27, జనవరి 2017, శుక్రవారం

మౌనం వీడండి

మీరు మీ తల్లితండ్రులని ఎందుకు ప్రేమిస్తున్నారు?
మీరు మీ పిల్లలని ఎందుకు ప్రేమిస్తున్నారు?
మీరు మీ బంధువులని ఎందుకు ప్రేమిస్తున్నారు?
మీరు మీ ఇరుగుపొరుగులని  ఎందుకు ఆదరిస్తున్నారు?
మీరు మీ ఉపాధ్యాయులని  ఎందుకు గౌరవిస్తున్నారు?
మీకు మీ మాతృభాష అంటే ఎందుకంత ఇష్టం?
మనం మన సంస్కృతిని ఎందుకు కాపాడుకోవాలి?
మన జీవితపరమార్థం ఏమిటి? దేవుడున్నాడా?
సనాతనధర్మం అంటే ఏమిటి? మన ధర్మం ఏమిటి?
మన కర్తవ్యాలు ఏమిటి? బాధ్యతలేమిటి? మతమంటే ఏమిటి?

ఇలాంటివి సగటు మనిషికి తరచూ లేక ఎప్పుడైనా జీవితంలో వచ్చే అనేక సందేహాలు. నేనూ సగటు మనిషినే. 2009లో ఒక దశలో మనస్సు బాగోలేక కొద్ది రోజులు చాలా అవస్థ పడ్డాను. అదేసమయంలో భారతావనికి వెళ్ళటం, మాఇంట్లో మానాన్నగారు చూస్తున్న ఒక ప్రవచనం  ప్రోగ్రాం టీవీలో చూడటం జరిగింది. మా నాన్నగారు మాట్లాడుతున్న వ్యక్తిని పరిచయం చేసి, ఈయన మన పౌరాణికగ్రంథాల మీద అద్భుతమైన ప్రసంగాలు చేస్తున్నారు, వినమని సలహా ఇచ్చారు. సరే ఆయన గురించి తెలియని వారెవ్వరు? వారు ప్రపంచంలో ఉన్న తెలుగు వాళ్ళందరికీ సుపరిచితమైన బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావుగారు.

వెనక్కి వచ్చేసిన తర్వాత కొన్ని వెబ్సైట్లు వెతికి కొన్ని ప్రవచనాలు డౌన్లోడ్ చేసుకొని వినటం మొదలుపెట్టాను. అదొక అమృతఝరి. వినేకొద్దీ ఇంకావినాలి, వినేకొద్దీ ఇంకా తెలుసుకోవాలి అనే ఉత్సాహం ఇనుమడించింది. వింటున్న కొద్దీ శరీరంలో కంపనాలు, కొన్ని పద్యాలు వింటే గొప్ప సంతోషం గొప్ప అనుభూతి, మరికొన్ని సంగతులకి ఓహో ఇంత అజ్ఞానంలో ఉన్నానని సిగ్గు, నాకున్న భాషాపరిజ్ఞానం ఆ అనుభవాన్ని మాటల్లో చెప్పలేనిది. ఆ మాటలు నాలో నిద్రాణంగా ఉన్న బలాలను పునరుద్దరించాయి, నా బలహీనతలను గుర్తుచెయ్యటం మొదలు పెట్టాయి. కొద్దిరోజుల తర్వాత డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.శ్రీచాగంటి.నెట్ ని కనుక్కోవటంతో గురువుగారితో కలిసి నాప్రయాణం మొదలైంది. రోజు ఏదో ఒక సమయంలో కాసేపు వినటం అలవాటు అయ్యింది. చాలా తెలుగు జాతీయాలు, సామెతలు, నుడికారాలు, క్రొత్త పదాలు,  ప్రామాణికమైన ప్రతిపదార్థాలు, పద్యాలు, శ్లోకాలు, మన సంస్కృతీ, మన వైభవం, మన పూర్వీకులు, మన జాతి గొప్పతనం, వ్యక్తిత్వవికాసం ఇది అది అని లేకుండా సువిశాల భారతదేశం,దాని గొప్పదనం, ప్రజలు గురించి నేను చాలా తక్కువ సమయంలో ఎన్నో విషయాలు తెలుసుకున్నాను. ఒకరకంగా ఇది నాకు మళ్ళీ వయోజనవిద్య.  బడికి వెళ్లకుండా ఇంటిదగ్గరనుంచే అనేక క్రొత్త విషయాలు నేర్చుకొనే అవకాశం కల్పించింది.  అతిత్వరగా నా శోకంలోంచి బయటపడ్డాను.

