21, డిసెంబర్ 2017, గురువారం

విదేశాలలో ఉద్యోగ పర్వం!

చాలామంది సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నవాళ్ళకి, లేకపోతే బయటి  దేశాలలో ఇతర ఉద్యోగాలలో పనిచేసే వాళ్ళకి తరచూ ఎదురయ్యే ప్రశ్న - ఏమి నేర్చుకొంటే వెంటనే ఉత్తర అమెరికాలోనో, యూరోపులోనో, ఆస్ట్రేలియాలోనో ఉద్యోగం వస్తుంది అని? త్వరపడి ఇంత చిన్న ప్రశ్నకి సమాధానం తెలియదా అనకండి. అడిగేవాళ్ళు నిజంగా తెలియక అడిగితే  ఇబ్బంది లేదు. అదే తెలిసి అడిగారనుకోండి, ఇది బ్రహ్మ పదార్ధం కంటే క్లిష్టమైన ప్రశ్న. ఇంకో మధ్య రకం వాళ్ళు అంటే అటు ఇటు చెందని వాళ్ళుంటారు. వాళ్ళు అడిగితే ఎలాగో ఒకలా సమాధానం చెప్పొచ్చు. 

ప్రతివాడికి విద్యార్ధి దశనుంచి, ఉద్యోగస్తుడయ్యే క్రమంలో కొద్దో గొప్పో సమస్యలుంటాయి. వాటిని దాటుకుని ఏదో ఒక ఉద్యోగంలో చేరి మెల్లిగా ఒక్కో మెట్టు ఎక్కి చివరికి పదవి విరమణ చేస్తాడు. ఈ పరిణామంలో ఎన్నో దశలు, వాటిలో కష్టాలు నష్టాలు చవి చూసి ఎంతో కొంత నేర్చుకుని, అనుభవం, ధనం సంపాదించి ఉద్యోగరుణం తీర్చుకొంటాడు. అలాగే ఆ దారిలో ఎందరి నుంచే సహాయం పొంది, తానూ సుఖపడి, మరికొందరికి తన చేయి అందించి వాళ్ళని పైకి తీసుకొచ్చి మనిషిగా తన కర్తవ్యం కూడా నెరవేరుస్తాడు. అందులో కొన్ని వింత అనుభవాలు ఎదురవుతాయి. ఎవరు స్వతహాగా ఇంకొకరిని పనికట్టుకొని నిరుత్సాహపరుస్తారని నేననుకోను. కానీ కొన్ని అనుభవాల తర్వాత మన పంథా మారుతుందేమో. కొన్ని సార్లు ప్రశ్నలు అడిగే వాళ్ళ లక్ష్యం ఏమిటో కూడా అర్థం కాదు. గూగుల్ తల్లి ప్రవేశం జరిగిన తరువాత, ఈ తరహా ప్రశ్నలు అడుగుతారా అని మీకనిపించవచ్చు. కానీ అడిగేవాళ్ళు ఉన్నారు.

సరియైన అర్హతలు, చదువు ఉండి అసలు ఏమి తెలియని వాళ్ళు: 

ప్రశ్న: బావ, ఇప్పుడు ఏది మార్కెట్లో హాట్గా ఉంది?
జవాబు: ఏదైనా ఒక రిలేషనల్ డేటాబేస్, ఒక వెబ్ బేస్డ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ తెలిస్తే ఎక్కడో అక్కడ జాబ్లో చేరొచ్చు.
ప్రశ్న: అయితే ఒరాకిల్, సీక్వెల్, మైసీక్వెల్ లలో ఏది నేర్చుకుంటే బావుంటుంది?
 ఏదైనా ఒకటి బాగా నేర్చుకొంటే చాలు
ప్రశ్న: అయితే ఒరాకిల్ నేర్చుకుంటే ఫర్వాలేదా?
జవాబు: ఆఁ  అది సరిపోతుంది.
ప్రశ్న: ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఏదైతే బావుంటుంది?
జవాబు: జావా, సి#, సి++ వీటిలో ఏదైనా ఒకటి బాగానే ఉంటుంది.
ప్రశ్న: వీటిలో ఏది సులభం?
జవాబు: మొదటి రెండిట్లో ఏదైనా ఒకటి కొంత శ్రమతో నేర్చుకోవచ్చు,

వీటితో ఆ జీవుడు ఏదైనా తెలుసుకొని, నేర్చుకొని, బాగుపడితే అంత కన్నా కావలసినది ఏమి ఉంది.

