24, అక్టోబర్ 2018, బుధవారం

వాట్సాప్ సిత్రాలు


మనలో చాల మంది ప్రొద్దునే నిద్రలేచి ముఖం కడుక్కోకుండా, మొట్టమొదట సెల్ ఫోన్ చూసేవాళ్ళు ఎంత మంది?  వాళ్లలో వాట్సాప్ చూసే వాళ్ళు ఎంత మంది? నేననుకోవటం కనీసం ఒక 95 శాతం ఫోన్ చూస్తే, వాళ్ళల్లో ఒక 95 శాతం వాట్సాప్ (whatsapp) మొదట చూస్తారని. వీళ్ళలో అందరికి కనీసం ఒకటో రెండో గ్రూపుల్లో సభ్యత్వం ఉంటుంది. ప్రొద్దున్నే చూడటం మంచి పనా లేక చెడ్డదా అన్నది కాదు ప్రశ్న. నా ప్రశ్నల్లా  ఏమిటంటే ఇది ఏరకంగా మనకి ఉపకరిస్తోంది అన్నది. 

వాట్సాప్ లో వచ్చే వార్తలని స్థూలంగా ఈక్రింది విభాగాలుగా చూడొచ్చు.  వచ్చే వార్తలన్నీ వీడియోలు, ఆడియోలు, యానిమేషన్లు, సంభాషణలు, సూక్తి ముక్తావళి, వీటిల్లో ఏదైనా కావచ్చు. 

జోక్స్ :
వీటితో ఎవరికి పేచీ లేదు. యేవో కొన్ని సున్నితమైన విషయాలకి సంబంధించినవి మినహాయిస్తే, వీటిని అందరు ఆస్వాదిస్తారేమో. 

దైవ భక్తి:
ఇది కూడా వ్యక్తిగతం కాబట్టి ఎక్కువ భాగం ఇబ్బంది లేదు. ఒకరి దేవుడి మీద ఇంకోడు హాస్యం, బురద చల్లనంత కాలం, లేకపోతే మన అభిప్రాయాలు బలవంతంగా రుద్ధనంత కాలం ఇది బాగానే నడుస్తుంది. లేకపోతే ఎక్కువ పరమత సహనం ఉన్నట్టు నటించవలసి ఉంటుంది. 

దేశభక్తి:
ఒకానొకప్పుడు ఎక్కువ మంది బయటకి చెప్పే అవసరం లేకుండానే దేశభక్తితో రగిలిపోయేవాళ్లు. నిజాయతి ఉన్న ఒక గొప్ప నాయకుడు "జై జవాన్, జై కిసాన్" అని పిలుపిస్తే లక్షల మంది వారితో మమేకమయ్యేరు. ఇప్పుడిది పైకి చెప్పుకోవలిసిన ఫాషన్, సోషల్ మీడియాలో చక్కగా వండబడుతున్న పదార్థం.  

ఆటలు /సాహసాలు: 
సోషల్ మీడియా పుణ్యామా అని క్రికెట్ కాకుండా వేరే క్రీడలు, ఇతర వ్యాసంగాలలో ప్రావీణ్యం చూపుతున్న ఆటగాళ్లు, పోటుగాళ్ళు గుర్తింపు పొందుతున్నారు. వాళ్లకి కూడా స్పాన్సర్స్ దొరుకుతున్నారు, జీవనోపాధి దొరుకుతోంది. చాలా సంతోషించవలసిన విషయం. 

సినిమాలు:
తెలుగు వాళ్ళకి సినిమా, రాజకీయాలు బాగా వంటపట్టాయి అందుకని ఇవి లైట్ తీసుకోవచ్చు. కాకపోతే మీము (meme), దుబ్స్మాషు (dubsmash), అర్థం లేని వీడియోల వల్ల అభిమాన నాయ(కుల) సంఘాల వాళ్ళు దెబ్బలాడుకోవటానికి మరో చక్కటి అవకాశం దొరుకుతోంది. సినిమా ఔత్సాహికులకు, ప్రతిభ ఉండి డబ్బులు లేనివారికి మంచి ప్రోత్సాహం కూడా దొరుకుతోంది. 

కళలు: 
ప్రభుత్వం ప్రోత్సహించట్లేదు అన్న అపప్రథకి గురైన ఈ రంగం ఇప్పుడు కొంచెం కొంచెం పుంజుకొంటోంది. ప్రచారం, గుర్తింపు దొరికి, చాల చిన్న చిన్న కళాకారులు కూడా విదేశాల ప్రయాణాలు చేసి వారి వారి సత్తాని, వ్యాపారాలని వృద్ధి చేసుకొంటున్నారు. 

పరోపకారం/బోధ: 
ఫలానా వారికి ఆరోగ్యం బాగోలేదు సాయం చేయండి. ఏదో ప్రాజెక్ట్ చేస్తున్నాము, విరాళాలు ఇవ్వండి. నిజంగా ఎంతమంది వీటిలో చిత్తశుద్ధితో చేస్తున్నారో, నిజమైన ఆర్తులకి ఇవి అందుతున్నాయో లేదో చెప్పటం కష్టం. ఈ పని చెయ్యండి, ఫలానా ఫలం దొరుకుతుంది అనే వాళ్ళు బాగానే ఉన్నారు. 

రాజకీయాలు: 
మనం ఎన్ని రకాలుగా చీలిపోవాలో అన్ని రకాలుగానూ చీలిపోయాం కాబట్టి, మన దాస్యభక్తి ప్రకటించుకోవడానికి ఇది అన్నిటిలోకి ముఖ్యమైనది. మర్యాదకోసం నోరు విప్పం, విప్పామో ముఠా గొడవలకి అంతు లేదు. అలాగే ప్రచార కండూతి ఉన్నవాళ్ళకిది వాళ్ళని ప్రకటించుకోవటానికి ఇదొక మంచి మార్గం. 

