22, సెప్టెంబర్ 2017, శుక్రవారం

పిచ్చి - అతి పిచ్చి

ఒక్కోడికి ఒక్కో పిచ్చి/వ్యసనం ఉంటుంది. మీకస్సలు ఏ పిచ్చి లేదా (మీరు ఈ గ్రహవాసులు కారేమో!)? అయితే ఇక్కడ చదవడం ఆపేసి, ఈ పేజీ మూసేసి వెళ్లిపోండి. డబ్బు పిచ్చి, సినిమా పిచ్చి, కీర్తి పిచ్చి, సీరియల్స్ పిచ్చి, నాటకాల పిచ్చి, ప్రక్కనవాడి తలపై చెయ్యి పెట్టె పిచ్చి, సుత్తేసే పిచ్చి, క్రికెట్ పిచ్చి, పందేల పిచ్చి, క్రమశిక్షణ పిచ్చి, చదివే పిచ్చి ఇలాంటివి కొన్ని. చివరిది పిచ్చేలా అవుతుంది అని అడక్కండి, అనవసరమైనవి చదివి బుర్ర పాడిచేసుకొన్నా, ఎక్కువ చదివి ఏమీ నేర్చుకోకపోయినా అది పిచ్చే. మరికొన్ని బయటికి చెప్తే బావుండదు. అన్ని పిచ్చిలు (ఈ బహువచన ప్రయోగం నాకే నచ్చలేదు, అయినా మీకర్థం అయ్యింది కాబట్టి సర్థుకుపోదాము) ప్రాణాంతకం కాదు, అందువల్ల అన్నింటిని ఒకే గాటన కట్టెయ్యక్కరలేదు. ఎక్కువ భాగం ఆ పిచ్చి ఉన్న వాడిని, వాడి కుటుంబాన్ని బాధిస్తాయి. కొన్ని పిచ్చిలు ధన, మానాలనీ హరించి, వాడిని ఏకాకిని చేస్తాయి.  మిగిలినవి సమాజంలో వారితో బాంధవ్యాలున్న వాళ్ళ జీవితాలని అతలాకుతలం చేస్తాయి.పిచ్చి(లు) మితంగా వాటి పరిమితుల్లోఉంటె సామాన్యులుగా సమాజంలోని మిగిలిన వాళ్ళతో సహజీవనం చేస్తాము.

1982లో భారతదేశంలో మనకి మొదటిసారి ఆసియా క్రీడలు జరిగాయి. మన ప్రజలు ఎక్కువమంది టీవీలు కొనుక్కొని, ఆపోటీలు చూసి బాగుపడిపోతారని కలర్ టీవీల మీద, సీఆర్టీ (CRT - cathode ray tube) పరికరాలమీద దిగుమతి సుంకం బాగా తగ్గించేశారు.  మా ఊళ్లోకి మొట్ట మొదటి టీవీ 1983 లో వచ్చింది. మాఇంట్లోకి రావడానికి మరో 6 ఏళ్ళు పట్టింది. అప్పట్లో దేశం మొత్తం మీద  నాలుగు కేంద్రాల నుంచి ప్రసారం జరిగేది. దక్షిణాదిన మద్రాసు నుంచి వచ్చే అరవ కార్యక్రమాలు సరిగ్గా అందని సిగ్నల్స్ వల్ల, ఒకళ్ళు ఇంటి మీద ఆంటిన్నా (antenna) పట్టుకుని కదిపితే, మిగిలిన వాళ్ళు కనిపించని వినిపించని అర్థం కానీవి చూసే వాళ్ళు. ఎప్పుడైనా తెలుగు సినిమా (వారానికి ఒకటి వేసేవాళ్ళనుకొంటా) వేస్తె టీవీ ఉన్న వాళ్ళ ఇల్లు జనంతో నిండిపోయేది. హైదరాబాద్ నుంచి తెలుగు ప్రసారాలు ప్రారంభం అయినా తర్వాత కథ అందరికి తెలిసిందే. దూరదర్శన్తో, మిగిలిన ప్రైవేట్ చాన్నెల్స్తో మన ప్రగతి చూసి మనం మురిసిపోవలిసిందే. టీవీలు వచ్చిన తర్వాత, వాటితో పాటు పుట్టుకొచ్చిన కార్పొరేట్ స్కూళ్ళు వాటితో మన పిల్లలలో  వచ్చిన మార్పులు అందరికి విదితమే. ఆటా లేదు, పాటా లేదు. చదువు, చదువు, చదువు. లేదా టీవీ, కంప్యూటర్, వీడియో, టాబ్లెట్ గేమ్స్ ఇవితప్ప వేరే లోకం లేదు. దీనితో పిల్లలకి మిగతా పిల్లలతో సంబంధాలు అంతంత మాత్రంగా ఉన్నాయి. 90వ దశకంలో పిల్లలుగా ఉండి  ఇప్పుడు పెద్దలైన వాళ్ళ జీవితాలే ఇందుకు నిదర్శనం.

మాకుటుంబానికి  తెలిసిన ఒక మలయాళీ క్రైస్తవ కుటుంబంలో ఇంటిపెద్ద బాగా క్రమశిక్షణతో కూడిన మనిషి. ఇంటిల్లిపాది ఆయన పెట్టిన నియమాలకు అనుగుణంగా నడిచిపోయేది. ఇల్లు, స్కూలు, చర్చి, ఇవి కాకుండా మరో చోట వాళ్ళ పిల్లల్ని చూడటం అసాధ్యం. పెద్దబ్బాయి తండ్రి ఏమి చేబితే అదే చేసే వాడు. స్కూలు పుస్తకాలు చదుకోవడం, బైబిల్ పఠనం అవే  వ్యాపకాలు.   సినిమాలు, బయట మిగతా పిల్లలతో ఆటలాడటం నిషిద్ధం. పక్కా ఆదర్శజీవి. రెండోవాడు వాళ్ళ నాన్నతో దోబూచులాడేవాడు. పదోతరగతి దాకా ఇద్దరు బాగా చదివేరు. ఇంటరులోకి వెళ్ళేటప్పటికి కొత్తగా వచ్చిన స్వతంత్రంతో రెండోవాడు దారి తప్పి సినిమాలు విరగచూసాడు. ఫలితం చెప్పుకోనక్కరలేదు. ఇటువంటి వాళ్ళు కొంతమంది పదో తరగతి దాకా నిర్బంధ హాస్టళ్లల్లో ఉండి చదివి వచ్చి, ఇంటర్లో వచ్చిన వెసులుబాటుతో సినిమాలతో కొట్టుకుపోయిన వాళ్ళు నాకు ఎరుక. పెద్దవాడు సరియైన దోవలో వెళ్లి జీవితంలో చక్కగా స్థిరపడ్డాడు. మరో స్నేహితుడున్నాడు. అతనికి ఇద్దరు పిల్లలు. స్కూల్ చదువుల్లో ఉన్నారు. వాళ్ళకి ఎక్కువ భాగం టీవీ నిషిద్ధం. కంప్యూటర్ వీడియో ఆటలు కూడా పరిమితంగా ఆడనిస్తారు. అయినా పెద్దవాడేమో ఒక్క కొలిక్కి వచ్చి మంచి కాలేజీకి వెళ్ళబోతున్నాడు. రెండోవాడు ఏదోరకంగా ఆటలవైపు తప్పించుకుపోయే ప్రయత్నాలు మానలేదు. మాకు, మాపిల్లలకి ఈబెడద తప్పలేదు.

