖతులు (fonts) వాడండి కానీ దానివల్ల చదివేవాళ్ళకి కలిగే అసౌకర్యం గమనించండి. ఉదాహరణకి www.google.com సైట్ లో మీరు ఏది వెతికినా, అది చూపెట్టే వివరాలన్నీ విఫులంగాను, చాలా సులభంగాను ఒక్కసారిగా  కనిపిస్తాయి. ఇది దృష్టిలో పెట్టుకొని మీ బ్లాగ్ మార్పు చేసుకొంటే, మీరు వెనక్కి తిరిగి చూడక్కర లేదు. బాగా తయారుచేసిన సైటుని చూపడంలో ఉద్దేశం - ఎంత తక్కువ హంగులు చేస్తే అంత బాగా మీ వ్రాతలు స్పష్టంగా కనిపిస్తాయి అనేది సుస్పష్టం చెయ్యడానికి.  తెలుగు బ్లాగుల్లోనే మంచివి కొన్ని, చెడువి కొన్ని చూపెట్టొచ్చు. కానీ బావుండదని చెయ్యలేదు. 

2. మీరు వ్రాసిన దాంట్లో పస లేకేపోతే, చదివే వాళ్ళు ఎవరు ఉండరు. ఇది నేను చెప్పే అవసరం లేదు. ఊరికే గుర్తు చెయ్యడానికి ఈమాట. నేను నాకోసం వ్రాసుకొంటున్నాను, అంటే మీకొక దణ్ణం. మీరు మీ కోసం అందరి కోసమంటారా, ఎంతో కొంత వాడిని, వేడిని, ప్రత్యేకతని చూపెట్టండి. 

3. కామెంట్స్ ఎవరు వ్రాయటం లేదని కొందరు బ్లాగర్లు బాధ పడుతున్నారు. మీరు బాగా వ్రాస్తూ ఇది జరుగుతోంది అంటే విచారించవలసిన విషయం. అటువంటి వారు కామెంట్స్ అందరూ చేయడానికి అనుమతిచ్చారో లేదో చూడండి, బ్లాగర్ లోను, వర్డుప్రెస్సు లోను మరి ఇతర బ్లాగ్స్ లో సరైన అనుమతులు ఇచ్చారో లేదో చూడండి. ఉదాహరణకి నేను బ్లాగర్ లో సభ్యుడిని అయితే అందులో కామెంట్స్ కి అడ్డంకి లేదు. అలాగే వర్డుప్రెస్సుకి విడిగా సభ్యత్వం ఉండాలి అందులో కామెంటడానికి. కొందరు google+ మెంబరు అయితేనే కామెంటనిస్తున్నారు.  moderation పెట్టుకొన్నపుడు ఇంకా అంతకంటే  జాగత్తలు అవసరం లేదని నా అభిప్రాయం. అందరిని కామెంట్ పెట్టనివ్వండి, వస్తే కామెంట్స్, లేదా చీవాట్లు. పోయేదేముంది?

ప్రస్తుతానికి ఇంతే. మళ్ళీ ఏదైనా కూడనిది చూస్తే దాని గురించి ఆలోచిస్తా. మీకేమైనా తోస్తే జత పరచండి.