ఒకసారి గురువుగారి ప్రవచనాల రుచి తెలిస్తే, ఆ ప్రభావంలోంచి బయటికి రావటం చాలా కష్టం. అవి అన్ని కళ్ళకు కట్టినట్లు మీ మనోనేత్రంలో గోచరమవుతాయి. రాముడి గురించి ఆయన చెప్తే, మీరు రాముడిని చూస్తూ రాముడు చెప్పేది వింటున్నట్టు అనిపిస్తుంది. కృష్ష్ణుడు గురించి ఆయన చెప్తే, మీరు కృష్ష్ణుని చూస్తూ కృష్ష్ణుడు చెప్పేది వింటున్నట్టు అనిపిస్తుంది. ఆయా పాత్రలతో మీరు కలసి మెలసి ఆపనులన్నీ, ఆసంభాషణలన్నీ మీరే చేసినట్టుంటుంది. మీరున్న చోటునుండి కదలకుండా, అన్ని ప్రదేశాలు కాలంతో సంబంధం లేకుండా దర్శించేయొచ్చు. నాతరానికి ఒక పెద్దదిక్కుగా, మంచి చెడు తారతమ్యం  చెప్పేవారుగా వారుండటం నేను చేసుకొన్నసుకృతం.  అమ్మ గురించి ఆయన పలు సందర్భాలలో ఇచ్చిన  సందేశం వింటే మీకు గగుర్పాటు కలిగి, ఇన్నిరోజులు ఎందుకు గురువుగారి వాణి వినలేదని బాధ కలుగుతుంది. ఒకసారి మీరు కూడా వినండి, నేను చెప్పేదాంట్లో అతిశయోక్తి లేదని, వినేకొద్దీ తన్మయత్వం, పరవశం పెరిగి మిమ్మల్ని ఎలా కట్టిపడేస్తారో చూడండి. పైన ప్రశ్నలన్నింటికీ మీకు ఈపాటికి సమాధానం దొరికేపోయిఉంటుంది. దొరకలేదా శ్రద్ధగా మళ్ళీ వినండి. మీరు తెలుసుకోండి, మీ సన్నిహితులతో పంచుకోండి.

ఇంత జ్ఞానం సంపాదించుకుని, దాచుకోకుండా ఎందుకు గురువుగారు అందరికి పంచుతున్నారు? అది సంపాదించుకోవటానికి యెంత తపస్సు, సాధన చేశారు? అంత కష్టపడి నేర్చుకొన్నది ఎందుకు ప్రతిఫలాపేక్ష లేకుండా ఊరికే పంచేస్తున్నారు? వీటన్నింటికి కూడా ఆయనే ఒకచోట సమాధానం ఇచ్చారు. జ్ఞానం పంచుకొంటే వృద్ధిచెందుతుంది. అది ఆయన స్వధర్మం కూడా అని. ఒక మనిషి ఇప్పుడున్న పరిస్థితులలో, తన స్వంత లాభం, తన కుటుంబం బాగు మానుకొని, సమాజానికి అశేషమైన కాలం, శ్రమ దానం చేయటం సామాన్యమైన విషయం కాదు. తాను ఏది ధర్మం, కర్తవ్యం అని నమ్మారో దాన్నే చెబుతున్నారు, పాటిస్తున్నారు.  అంటే తానూ నమ్మిన విలువలు తన జీవితంలోనే ఆచరణాత్మకంగా చూపెడుతున్నారు.