అభినందనలు: 
పుట్టిన రోజు, పండగ రోజు అభినందనలు  చెప్పుకోవడంలో అభ్యంతరం లేదు. కానీ లేచినపుడొకటి, తినేటప్పుడొకటి, పాడుకొనేటప్పుడొకటి మెసేజ్లు (messages) అవసరం లేదేమో.

విజ్ఞానం:
వాట్సాప్ గూగుల్ తర్వాత ఎక్కువ కష్టపడకుండా విజ్ఞానం పంచె సాధనంగా తయారయ్యింది. ఒకవేళ మీకు వాట్సాప్ లో సభ్యత్వం లేకపోతే ఈ ఒక్క కారణానికి సభ్యుడుగా చేరి పోవచ్చు. అతి తక్కువకాలంలో అన్ని శాస్త్రాలలో అఖండమైన విజ్ఞానం మీ సొంతం అవుతుంది.  

వ్యాపారం:
పేరుకి జనులనుద్దరించడానికి ఉద్భవించాము అని చెప్పుకుని, నిజానికి వ్యాపారం కోసం మాత్రమే వచ్చినవి ఈ ఉత్పత్తుల, సేవల సంస్థలు అన్ని. ఇందులో సందేహం ఏమాత్రము లేదు. మనం ఏది చేసినా, దాన్ని గోప్యంగా ఉంచుతామని చెప్పి వాళ్ళ వ్యాపారాలకు, స్వప్రయోజనాలకు అనుగుణంగా వాడుకొనే సంస్థలు అనేకం. 

ఆరోగ్య చిట్కాలు:
రోజు ప్రొద్దున్నే పరగడుపున ఒక లీటర్ గోరువెచ్చని నీళ్ళు త్రాగండి. మీకున్న సమస్త రోగాలు మాయమవుతాయి అన్న వార్త మీలో చాలా మంది చూసే ఉంటారు. ఇదే జరిగుంటే, ప్రజలంతా రోగరహితంగా ఉండి ఆసుపత్రులు మందుల కంపెనీలు జండా ఎత్తేసేవి.  

సోషల్ మీడియా ఆవిర్భావం తర్వాత చాలా మంచి జరిగింది అనే ఒప్పుకోవాలి. 90వ దశకానికి ముందర స్కూళ్ళకి వెళ్లిన వాళ్ళకి, ఎన్నో ఏళ్ళ తర్వాత అనేకమంది స్నేహితులు, బంధువులు దూరంతో సంబంధం  లేకుండా కలిసి, ఉత్తరప్రత్యుత్తరాలు జరుపుకునే వేదిక దొరికింది. అయితే ఉన్న వసతులని ఏదో విధంగా దుర్వినియోగం  చేసే వాళ్ళు రోజు రోజుకి పెరగడమే కానీ తగ్గడం లేదు. సొంతంగా ఒక్క అభిప్రాయము, మాట వ్రాయనివాళ్ళు ఒక రోజులో కొన్ని పదుల మెసేజ్లు (messages) ఫార్వర్డ్ చేస్తున్నారు. పోనీ వాటిలో ఏవైనా వాళ్ళని కదిలించిన, వాళ్ళల్లో భావావేశం, పొంగు తెచ్చి, ఉత్తేజాన్ని నింపే వార్తలు పంపుతున్నారా అంటే అది కూడా కాదు.  అంటే వాళ్ళకి పనికిరాని వార్త మరొకళ్ళకి  పనికివస్తుంది అని కళ్ళుమూసుకొని పంపించేస్తున్నారు. దీని వల్ల ఇంటర్నెట్ మీద ఎంత రద్దీ, ఎంత భారం పడుతోందో, మనం ఎంత డిజిటల్ చెత్త (spam)తయారుచేస్తున్నామో అర్థం కావట్లేదు. అలాగే ఈవ్యర్థాల వల్ల బ్యాండ్విడ్త్ (bandwidth) తగ్గి, నిజమైన అవసరార్థులకి ఎంత అసౌకర్యం కలుగుతుందో ఎవరికి పట్టదు. పనిలో పని ఏ వార్తలు వాళ్ళకి వస్తున్నాయో సరిగ్గా చూడని, చదవని వాళ్ళు, పంపినవే మళ్లీ, మళ్లీ  పంపటం ఒక గొప్ప ఫార్స్. తప్పులు చేసే వాళ్ళు, వాళ్ళని దిద్దేవాళ్ళు, భాషతో భయపెట్టేవాళ్ళు, తప్పుడు వార్తలతో, పుకార్లతో, అబద్దాలతో శోభిల్లే ఇదో వింత ప్రపంచం. వినోదానికి తప్ప మారేందుకు పనికిరాదేమో అని ఒక్కొక్కసారి నిరాశ కలుగుతుంది. ఇంక సెల్ ఫోన్తో జీవితంలో వ్యక్తిగత అభివృద్ధి, బంధాలని తగ్గించుకొని/కోల్పోయి, పిచ్చి పనులు చేసి, కూడని పరిస్థితులలోకి చివరికి జీవితాలు నెట్టబడటం రోజు పత్రికలూ, టీవీ, ఇతర మీడియా సాధనాలు వాడే/చూసే వాళ్ళకి చెప్పనక్కరలేదు!


