26, అక్టోబర్ 2017, గురువారం

కొన్ని నిజాలు/అబద్దాలు?

శ్రీరామాయణంలో రాముల వారు అరణ్యానికి బయలుదేరే సమయంలో ఒక చిన్న విశేషం గురించి చెప్పుకుందాము. దశరథుడు రాముణ్ణి అడవికి వెళ్ళొద్దని పలు విధాలుగా ప్రాధేయపడతాడు. రాముడు తండ్రికి నమస్కరించి, మీ మాటని ఆచరణలో పెట్టడమే నా ధర్మమని చెప్పి సెలవు తీసుకొని అంతఃపురంలోంచి బయలు దేరుతాడు. బయటికి వచ్చి సుమంతుణ్ణి రథాన్ని తీసుకు రమ్మని, సీతాలక్ష్మణులతో కలసి రథంలో బయలుదేరుతాడు. ఇంతలో దశరథుడు మేడమీది నుంచి రాముణ్ణి వెళ్లవద్దని కోరుతాడు. అలాగే సుమంతుణ్ణి రథం ముందుకు తీసుకువెళ్ళద్దని ఆజ్ఞాపిస్తాడు. అయితే రాముడు ముందుకే రథాన్ని నడపమని సుమంతుడికి చెప్తే, సుమంతుడు అలా చేస్తే రాజాజ్ఞని ధిక్కరించినట్టవుతుందని రాముడికి చెబుతాడు. రాముడు రథచక్రాల ధ్వనిలో రాజు మాట వినిపించలేదని చెప్పమని చెబుతాడు. సుమంతుడు అది అబద్దం చెప్పటం కాదా అని ప్రశ్నిస్తే, రాముడు ఒక పెద్ద సత్యాన్ని కాపాడటం కోసం ఒక చిన్న నిరపకారమైన అబద్దం చెప్పటం తప్పు  కాదని చెబుతాడు. ఇది త్రేతాయుగపు ధర్మసూక్ష్మం.  

మహాభారతంలో కురుక్షేత్రంలో యుద్ధం హోరాహోరీగా జరుగుతోంది. గురుదేవులు ద్రోణుల వారి స్వైర విహారానికి పాండవుల పనుపున పోరాడుతున్న వీరులు పిట్టలలా నేల కూలుతున్నారు. ఆయనని నిలువరించడం ఎలాగో పాండవులకు అర్థం కాలేదు. మాములుగానే తరుణోపాయం కోసం కృష్ణభగవానుణ్ణి ప్రార్థించారు. ఆయన ఆచార్యుడి బలహీనతని పాండవులకు వివరించి, మరు రోజు యుద్ధం ఎలా చెయ్యాలో చెప్పాడు. అనుకొన్న విధంగా ధర్మరాజు "అశ్వథామ హతః కుంజరః" అని అనటం, పాండవ సైన్యం జయభేరులు మ్రోగించటం,  ఆ రణగొణధ్వనిలో ద్రోణాచార్యులు పై వాక్యంలోని చివరి భాగం సరిగ్గా వినకపోవడం, తత్ఫలితంగా ఆయన అస్త్ర సన్యాసం చేయటం, ధృష్టద్యుమ్నుడు ఆయన్ని హతమార్చటం వెంట వెంటనే జరిగిపోయాయి. ధర్మరాజుకి ఇదంతా ఇష్టం లేకపోయినా కృష్ణపరమాత్మకి ఎదురు చెప్పలేక ఆయన చెప్పిన వ్యూహం అమలుచేయటం జరిగింది. తదనంతరం స్వర్గారోహణ పర్వంలో పైపనికి తగిన శిక్ష అనుభవించేడు అన్నది మరో ద్వాపర యుగపు కథ. 

ఈమధ్యన లింక్డీన్.కామ్ (www.linkedin.com) అన్న వెబ్సైటులో మాతో పనిచేసి వెళ్ళిపోయిన ఒక తోటి ఉద్యోగి దరఖాస్తు చూశాను.  ఈ సంస్థ అన్ని రకాల ఉద్యోగులకి క్రొత్త అవకాశాలని చూపెట్టడానికి, ఇతర సంస్థలు ఇక్కడనుంచి కావలసిన వాళ్ళని ఎంచుకోవడానికి అనువైన ప్రదేశం అని ప్రచారం చేసుకొంటుంది. నచ్చిన ఉద్యోగులు వారికి సంబందించిన కొంత సమాచారం ఇక్కడ పొందుపరుస్తారు.  నేను పైన చెప్పినాయన మరోచోట డైరెక్టర్గా ఉన్నత స్థానంలో ఉన్న వ్యక్తి, తెలివైన వాడు, సామర్థ్యం ఉన్న యువకుడు. అంత వరకు తప్పేమి లేదు. అయితే ఉన్న అనుభవమంతా క్రింది స్థాయి నుంచి వచ్చినట్టు కాకుండా, చేరడమే ఉన్నత ఉద్యోగిగా చేరినట్టు వ్రాసాడు. అతను చేరటం ట్రైనీగా  మాతో చేరి త్వరత్వరగా ఉద్యోగంలో ఎదిగాడు.  కానీ అదంతా దాచేసి ఏమి ఎవరికి తెలియనట్టు  క్రొత్త చోట మెట్లుఎక్కాలని చూస్తున్నట్టు తెలిసింది. పరిశీలించి చూస్తే ఈ తత్త్వం బాగా యువతలో వృద్ధి చెందుతున్నట్లు అనిపిస్తోంది. దీని వల్ల నిజంగా అనుభవం, నైపుణ్యమున్నవాడికి నష్టం కాదా? లేని అనుభవంతో సంస్థలో అత్యున్నతస్థానంలో ఉండి వీళ్ళు ఎవరికి ఉపకారం చేయగలరు?

కొన్ని వారాల క్రితం వరంగల్ జిల్లా కలెక్టర్ ఆమ్రపాలిగారు ఏదో సందర్భంలో ఉద్యోగాలకి ప్రయత్నించే  ఆశావహులు దరఖాస్తుల్లో కొన్ని లేని హంగుల్ని చేర్చటంలో తప్పులేదని వాక్రుచ్చారు. అది కాస్తా పత్రికల్లో కొంత రాద్ధాంతానికి దారి తీసింది. నిరుద్యోగులు ఏదో ఒక వృత్తిలో చేరటానికి, కుదురుకోవటానికి ఆవిడ స్వతంత్రించి ఇచ్చిన సలహా పనికొస్తుంది. చిత్రమేమిటంటే అన్ని సంస్థలు మనం ఇస్తున్న విషయాలు ప్రమాణపూర్వకముగా నిజమని ధ్రువపత్రాలు తీసుకొంటాయి.  అవి నిజం కానీ పక్షంలో మన ఉద్యోగాలు పీకేయడానికి వాటికి హక్కు ఉంది. చట్టపరంగా నేరం కూడాను. అయినా అలా చేసే వాళ్లకి కొదవలేదు. కారుణ్యదృక్పథంతో చూస్తే నిరుద్యోగులు ఏదో విధంగా జీవితంలో స్థిరపడటంలో పెద్ద అభ్యంతరం కనపడదు. అదే పని కొంత అనుభవమున్న వాళ్ళు చేస్తే అనైతికంగాను, ఎబ్బెట్టుగాను, మోసంగాను అనిపిస్తుంది. ఇది కలియుగంలో కథ (మాయ) ఏమో?