15, జూన్ 2018, శుక్రవారం

చిక్కటి బెంగ


చిక్కటి బెంగ - ఇదేమి పదం,  వీడి అసాధ్యం కూల అని నవ్వుకోకండి. Nostalgia అన్న ఆంగ్లపదానికి వచ్చిన చిక్కిది. పైన ఉన్న బొమ్మలో కొన్ని నిర్వచనాలు ఇచ్చారు, కానీ నాకవేవి నచ్చలేదు. అందుకని నాకు నచ్చిన అర్థంతో రెండు పదాలని కలిపి నాక్కావలసింది తయారుచేసుకున్నాను.  మనలో చాలా మందికి బాల్యం లోని మధురస్మృతులు తలుచుకొంటుంటే మనస్సులో ఎక్కడో తీయటి (ఇదెంటో తెలియాలంటే దేవులపల్లి కృష్ణశాస్త్రిగారి రచన - కృష్ణపక్షం చూడండి) బాధ కలుగుతుంది. ఇదేదో బాగానే ఉన్నట్టుంది.  Nostalgia కి తీయటి బాధకి  ఏదో బాదరాయణ సంబంధం ఉన్నట్టుంది.  ముఖ్యంగా ప్రవాసంలో ఉన్నవాళ్ళకి కష్టేఫలి గురువు గారు వ్రాసే వంటకాల స్పెషల్స్ చూసినపుడు, లేకపోతే ఫణిబాబు గారి యాత్ర విశేషాలు చూసినపుడు ఇవన్నీ మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు అందుబాటులో లేవే అన్ననైరాశ్యం కలుగుతుంది (ఈ పెద్దలిద్దరు మన్నించాలి అడక్కుండా వారి పేర్లు వాడుకొన్నందుకు - అలాగే వారు విద్వత్తు కలిగి అన్ని కళలలో ఆరితేరినవారు, వీటికి మాత్రమే పరిమితం కాదని గమనించాలి). అత్యాశ కాదు కానీ నాలాంటి ప్రవాస మందమతులకి తిండి మీద, తిరుగుడు మీద శ్రద్ద ఎక్కువ అందుకని వాటిగురించే ఎక్కువ ఆలోచనలొస్తుంటాయి. గాంధీగారిలాంటి మహాత్ములకైతే ప్రవాసంలో తెల్లవాళ్లు పెట్టిన బాధలు మన దేశానికి స్వతంత్రం ఎలా తేవాలి అన్న దాని మీద ఆసక్తిని పురిగొల్పాయి. సరే దారి తప్పిపోతున్నట్టున్నాను. 