ఇంత చేస్తున్న ఆయనకి మనం తిరిగిచ్చినది ఏమిటి? మనస్తాపం, అపనిందలు. తిట్లు, చీవాట్లు, కేసులు. ఇవి అవసరమా? మనలని ఉద్ధరిద్దామనుకొన్న వ్యక్తికి మనమిచ్చే సత్కారం ఇదేనా? ఆయన చెప్పిన విషయాలని అసంబద్దంగా ముక్కలు చేసి జనాలకి అబద్దాలు చెప్పి ఎన్నాళ్ళు పబ్బం చేసుకొంటారు? పూర్తిగా ఒక విషయం మీద ఆయన చెప్పిన పూర్తి పాఠాన్ని వినండి, అవగాహన పెంచుకోండి, మీకు నచ్చిన వారితో పంచుకోండి, మీ జీవితాలని ఆనందమయం చేసుకోండి, ఇతరులని ఆనందస్వరూపుల్నీ చేయండి.  ఒక అభిమానిగా, సనాతన ధర్మం నమ్మేవాడిగా నా ప్రార్థన ఇంతే. మీకిష్టం లేకపోతె వినొద్దు, వారి జోలికెళ్లొద్దు.  అలాకాదు సగమే వింటాం, మాలాంటి ఇతరులు చెప్పే చెప్పుడు కబుర్లు వింటాం, మాకు తెలిసిన మిడిమిడి జ్ఞానంతో ఆయన్ని అది చేస్తాం ఇది చేస్తామంటారా, మీ పాపం మీరు వండుకొంటున్నారు. ఆయనకీ ఏమి అవదు. ఒకసారి ఆయన అన్నట్టు అన్ని మానేసి, ఇంట్లో వారి సతీమణికి చెప్పుకొన్నా వారిద్దరూ తరిస్తారు. ఏమైనా కోల్పోతే అది మనమే. ఇంతటి మహనీయుణ్ణీ  కించపరిచి, అవమానాల పాలు చేసి మనం బాపుకొనేదేమి లేదు పాపం మూటకట్టుకోవటం, మన పతనానికి గోతులు త్రవ్వుకోవటం తప్ప.

నా ఆక్రోశమల్లా  అందరిని బాగుచేద్దామని కాదు, కొందరిలోనైనా వివేకం గుర్తుచేసి ఎందుకు ఒక మంచి మహనీయుని ప్రోత్సాహించాలో, వారికి ఎందుకు అడ్డుపడకుండా ఉండాలో తెలియచేయటానికి. గురువుగారు మన సమకాలీకులవటం మన అదృష్టం.  ఒకే ఒక్క మనిషి నిస్వార్థంగా, సాత్వికంగా, జనరంజకంగా మన సనాతనధర్మ పరిరక్షణకు అనితరమైన కృషిచేస్తుంటే, వారికి చెయ్యిఅందించాలనుకొంటే దీన్ని నలుగురితో పంచుకోండి. వారికి అన్ని విధాలా సహకారం అందించి మీవంతు పాలుపంచుకోండి. మన జాతిలో ఐక్యతని పెంపొందించండి. భావితరాలకు మన విజ్ఞానం పంచే మహాత్ములని దూరం చేసుకోకండి. ఇటువంటి సత్పురుషులని మీ పిల్లలకి పరిచయం చేయండి. కొద్ది మంది చేసే దుష్ప్రచారాన్ని త్రిప్పికొట్టండి, అటువంటి వాదనలు ఖండించండి. మీకు ఉపయోగపడతాయని క్రింద కొన్ని లింకులిస్తున్నాను. 

సర్వేజనాః సుఖినోభవంతు. 
ఓం శాంతిః శాంతిః శాంతిః!!


శ్రీచాగంటి వారి ప్రవచనాలు దొరికే చోటు 

శరత్చంద్రికగారి బ్లాగ్లో గురువుగారి మీద వ్యాసం 

గురువుగారిని  సమర్థిస్తున్న వారికోసం పిటిషన్ 

23, జనవరి 2017, సోమవారం

మరో శకం

డోనాల్డ్ జాన్ ట్రంప్ 45వ దేశాధ్యక్షుడిగా మొన్న శుక్రవారం ప్రమాణస్వీకారం చేశారు. అభిమానులు, కుటుంబం, గతఅధ్యక్షులు వెంట ఉండగా ఉత్సవం అట్టహాసంగా జరిగింది.  ఒకవైపు సంబరాలు, మరో వైపు నిరసన సెగల మధ్య మరో శకం మొదలైయ్యింది. ఆమర్నాడే అమెరికా లోని మహిళాలోకం వాషింగ్టన్ డిసిలో పెద్ద సభ నిర్వహించారు. ఎందరో అభ్యుదయ మహిళలు, నాయకులూ ట్రంప్ పురుషాధిక్యతని , జాత్యాహంకారాన్ని ఖండిస్తూ  ఎన్నో తీర్మానాలు చేశారు. 

