15, జూన్ 2017, గురువారం

గొల్లపూడిగారి జీవనకాలం

శ్రీ గొల్లపూడి మారుతీరావు గారు తెలియని వ్యక్తి తెలుగుదేశంలో అరుదు. వారిని మళ్ళి పరిచయం చేయటం ఆయనెవరో తెలియని ఆ కొద్దిమంది కోసం మాత్రమే. ఆయన చేయి తిరిగిన రచయిత, నాటక కర్త, నటుడు. ఇవి కాక మరి కొన్ని రంగాల్లో ప్రవేశం కూడా ఉంది. బాగా చదువుకొన్న మనిషి. లోకాన్ని, ప్రపంచాన్ని కలయతిరిగిన మనిషి. మనందరిలాగా మనలోనే ఉన్న చాలా నేలబారుమనిషి* కానీ అసాధారణమైన మనిషి. వారు వ్రాసిన ఎన్నో విషయాలు, ఎన్నో ప్రశ్నలు వారి కలంలోంచి జారిపడి మనలని  ఉక్కిరిబిక్కిరి చేసి,ఉత్తేజపరిచి, కార్యోన్ముఖులని చేయటానికి మాత్రమే బయటికి వచ్చేయేమో అనిపిస్తుంది. ఆయన నటించిన "ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య" చూస్తే, ప్రేక్షకుడికి ఆయన బయట కనిపిస్తే తందామనిపిస్తుంది. అది ఆయన మొదటి సినిమా నటుడిగా. అంటే విలన్ గా ఎంత  బాగా నటించారో అర్థం అవుతుంది. వారు కొన్ని దశాబ్దాలుగా "జీవనకాలం" అనే కాలమ్ వ్రాస్తున్నారు.

నేను అప్పుడప్పుడు ఏదో ఒకటి అర ఆయన  కథల్ని,వ్యాసాల్ని చదవటమే కానీ వారి సాహిత్యం నాకు అంతగా పరిచయం లేదు. ఈ మధ్యన ఏదో  విషయంగా, ఆయన బ్లాగులోకి వెళ్లి అక్కడనుంచి ఈ కాలాన్ని(column) పట్టుకొన్నాను. కౌముది పత్రిక వాళ్ళు సెప్టెంబర్ 15 2008 నుంచి ఇవాళ్టి దాకా గొల్లపూడి గారి అన్ని వ్యాసాల్ని ఇక్కడ భద్రపరచేరు. కోతికి కొబ్బరికాయ దొరికినట్టు వెంటనే చదవటం మొదలుపెట్టి, ఒక వారంలో అన్ని వ్యాసాలూ చదివేను. ఇలా చదవడంలో కొన్ని ఇబ్బందులున్నాయి. మళ్ళి మళ్ళి చెప్పిన సంగతులు, వ్యక్తుల ప్రస్తావన కొంతమందికి నచ్చకపోవచ్చు. వాటిని క్లుప్తంగా మీతో పంచుకుందామని ఈ నాలుగు ముక్కలు. గొల్లపూడిగారి వ్యాసాల్ని స్థూలంగా 1. ప్రస్తుత అవినీతి రాజకీయాలు, నాయకులు, ప్రపంచ నాయకులు, 2. భాష, సంగీతం,  గ్రంథాలు, రచయితలు,సంస్కృతి 3. క్రికెట్, క్రీడలు, రేడియో, సినిమాలు, నటులు, 4. పర్యావరణం, వర్తమాన విషయాలు, కీర్తిశేషులు అని నాలుగు భాగాలుగా చూడొచ్చు. దగ్గరదగ్గర సగానికి పైగా వ్యాసాల్నిమొదటిభాగానికి, మిగిలిన సగాన్ని మూడు భాగాలుగా మిగిలిన మూడు విషయవస్తువులకు పంచారు.