ఇంతకి చెప్పొచ్చేదేమిటంటే ఏదైనా మితంగా ఉంటె, తింటే, చేస్తే ఇబ్బంది లేదు.  లేక పోతే  మన జీవితం చిన్నాభిన్నం అవుతుంది. ఒక్కోసారి కొన్ని విషయాలు చదివినప్పుడు మనమెటు ప్రయాణం చేస్తున్నామో అర్థం కాదు. మనలో చాలామంది చిన్నప్పుడు చీపురు పుల్లలతో, చిన్న కొమ్మల పుల్లల్తో బాణాలు చేసి ఆడుకొన్నవాళ్ళమే. సంతల్లో తుపాకీ బొమ్మలు కొనుక్కొని మిగిలిన పిల్లల్ని కాల్చినట్టు ఉత్తుత్తి ఆటలు ఆడాము. అలా అని ఇప్పుడు పెద్దవి, నిజమైనబాణాలతో, నిజమైన తుపాకులతో జనాలమీద పడి చంపట్లేదు కదా! అవే ఆటలు యిప్పుడు పిల్లలు కంప్యూటర్లలో వీడియోలలో ఆడటం చాలా ప్రమాదకరమని మనస్తత్వ శాస్త్రజ్ఞులు హెచ్చరిస్తున్నారు. ఒక తరంలో తప్పు కానిది మరో తరానికి వచ్చేటప్పటికి పెద్ద తప్పు అయ్యికూర్చుంది. మంచి చెడు ఎప్పుడు ఉన్నాయి. చెడు పాళ్ళు గతంలో కంటే ఇప్పుడు పెరిగినట్టు మీకనిపిస్తోందా? మునుపటికంటే ఆటవిక ప్రవృత్తి పెరిగినట్టనిపిస్తోందా? లోపం ఎక్కడుంది?

ఆమ్వే వాడు - క్రొత్త బూచాడు!

మేము కొత్తగా అమెరికా వచ్చిన రోజుల్లో (ఇది పాతికేళ్ల క్రితం సంగతి),  మా సీనియర్లు ఏది చెయ్యాలో ఏది చెయ్యకూడదో చెప్తుండేవాళ్లు. బయటకెళ్ళినపుడు ఎవరైనా ఇండియన్స్ మీ దగ్గరకి వచ్చి పరిచయం చేసుకుంటే కొంచెం పరాక్కుగా ఉండమని హెచ్చరిస్తుండేవాళ్లు. కొన్ని విని ఆచరించే వాళ్ళం, కొన్నేమో వీళ్ళేదో మనకి కథలు చెప్తున్నారని నవ్వి ఊరుకొనేవాళ్ళం.  విద్యార్థులుగా ఉన్నప్పుడు చేతిలో డబ్బులాడక గుట్టు చప్పుడు కాకుండా ఉండేవాళ్ళం. పనిలో పని ఎక్కడికైనా వెళ్ళినపుడు ఎవరైనా భారతీయ మొహాలు (అమెరికాలో దేశీలు, ఫిరంగులు అన్నవి ప్రాచ్యులు, అప్రాచ్యులు అన్నవాటికి సమానార్థాల్లో వాడే పదాలు - మాయాబజారులో అస్మదీయులు, తస్మదీయులు లాగ) కనిపిస్తే మొహం వాచిపోయి ఏదో విధంగా మాటలు కలిపేవాళ్ళము. అందునా తెలుగు మాట వినిపిస్తే పరవశించి పోయి,  వాళ్ళని పరిచయం చేసుకొని కాసేపు మాట్లాడి వెళ్ళేవాళ్ళం. అందువల్ల కాస్త బెంగ తీరినట్టుగా అనిపించేది.

చదువులయ్యాయనిపించి, కొంత కాలం ఉద్యోగాల వేట తర్వాత ఒక క్రొత్త పట్టణంలో ఏదో ఉద్యోగంలో ఇరుక్కున్నాను. అప్పుడు చేతిలో కారు, డబ్బులుండేటప్పటికి తిరగడం మొదలెట్టాను (జల్సాల కోసం కాదు, కొంత ఏమి తోచక, కొంత క్రొత్త స్నేహాలు ఇంకా కుదరక). అలా ఒక్కొక్కసారి మాల్స్ వైపు వెళ్లి ఏమి కొనకుండా తిరిగిరావటం జరిగేది. ఇది పూర్తిగా విండో షాపింగ్ కూడా కాదు. ఏదో  కాలక్షేపానికి తిరగడం, ఆకలి వేస్తె ఏదోఒకటి కడుపులోకి పంపటం, కాలాన్ని చంపడం (కిల్లింగ్ టైం, విచిత్రం కాకపోతే కాలం నన్ను చంపుతుంది కానీ నేను దాన్ని చంపటం ఏమిటి?), లేకపోతే  ఏదో ఒక ఇంగ్లిష్ సినిమా చూసి వెనక్కురావటం జరిగేది. అప్పుడప్పుడు క్రొత్త నేస్తాలు ఎవరైనా కూడా ఉండేవాళ్ళు.

ఇలా బయటికి వెళ్లిన ఒకానోక సందర్భంలో, ఒక దేశీ ఒకానొక మంగలి షాపులో కనిపించాడు. మా సంభాషణ ఇలా ఇంగ్లీషులో కొనసాగింది.  వీడు క్రొత్త బూచాడు

అజ్ఞాత: Hi! how are you?
నేను: Good! how are you?
అజ్ఞాత:You look familiar. Did I meet you before?
నేను: No, I have not met you before.
అజ్ఞాత: Oh, ok, I am sorry. You look similar to someone I know. Anyway, my name is Sudhakar and I work for Amex.
నేను: I am Anyagaami and I work for MSS.
అజ్ఞాత: We should meet for tea at my home.
నేను: Sure, we can.

ఇద్దరం ఒకళ్ళ ఫోన్ నెంబర్ మరొకరికి ఇచ్చుకుని అక్కడి నుంచి పనైనా తర్వాత వెళ్ళిపోయాము.  ఒక రోజు అతను కాల్ చేసి, నీకు డబ్బులు బాగా సంపాదించే ఉద్దేశం ఉందా అని అడిగాడు.  ఉందన్నాను. అయితే నా దగ్గర ఒక గొప్ప వ్యాపారానికి సంబంధించి
ఒక రహస్యం ఉంది. నువ్వు మన దేశంవాడివి కాబట్టి నీకు చెబుతాను అన్నాడు. సరే క్లుప్తంగా వ్యవహారమేమిటి అని అడిగాను. నేనొక కంపెనీకి ప్రతినిధి క్రింద పనిచేస్తున్నాను, వాళ్ళు తయారు చేసే నిత్యావసర వస్తువులు నీకు తెలిసిన వాళ్లకి అమ్మి, వాళ్ళని కంపెనీసభ్యుల క్రింద చేర్పించాలి. ప్రతి వస్తువుకి, ప్రతి సభ్యుడికి కంపెనీ కొంత మొత్తం తిరిగి నీకు చెల్లిస్తుంది.  ఆ పని సరిగ్గా చేసుకొంటూ వెళితే, నెలకి అరవై వేల డాలర్లు  దాకా సంపాదించవచ్చు అని చెప్పి ఎవరో కొంత మంది పేర్లు కూడా చెప్పాడు. మనం చేర్పించిన వాళ్ళు మరికొంత మందిని చేర్పించి, మరిన్నీ వస్తువులు అమ్మితే ఇంకా మనం జీవితంలో పని చెయ్యక్కరలేదు. ఊరికినే కూర్చొని డబ్బులు లెక్కపెట్టుకోవడమే అని అరచేతిలో వైకుంఠం చూపెట్టాడు.