15, జూన్ 2018, శుక్రవారం

చిక్కటి బెంగ


చిక్కటి బెంగ - ఇదేమి పదం,  వీడి అసాధ్యం కూల అని నవ్వుకోకండి. Nostalgia అన్న ఆంగ్లపదానికి వచ్చిన చిక్కిది. పైన ఉన్న బొమ్మలో కొన్ని నిర్వచనాలు ఇచ్చారు, కానీ నాకవేవి నచ్చలేదు. అందుకని నాకు నచ్చిన అర్థంతో రెండు పదాలని కలిపి నాక్కావలసింది తయారుచేసుకున్నాను.  మనలో చాలా మందికి బాల్యం లోని మధురస్మృతులు తలుచుకొంటుంటే మనస్సులో ఎక్కడో తీయటి (ఇదెంటో తెలియాలంటే దేవులపల్లి కృష్ణశాస్త్రిగారి రచన - కృష్ణపక్షం చూడండి) బాధ కలుగుతుంది. ఇదేదో బాగానే ఉన్నట్టుంది.  Nostalgia కి తీయటి బాధకి  ఏదో బాదరాయణ సంబంధం ఉన్నట్టుంది.  ముఖ్యంగా ప్రవాసంలో ఉన్నవాళ్ళకి కష్టేఫలి గురువు గారు వ్రాసే వంటకాల స్పెషల్స్ చూసినపుడు, లేకపోతే ఫణిబాబు గారి యాత్ర విశేషాలు చూసినపుడు ఇవన్నీ మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు అందుబాటులో లేవే అన్ననైరాశ్యం కలుగుతుంది (ఈ పెద్దలిద్దరు మన్నించాలి అడక్కుండా వారి పేర్లు వాడుకొన్నందుకు - అలాగే వారు విద్వత్తు కలిగి అన్ని కళలలో ఆరితేరినవారు, వీటికి మాత్రమే పరిమితం కాదని గమనించాలి). అత్యాశ కాదు కానీ నాలాంటి ప్రవాస మందమతులకి తిండి మీద, తిరుగుడు మీద శ్రద్ద ఎక్కువ అందుకని వాటిగురించే ఎక్కువ ఆలోచనలొస్తుంటాయి. గాంధీగారిలాంటి మహాత్ములకైతే ప్రవాసంలో తెల్లవాళ్లు పెట్టిన బాధలు మన దేశానికి స్వతంత్రం ఎలా తేవాలి అన్న దాని మీద ఆసక్తిని పురిగొల్పాయి. సరే దారి తప్పిపోతున్నట్టున్నాను. 

చిన్నతనంలో ఏడాదికి రెండు మూడు సార్లు మా అమ్మమ్మగారింటికి సెలవులలో తణుకు వెడుతూవుండేవాళ్ళము. సాధారణంగా మాఅమ్మగారు, మాతమ్ముడు, చెల్లెలు తో కలిసి ప్రయాణం చేసేవాళ్ళము. కాస్త పెద్దవాళ్ళమైన తర్వాత, నేను మాతమ్ముడు కలిసి వెడుతూ ఉండేవాళ్ళము. మానాన్నగారికి సెలవులు లేకపోటంవల్ల , లేకపోతే అత్తగారింట్లో తోచదనో మాతో వచ్చిన సందర్భాలు చాలా తక్కువ.  ఎక్కడా  బండి మారి వేరే బండిలో వెళ్ళక్కరలేదు కాబట్టి, ఎక్కువ భాగం సర్కారు ఎక్స్ప్రెస్లోనే ప్రయాణం చేసేవాళ్ళము.  పేరుకి ఎక్స్ప్రెస్స్ బండే కానీ ప్యాసింజర్ బండి కంటే నెమ్మదిగా వెళ్ళేది. అన్ని స్టేషన్లలోనూ గూడ్స్ రైళ్ల కోసమో, ఇంకా పెద్ద ఎక్స్ప్రెస్స్ రైళ్ల కోసం ఎక్కడో అక్కడా మధ్యలో  ఆపేసేవాళ్ళు. మధ్యాహ్నము 2 గంటలకి రైలు మా ఊళ్ళో ఎక్కితే, తెల్లారగట్ట 2 గంటలకి తణుకు చేరుకొనేది. మాఊరినుంచి బెజవాడ దాకా మెయిన్ లైన్ డబుల్ లైన్, మధ్యలో తెనాలి - గుంటూరు - విజయవాడ బ్రాంచ్ లైను, అక్కడి నుంచి కైకలూరు, ఆకివీడు, భీమవరం, తణుకు మీదుగా నిడదవోలు దాకా బ్రాంచ్ లైన్, పైపెచ్చు ఒకటే లైను.  మద్రాసు నుంచి కాకినాడ దాకా పూర్తిగా స్టీమ్ ఇంజిన్ తోనే రైలు నడిచేది. 1981 దాకా విజయవాడ మద్రాసు మధ్యలో, మెయిన్ లైన్లో ఎలక్ట్రిక్ రైళ్లు రాలేదు. అందువల్ల జనాలకి తొందరలేక ఎక్కువ భాగం మెల్లగా, నిదానంగా ప్రయాణాలు చేసేవాళ్లు. హడావిడి చేసేవాళ్ళు ఎలాగూ ఎప్పుడూ ఎంతో కొంత మంది ఉండడం సహజమే కదా!

పండగ సెలవలైనా, వేసవి సెలవులైనా తణుకు వెళుతున్నాము అంటే అందరికి ఉత్సాహం ఎక్కువై, పది రోజుల ముందరి నుంచే స్కూల్లో అందరికి చెప్పేసే వాళ్ళము. ఇంక దీపావళికి అక్కడికి వెడుతున్నామంటే మమ్మల్ని పట్టుకోవటం ఎవరితరం కాదు. టీచర్లు కూడా ఇచ్చిన సెలవుల కంటే కాస్త ఎక్కువ కాలం స్కూలికి రాకపోయినా ఇబ్బంది పెట్టేవాళ్లు కాదు. అందువల్ల ఇచ్చిన సెలవల కంటే ఒక్కోసారి ముందరెళ్ళడం, లేదా ఆలస్యంగా రావటం జరిగేది.  అదృష్టం బావుండి, మేము చదువుకున్నవి ప్రభుత్వపు బళ్ళు, మాకు చదువు చెప్పిన వాళ్ళు మార్కుల కోసం, ర్యాంకుల కోసం మమ్మల్ని రుబ్బని సహృదయులు. ఎల్కేజీ నుంచి బడికి నిత్యం రాకపోతే ఫెయిల్ చేస్తాము లేకపోతె విద్యార్థి ప్రగతి పొందడు అని భయపెట్టేవాళ్ళు కాదు. ఈ పెద్దల గురించి మరో సమయంలో వ్రాసే అదృష్టం భగవంతుడిచ్చుగాక!