సరియైన అర్హతలు, చదువు ఉండి అన్నీ తెలిసిన వాళ్ళు: 

ప్రశ్న:అన్నా, ఇప్పుడు ఏది మార్కెట్లో హాట్గా ఉంది (అంటే అతి తక్కువ నైపుణ్యంతో అతి ఎక్కువ జీతం సంపాదించడం ఎలా అని అన్వయం చేసుకోవాలి) ?
జవాబు: ఏదైనా ఒక రిలేషనల్ డేటాబేస్, ఒక వెబ్ బేస్డ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ తెలిస్తే ఎక్కడో అక్కడ జాబ్లో చేరొచ్చు.
ప్రశ్న: అయితే ఒరాకిల్, సీక్వెల్, మైసీక్వెల్ లలో ఏది నేర్చుకుంటే బావుంటుంది?
జవాబు: ఏదైనా ఒకటి బాగా నేర్చుకొంటే చాలు
ప్రశ్న: అయితే ఒరాకిల్ నేర్చుకుంటే ఫర్వాలేదా?
జవాబు: ఆఁ  అది సరిపోతుంది.
ప్రశ్న: అయితే సీక్వెల్, మైసీక్వెలకి జాబ్ రాదంటావు?
జవాబు: లేదు. వాటికైనా వస్తుంది. కొన్ని రకాల జంటలకి ఉన్న ప్రాముఖ్యం మరికొన్నింటికి ఉండదు. అంతే కానీ ఇదే నేర్చుకొంటేనే జాబ్ దొరుకుతుందని నాఉద్దేశం కాదు.
ప్రశ్న: ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఏదైతే బావుంటుంది?
జవాబు: జావా, సి#, సి++ వీటిలో ఏదైనా ఒకటి బాగానే ఉంటుంది.
ప్రశ్న: అదేంటి మొన్న మా కజిన్ పైథాన్, రూబీకి మార్కెట్ బావుంది మిగిలినవాటికి జాబ్స్ కొన్నే ఉన్నాయన్నారు?
జవాబు: ఒక్కో చోట ఉన్న పరిశ్రమలని బట్టి డిమాండ్ ఒక్కో రకంగా ఉంటుంది. వీటికి ఎక్కువ, వాటికి తక్కువ అనుకోవక్కరలేదు. ఏదైనా ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ సరిగ్గా నేర్చుకొంటే మిగిలినవి సులభంగానే గ్రహించవచ్చు అందుకని వాటి గురించి అంత చర్చ అక్కరలేదు.
ప్రశ్న: ఏది నేర్చుకొంటే ఎక్కువ జీతము వస్తుంది?
జవాబు: (నా మనస్సులో...  ముందు ప్రశ్నకి సమాధానం చూడరా మూర్ఖుడా!). ఇది ప్రదేశాన్ని బట్టి, కంపెనీని బట్టి మరి కొన్ని కారణాల వల్ల ఒక్కోచోట ఒక్కోలా ఉంటుంది.
ప్రశ్న: నీకు వీటి గురించి అంత బాగా తెలియదనుకొంటా?
జవాబు: అవును. (మనస్సులో...  జీతంతో పాటు కాఫీ టిఫిన్ పెట్టి, కాళ్ళు చేతులు నొక్కుతారా అని అడగలేదు)