చిన్నతనంలో ఏడాదికి రెండు మూడు సార్లు మా అమ్మమ్మగారింటికి సెలవులలో తణుకు వెడుతూవుండేవాళ్ళము. సాధారణంగా మాఅమ్మగారు, మాతమ్ముడు, చెల్లెలు తో కలిసి ప్రయాణం చేసేవాళ్ళము. కాస్త పెద్దవాళ్ళమైన తర్వాత, నేను మాతమ్ముడు కలిసి వెడుతూ ఉండేవాళ్ళము. మానాన్నగారికి సెలవులు లేకపోటంవల్ల , లేకపోతే అత్తగారింట్లో తోచదనో మాతో వచ్చిన సందర్భాలు చాలా తక్కువ.  ఎక్కడా  బండి మారి వేరే బండిలో వెళ్ళక్కరలేదు కాబట్టి, ఎక్కువ భాగం సర్కారు ఎక్స్ప్రెస్లోనే ప్రయాణం చేసేవాళ్ళము.  పేరుకి ఎక్స్ప్రెస్స్ బండే కానీ ప్యాసింజర్ బండి కంటే నెమ్మదిగా వెళ్ళేది. అన్ని స్టేషన్లలోనూ గూడ్స్ రైళ్ల కోసమో, ఇంకా పెద్ద ఎక్స్ప్రెస్స్ రైళ్ల కోసం ఎక్కడో అక్కడా మధ్యలో  ఆపేసేవాళ్ళు. మధ్యాహ్నము 2 గంటలకి రైలు మా ఊళ్ళో ఎక్కితే, తెల్లారగట్ట 2 గంటలకి తణుకు చేరుకొనేది. మాఊరినుంచి బెజవాడ దాకా మెయిన్ లైన్ డబుల్ లైన్, మధ్యలో తెనాలి - గుంటూరు - విజయవాడ బ్రాంచ్ లైను, అక్కడి నుంచి కైకలూరు, ఆకివీడు, భీమవరం, తణుకు మీదుగా నిడదవోలు దాకా బ్రాంచ్ లైన్, పైపెచ్చు ఒకటే లైను.  మద్రాసు నుంచి కాకినాడ దాకా పూర్తిగా స్టీమ్ ఇంజిన్ తోనే రైలు నడిచేది. 1981 దాకా విజయవాడ మద్రాసు మధ్యలో, మెయిన్ లైన్లో ఎలక్ట్రిక్ రైళ్లు రాలేదు. అందువల్ల జనాలకి తొందరలేక ఎక్కువ భాగం మెల్లగా, నిదానంగా ప్రయాణాలు చేసేవాళ్లు. హడావిడి చేసేవాళ్ళు ఎలాగూ ఎప్పుడూ ఎంతో కొంత మంది ఉండడం సహజమే కదా!

పండగ సెలవలైనా, వేసవి సెలవులైనా తణుకు వెళుతున్నాము అంటే అందరికి ఉత్సాహం ఎక్కువై, పది రోజుల ముందరి నుంచే స్కూల్లో అందరికి చెప్పేసే వాళ్ళము. ఇంక దీపావళికి అక్కడికి వెడుతున్నామంటే మమ్మల్ని పట్టుకోవటం ఎవరితరం కాదు. టీచర్లు కూడా ఇచ్చిన సెలవుల కంటే కాస్త ఎక్కువ కాలం స్కూలికి రాకపోయినా ఇబ్బంది పెట్టేవాళ్లు కాదు. అందువల్ల ఇచ్చిన సెలవల కంటే ఒక్కోసారి ముందరెళ్ళడం, లేదా ఆలస్యంగా రావటం జరిగేది.  అదృష్టం బావుండి, మేము చదువుకున్నవి ప్రభుత్వపు బళ్ళు, మాకు చదువు చెప్పిన వాళ్ళు మార్కుల కోసం, ర్యాంకుల కోసం మమ్మల్ని రుబ్బని సహృదయులు. ఎల్కేజీ నుంచి బడికి నిత్యం రాకపోతే ఫెయిల్ చేస్తాము లేకపోతె విద్యార్థి ప్రగతి పొందడు అని భయపెట్టేవాళ్ళు కాదు. ఈ పెద్దల గురించి మరో సమయంలో వ్రాసే అదృష్టం భగవంతుడిచ్చుగాక!