మాకు ఒక దొడ్డమ్మ, ఒక పిన్ని, వాళ్ళకి వరసగా ముగ్గురు ఇద్దరు పిల్లలున్నారు. మరో ముగ్గు మేనమామలున్నా, వాళ్ళు బాగా దూరంగా ఉండేవాళ్ళు. తణుకు వాళ్ళకి మాకంటే బాగా దగ్గర కాబట్టి మాకంటే వాళ్ళు తరచుగా అక్కడికి వచ్చే వాళ్ళు. వెళ్లిన తర్వాత ఎవరిళ్ళకి వెళ్లి ఎవరెవరిని కలుస్తామో, ఏమి ఆటలాడతామో, ఏమి సినిమాలు చూస్తామో అని ఒకటే ఉత్కంఠ.  ఇదికాక తినుబండారాలు, కావలసిన అద్దె పుస్తకాలు, ఓహో ఆభోగం తలచుకొంటే, 1990లో దేవుడి దగ్గరికి వెళ్ళిపోయిన మా అమ్మమ్మగారు, ఆవిడ మామీద కురిపించిన అవ్యాజమైన ప్రేమ, మనుమలు ఎంత అల్లరి చేసినా ఆవిడొక్కరే అడిగినవన్నీ అమర్చి పెట్టటం, ఎప్పుడైనా విసుక్కోవలసివస్తే ఎంతో అందంగా "లండిక్కి" (అర్థం నాకు తెలియదు) అనటం ఇప్పటికి నా కళ్ళల్లో మెదులుతున్నాయి. శ్రీచాగంటి వారన్నట్టు అమ్మ అంటే రాశీభూతమైన ప్రేమ. అమ్మకి దూరంగా ఉండటం వల్ల , ఈ మాట తలచుకొన్నపుడల్లా మనస్సు ఇంటి వైపుకి మళ్ళుతూ ఉంటుంది. అటువంటిది అమ్మమ్మ అంటే అమ్మకే అమ్మ , ఎంత ప్రేమవుంటుందో చెప్పనలవి కాదు.  తెలియని వయస్సులో ఆవిడని ఏదైనా కావాలని అడిగితే అతి సులభంగా ఎలాగైనా సాధించి చేయగలిగే శక్తిమంతురాలని నమ్మే వాళ్లము.  వయస్సుతో పాటు ఆవిడ శ్రమ, కష్టాలు, బలహీనతలు, భర్త లేకుండా ఆరుగురు పిల్లలని ప్రయోజకుల్ని చేసి, అందరితో మంచి మనిషి అనిపించుకోవటానికి ఎన్ని అవస్థలు పడ్డారో తల్చుకొంటే చాలా బాధ వేస్తుంది. 

ఇంకా తణుకులో ఆటలు, పుస్తకాలు, సినిమాలు, తిండి, పెళ్లిళ్లు , పేరంటాలు, నోములు, వ్రతాలు, అమ్మమ్మ స్నేహితులు, వాళ్ళ పిల్లలు,  ఊళ్లలో వీరవిహారం మాటల్లో చెప్పడం కష్టం. అదీకాకుండా అమ్మమ్మ చుట్టుపక్కల వాళ్ళతో కలసి పనుల్లో చేయి వేయడం, దీపావళికి మతాబులు సిసింద్రీలు చుట్టడం, అసలు అందరితో కలిసి పని చేయడం, పని నేర్చుకోవటం ఎలాగ అన్నది మాపిల్లలకి ఎలా నేర్పించాలో నాకు ఇంకా అంతుబట్టకుండానే వాళ్ళు పెద్దవాళ్లయిపోతున్నారు. . సెలవులు అయిపోయిన తర్వాత వెనక్కి వచ్చేస్తుంటే ఉండే బాధ, బెంగ  మాటల్లో చెప్పటం కష్టం. మేము పిల్లలము ముగ్గురు ఎవరితో మాట్లాడకుండా నిశ్శబ్దంగా రైలులో వెనక్కి వచ్చేసి, మరో వారం రోజులకు గాని మామూలు మనుషులం కాలేక పోయేవాళ్ళము. అమ్మ పరిస్థితి కూడా అంతే కానీ బయట పడేది కాదనుకొంటా. ఇంటి పనిలో మునిగిపోయేది. అమ్మ అమ్మే!  ఇప్పటికి ఆ స్మృతులు తలచుకొంటే బెంగే కానీ పిల్లలప్పటి తీవ్రత లేదు. ఈ గొడవంతా ఇప్పుడెందుకంటారా? కొద్ది రోజులలో మా ఇండియా యాత్ర మొదలవుతోంది, అందరిని తలుచుకొని మదిలో ఈ కబుర్ల కితకితలు మొదలయ్యాయి. 

28, ఫిబ్రవరి 2018, బుధవారం

నేనెందుకు చదువుతాను?