రాజకీయాల్లో ప్రస్తుత నాయకుల గురించి, వాళ్ళ హామీల బూతు మాటల* గురించి, వాళ్ళ వారసత్వాల గురించి, వాళ్ళ అస్థిరత్వం (ఒక పార్టీతో ఉండకపోవటం) గురించి, వాళ్ళ అవినీతి గురించి మీరు చదివితే గాని శ్రీ గొల్లపూడి ప్రతిభ అవగతం కాదు. గడచిన 60 సంవత్సరాలలో మన ప్రగతి, స్వాతంత్య్రం వచ్చినపుడున్న నాయకులు, ఇప్పటి నాయకులు, ఆ నాయకుల వంచకత్వం ఎంతో పదునైన కలంతో చీల్చి చెండాడేరు. ముఖ్యంగా మన క్రొత్త గాంధీలు, నిధులు (నల్లకళ్లజోళ్లవంశం), తెలుగునేల మీది రాజకీయ వంశాల గురించి వారి వ్యాఖ్యలు చదివితే, అయ్యో మనం ఎటువంటి నాయకుల పాలనలో ఉన్నాం, ఏమి పొందుతున్నామో స్పష్టం అవుతుంది. పై రాజకీయ వంశాలలో వాళ్ళు కాకుండా ఓ కల్మాడీ, ఓ రాజా, ఓ శిబుసొరేన్, ఓ మధు కోడా, ఓ లల్లూ, ఓ ములాయం, ఓ మాయావతి, ఓ జయలలిత, ఓ మమతల గురించి ఆయన చెప్పిన కబుర్లు వింటే, వీళ్ళు  మళ్ళీ మళ్ళీ ఎలా ఎన్నికలలో గెలిచి ప్రభుత్వాలు ఏర్పాటు చేస్తున్నారో అర్థం అవుతుంది. తరచూ మహాత్మా గాంధీ గారినో, నెల్సన్ మండేలా గారినో ఎందుకు గుర్తు చేస్తున్నారో తెలుసుకొంటే పాఠకుడు గతం నుంచి ఏమి నేర్చుకోవాలి అన్నది తెలుస్తుంది.

తెలుగు భాష గొప్పదనం, కర్ణాటక సంగీతంలో దాని పాత్ర, ఓ త్యాగయ్య కృషి, ఓ పోతన గారి భాగవతాన్ని మనం ఎందుకు చదివి ఆపద్యాలని  మననం చేసుకోవాలో చెప్పారు. ముఖ్యంగా ఆయన తరంలో రచయితలు మన సాహిత్యాన్ని, ప్రపంచ సాహిత్యాన్ని ఎంత అధ్యయనం చేసి తరువాత వారి కృషి చేశారో వారు చెప్పిన ఉదాహరణలలో  గమనించవచ్చు. అలాగే మన సంప్రదాయాలు, మతం, ధర్మం, సంస్కృతి, సంగీతం, భాష ఒక దానితో మరొకటి ఎలా పెనవేసుకొని ఉన్నాయో తెలియాలన్నా, క్రొత్త పదాలు తెలుసుకోవాలన్నా (ఉదా: విపర్యం, లాయకీ, మరి కొన్ని అప్పుడే మరిచి పోయాను. ఉత్తరాంధ్ర వాళ్ళకి ఇవి తెలిసే ఉంటాయి.) ఆయన వ్యాసాలు చదవాలి. క్రికెట్ గురించి నేను స్పృశించదలచుకోలేదు (మన జాతీయ క్రీడ ఏమిటి? ఇది ఎంతమందికి తెలిసే అవకాశం ఉంది?), దాని గురించి వ్రాసే వాళ్ళు, ప్రచారం చేసేవాళ్ళు, డబ్బులిచ్చేవాళ్ళు చాలా మంది ఉన్నారు. అయితే ఆటగాళ్లు, వాళ్ళ మీద ఆట మీద వ్యాపారాల నీడ ఇవి ఆయన ఎంచుకొన్న వస్తువులు. ప్రపంచంలో ఫుట్బాల్ ఆటగాళ్ల ప్రభావం, వాళ్ళ అభిమానుల ఆశలు, మన దేశంలో ఆటల ప్రోత్సాహము, వాటి భవిష్యత్తు బాగా వివరించారు.