ఇటువంటి కథ నా సీనియర్లు ముందే చెప్పటం వల్ల, నేను ఏదో కారణం చెప్పి తప్పించుకొన్నాను. కథ తాలూకు స్క్రిప్ట్ ఇంచుమించుగా అదే బాణీలో సాగుతుంది. నిన్నెక్కడో చూసాను, లేదా నువ్వు ఇంతకూ ముందే నాకు తెలుసు తరహా. కానీ వీళ్ళ లోగుట్టు తెలియని వాళ్ళు, చదువుకొన్న వాళ్లు కూడా ఈ ఉచ్చులో ఇరుక్కుని విలవిలలాడినవారు నాకు తెలుసు. ఈ చిత్రాలన్నింటికి మూలవిరాట్టు కంపెనీ - ఆమ్వే (Amway). ఆ తర్వాత కాలంలో ఇది ఇండియాలో కూడా వ్యాపారం మొదలెట్టింది. దీన్ని పోలిన కంపెనీలు కూడా వీధికి  రెండు చొప్పున బయలుదేరాయి. మాబంధువులావిడ ఒకరు దీంట్లో చేరి మా అమ్మానాన్నలని బలవంతము చేసి మొహమాట పెట్టి, కొన్ని వస్తువులమ్మింది. కొన్నాళ్లయ్యాకా జనాలు తెలివిమీరి ఆవిడకి డబ్బు ఎక్కొట్టటం మొదలెట్టారు. దాంతో ఒక మంచి రోజు చూసుకొని  ఆవిడ ఆ వ్యాపారం కాస్తా మూసేసింది.  ఇలాంటి గొలుసుకట్టు, పిరమిడ్ వ్యాపారాలు ఎన్ని ప్రజలని మోసం చేసినా, ఎన్ని కేసులు వేసినా, కంపెనీ స్థాపకులు దివ్యంగా వెలిగిపోతుంటారు (విజయ మాల్యా లాగ). సామాన్యులు ఇల్లు గుల్ల చేసుకొంటారు. ఎంతైనా మనిషిలో ఆశ ఎంత చెడ్డదో? అందుకని ఎవరైనా సులభంగా డబ్బులు దొరికే మార్గం చెప్తామంటే అక్కడి నుంచి వెంటనే మాయమవ్వండి లేదా వారి చేతిలో మీరు మాయమవటం ఖాయం. 

31, ఆగస్టు 2017, గురువారం

సుధా మూర్తి గారి చీరలు

మనసుని కోతితో తరచూ పోలుస్తూ ఉంటారు. ఎందువల్లో అది నాకంత సరైన ఉపమానం అనిపించదు.  కోతులు ఏదైనా తినేటప్పుడో,  పిల్లలికి పాలిచ్చేటపుడో, పేలు తీస్తూనో మనకంటే స్థిరంగా, కుదురుగా ఉన్నాయనిపిస్తుంది. ఎక్కడినుంచి యేముప్పొస్తుందా అని ఇంకా కాస్త మెలకువగా, జాగ్రత్తగా కూడా ఉంటాయి. సరే కోతిలోంచి మనిషి బయలుదేరేడు కాబట్టి ఇంకా కొన్ని లక్షణాలు పూర్తిగా పోలేదేమో? అట్లాంటి మనసుని నియంత్రించి కొంత లాభం, పురుషార్థాలు పొందాలని మనిషి చేయని ప్రయత్నం లేదేమో? మన పరిణామక్రమంలో మన పూర్వులు కొంత పరిశోధన చేసి  కొన్ని మార్గదర్శకాలు చేశారు.  మనస్సుని బుజ్జగించి, బ్రతిమాలి మన మార్గంలోకి తెచ్చుకోవాలి కానీ, బలవంతంగా మాత్రం కాదన్నది ప్రాథమిక సూత్రం.  మనస్సుని ఎలా దారికి తెచ్చుకోవాలి అన్న దానికి చాలా పద్దతులున్నాయి. వాటిలో  మన సనాతన ధర్మం నుంచి ఒకటి ఇక్కడ ప్రస్తావిస్తున్నాను.

మా మనస్సు మేము చెప్పినట్టే విని మా స్వాధీనములోనే ఉంది అనుకుంటే మిగిలిన క్రింది భాగం మీకు పనికిరాదు. అన్ని ఆశ్రమాలు జీవితంలో అనుభవించి, కష్టాలు అధిగమించి, మనం చేయవలసిన కర్తవ్యాలు నిర్వర్తించి, చివరికి శరీరం వదలి వెళ్ళేటపుడు బాధ పడకుండా వెళ్ళిపోవాలి (ఏకారణానికైనా) అనుకుంటే మనసు మన అధీనంలో ఉండటం ఎంతైనా అవసరం.  జీవితం యొక్క పరమార్థాలలో ఇదొకటి అని నేను నమ్ముతాను. కాశీకి వెళ్ళినపుడు మనవాళ్లు ఏదైనా మనస్సుకి బాగా నచ్చిన పండునో కూరగాయనో వదిలిపెట్టేయటం ఒక సంప్రదాయం. బహుశా వయసులో ఉన్నపుడు ఈ పని చేయరేమో? లేకపోతే వయసయ్యేదాకా కాశీ  వెళ్లరేమో?   ఈ రెంటిలోను ప్రయోజనం తక్కువ. ఎందుకంటే యెంత త్వరగా ఆపని చేస్తే సాధనకి (ఆ వస్తువుకి దూరంగా ఉండటం సాధ్యమవుతుంది) అంత  ఉపయోగం. నోరు కట్టుకొంటే మెల్లగా అది మనస్సుని ప్రభావితం చేస్తుంది అన్నది అంతఃసూత్రమేమో? క్రమంగా మనసు మీద నియంత్రణ సాధ్యం అవుతుంది. సాధనమున కూరు పనులు ధరలోన ... ఇది నాకు తెలిసిన సంగతి.

కొద్ధి రోజుల  క్రితం సుధామూర్తి గారు చీరలు కొనటం అన్న ప్రక్రియని కాశీలో ఇరవై ఒక్క సంవత్సరాల క్రిందట వదిలేశారు అన్న వార్త వచ్చింది. చిన్న వార్తే, కానీ చదివితే చాల ఆసక్తికరంగా ఉంది. ఆవిడెవరో తెలియకపోతే ఇక్కడ లంకె దగ్గర ఇంగ్లీషులో విషయం గ్రహించవచ్చు.  ఆవిడ రోజూ ఎన్ని చీరలు మార్చినా , ఒక రోజు కట్టినవి మళ్ళి జీవితంలో కట్టకపోయినా అతి సులువుగా రోజులు వెళ్లబుచ్చగలిగిన ధనవంతురాలైన వ్యక్తి.   మరి ఆ నిర్ణయం ఎందుకు తీసుకొన్నారు? ఒకటి - ఎక్కడి నుంచి బయలుదేరేమో (మూలాలు మర్చిపోకుండా) గుర్తెరిగి మాములు సాధారణ  వ్యక్తిలా బ్రతకాలని కోరుకోవటం, రెండు - డబ్బుల కంటే విలువైనవి మనస్సుని అదుపులో పెట్టుకొంటే సంపాదించవచ్చు అని  గ్రహించటం వల్లా. ఆవిడ సాంఘిక సేవ, రచనలు మాత్రమే ఎరిగున్న నేను, ఇది చదివిన తర్వాత ఆవిడ కి 'ఫిదా' అయిపోయాను.  నీతా అంబానీ గారి ఫోన్ ఖరీదు ఇరవై అయిదు కోట్ల రూపాయలు అన్న వార్త ఒకటి చక్కర్లు కొడుతోంది. అది నిజం అని అనుకొంటే - సుధామూర్తి గారు ఏవిలువలని ప్రోత్సహిస్తున్నారో నేను చెప్పక్కరలేదు.

కొస మాట:  పైన చెప్పినవన్నీ పెద్దలు, గురువులు ఎప్పుడో చెప్పినవే.  మనస్సుకి నచ్చిన విషయం కాబట్టి మరోసారి స్పృశించాను. భవిష్యత్తులో వ్రాసే వాటికి కూడా ఇవే ఆధారం.