నాకు ఊహ తెలిసిన తర్వాత (దగ్గర దగ్గర నాలుగేళ్ళపుడు) మాఅమ్మ దగ్గర కూర్చుని అక్షరాలు దిద్దుతూ నేర్చుకొన్న విషయం ఏమిటంటే చదువుకొంటే జీవితంలో వృద్ధిలోకోస్తామని. చదువు, వ్యక్తిగత వృద్ధి నిర్వచనాలు అడగొద్దు. అవి ఒక్కో మనిషికి ఒక్కోక్కలా అన్వయం అవుతాయి లేకపోతే వాళ్ళు ఒక్కోక్కలా అన్వయం చేసుకొంటారు.  నాకు అర్థం అయినదేమిటంటే, దొరికినది దొరికినట్టు చదవటమే. మొదట చిన్న చిన్న కథల పుస్తకాలతో అక్షరాలని కూడపలుక్కుని చదవటం నేర్చుకున్నాను (అమ్మ వెనకాలే ఎక్కడో పనిలో ఉండి గమనిస్తూ ఉండేది, అలాగే  తెలియని పదాల గురించి తెలుసుకోవడానికి మా అమ్మే మొదటి నిఘంటువు). రెండు మూడు తరగతులకొచ్చేటప్పడికి  చందమామ,బాలమిత్ర, బొమ్మరిల్లు చదవటం మొదలయ్యింది. అలాగే వేరే తరగతుల వాళ్ళ వాచకాలు, ఉపవాచకాలు. చుట్టూ పక్కల అంతా తెలుగు మీడియం పిల్లలు తప్ప మరొకళ్ళు లేక పోవటం మా అదృష్టం.  అప్పటికి పుస్తకాల మేత అలవాటయ్యి, ఆకలి పెరిగింది. ఐదో తరగతిలోకి వచ్చేటప్పటికి మానాన్నగారు  ఈనాడు పత్రికకి చందా కట్టి, ఇంటికి తెప్పించటం మొదలెట్టారు. ఆరు, ఏడు  తరగతుల్లో వార, మాస పత్రికలు, డిటెక్టివ్ పుస్తకాలు అలవాటయ్యాయి. ఎనిమిదో తరగతిలో నవలలు నాకు చదువుకోవటానికి అందుబాటులోకి వచ్చాయి. ఆ తర్వాత స్కూల్ బయట  చదువు గురించి ఇంక వెనక్కి తిరిగి చూడలేదు. మా అమ్మానాన్నకి చదువు మీద ఉన్న అనురక్తి, స్కూలు వేళలో స్కూలు పని, సాయంత్రం ఆడుకొనే వేళలో తప్ప, మిగిలిన వేళల్లో ఇంటి పట్టున ఉండి నీడలో పాఠ్య పుస్తకాలో, వాళ్ళకి తెలియకుండా వేరే పుస్తకాలో చదువుకోగలగటం మరో అదృష్టం. పెద్ద తరగతుల్లోకి వెళ్లిన తర్వాత క్లాసు పుస్తకాలు చదవవలసిన వత్తిడి ఉన్నా, వేరేవి చదివినా మా అమ్మానాన్నలు చూసి చూడనట్టు ఉండేవాళ్ళు.

జీవితంలో నేను ఇప్పటిదాకా మత్తులోని ఎత్తుని నాలుగైదు మార్గాల్లో రుచి చూసాను (దీన్ని ఇంగ్లీషువాడు "getting high" అంటాడనుకొంటాను). వాటిలో ఒకటి రెండు ప్రస్తావిస్తాను.  మొదటిది తిండి. ఆంధ్రుడైనందుకు, ఆవకాయ, గోంగూర పచ్చడి, మిరపకాయ బజ్జి, మినపట్లు, పెసరట్లు మొదలైన వాటిలో మత్తు చూసాను. అవి తల్చుకొన్న వెంటనే నోరు, మెదడు ఆ రుచులు కోరుతాయి. రెండోది, గెలుపు. ఏదైనా పరీక్షలో మొదటివాడిగా నిలబడితే వచ్చే కిక్కు. ఆ మజాని మాటల్లో చెప్పటం కష్టం. అలాంటిదే మంచి పుస్తకం చదవటంలో ఉండే ఆనందం. ఈ రకం మత్తుని  నెమరువేసుకొని, నెమరువేసుకొని అనుభవించాలనిపిస్తుంది. అన్నింటి లాగే ఇందులోనూ అతి ఎక్కువైతే కళ్ళు నెప్పెట్టడం, తల బరువెక్కడం, మనస్సు అలిసిపోవటం, కొన్నాళ్ళు వీటికి దూరంగా పారిపోతే బావుందనిపిస్తుంది. బహుశా అందుకనే అన్ని ప్రక్రియల్లోను కొంత విరామమిచ్చి, మళ్ళి సాధన చేసుకోమని పెద్దలు సలహా ఇచ్చిన్నట్టున్నారు.  ఒక పుస్తకాన్ని తీసుకుని అది ఎందుకు నచ్చిందో, ఎందుకు నచ్చలేదో చెప్తే పని సులభమవుతుంది. అయితే అది పుస్తక సమీక్ష అవుతుంది కానీ నేను చెప్పదలుచుకున్నది పూర్తిగా చెప్పబడదేమో? అలాగే నేను చదివిన కొన్ని పుస్తకాలని అరువుతెచ్చుకున్నా, అందరు పాఠకులు అవి చదివి ఉండాలని లేదు.  అయినా మరో మార్గాంతరం లేక అదే పద్దతిలో, అతి చిన్న భాగాలుగా విడదీసి వివరణ ఇస్తున్నాను.

భావోద్వేగాలు:
మొదటిది మనలో ఉండే భావోద్వేగాలని తట్టి  లేపి, మనల్నికూర్చోనివ్వక, నుంచోనివ్వక, మనస్సుని ఏపని మీద దృష్టి పెట్టకుండా చేసేది. ఇది వయస్సుతో పాటు సహజంగా మారే విషయం. మనలో చాలా మంది చిన్నతనంలో సర్కస్సులకి వెళ్లినవాళ్ళమే. Tight Rope Walk అని ఒక ప్రదర్శన అందరు చూసిందే అయ్యుంటుంది. రెండు కొయ్య స్తంభాలని పాతి, వాటి పైభాగాలని ఒక ఇనపతీగతో కలిపి బిగించి కడతారు.  రెండు కొయ్యలకి నిచ్చెనలని అమర్చి,  వాటి ద్వారా పైదాకా వెళ్లి, ఒక చిన్న పిల్లనో, పిల్లాడినో ఆ తీగ మీద ఏ ఆధారం లేకుండా నడిపిస్తారు. ఆ మనిషి ఒక వైపు నుంచి మరో వైపుకి నడుస్తున్నంత సేపు, ప్రేక్షకులు ఊపిరి బిగబట్టి చూస్తూంటారు. ఒక్కసారి అవతలకి చేరుకోగానే, ఊపిరి వదులుతారు. పడిపోతారేమో అని పిల్లలం సీటు చివరికంత కూర్చుని, కళ్ళార్పకుండా చూసేవాళ్ళం. ఎవరైనా పడితే, పైకి లేచి ఏమైనా అయ్యిందా అని ఆదుర్దాగా చూసే వాళ్ళము. క్రింద వల అనేది ఒకటి ఉంటుందని తరవాత తెలిసింది. అలాగే ఏదైనా పుస్తకంలో లీనమై చదువుతుంటే, కాలం తెలియదు, ఒళ్ళు తెలియదు, ప్రక్కన వారి స్పృహ ఉండదు.