ఇవన్నీ చూస్తే ఎన్నికలముందు వీళ్లేందుకు సంఘటితంకాలేదు అన్న ప్రశ్న వస్తుంది. చాలా మంది ధిక్కారస్వరాలు వినిపించారు, కానీ అవిఅన్నీ ట్రంప్ కి వినిపించలేదు. మూడునెలల ముందరిదాకా గెలుస్తారని అనుకొన్న హిల్లరీ ఎలా ఓడిపోయారో, ఇన్ని అవగుణాలున్న ట్రంప్ ఎలా గెలిచారో పెరుమాళ్ళకెరుక. వీటి వెనక పెద్ద కుట్ర ఉన్నట్టుగా వినికిడి. ఇవన్నీ ఊహాగానాలే గాని ఎవరికి ఇతమిద్దంగా తెలియదు. అగ్రరాజ్య ఎన్నికలు పారదర్శకంగా జరుగుతాయి అన్నది కుందేటికొమ్ములా తయారయ్యాయి. 

ఎందుకో మనుషుల్లో జంతు ప్రవృత్తీ  పూర్తిగా సమసిపోలేదనిపిస్తుంది. నాచుట్టూ ఉన్న జనాలని పరిశీలిస్తే, ముఖ్యంగా తెల్లవాళ్ళని. వాళ్ళల్లో ఎక్కువమందికి ట్రంప్ లో వాళ్ళ దైవం కనిపించేదేమో అనిపిస్తుంది. ఒకే సమాజంలో ఉండే సమాచార సాధనాల్లో ఒకే వార్తకి వీళ్ళు ఇంకోలా స్పందించటం చిత్రంగా ఉంది. ట్రంప్ స్వదేశిరక్షణ విధానాల్లో తప్పేమీలేదు. కానీ మాది తప్ప మిగిలిన జాతులన్నీ నిమ్నమైనవిగా బాహాటంగా ప్రకటిస్తే దానికి వీళ్ళు మద్దతు ఎలా ఇచ్చారో అర్థంగాదు. పైపెచ్చు వీళ్ళు మిగిలిన దేశాల వాళ్లకి నీతి సందేశాలు. 

తమిళనాట జల్లికట్టుకి చట్టబద్దత కల్పించేశారు. కేంద్రం మెడలు వంచారన్నారు, సినిమా హీరోలు సంఘీభావం తెలియచేసారు, మన సంస్కృతీ అన్నారు.  సినిమాల్లో జంతువులని వాడితే అహింసా మార్గంలో వాడాము అని  ధృవీకరణలు. బావుంది. మరి అన్ని జిల్లాల్లో సంస్కృతి పేరు చెప్పి అన్ని పదుల జీవాలని హింసించటాన్ని ఏమంటారు. పైపెచ్చు వీళ్ళని చూసి మన యువత ప్రత్యేక రాష్ట్ర ప్యాకేజి తెస్తామని విశాఖపట్టణంలో ఆందోళన మొదలెట్టబోతున్నారు. దీని వల్ల సామాన్యులకి ఇబ్బంది, కొంచెం తప్పుదారి పడితే వాళ్ళకి విద్యాసంవత్సరం పోవటం తప్ప ఏమొస్తుంది. నిజంగా చెయ్యగలిగినది ఎన్నికలలో అది తెచ్చే నాయకత్వాన్ని ఎన్నుకోవటం, అది వెంటనే కుదరదు కాబట్టి ఉన్న ప్రభుత్వం మీద వత్తిడి తెమ్మని స్థానిక నాయకులని ముందుకు తోయడం తప్ప. 

16, జనవరి 2017, సోమవారం

చిరు విజ్ఞప్తి

చిరు విజ్ఞప్తి: బ్లాగును చదివే విధంగా తయారుచేయటం ఎలా?