15, జూన్ 2017, గురువారం

గొల్లపూడిగారి జీవనకాలం

శ్రీ గొల్లపూడి మారుతీరావు గారు తెలియని వ్యక్తి తెలుగుదేశంలో అరుదు. వారిని మళ్ళి పరిచయం చేయటం ఆయనెవరో తెలియని ఆ కొద్దిమంది కోసం మాత్రమే. ఆయన చేయి తిరిగిన రచయిత, నాటక కర్త, నటుడు. ఇవి కాక మరి కొన్ని రంగాల్లో ప్రవేశం కూడా ఉంది. బాగా చదువుకొన్న మనిషి. లోకాన్ని, ప్రపంచాన్ని కలయతిరిగిన మనిషి. మనందరిలాగా మనలోనే ఉన్న చాలా నేలబారుమనిషి* కానీ అసాధారణమైన మనిషి. వారు వ్రాసిన ఎన్నో విషయాలు, ఎన్నో ప్రశ్నలు వారి కలంలోంచి జారిపడి మనలని  ఉక్కిరిబిక్కిరి చేసి,ఉత్తేజపరిచి, కార్యోన్ముఖులని చేయటానికి మాత్రమే బయటికి వచ్చేయేమో అనిపిస్తుంది. ఆయన నటించిన "ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య" చూస్తే, ప్రేక్షకుడికి ఆయన బయట కనిపిస్తే తందామనిపిస్తుంది. అది ఆయన మొదటి సినిమా నటుడిగా. అంటే విలన్ గా ఎంత  బాగా నటించారో అర్థం అవుతుంది. వారు కొన్ని దశాబ్దాలుగా "జీవనకాలం" అనే కాలమ్ వ్రాస్తున్నారు.

నేను అప్పుడప్పుడు ఏదో ఒకటి అర ఆయన  కథల్ని,వ్యాసాల్ని చదవటమే కానీ వారి సాహిత్యం నాకు అంతగా పరిచయం లేదు. ఈ మధ్యన ఏదో  విషయంగా, ఆయన బ్లాగులోకి వెళ్లి అక్కడనుంచి ఈ కాలాన్ని(column) పట్టుకొన్నాను. కౌముది పత్రిక వాళ్ళు సెప్టెంబర్ 15 2008 నుంచి ఇవాళ్టి దాకా గొల్లపూడి గారి అన్ని వ్యాసాల్ని ఇక్కడ భద్రపరచేరు. కోతికి కొబ్బరికాయ దొరికినట్టు వెంటనే చదవటం మొదలుపెట్టి, ఒక వారంలో అన్ని వ్యాసాలూ చదివేను. ఇలా చదవడంలో కొన్ని ఇబ్బందులున్నాయి. మళ్ళి మళ్ళి చెప్పిన సంగతులు, వ్యక్తుల ప్రస్తావన కొంతమందికి నచ్చకపోవచ్చు. వాటిని క్లుప్తంగా మీతో పంచుకుందామని ఈ నాలుగు ముక్కలు. గొల్లపూడిగారి వ్యాసాల్ని స్థూలంగా 1. ప్రస్తుత అవినీతి రాజకీయాలు, నాయకులు, ప్రపంచ నాయకులు, 2. భాష, సంగీతం,  గ్రంథాలు, రచయితలు,సంస్కృతి 3. క్రికెట్, క్రీడలు, రేడియో, సినిమాలు, నటులు, 4. పర్యావరణం, వర్తమాన విషయాలు, కీర్తిశేషులు అని నాలుగు భాగాలుగా చూడొచ్చు. దగ్గరదగ్గర సగానికి పైగా వ్యాసాల్నిమొదటిభాగానికి, మిగిలిన సగాన్ని మూడు భాగాలుగా మిగిలిన మూడు విషయవస్తువులకు పంచారు.

రాజకీయాల్లో ప్రస్తుత నాయకుల గురించి, వాళ్ళ హామీల బూతు మాటల* గురించి, వాళ్ళ వారసత్వాల గురించి, వాళ్ళ అస్థిరత్వం (ఒక పార్టీతో ఉండకపోవటం) గురించి, వాళ్ళ అవినీతి గురించి మీరు చదివితే గాని శ్రీ గొల్లపూడి ప్రతిభ అవగతం కాదు. గడచిన 60 సంవత్సరాలలో మన ప్రగతి, స్వాతంత్య్రం వచ్చినపుడున్న నాయకులు, ఇప్పటి నాయకులు, ఆ నాయకుల వంచకత్వం ఎంతో పదునైన కలంతో చీల్చి చెండాడేరు. ముఖ్యంగా మన క్రొత్త గాంధీలు, నిధులు (నల్లకళ్లజోళ్లవంశం), తెలుగునేల మీది రాజకీయ వంశాల గురించి వారి వ్యాఖ్యలు చదివితే, అయ్యో మనం ఎటువంటి నాయకుల పాలనలో ఉన్నాం, ఏమి పొందుతున్నామో స్పష్టం అవుతుంది. పై రాజకీయ వంశాలలో వాళ్ళు కాకుండా ఓ కల్మాడీ, ఓ రాజా, ఓ శిబుసొరేన్, ఓ మధు కోడా, ఓ లల్లూ, ఓ ములాయం, ఓ మాయావతి, ఓ జయలలిత, ఓ మమతల గురించి ఆయన చెప్పిన కబుర్లు వింటే, వీళ్ళు  మళ్ళీ మళ్ళీ ఎలా ఎన్నికలలో గెలిచి ప్రభుత్వాలు ఏర్పాటు చేస్తున్నారో అర్థం అవుతుంది. తరచూ మహాత్మా గాంధీ గారినో, నెల్సన్ మండేలా గారినో ఎందుకు గుర్తు చేస్తున్నారో తెలుసుకొంటే పాఠకుడు గతం నుంచి ఏమి నేర్చుకోవాలి అన్నది తెలుస్తుంది.

తెలుగు భాష గొప్పదనం, కర్ణాటక సంగీతంలో దాని పాత్ర, ఓ త్యాగయ్య కృషి, ఓ పోతన గారి భాగవతాన్ని మనం ఎందుకు చదివి ఆపద్యాలని  మననం చేసుకోవాలో చెప్పారు. ముఖ్యంగా ఆయన తరంలో రచయితలు మన సాహిత్యాన్ని, ప్రపంచ సాహిత్యాన్ని ఎంత అధ్యయనం చేసి తరువాత వారి కృషి చేశారో వారు చెప్పిన ఉదాహరణలలో  గమనించవచ్చు. అలాగే మన సంప్రదాయాలు, మతం, ధర్మం, సంస్కృతి, సంగీతం, భాష ఒక దానితో మరొకటి ఎలా పెనవేసుకొని ఉన్నాయో తెలియాలన్నా, క్రొత్త పదాలు తెలుసుకోవాలన్నా (ఉదా: విపర్యం, లాయకీ, మరి కొన్ని అప్పుడే మరిచి పోయాను. ఉత్తరాంధ్ర వాళ్ళకి ఇవి తెలిసే ఉంటాయి.) ఆయన వ్యాసాలు చదవాలి. క్రికెట్ గురించి నేను స్పృశించదలచుకోలేదు (మన జాతీయ క్రీడ ఏమిటి? ఇది ఎంతమందికి తెలిసే అవకాశం ఉంది?), దాని గురించి వ్రాసే వాళ్ళు, ప్రచారం చేసేవాళ్ళు, డబ్బులిచ్చేవాళ్ళు చాలా మంది ఉన్నారు. అయితే ఆటగాళ్లు, వాళ్ళ మీద ఆట మీద వ్యాపారాల నీడ ఇవి ఆయన ఎంచుకొన్న వస్తువులు. ప్రపంచంలో ఫుట్బాల్ ఆటగాళ్ల ప్రభావం, వాళ్ళ అభిమానుల ఆశలు, మన దేశంలో ఆటల ప్రోత్సాహము, వాటి భవిష్యత్తు బాగా వివరించారు.