ఒకసారి ఏదో పోటీ పరీక్ష కోసం ఢిల్లీ వెళ్లి తిరిగి ఆంధ్రప్రదేశ్ ఎక్సప్రెస్లో హైదరాబాద్ తిరిగివస్తున్నాను. అప్పట్లో టైం మన చేతిలో కాక రైల్వేవాళ్ళ చేతుల్లో ఉండటం వల్ల, ఎక్కడికి వెళ్లినా కూడా పుస్తకాలు వేసుకొని ప్రయాణం చేయటం అలవాటు. నాకు పైన ఉన్న బెర్త్ దొరికింది (టూ టైర్ బోగి అని గుర్తు). అది రోజున్నర ప్రయాణం. పానుగంటివారి సాక్షి వ్యాసాలు చదువుతున్నాను. నాకు ఎదురుగా ఒక మార్వాడి (నాకెలా తెలుసు అన్నది మరో పెద్ద కథ. స్వతంత్ర భారతంలో ఒక్క రైలు ప్రయాణంలో మొత్తం ఒక కుటుంబం పుట్టుపూర్వోత్తరాలు తెలుసుకోవచ్చు) అన్న చెల్లి, నా బెర్త్ క్రింద ఒక తెలుగు పెద్దావిడ తోటి ప్రయాణీకులు. అప్పుడు నాకు 21 ఏళ్ళు, ఆ పిల్లకి 17, 18 ఉంటాయేమో. అన్నగారు 24 లేక 25 ఏళ్ళ వాడు అయిఉండవచ్చు. పెద్దావిడకి ఒక 50 సంవత్సరాల వయస్సుండవచ్చు. పుస్తకంలో రచయిత వ్యంగ్యానికి నాకు ఒకటే ముసిముసి నవ్వులు, గట్టిగా నవ్వితే ప్రక్కన వాళ్ళు ఏమి అనుకొంటారో అని భయం (ఆ అమ్మాయి అందంగా ఉండటం, నేను కొన్ని సార్లు దొంగచూపులు చూడటం కూడా మరో నిజం. అపార్థాలకు అవకాశం ఎక్కువ) . అప్పటికి అన్నగారు ఒక కంట నన్ను గమనిస్తున్నారు. ఒక రెండు, మూడు గంటలు అదే పరిస్థితి. ఇక లాభం లేదనుకొని ఒక ద్వారం తలుపు దగ్గిర చతికిలపడి చదువుకొన్నాను.

ఊహాగానాలు:
నా తరంలో, అంటే 80వ దశకంలో కాలేజీలలో ఉన్నవాళ్ళకి,  చదవటం (పాఠ్య పుస్తకాలు కాకుండా) అలవాటు ఉన్న వాళ్లకి అన్ని పత్రికల్లో సీరియళ్ల తాకిడి తెలిసే ఉంటుంది. ఈనాడు దినపత్రికలో, మూడో పేజీలో వచ్చే బొమ్మల కథల కోసం నేను, మాతమ్ముడు, మా చెల్లెలు దెబ్బలాడుకొనేవాళ్ళం.  ఆవేళ కథ చదివిన తర్వాత, రేపు ఏమి జరుగుతుంది అన్నది ఒక్కోసారి తెగేది కాదు. మా అమ్మో, నాన్నో అక్కడి నుంచి మమ్మల్ని తప్పించేదాకా ఇదే తంతు. నేను ఇంటర్లోకి వచ్చేటప్పటికి, ఉదయము పత్రికలో "అశ్వభారతం" ధారావాహిక క్రింద వచ్చేది. దానికోసం ప్రొద్దున్నే పడిగాపులు కాసేవాడిని. రేపేమి జరగబోతోందో అన్న ఉత్కంఠ ఆపుకోవటం కష్టంగా ఉండేది. ఇవికాక షాడో ఇస్తాంబుల్ లోనో, కాబూల్లోనో గూఢచర్యం చేస్తున్నాడనుకోండి, ఒకసారి కళ్ళు మూసుకొని ఊహ చేయండి.  సూపర్ స్టార్ కృష్ణనో, రజనీనో ఆయా ప్రదేశాలలో కథానాయికతో వెళ్ళి ఒక్క ఆయుధం కూడా లేకుండా విరోధులు అందర్నీ పచ్చడి చేసి, సింగపూర్ ప్రధానితో నీ వల్లే మాదేశం కాపాడబడిందని అనిపించుకుని, అమెరికా ప్రెసిడెంట్తో మెడల్ వేయించుకొని ఢిల్లీలో తేలుతారు అనుకోండి. (ఏమిటి ఇస్తాంబుల్, కాబూల్, సింగపూర్, అమెరికా సిటీ బస్సు స్టాపుల అనకండి, బాండ్ చేయగలిగితే షాడో కూడా చేయగలడు. కృష్ణ, రజని తెలియదా? మహేష్ బాబు, జూనియర్ ఏంటోడు తెలుసా,  అయితే వాళ్లనే షాడో అనుకోండి, ఒక పనయిపోతుంది). కంగారు పడొద్దు. పుస్తకం ఎన్ని సిన్మాలనయినా మన మస్తిష్కంలో చూపగలదు.  నాకైతే టీవీలు, ఇంటర్నెట్ రాకముందు పుస్తకాలే లోకం, అందునా పురాణ కథలో, జానపద కథలో చదువుతుంటే పదునాల్గు భువనాలు తిరిగివచ్చే వీలుండేది.

