31, ఆగస్టు 2017, గురువారం

సుధా మూర్తి గారి చీరలు

మనసుని కోతితో తరచూ పోలుస్తూ ఉంటారు. ఎందువల్లో అది నాకంత సరైన ఉపమానం అనిపించదు.  కోతులు ఏదైనా తినేటప్పుడో,  పిల్లలికి పాలిచ్చేటపుడో, పేలు తీస్తూనో మనకంటే స్థిరంగా, కుదురుగా ఉన్నాయనిపిస్తుంది. ఎక్కడినుంచి యేముప్పొస్తుందా అని ఇంకా కాస్త మెలకువగా, జాగ్రత్తగా కూడా ఉంటాయి. సరే కోతిలోంచి మనిషి బయలుదేరేడు కాబట్టి ఇంకా కొన్ని లక్షణాలు పూర్తిగా పోలేదేమో? అట్లాంటి మనసుని నియంత్రించి కొంత లాభం, పురుషార్థాలు పొందాలని మనిషి చేయని ప్రయత్నం లేదేమో? మన పరిణామక్రమంలో మన పూర్వులు కొంత పరిశోధన చేసి  కొన్ని మార్గదర్శకాలు చేశారు.  మనస్సుని బుజ్జగించి, బ్రతిమాలి మన మార్గంలోకి తెచ్చుకోవాలి కానీ, బలవంతంగా మాత్రం కాదన్నది ప్రాథమిక సూత్రం.  మనస్సుని ఎలా దారికి తెచ్చుకోవాలి అన్న దానికి చాలా పద్దతులున్నాయి. వాటిలో  మన సనాతన ధర్మం నుంచి ఒకటి ఇక్కడ ప్రస్తావిస్తున్నాను.

మా మనస్సు మేము చెప్పినట్టే విని మా స్వాధీనములోనే ఉంది అనుకుంటే మిగిలిన క్రింది భాగం మీకు పనికిరాదు. అన్ని ఆశ్రమాలు జీవితంలో అనుభవించి, కష్టాలు అధిగమించి, మనం చేయవలసిన కర్తవ్యాలు నిర్వర్తించి, చివరికి శరీరం వదలి వెళ్ళేటపుడు బాధ పడకుండా వెళ్ళిపోవాలి (ఏకారణానికైనా) అనుకుంటే మనసు మన అధీనంలో ఉండటం ఎంతైనా అవసరం.  జీవితం యొక్క పరమార్థాలలో ఇదొకటి అని నేను నమ్ముతాను. కాశీకి వెళ్ళినపుడు మనవాళ్లు ఏదైనా మనస్సుకి బాగా నచ్చిన పండునో కూరగాయనో వదిలిపెట్టేయటం ఒక సంప్రదాయం. బహుశా వయసులో ఉన్నపుడు ఈ పని చేయరేమో? లేకపోతే వయసయ్యేదాకా కాశీ  వెళ్లరేమో?   ఈ రెంటిలోను ప్రయోజనం తక్కువ. ఎందుకంటే యెంత త్వరగా ఆపని చేస్తే సాధనకి (ఆ వస్తువుకి దూరంగా ఉండటం సాధ్యమవుతుంది) అంత  ఉపయోగం. నోరు కట్టుకొంటే మెల్లగా అది మనస్సుని ప్రభావితం చేస్తుంది అన్నది అంతఃసూత్రమేమో? క్రమంగా మనసు మీద నియంత్రణ సాధ్యం అవుతుంది. సాధనమున కూరు పనులు ధరలోన ... ఇది నాకు తెలిసిన సంగతి.

కొద్ధి రోజుల  క్రితం సుధామూర్తి గారు చీరలు కొనటం అన్న ప్రక్రియని కాశీలో ఇరవై ఒక్క సంవత్సరాల క్రిందట వదిలేశారు అన్న వార్త వచ్చింది. చిన్న వార్తే, కానీ చదివితే చాల ఆసక్తికరంగా ఉంది. ఆవిడెవరో తెలియకపోతే ఇక్కడ లంకె దగ్గర ఇంగ్లీషులో విషయం గ్రహించవచ్చు.  ఆవిడ రోజూ ఎన్ని చీరలు మార్చినా , ఒక రోజు కట్టినవి మళ్ళి జీవితంలో కట్టకపోయినా అతి సులువుగా రోజులు వెళ్లబుచ్చగలిగిన ధనవంతురాలైన వ్యక్తి.   మరి ఆ నిర్ణయం ఎందుకు తీసుకొన్నారు? ఒకటి - ఎక్కడి నుంచి బయలుదేరేమో (మూలాలు మర్చిపోకుండా) గుర్తెరిగి మాములు సాధారణ  వ్యక్తిలా బ్రతకాలని కోరుకోవటం, రెండు - డబ్బుల కంటే విలువైనవి మనస్సుని అదుపులో పెట్టుకొంటే సంపాదించవచ్చు అని  గ్రహించటం వల్లా. ఆవిడ సాంఘిక సేవ, రచనలు మాత్రమే ఎరిగున్న నేను, ఇది చదివిన తర్వాత ఆవిడ కి 'ఫిదా' అయిపోయాను.  నీతా అంబానీ గారి ఫోన్ ఖరీదు ఇరవై అయిదు కోట్ల రూపాయలు అన్న వార్త ఒకటి చక్కర్లు కొడుతోంది. అది నిజం అని అనుకొంటే - సుధామూర్తి గారు ఏవిలువలని ప్రోత్సహిస్తున్నారో నేను చెప్పక్కరలేదు.

కొస మాట:  పైన చెప్పినవన్నీ పెద్దలు, గురువులు ఎప్పుడో చెప్పినవే.  మనస్సుకి నచ్చిన విషయం కాబట్టి మరోసారి స్పృశించాను. భవిష్యత్తులో వ్రాసే వాటికి కూడా ఇవే ఆధారం.