గొల్లపూడి గారు రచయితగా సినిమా రంగంలోకి వచ్చి ఆ తర్వాత నటుడయ్యారు.  ఆయనకున్న సుదీర్ఘమైన అనుభవం వల్ల , సినీ వ్యక్తులతో ఉన్న అనుబంధం వల్ల ఈ వస్తువు గురించి ఆయన వ్రాసిన అన్ని వ్యాసాలూ ప్రత్యేకమైనవే.  ముఖ్యంగా నాగేశ్వరరావు, రామారావు గార్లతో అయన పని చేసిన ఉదంతాలు చదువరులకు బాగా నచ్చుతాయి. అలాగే వివిధ సమకాలీకులతో ఆయన అనుభవాలు కూడా. కీర్తిశేషులు గురించి ఆయన వ్రాసినవన్నీ నామనస్సుకు నచ్చినవే. సినిమాలు, మిగిలిన అన్ని రంగాలలోని ప్రసిద్దుల గురించి పరుషంగా మాట్లాడవలసి వచ్చినా ఎక్కడ నోరు జారకుండాఎంతో మర్యాదతో (ఆయనకి ఇష్టం లేకపోయినా అని నాకనిపించింది) హుందాగా వ్రాయటం నాకెంతో నచ్చింది.  వేటూరి, శ్రీశ్రీ, రావిశాస్త్రి, విశ్వనాథ్ గార్ల  గురించి ఆయన చెప్పిన కబుర్లు ఆహ్లాదకరంగా ఉన్నాయి. మన వనరులని సరిగ్గా (ప్రకృతి, మానవ) వాడుకోక, దుర్వినియోగం చేస్తూ పోతే పర్యవసానాలు ఎలా ఉంటాయో కళ్ళకి కట్టినట్టు చూపెట్టారు.

చివరిగా నా మాటలు కొన్ని చెప్పి ఇక్కడితో ముగిస్తా.  అవినీతి గురించి ఎంతో ఆవేదన పడ్డ ఆయన మనస్సు ఎంతో దుఃఖపడిఉంటుంది. ఎన్నో సందర్భాలలో దాన్ని లేవనెత్తారు. మెజార్టీలని అణగత్రొక్కి, మైనారిటీలని నెత్తి మీద పెట్టుకొనే రాజకీయులని ఎన్నో సార్లు ఆయన ఖండించారు. కంచి పీఠాధిపతిని కారాగారం పాలు చేస్తే ఆయన తప్ప మరే ప్రముఖ వ్యక్తి గళం విప్పలేదు. ఆదర్శాల గురించి, స్వార్థ రహిత నాయకుల గురించి చెప్పిందే మళ్ళి, మళ్ళి చెప్పడం ద్వారా యువతలో ఒక్కరు మారినా, వాళ్ళు దేశానికి మార్గదర్శనం చేస్తారేమో అని ఆశపడ్డారు. వీటన్నింటిలోను మన సంసృతిని, ధర్మాన్ని రంగరించి అందరికి సులువుగా అర్థం అయ్యేలా విడమరచి చెప్పారు. చివరిగా ఆయన బలహీనతల్ని నిర్భయంగా ఒప్పుకొంటూ, నిజం చెప్పడానికి అయినవారిని కూడా విమర్శించటానికి వెనుకాడలేదు.  వీటన్నింటికి జరిగే పరిణామాలకి వెరవలేదు.  ఇవి చాలు గొల్లపూడి గారిని సామాన్యమైన మనిషి అంటూనే, అసాధారణమైన వ్యక్తి అనటానికి.

* ఇవి గొల్లపూడి వారి ట్రేడ్మార్క్ పదాలు, వారికి కృతజ్ఞతలతో.. 

11, మే 2017, గురువారం

రావిశాస్త్రి, శ్రీశ్రీ, విశ్వనాథ, గాంధీ గార్ల సారుప్యం

రావిశాస్త్రి, శ్రీశ్రీ, విశ్వనాథ, గాంధీ - వీళ్ళ పేర్లు తెలియని తెలుగు వాళ్లుంటారని నేననుకోను. ఒక వేళ తెలియకపోతే తెలుసుకోవడం ఈ రోజుల్లో అంత కష్టం కాదు. క్లుప్తంగా.....

రావిశాస్త్రి - రాచకొండ విశ్వనాథశాస్త్రి  - రచయిత, న్యాయవాది, వామభావపక్షవాది.
శ్రీశ్రీ - శ్రీరంగం శ్రీనివాసరావు -  కవి, రచయిత, వామభావపక్షవాది, విరసం స్థాపకులలో ఒకరు.
విశ్వనాథ - విశ్వనాథ సత్యనారాయణ -  కవి, రచయిత, మొదటి తెలుగు జ్ఞానపీఠ బహుమతి గ్రహీత, ఉపాధ్యాయుడు.
గాంధీ - మోహనదాస్ కరంచంద్ గాంధీ - భారత జాతిపిత,  రచయిత, న్యాయవాది.

మొదటి ముగ్గురు తెలుగువాళ్లయితే, చివరి ఆయన గుజరాతీ. మొదటి ఇద్దరు మంచి స్నేహితులు. శ్రీశ్రీ, విశ్వనాథ గార్లకి ఒకరంటే మరొకరికి గొప్ప అభిమానం, గౌరవం ఉండేవి.  ఒకళ్ళ కవిత్వంతో  మరొకరిని ఉత్సాహపరచి, ఉద్రేకపరచి క్రొత్త రచనలను చేసే విధంగా ప్రోత్సహించి మనలని అలరించిన వారే. వీరంతా రచనావ్యాసంగంలో చేయి తిరిగిన వారే. అందరు ప్రజల కోసం సొంత లాభం వదిలిపెట్టి నిస్వార్థంగా సేవ చేసిన వారే. ఎవరికి వారు అశేష ప్రజల అభిమానాన్ని, ఎందరో పాఠకుల ఆదరణని పొందిన వారే. వాళ్ళ సమకాలీకుల దగ్గర నుంచి ఎక్కువ విమర్శలని, తక్కువ ఆదరణని పొందిన వారే.

ఇంత చేసి వాళ్లెవరు నాకు తెలిసి వ్యక్తిగతంగా చెడ్డ వారు కాదు. వారి గురించిన పరిచయ వాక్యాలు కూడా కొంత మందికి కోపం తెప్పించవచ్చు. అయితే నాకు తెలిసినదేమిటి అన్న ప్రశ్న వస్తుంది. అందులోకే వస్తున్నాను. వారు నాకు వారి రచనల ద్వారానే పరిచయం. అన్ని రచనలు చదివాను అని చెప్పను కానీ చదివిన మేరకు వాళ్ళ గురించి ఒక అంచనాకి వచ్చాను. కవి సహజంగా ప్రజాబంధువయిఉంటాడు, వాళ్లకున్న సమస్యలను కష్టాలను చూసి స్పందించి రచనలు చేస్తాడు. అందువల్ల పైపెద్దలంతా ప్రజలకి ఎంతో కొంత ప్రయోజనం ఒనగూర్చే పనులే చేశారు కానీ, ప్రజాకంటకమైన పనులేమీ చెయ్యలేదు. వాళ్ళు ఆశించిన ప్రయోజనం రాకపోయినా వాళ్ళ ప్రయత్న లోపం ఎంత మాత్రం లేదు. అందరు ధృడ సంకల్పం, ఉన్నత వ్యక్తిత్వం ఉన్న వారు, లేకపోతే సమాజం వారిపట్ల ప్రవర్తించిన తీరుకి  వాళ్ళు ఏనాడో చెల్లాచెదురయ్యేవాళ్ళు, జనం గుండెల్లో ఇంత కాలం చోటు చేసుకోవటం కల్ల. ఈ భాగం వాళ్ళ ప్రజాజీవితంకి సంబంధించినది మాత్రమే.