భాషాభివృద్ది:
ఏదైనా ఒక నైపుణ్యం పొందడం గురించి ఒక రచయిత ఇలా అంటాడు. "ఆ విషయం చదవటం, అర్థం చేసుకొని మననం చేయటం, పునశ్చరణ చేయటం - ఇవే మనల్ని అభివృద్ధి పథంలోకి నడుపుతాయి". భాషకి కూడా ఇదే సూత్రం వర్తిస్తుంది.  చదువుతూంటే క్రొత్త పదాలు, ప్రయోగాలు, నుడికారం, సామెతలు, మాండలీకాలు మనం ఇల్లు కదలకుండా తెలిసికోవచ్చు. ఏదైనాతెలుగులో క్రొత్తది నేర్చుకొంటే, ఆఉత్సాహం మరోలా ఉంటుంది (ఆ కిక్కె వేరబ్బా!). నాకు ఎనిమిది యేళ్ళ అప్పుడు, ఒకసారి  "మన పాత ఇంటి దగ్గర నివసించేవాడు ఇప్పుడు ముందున్న రహదారిపై పోవుచున్నాడు" అని మాఅమ్మతో అన్నాను.  అప్పట్లో మాఇంటికి ఎవరు బంధువులు  వచ్చినా, మా అమ్మ అందరికి చెప్పి, నవ్వి అందరిని నవ్వించేది. నేను ఉడుక్కునేవాడిని. పుస్తకాల ప్రభావం అంతలా ఉంటుంది అంటే అతిశయోక్తి కాదు. అవికాకుండా, మనుషులు, వారి యాస/గోస, ప్రాంతీయత, చరిత్ర, ప్రదేశాలు, విజ్ఞానం ఒకటేమిటి అసలు కోర్కె ఉంటె, సమస్తనాగరికత పరిణామం అంతా పుస్తకాలలోంచి గ్రహించవచ్చు. ముఖ్యంగా ప్రఖ్యాతినొందిన ఏ రచయిత దగ్గరైనా చిన్న చిన్న పదాలతో అత్యంత ప్రభావకరమైన వాక్యాలు రావటం గమనించవచ్చు. కొందరి వ్రాతలు చదివి చదివి, ఎన్ని సార్లైనా వాటిలో రసాన్ని పిండుకుని, త్రాగి త్రాగి ఆస్వాదించవచ్చు. ఇది నేను తరచూ చేస్తుండే పనుల్లో ఒకటి. మచ్చుకకి "ఏ జాతి చరిత్ర చూసిన ఏమున్నది గర్వకారణం, నరజాతి చరిత్ర సమస్తం పరపీడనపరాయణత్వం",  "ఏ దేశమేగినా ఎందుకాలిడినా పొగడరా నీతల్లి భూమి భారతిని, నిలపరా నీ తల్లి నిండు గౌరవము", "జయ జయ భారత జనయిత్రి దివ్యగాత్రి" - ఇవి వింటే మీకు ఆవేశం, పొంగు రావటంల్లేదు? ఇందులో కష్టమైన పదాలూ ఏమీలేవు కానీ ఎంత అర్థవంతమైన, సారవంతమైన, ప్రోత్సాహకరమైన వాక్యాలు. ఎలాగూ వాటిని ఆచరణలో పెట్టం, కనీసం చదివి, నాజాతి ఇటువంటి రచయితలనిచ్చిందని పొంగిపోదాం.

సృజనాత్మకత:
దీని గురించి నేను ఎక్కువ చెప్పలేను. ఒక చిన్న ఉదాహరణతో దీన్ని పూర్తి చేస్తాను. నేను గత రెండు మూడేళ్ళుగా రోజులో కొంత సమయం తెలుగు బ్లాగ్లు చదవడానికి కేటాయిస్తున్నాను. ప్రతి రోజు ఇది బావుంది అనేవి ఒకటో రెండో ఉంటాయి. వాటికి నా మనఃస్థితిని బట్టి కామెంట్స్ పెడదామనుకొంటాను. కానీ వ్రాయడానికి వచ్చేసరికి, బావుంది, కెవ్వు కేక, వావ్, అదిరింది, చక్కగా ఉంది. ఇంతే గుర్తుకొచ్చేది, కొన్ని సార్లు వ్రాసిన విషయం ప్రస్తావించి ఏదో ఉద్ధరిద్దామని బయలుదేరితే బద్ధకం అడ్డు. అది కూడా దాటితే ఒకే బాణీలో వ్రాసినవి మరి కొన్ని వ్రాయటం ఇష్టం లేదు. సంతృప్తి లేదు. అదే శ్రీశ్రీగారిది "రివ్యూలు, ప్రివ్యూలు" అన్న పుస్తకం చదివిన తర్వాత ఆయనని మహాకవి అని ఎందుకన్నారో నాకు అర్థం అయ్యింది. వారి రివ్యూలు ఒక రకంగా కామెంట్స్ వ్రాయటం లాంటిదే. ఫలానాకథలో నాగమణి ఎందుకు నవ్విందో కాకుండా, కథ గురించి చెప్పి పూర్తిగా చెప్పకుండా, వాడిన పదాన్ని మళ్ళి వాడకుండా, ప్రతీది క్రొత్త పంథాలో చెప్పటం కొన్ని పదుల పుస్తకాలకి ముందు మాట వ్రాయటం ద్వారా ఆయనకే చెల్లింది. నావరకు  సృజనాత్మకతకి అదే తారాస్థాయి, అదే కొలమానం.  నేను చదివిన వారు, చదవని వారు ఇల్లాంటి ఆణిముత్యాలని మనకందించిన కవులు ఆంధ్ర దేశంలో ఎంతో మంది ఉన్నారు.  ఒక శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రీ, ఒక విశ్వనాథ, ఒక చలం, ఒక మల్లాది రామకృష్ణశాస్త్రి, వీరంతా కారణజన్ములు, అక్షర బ్రహ్మలు, ఋషులు, ఈ పరంపరకు అంతు లేదు, ఇది నిరంతర జీవధార.  వీరందరిని ఎప్పుడు తలుచుకున్నా తనువు పులకరించిపోతుంది.