మీలో అందరు సాంకేతిక నిపుణులు అవ్వొచ్చు కాక పోవచ్చు. కానీ కొన్ని చిన్న చిన్న మార్పులు చెయ్యటం ద్వారా మీ బ్లాగ్ ని ఎక్కువ మంది సులభంగా చదివి ఆనందించే వీలుంటుంది (ప్రత్యేకంగా - readability). సహృదయులైన బ్లాగరులు వీటిని స్వీకరిస్తారని ఆశిస్తున్నాను. రెండో బ్లాగులోనే సలహాలకి వచ్చేసాడా అని పెదవి విరవవద్దు. నేను ఇంటర్నెట్ మొదలైన దగ్గరనుంచి అన్నింటిని ఫాలో అవుతున్నాను. 


1. ఫోటోలు, మిరుమిట్లుగొల్పే రంగులు, కదిలే బొమ్మలు, రకరకాల పరిమాణాల్లో ఖతులు (fonts) వాడండి కానీ దానివల్ల చదివేవాళ్ళకి కలిగే అసౌకర్యం గమనించండి. ఉదాహరణకి www.google.com సైట్ లో మీరు ఏది వెతికినా, అది చూపెట్టే వివరాలన్నీ విఫులంగాను, చాలా సులభంగాను ఒక్కసారిగా  కనిపిస్తాయి. ఇది దృష్టిలో పెట్టుకొని మీ బ్లాగ్ మార్పు చేసుకొంటే, మీరు వెనక్కి తిరిగి చూడక్కర లేదు. బాగా తయారుచేసిన సైటుని చూపడంలో ఉద్దేశం - ఎంత తక్కువ హంగులు చేస్తే అంత బాగా మీ వ్రాతలు స్పష్టంగా కనిపిస్తాయి అనేది సుస్పష్టం చెయ్యడానికి.  తెలుగు బ్లాగుల్లోనే మంచివి కొన్ని, చెడువి కొన్ని చూపెట్టొచ్చు. కానీ బావుండదని చెయ్యలేదు. 

2. మీరు వ్రాసిన దాంట్లో పస లేకేపోతే, చదివే వాళ్ళు ఎవరు ఉండరు. ఇది నేను చెప్పే అవసరం లేదు. ఊరికే గుర్తు చెయ్యడానికి ఈమాట. నేను నాకోసం వ్రాసుకొంటున్నాను, అంటే మీకొక దణ్ణం. మీరు మీ కోసం అందరి కోసమంటారా, ఎంతో కొంత వాడిని, వేడిని, ప్రత్యేకతని చూపెట్టండి. 

3. కామెంట్స్ ఎవరు వ్రాయటం లేదని కొందరు బ్లాగర్లు బాధ పడుతున్నారు. మీరు బాగా వ్రాస్తూ ఇది జరుగుతోంది అంటే విచారించవలసిన విషయం. అటువంటి వారు కామెంట్స్ అందరూ చేయడానికి అనుమతిచ్చారో లేదో చూడండి, బ్లాగర్ లోను, వర్డుప్రెస్సు లోను మరి ఇతర బ్లాగ్స్ లో సరైన అనుమతులు ఇచ్చారో లేదో చూడండి. ఉదాహరణకి నేను బ్లాగర్ లో సభ్యుడిని అయితే అందులో కామెంట్స్ కి అడ్డంకి లేదు. అలాగే వర్డుప్రెస్సుకి విడిగా సభ్యత్వం ఉండాలి అందులో కామెంటడానికి. కొందరు google+ మెంబరు అయితేనే కామెంటనిస్తున్నారు.  moderation పెట్టుకొన్నపుడు ఇంకా అంతకంటే  జాగత్తలు అవసరం లేదని నా అభిప్రాయం. అందరిని కామెంట్ పెట్టనివ్వండి, వస్తే కామెంట్స్, లేదా చీవాట్లు. పోయేదేముంది?

ప్రస్తుతానికి ఇంతే. మళ్ళీ ఏదైనా కూడనిది చూస్తే దాని గురించి ఆలోచిస్తా. మీకేమైనా తోస్తే జత పరచండి.