రావిశాస్త్రి గారికి బంధువయినా ఒక ఆవిడ అన్నదాని ప్రకారం ఆయన తాగుడు, పరస్త్రీ వ్యసనాల వల్ల ఆయన కుటుంబం నానా అవస్థలు పడిందని. అలాగే శ్రీశ్రీ గారి వ్యసనాల వల్ల ఆయన భార్యలు సుఖపడినట్టు నాకనిపించలేదు. విశ్వనాథ వారు తనకి ఉన్నా లేకపోయినా అందరికి దానాలిచ్చి మొత్తం కుటుంబాన్ని నిర్లక్ష్యం చేశారని, ఇంట్లో ఆడవారిని సరిగ్గా చూడలేదని వారి కుటుంబంతో పరిచయమున్న ఒకావిడ చెప్పారు. గాంధీ గారి ప్రజాసేవ వల్ల ఆయన పిల్లలు ఎవరూ ఆయనని ఆదరించలేదన్నది జగమెరిగిన సత్యం. ఇవన్నీ వారి వ్యక్తిగత జీవితాలు అయినా అందరికి బహిర్గతమయిన నిజాలే.

ఇంట గెలిచి రచ్చ గెలవమని ఒక నానుడి. పైన చెప్పిన వాళ్ళందరికి వారి వారి కర్తవ్యం, విద్యుక్త ధర్మం తెలియకపోవడం అన్న సమస్యే లేదు. మరి కుటుంబాన్ని వదిలి, దేశసేవ మీద దృష్టి పెట్టటంలో ఉద్దేశం ఏమిటి? సగటు మనుషులుగా మనం వారి ఔన్నత్యాన్ని ప్రక్కనపెట్టి వారి బలహీనతలను రచ్చకెక్కించటం సబబేనా? వాటిని మాత్రమే పరిగణించి, మనం కూడా వారు చేశారు కాబట్టి మేము చేస్తున్నాము అనటం అందమా? లేక వారు చేసిన సేవల ఫలితంగా వాటిని మాత్రమే చూసి మిగిలిన వాటిని తిరస్కరించాలా? కాలేజీ రోజుల్లో వీటి మీద గంటలు గంటలు చర్చలు చేసే వాళ్ళం. వాటిల్లో మేము చేసిన తీర్మానాలు మాత్రం అడక్కండి.



17, మార్చి 2017, శుక్రవారం

బ్లాగుల్లో నేనెందుకు వ్రాస్తున్నాను?

నేను డిగ్రీ పూర్తి చేసుకొని ఉద్యోగం వెతుక్కోవటానికి హైదరాబాద్లో ఉన్నరోజుల్లో, అప్పుడప్పుడు అఫ్జల్ గంజ్లో ఉన్న స్టేట్ లైబ్రరీకి వెళ్లి కాసేపు కాలక్షేపం చేసేవాడిని. అప్పటిదాకా చిన్నఊళ్ళల్లో ఉన్న చిన్న లైబ్రరీల్లో చదివిన నాకు, అంత పెద్ద లైబ్రరీ మొట్టమొదటిసారి చూసేటప్పటికి ఒళ్ళు స్పృహ తెలియలేదు. ప్రత్యేకంగా తెలుగు పుస్తకాలు ఒక పెద్ద గది నిండా పదో, పన్నెండో అరలలో  చక్కగా సర్దబడి కళ్ళకి చాలా ఇంపుగా వుండేవి. అప్పట్లో అరవై రూపాయలు డిపాజిట్ తీసుకొని, రెండు పుస్తకాలు రెండు మూడు వారాలుంచుకొని చదవటానికి  అద్దెకి ఇచ్చేవాళ్లు. ఆరోజుల్ని, ఆరోజుల్లో చదివిన కొన్ని పుస్తకాలు తలచుకొంటే చాలా బెంగగా ఉంటుంది. ఆతర్వాత ఉస్మానియా యూనివర్సిటీ లైబ్రరీకి వెళ్లినా, అక్కడ ఇంకా ఎక్కువ పుస్తకాలు చూసిన, స్టేట్ లైబ్రరీ ఇచ్చిన ఆనందం మళ్ళీ ఆస్టిన్, టెక్సాస్ లోని లిండన్ జాన్సన్ లైబ్రరీలో తెలుగు పుస్తకాలు చూసే దాకా రాలేదు.  చివర చెప్పిన లైబ్రరీలో సౌత్ ఈస్ట్ ఆసియాకి సంబంధించిన చాలా భాషల్లో పుస్తకాలున్నాయి. అప్పట్లో ఆదాయం ఇంకా లేనపుడు, అమ్మ నాన్న ఇచ్చిన డబ్బులతో పుస్తకాలు కొనడానికి చేతులు రాక, వాటి కేసి దిగులుగా చూస్తూ వెళ్లిన రోజులు (కోఠి, ఆబిడ్స్ లో ఆదివారం వీధుల మీద పుస్తకాల అమ్మకాలు చూసే ఉంటారు) ఇంకా గుర్తే.  అప్పట్లో చూసిన కొన్ని అపురూపమైన పుస్తకాలు ఇప్పుడు కొనుక్కుందామనుకొన్నా దొరకని పరిస్థితి మీలో చాలా మందికి అనుభవైక్యమే. క్రొత్త పుస్తకాల వాసన, ఎవ్వరి దగ్గర దొరకని పాత పుస్తకం మనకి దొరకడం, దానిలో ఒక్కొక్క పేజీ త్రిప్పుతూ ఆ తన్మయత్వంలో మునిగితేలటం ఇవన్నీ నోటితోనే, కాగితం మీదో చెప్పే విషయాలు కావు. అనుభవించి తెలుసుకోవలసినవి మాత్రమే. 

అప్పుడు చదివిన కొన్ని మంచి పుస్తకాలలో ఒకటి - "నేనెందుకు వ్రాస్తున్నాను" అన్న పుస్తకం. చదివి చాలా కాలం అయ్యింది. అప్పటివరకు ఉన్న కొందరు లబ్దప్రతిష్టులైన రచయితల చేత ఎడిటర్ వారెందుకు వ్రాయటం మొదలెట్టారో ఒక్కోవ్యాసం వ్రాయించి, వాటినన్నింటిని ఒక సంకలనం క్రింద ప్రచురించారు. శ్రీశ్రీ గారు, గొల్లపూడి మారుతీరావు గారు నాకు గుర్తున్న ప్రముఖులు. పుస్తకం సారాంశం ఏమిటంటే - "నీలో ఉన్న భావాలు అందరితో పంచుకోవాలి, వాటికి ఒక శాశ్వతత్వం కల్పించాలి అనుకున్నపుడు వాటికి అక్షర రూపం ఇచ్చి పుస్తకాలుగా చూడాలనుకొంటావు" - అని. ఊటలో ఉన్న జల ఆగలేక బయటికి ఎలా తన్నుకువస్తుందో అలా నీలో ఉన్న మాట, పాట  గుండెల్లో స్థిమితంగా ఉండలేక బయటకి ఉరికి రావటం అన్నమాట. ఈ రచయితలంతా వారి మొదటి పద్యం, కవిత, కథ, వ్యాసం, ఏదైనా అచ్చు వేయటానికి ఎంత శ్రమపడ్డారో , ముద్రణలో కష్టాలు, కాపీల సంఖ్య, అమ్ముకోవటంలో బాధలు, పారితోషికంతో సమస్యలు ఇలా అనేక విషయాలు చర్చించబడ్డాయి. అయితే వాటిలో ఓకే అంశాన్ని - మనం  అచ్చులో అక్షరాలని చూసుకొన్నప్పుడు కలిగే ఆనందం  -  మాత్రమే నేను స్పృజించదలచుకొన్నాను. ఈపుస్తకం మళ్ళీ ఇంకోచోటెక్కడా తారసపడలేదు. దొరికితే మాత్రం తప్పక  చదవాల్సిన పుస్తకం. ముఖ్యంగా ఔత్సాహిక రచయితలకి ఇది మంచి రిఫరెన్స్ పుస్తకం. ప్రత్యేకంగా ఒక రచయిత మాటలని మరొకళ్ళు యథాతధంగా చెప్పటం కష్టం. వారి మాటల్లోనే చదివితే పొందే అలౌకిక ఆనందం చెప్పనలవికాదు. నేను వ్రాయటానికి పైన పేర్కొన్న పెద్దల మాటలు ఒక విధంగా ప్రేరణ అయితే, మరో రకంగా వ్రాసే వాళ్ళ గుంపులో చేరాలన్న చిన్ననాటి ఉబలాటం.