హమ్మయ్య, వీడు ఇక్కడ నన్ను వదిలేసాడు కాబట్టి బ్రతికిపోయాను. లేదంటే నేను భూలోకంలోనే నరకలోక శిక్షలన్నీ ఇప్పుడే అనుభవించేవాడిని. ఇదే బాపతు మనకి (అంటే బయట ఉద్యోగాలు చేసే వాళ్ళకి) డబ్బులు ఎలా సులభంగా సంపాదించాలి, పైకి ఎలా యెగప్రాకాలి, విదేశీ పౌరసత్వం ఎలా వెంటనే సంపాదించుకోవాలి లాంటి కిటుకులు చాలా ఉచితంగా ఇస్తారు.

అన్నీ కొంచెం కొంచెం తెలిసిన వాళ్ళు:

వీళ్ళు పై తరగతిలో వాళ్ళలా లౌక్యం లేకుండా అటువంటి ప్రశ్నలే అడుగుతారు. వీళ్ళకి చెప్పటం, ఒప్పించటం కొంచెం సులభమే.

ఏమి తెలియని సామాన్యులు: 

సోడా షాప్ ఓనర్(సోషాఓ): నువ్వు ఎక్కడ ఉంటావు?
నేను: సీడర్ రాపిడ్స్, అయోవా, అమెరికా.
సోషాఓ: అదెక్కడ?
నేను: చికాగో నుంచి పశ్చిమానికి 4 గంటల కారుప్రయాణం.
సోషాఓ: మా దూరపు బంధువు చికాగోలోనే ఉంటాడు.
నేను: చికాగోలో ఎక్కడ ఉంటాడు?
సోషాఓ: ఏమో చికాగోలో ఉంటాడు. నీ జీతమెంత (నాకు తెలుసు మీరైతే ఈ ప్రశ్న అడగరు, కానీ ముందే చెప్పా కదా, సామాన్యుడికి ఈ బాధ లేదు) ?
నేను:  (మనస్సులో... లెక్కలు) సుమారుగా సంవత్సరానికి 17 లక్షల రూపాయలు.
సోషాఓ: అబ్బో ఒక పదిహేను లక్షలయినా మిగలవా?
నేను: మిగలవు. యేవో రకరకాల ఖర్చుల చిట్టా విప్పి చెప్పేను.  (అతనికి అర్థం అయిన్దనుకోను).
సోషాఓ: సరే నన్ను కూడా నీతో తీసుకోపోరాదా? ఏఉద్యోగమైన చేస్తా.
నేను: ఎవరిని పడితే వాళ్ళని ఎప్పుడు పడితే అప్పుడు తీసుకొని పోలేము. దానికి పెద్ద తతంగం ఉంది.
సోషాఓ: అయితే నీప్రయత్నం మొదలుపెట్టు, యెంత త్వరగా వీలయితే అంత త్వరగా తీసుకునిపో..
నేను: సరే, చూస్తాను.

ఇది తెలియని అమాయకత్వం కాబట్టి సర్దుకుపోవచ్చు. ఒకవేళ సమాధానం చెప్పలేదనుకోండి, కళ్ళు నెత్తికెక్కాయంటారు. చెప్పారనుకోండి, వాళ్ళకు నచ్చదు కాబట్టి, వీడికి చేతకాదంటారు. ఏదైనా గట్టిగా మాట్లాడితే మదమెక్కిందంటారు. దీనికి మధ్యేమార్గం లేదు. ఇటువంటివే మన పెరట్లో పెరిగే డబ్బుల చెట్ల గురించి, కాలేజీల గురించి, పెళ్లి సంబంధాల గురించి, వ్యాపారాల గురించి ప్రశ్నలు వస్తూనే ఉంటాయి. ఊరికినే ఉండగలిగితే ఉత్తమం, లేకపోతే ఎలాతప్పుకు తిరగాలి అన్న మీ అనుభవాలు టపాలలో వ్రాసేయండి.  మేము చదువుకొని ఆనందిస్తాము.