ఆత్మసంతృప్తి:
ఇది అన్నింటిలోకి ముఖ్యమైనది.  అన్నిసార్లు ఏదో తెలుసుకోవటానికి,  నేర్చుకోవటానికి మాత్రమే కాదు, ఊరికినే చదవటం అనే క్రియ ద్వారా ఆనందం పొందొచ్చు. యండమూరి వీరేంద్రనాథ్ గారి పుస్తకాలు కొన్ని పదుల సార్లు చదివి ఉంటాను. ఇప్పటికి ఎప్పుడైనా మనస్సు బాగోకపోతే నా దగ్గర ఉన్నచదివిన వైవి పుస్తకాలలో, ఏదో ఒక పుస్తకంతోనే స్వాంతన పొందుతాను. అందులో ఏముంది, యువతలో ఉద్రేకం, రక్తం పొంగించే ఉత్ప్రేరకాలు తప్ప అంటారా? అది నిజమే అయుండచ్చు కానీ చిన్ననాటి కొన్ని మధుర స్మృతుల్ని అవి నిద్దర లేపుతాయి, మనసు కుదుటపడుతుంది. ఇంత కంటే సాహిత్యానికి ఉన్న పరమ ప్రయోజనం ఏమిటి?  శ్రీమద్భాగవతంలో వామనావతార ఘట్టంలో  ఒక చిన్న సన్నివేశం ఉంది (http://www.telugubhagavatam.org/?tebha&Skanda=8&Ghatta=76 - అష్టమ స్కంధం, 592వ పద్యం). గురువు గారు వద్దన్నా బలి చక్రవర్తి  వామనమూర్తికి దానం చేయటానికి సన్నద్ధుడు అవుతాడు. గురువు అబద్దం చెప్పమంటారు, బలి చెప్పనంటాడు. బలి రాజ్యం కోల్పోతాడు కానీ మాట తప్పడానికి ఒప్పుకోడు. బలిలోని అహం నాకు నచ్చుతుంది ( ఈ వాదన తప్పయినా, నావరకు నాకిదే ఒప్పు అనిపిస్తుంది. బహుశా నా గతజన్మలలో ఎప్పుడో బలి పరివారంలో పనిచేసి ఉండిఉంటానేమో!) ఎన్ని సార్లు చదివినా ఈ పద్యం, భావం నిత్య నూతనంగా, అత్యంత మానవ సహజంగా  ఉంటుంది. దీంట్లోని మూడుపాత్రలలోని నీతి గ్రహించి కొన్ని ఆదర్శాలను మనకి అన్వయించుకోవచ్చు. ఇటువంటి దృష్టాంతాలు పోతన గారి భాగవతంలో కోకొల్లలు. మీకు కవిత్వంలో అనురక్తి ఉంటె, పద్యాలలోని శబ్దం చెవులకి సంగీతాన్ని, కళ్ళకి చిత్రాల్ని, హృదయానికి అలౌకికానందాన్ని వెనువెంటనే ఇచ్చేస్తాయి. ఆధ్యాత్మిక చింతన ఉంటె మన కర్మభూమిలో దాని అభ్యసించాలంటే గురువుకి, వాఙ్మయానికి కొరత లేదు. మంచికి, చెడుకి ఉన్న విచక్షణ తెలియజెప్పడానికి పుస్తకం కంటే మెరుగైన సాధనం నాదృష్టిలో లేదు.

ఈ సంగతి మీద ఎంతైనా వ్రాయొచ్చు, అంతు దరి లేదు. గరికపాటి వారు చెప్పినట్టు అన్ని (ఫిక్షన్, నాన్ ఫిక్షన్) చదవండి, మీకు మీరుగా తప్పొప్పులు నిర్థారించుకోండి . చివరగా వీటన్నింటినుంచి నేను కూడా ప్రేరణ పొంది, రచనలు చేసి, పైన చెప్పిన ఋషుల ఋణం తీర్చుకోవాలనిపిస్తుంది. నేనేదో  సృష్టి చేయడానికి బయలుదేరినవాడినని అనుకోవద్దు. నాకు తెలిసింది, నేను తెలుసుకున్నది ఋషి హృదయం చెడకుండా చెప్పగలిగితే నేను కృతార్థుడనే. పూర్వులు మనకందించినది మనం పాటించి తరవాత తరానికి మన అనుభవం తెలిచేస్తే చాలు అని నా అభిప్రాయం. ఈ సంపదని నాశనం చేయకుండా యదాతథంగా అందిస్తే మన పని మనం పూర్తిచేసినట్టే. మా గురువులు అన్నట్టు - ఎందుకు దేవుడిని పూజించాలి అంటే పూజించకుండా ఉండలేక. ఎందుకు చదవాలి అన్న ప్రశ్నకి చదవకుండా ఉండలేక అన్నది సరైన జవాబు (ఇది నా కల్పితం). ఇప్పుడున్న పరిస్థితులలో పుస్తకం కొనుక్కుని చదివే వాళ్ళు తగ్గేరు. కానీ కొనుక్కోకుండా చదివే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి (లైబ్రరీలు, ఇంటర్నెట్). అందుకని చదవడం అందరికి మంచి వ్యసనం. మీరు దానికి చిక్కుకోండి, మరింత మందిని దానికి చిక్కించండి. శుభం భూయాత్!!!