పూర్వపు (ఇంటర్నెట్ లో న్యూస్ గ్రూప్స్ కూడా రాక ముందు రోజుల గురించి - ఇవేమిటో తెలుసుకోవాలంటే ఇక్కడ నొక్కండి) రచయితలకున్నన్ని సాధకబాధకాలు మనకిప్పుడు లేవని నేననుకొంటున్నాను. కనీసం సొంతంగా బ్లాగుల్లో ఉచితంగా వ్రాసుకోవచ్చు. యేభాషలో అయినా వ్రాసుకోవచ్చు. నచ్చితే వ్రాయవచ్చు లేదా ఊరుకోవచ్చు.  ఎవరిని అకారణంగా కించపరచకుండా (ఇది అన్ని వేళల కుదరేదేమో? కొన్ని విషయాలలో కొందరికి మోదం, మరి కొన్నింటి విషయంలో కొందరికి ఖేదం కలగడం సహజమేమో!), ఏదైనా, ఎప్పుడైనా, ఎలాగైనా వ్రాసుకోవచ్చు. పాఠకులని, ప్రచురణ కర్తలని వెతుక్కోవక్కరలేదు. డెడ్ లైన్లు లేవు, పీకల మీద కూర్చునే వాళ్ళు లేరు. అయితే మనం సరదాగా మన కోసం వ్రాసుకున్నంత సేపే. ఒకసారి లాభాపేక్షతో చేసినా, ఆదాయంకోసం చేసినా, పైన చెప్పినవేవి వర్తించవు. అలాగే తెలుగులో వ్రాతల్ని పుస్తకాలుగా మలుచుకొనేవాళ్ళకి పరిస్థితి అంత ఆశాజనకంగా లేదనే అనాలి (ఈ విషయంలో అనుభవజ్ఞులు ఎవరైనా వాళ్ళ అనుభవాలు వ్రాస్తే బావుంటుంది). నాకు పదేళ్ళప్పుడు వ్రాయాలన్న పురుగు కుట్టటం మొదలు పెట్టింది. కానీ బెరుకు, బద్ధకం, భయం లాంటి ఈతిబాధలు చాలా కాలం ఇబ్బంది పెట్టాయి. చివరికి బ్లాగులు అందుబాటులోకొచ్చాక ఒక వృత్తిపరమైన బ్లాగ్ మొదలెట్టాను. వ్రాత అయితే అచ్చులోకొచ్చింది కానీ, అది పూర్తి సంతృప్తినివ్వలేదు. అది కాస్తా చాలా తక్కువ కాలంలోనే అటకఎక్కింది. ఇప్పటికి ముక్కంటి దయవల్ల అన్ని అనుకూలించి కావలసిన చోటికి వచ్చి, నాకు నచ్చినది వ్రాయటం కొంత సాధ్యమైంది. ఇంకా చాలా దూరం ప్రయాణం చేయవలసి ఉంది. 

వ్రాయటం అనే వ్యాపకం, చదవటం లాగే మొట్టమొదటగా మన ఆత్మసంతృప్తి కోసం చేసే పని మాత్రమే అని నా నమ్మకం. ఆ తర్వాత వరుసలో మన భావాలు ఇతరులకి తెలియచేయటం, వారిని మన మార్గాన్ని అనుసరించమని ప్రోత్సహించటం, వారినుంచి విమర్శలను, వ్యాఖ్యలని కోరటం, క్రొత్త విషయాలు నేర్చుకోవటం  లాంటివి.  చక్కగా, పకడ్బందీగా వ్రాయటం వరకే రచయితగా మన పని,  ఆతర్వాత మళ్ళీ భవిష్యత్తులో చూసుకొంటే, ఓహో బావుంది అనుకోవటం లేదా అయ్యో సరిగ్గా వ్రాయలేకపోయానే, ఇంకా బాగా వ్రాసి ఉండొచ్చేమో అనుకోవటం కూడా బాగానేఉంటుంది. ఎక్కువ మంది చదవడం లేదు, ఎక్కువ కామెంట్లు రావటం లేదు అన్నది మీ చేతిలో లేదు. దానిగురించి చింత కూడా అనవసరం. నేను గమనించిన దాని ప్రకారం క్రమం తప్పకుండా, స్థిరంగా, బిగువుగా, సులభంగా,  సరళంగా పాఠకుల హృదయానికి దగ్గరగా ఉండేలా వ్రాసే వారికి (ముఖ్యంగా శైలి, విషయపరిజ్ఞానం, కథనం బాగా ఉంటే) పాఠకుల కొరత లేదు.  ఇక భాష మీద పట్టు, వ్రాసే విషయం మీద అధికారం ఉన్న వాళ్ళ గురించి వేరే ప్రత్యేకంగా చెప్పేదేమిలేదు. చాల మంది మేధావులు, ప్రాజ్ఞులు, అద్భుతంగా వ్రాసే వాళ్ళు బ్లాగులలో ఉన్నారు. పేరు పేరునా చెప్పటం కష్టం కాబట్టి ఆ ప్రయత్నం చెయ్యట్లేదు. నేను మాత్రం అలాంటి వారి వద్ద నుంచి నిరంతరం స్ఫూర్తి  పొందుతూనే ఉంటాను. కొంత మంది బ్లాగ్ రచయితల వెతలు చూసి, చదువరిగా నా అనుభవంతో ఇది వ్రాయాలనిపించింది. నేనేదో పైనుంచి దిగివచ్చిన అవతారమని చెప్పుకోవటం కాదు. నాకు తెలిసినది మీతో పంచుకొని, నన్ను నేను ఉద్దరించుకోవటానికి చేసే ప్రయత్నం మాత్రమే. నేనెందుకు చదువుతాను అన్నది మరో సారి. 

6, మార్చి 2017, సోమవారం

కంప్యూటర్లో తెలుగులిపి రూపకర్తలు

గమనిక:
నేను చదువుకున్నది కంప్యూటర్ సైన్స్ కాదు, ఇక్కడ వ్రాసిన కొన్ని విషయాలు సమగ్రంగా ఉండక పోవచ్చు, తప్పులుండొచ్చు. కానీ సంబంధిత రంగంలో పని చేస్తుండడం వల్ల, కొంత విషయపరిజ్ఞానం ఉండటం వల్ల దీని గురించి వ్రాయదలచుకొన్నాను.  రెండవది తెలుగునాట మనకి ఇంటికి ఇద్దరైనా సాఫ్ట్ వేరు ఇంజినీరులు ఉన్నా, ఆ రంగంలో పరిశోధనల పరంగా చూస్తే మన వంతు పాత్ర చాలా తక్కువ. అలాంటిపరిశోధకులలో పేరేన్నదగిన ఒకరిద్దరు తెలుగువారిని గురించి వ్రాద్దామన్నదే ఈ ప్రయత్నం. ఒకేసమయంలో చాలామంది ఒకే సమస్యమీద ఏక కాలంలో పనిచేసి, పరిష్కారం కనిపెట్టి ఉండవచ్చు. వారందరిని నేను ఇక్కడ ప్రకటనంగా తెలియచేయక పోయినా, వారందరికి నేను కృతజ్ఞుడను (ఈవేళ తెలుగులో నేను ఇక్కడ వ్రాయటానికి వాళ్ళే కారణభూతులు). మూడవది సామాన్య పాఠకులకు వ్రాద్దామని అనుకొన్నా, క్లిష్టమైన తెలియని సంగతులతో కూడినది అవటం వల్ల అందరికి అర్థం కాకపోవచ్చు. ముఖ్యమైన మైలురాళ్ళు, అప్పుడేమి జరిగింది అన్నవాటికే ప్రాముఖ్యతనిచ్చాను. చాలా పదాలు సాంకేతికమైనవి కనుక ఇంగ్లీషులోనే ఉంచేసాను. 