గొల్లపూడి గారు రచయితగా సినిమా రంగంలోకి వచ్చి ఆ తర్వాత నటుడయ్యారు.  ఆయనకున్న సుదీర్ఘమైన అనుభవం వల్ల , సినీ వ్యక్తులతో ఉన్న అనుబంధం వల్ల ఈ వస్తువు గురించి ఆయన వ్రాసిన అన్ని వ్యాసాలూ ప్రత్యేకమైనవే.  ముఖ్యంగా నాగేశ్వరరావు, రామారావు గార్లతో అయన పని చేసిన ఉదంతాలు చదువరులకు బాగా నచ్చుతాయి. అలాగే వివిధ సమకాలీకులతో ఆయన అనుభవాలు కూడా. కీర్తిశేషులు గురించి ఆయన వ్రాసినవన్నీ నామనస్సుకు నచ్చినవే. సినిమాలు, మిగిలిన అన్ని రంగాలలోని ప్రసిద్దుల గురించి పరుషంగా మాట్లాడవలసి వచ్చినా ఎక్కడ నోరు జారకుండాఎంతో మర్యాదతో (ఆయనకి ఇష్టం లేకపోయినా అని నాకనిపించింది) హుందాగా వ్రాయటం నాకెంతో నచ్చింది.  వేటూరి, శ్రీశ్రీ, రావిశాస్త్రి, విశ్వనాథ్ గార్ల  గురించి ఆయన చెప్పిన కబుర్లు ఆహ్లాదకరంగా ఉన్నాయి. మన వనరులని సరిగ్గా (ప్రకృతి, మానవ) వాడుకోక, దుర్వినియోగం చేస్తూ పోతే పర్యవసానాలు ఎలా ఉంటాయో కళ్ళకి కట్టినట్టు చూపెట్టారు.

చివరిగా నా మాటలు కొన్ని చెప్పి ఇక్కడితో ముగిస్తా.  అవినీతి గురించి ఎంతో ఆవేదన పడ్డ ఆయన మనస్సు ఎంతో దుఃఖపడిఉంటుంది. ఎన్నో సందర్భాలలో దాన్ని లేవనెత్తారు. మెజార్టీలని అణగత్రొక్కి, మైనారిటీలని నెత్తి మీద పెట్టుకొనే రాజకీయులని ఎన్నో సార్లు ఆయన ఖండించారు. కంచి పీఠాధిపతిని కారాగారం పాలు చేస్తే ఆయన తప్ప మరే ప్రముఖ వ్యక్తి గళం విప్పలేదు. ఆదర్శాల గురించి, స్వార్థ రహిత నాయకుల గురించి చెప్పిందే మళ్ళి, మళ్ళి చెప్పడం ద్వారా యువతలో ఒక్కరు మారినా, వాళ్ళు దేశానికి మార్గదర్శనం చేస్తారేమో అని ఆశపడ్డారు. వీటన్నింటిలోను మన సంసృతిని, ధర్మాన్ని రంగరించి అందరికి సులువుగా అర్థం అయ్యేలా విడమరచి చెప్పారు. చివరిగా ఆయన బలహీనతల్ని నిర్భయంగా ఒప్పుకొంటూ, నిజం చెప్పడానికి అయినవారిని కూడా విమర్శించటానికి వెనుకాడలేదు.  వీటన్నింటికి జరిగే పరిణామాలకి వెరవలేదు.  ఇవి చాలు గొల్లపూడి గారిని సామాన్యమైన మనిషి అంటూనే, అసాధారణమైన వ్యక్తి అనటానికి.

* ఇవి గొల్లపూడి వారి ట్రేడ్మార్క్ పదాలు, వారికి కృతజ్ఞతలతో..