మాకు ఒక దొడ్డమ్మ, ఒక పిన్ని, వాళ్ళకి వరసగా ముగ్గురు ఇద్దరు పిల్లలున్నారు. మరో ముగ్గు మేనమామలున్నా, వాళ్ళు బాగా దూరంగా ఉండేవాళ్ళు. తణుకు వాళ్ళకి మాకంటే బాగా దగ్గర కాబట్టి మాకంటే వాళ్ళు తరచుగా అక్కడికి వచ్చే వాళ్ళు. వెళ్లిన తర్వాత ఎవరిళ్ళకి వెళ్లి ఎవరెవరిని కలుస్తామో, ఏమి ఆటలాడతామో, ఏమి సినిమాలు చూస్తామో అని ఒకటే ఉత్కంఠ.  ఇదికాక తినుబండారాలు, కావలసిన అద్దె పుస్తకాలు, ఓహో ఆభోగం తలచుకొంటే, 1990లో దేవుడి దగ్గరికి వెళ్ళిపోయిన మా అమ్మమ్మగారు, ఆవిడ మామీద కురిపించిన అవ్యాజమైన ప్రేమ, మనుమలు ఎంత అల్లరి చేసినా ఆవిడొక్కరే అడిగినవన్నీ అమర్చి పెట్టటం, ఎప్పుడైనా విసుక్కోవలసివస్తే ఎంతో అందంగా "లండిక్కి" (అర్థం నాకు తెలియదు) అనటం ఇప్పటికి నా కళ్ళల్లో మెదులుతున్నాయి. శ్రీచాగంటి వారన్నట్టు అమ్మ అంటే రాశీభూతమైన ప్రేమ. అమ్మకి దూరంగా ఉండటం వల్ల , ఈ మాట తలచుకొన్నపుడల్లా మనస్సు ఇంటి వైపుకి మళ్ళుతూ ఉంటుంది. అటువంటిది అమ్మమ్మ అంటే అమ్మకే అమ్మ , ఎంత ప్రేమవుంటుందో చెప్పనలవి కాదు.  తెలియని వయస్సులో ఆవిడని ఏదైనా కావాలని అడిగితే అతి సులభంగా ఎలాగైనా సాధించి చేయగలిగే శక్తిమంతురాలని నమ్మే వాళ్లము.  వయస్సుతో పాటు ఆవిడ శ్రమ, కష్టాలు, బలహీనతలు, భర్త లేకుండా ఆరుగురు పిల్లలని ప్రయోజకుల్ని చేసి, అందరితో మంచి మనిషి అనిపించుకోవటానికి ఎన్ని అవస్థలు పడ్డారో తల్చుకొంటే చాలా బాధ వేస్తుంది. 

ఇంకా తణుకులో ఆటలు, పుస్తకాలు, సినిమాలు, తిండి, పెళ్లిళ్లు , పేరంటాలు, నోములు, వ్రతాలు, అమ్మమ్మ స్నేహితులు, వాళ్ళ పిల్లలు,  ఊళ్లలో వీరవిహారం మాటల్లో చెప్పడం కష్టం. అదీకాకుండా అమ్మమ్మ చుట్టుపక్కల వాళ్ళతో కలసి పనుల్లో చేయి వేయడం, దీపావళికి మతాబులు సిసింద్రీలు చుట్టడం, అసలు అందరితో కలిసి పని చేయడం, పని నేర్చుకోవటం ఎలాగ అన్నది మాపిల్లలకి ఎలా నేర్పించాలో నాకు ఇంకా అంతుబట్టకుండానే వాళ్ళు పెద్దవాళ్లయిపోతున్నారు. . సెలవులు అయిపోయిన తర్వాత వెనక్కి వచ్చేస్తుంటే ఉండే బాధ, బెంగ  మాటల్లో చెప్పటం కష్టం. మేము పిల్లలము ముగ్గురు ఎవరితో మాట్లాడకుండా నిశ్శబ్దంగా రైలులో వెనక్కి వచ్చేసి, మరో వారం రోజులకు గాని మామూలు మనుషులం కాలేక పోయేవాళ్ళము. అమ్మ పరిస్థితి కూడా అంతే కానీ బయట పడేది కాదనుకొంటా. ఇంటి పనిలో మునిగిపోయేది. అమ్మ అమ్మే!  ఇప్పటికి ఆ స్మృతులు తలచుకొంటే బెంగే కానీ పిల్లలప్పటి తీవ్రత లేదు. ఈ గొడవంతా ఇప్పుడెందుకంటారా? కొద్ది రోజులలో మా ఇండియా యాత్ర మొదలవుతోంది, అందరిని తలుచుకొని మదిలో ఈ కబుర్ల కితకితలు మొదలయ్యాయి.