ఇక కథలోకి.... 
కంప్యూటర్ రంగంలో ట్యూరింగ్ అవార్డు అన్నది భౌతిక, రసాయన శాస్త్రాల లాంటి మిగిలిన రంగాల్లో ఇచ్చే నోబెల్ ప్రైజ్ లాంటిది. ఆ బహుమానం 1974లో తీసుకొన్న ప్రముఖుడు డోనాల్డ్ నూత్ (Donald Knuth - DK గారి సొంత సైట్ లింక్). ఈయన స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో  విశ్రాంత అధ్యాపకులు. ఆయన తర్వాత 20 ఏళ్ళకి మన తెలుగు వారైన రాజిరెడ్డిగారు 1994 లో అందుకొన్నారు. మిగిలిన అవార్డు గ్రహీతలను చూడాలనుకొంటే ఇక్కడ నొక్కండి. రాజిరెడ్డిగారి గురించి, ఆయన కార్నిగీ మెల్లన్ యూనివర్సిటీలో ఆర్టిఫిషల్ ఇంటలిజెన్స్ (AI - artificial intelligence) మీద చేసిన పరిశోధనలు, ఆయనని విజిటింగ్ ప్రొఫెసర్ క్రింద మన ప్రభుత్వాలు ఆంధ్రప్రదేశ్ కి రప్పించటం వార్తల్లో చాలామందే చదివివుంటారు. ఇక్కడ నేను వ్రాసే విషయవస్తువు కోసం DK గారి కృషికి మాత్రం పరిమితమవుతాను. 

టెక్ (TeX) అన్న టైప్ సెట్టింగ్ కంప్యూటర్ భాషను తయారు చేసింది DK గారు. దీన్ని  కంప్యూటర్లో రకరకాల ఫాంట్లని వివిధ రకాల ఆకృతుల్లో తయారుచేయటానికి వాడతారు. అలాగే లేసర్ ప్రింటర్స్ లో ప్రింట్ చేసేటప్పుడు డాటాను ఒక ప్రత్యేక పద్దతిలో (postscript రూపంలో) ప్రింటర్ కి పంపుతారు. దానికి కావలసిన సాంకేతికతని కూడా DK గారే తయారుచేశారు. వీటన్నింటిని కలిపి ది ఆర్ట్ అఫ్ కంప్యూటర్ ప్రోగామ్మింగ్ అని నాలుగు సంపుటాలు వ్రాసారు. వీటిని కంప్యూటర్ రంగంలో ఉన్న చాలా మంది భగవద్గీత క్రింద పరిగణిస్తారు. 1990లలో యూనివర్సిటీలలో వీటిని పాఠ్యపుస్తకాలుగా కంప్యూటర్ సైన్స్ విద్యార్థులు వాడేవాళ్లు. అప్పటికి వేరే భాషల్లో వ్రాయటానికి, లెక్కలకి,  పరిశోధనపత్రాలకి సంబందించిన సింబల్సు కంప్యూటర్లో వ్రాయటానికి వీలయ్యేది కాదు. మైక్రోసాఫ్ట్ వర్డ్ ఉన్నాకూడా దానితో అన్ని వీలయ్యేవికాదు, లేదా అది చాలా ఖరీదుండడంచేత ఎక్కువ మంది వాడేవాళ్లు కాదు. అందువల్ల TeXని ఆధారం చేసుకొని LaTeX అని మరో డాక్యుమెంట్ రైటింగ్ సిస్టం కనిపెట్టారు. ఇది ఎక్కువ భాగం సాంకేతిక రంగంలో ఉన్న వాళ్ళు, పరిశోధన విద్యార్థులు వాడుకుంటుండేవాళ్లు. 1991లో లక్ష్మి ముక్కవిల్లి గారు TeluguTeX అనే LaTeX ని పోలిన తెలుగు సాఫ్ట్వేర్ తయారుచేశారు, కానీ దీన్ని వాడటానికి కూడా కొంత సాంకేతిక నైపుణ్యం అవసరం ఉండేది. 

ఈ పూర్వరంగం సంగతులు మీకు చెప్పడానికి చాలా కారణాలున్నాయి. 1990లలోనే అవినాష్ చోప్డే అన్న ఆయన భారతీయ భాషల్ని కంప్యూటర్లో వ్రాయడానికి ITRANS అన్న సిస్టం తయారుచేశారు, ముఖ్యంగా ఆ రోజుల్లో హిందీ పాటల సాహిత్యం దీని సహాయంతో వ్రాసి ఇంటర్నెట్లో పంచుకొనే వాళ్ళ సంఖ్య వందల్లో ఉండేది.  మన కథానాయకులు రంగంలోకి వచ్చేటప్పటికి ఇవి పరిస్థితులు. ఇంచుమించుగా ఇదే సమయంలో తెలుగులో ఈవిధంగా వ్రాయటాన్ని అందుబాటులోకి తెచ్చిన వాళ్ళు శ్రీయుతులు రామరావు కన్నెగంటి (RK - రామ గారి లింక్ ), ఆనంద కిశోర్ (AR), రమణ జువ్వాది (RJ - రమణగారి బ్లాగ్ లింక్). వీళ్లు  రైస్ యూనివర్సిటీలో చదువుకునేటప్పుడు, వాళ్ళ పరిశోధనలో భాగంగా దీన్ని తయారుచేసినట్టు, చదివిన యూనివర్సిటీ మీద ప్రేమతో వాళ్ళు కనిపెట్టిన సిస్టం ఆపేరు పెట్టినట్టు అప్పట్లో చదివాను. చిత్రంగా వీరి గురించి అప్పట్లో చదివిన వ్యాసాలేవి ఇంటర్నెట్లో అందుబాటులో లేవు. ఇంగ్లిష్ అక్షరాల సహాయంతో తెలుగులో వ్రాయటమన్నది రైస్ ట్రాన్స్లిటరేషన్ సిస్టం (Rice Transliteration System) తో బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది అన్నది నిస్సందేహం.  ఇది కూడా మొదట్లో యూనివర్సిటీలలో, పెద్ద కంప్యూటర్ కంపెనీలలో, పరిశోధనలో ఉన్న తెలుగు వాళ్ళు వాడేవాళ్లు.  పైనిచ్చిన లింకుని అనుసరిస్తే, RTS తాలూకు వివరాలు దొరుకుతాయి. చాల కాలం అంటే లేఖిని తయారయ్యేదాకా చాలామంది దీని సాయంతోనే న్యూస్ గ్రూప్స్ లో తెలుగు వ్రాసేవాళ్ళు. ఆ తర్వాత కాలంలో  ఇంటర్నెట్ మీద, డెస్క్టాప్ మీద తెలుగు కోసం చాలా టూల్స్ వచ్చినా ఇది బాగా మనస్సులో నిలిచిపోయింది. వారి వారి రంగాలలో అత్యున్నత స్థాయికి  చేరటమే కాకుండా, తెలుగును  కంప్యూటర్లో వ్రాయటం విస్తృతంగా వ్యాప్తినొందడానికి పునాదిరాయి వేసి, ఔత్సాహిక రచయితలకి మార్గం సుగమం చేసిన వీరి కృషిని తెలుగు వారంతా గుర్తుంచుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది. 

పైన ఇచ్చినవి కాకుండా RTS గురించిన మరో వ్యాసం సౌమ్య గారి బ్లాగ్లో చూడొచ్చు.  మరో ఉపయోగకరమైన లంకె.