7, మార్చి 2019, గురువారం

ఏడవటం నా జన్మహక్కు

పిల్లవాడు పుట్టి పుట్టగానే ఏడవకపోతే, గిల్లి ఏడ్పించేవారు. ఇప్పటికి ఇది ఆచరణలో ఉన్న వ్యవహారమే. ఇది శిశువు ఆరోగ్యంగా పుట్టాడా లేదా అని తెలుకోవడానికి చేసేవాళ్ళు. క్రమేణా వాడు పెద్దవాడయ్యే క్రమంలో ఏడుస్తూ, నవ్వుతూ ఇవి రెండు కాకుండా బ్రహ్మనందాన్ని ఎలా పొందాలి అన్న దిశగా ప్రయాణం చేస్తాడు అని ఆశించేవారు. కాస్త విషయపరిజ్ఞానం ఉన్నవాళ్ళు ఇలా బ్రతకాలని, లేకపోతే అధమం సంతోషంగా అయినా ఉండాలని కోరుకుంటారు. కనీసం గతంలో ఇలా జరిగేదని మనకున్న వాఙ్మయం చెబుతోంది. మారుతున్న పర్యావరణం, కాలంతో పాటు మనిషి పెడబుద్ధి కూడా రూపాంతరం చెందుతున్నట్టు అనిపిస్తుంది. మార్పు సహజము లేదా సహజమైన మార్పుని ఆహ్వానించవలసిందే.  కానీ అవాంఛితమైన మార్పు, విపరీత ధోరణులు ఎవరికి అభిలషణీయం కాదు.

నేను మాట్లాడుతున్న అసహజమైన మార్పు "ఏడుపు" గురించి. ఏదో బాధ, ఒక దుఃఖం కలిగించే సంఘటనో, అనారోగ్యం, దగ్గర మనుషులలో లేక వాళ్ళతో అశాంతి ఉండి, ఎవరైనా ఏడిస్తే అది అత్యంత సహజం. అటువంటి వాళ్లకి ఓదార్పు మాటలు చెప్పటమో,  సానుభూతి చెయ్యటమో, మనకి చేతనయినా సాయం ఏదైనా చేయటానికి ప్రయత్నం చేస్తాం. కానీ అయినదానికీ, కానీదానికి ఏడుపు అనే భావప్రకటన చేసే వాళ్ళ సంఖ్య బాగా పెరిగిపోయింది. నన్ను తిట్టావు ఏడుస్తాను, మా హీరోని తిట్టావు ఏడుస్తాను, మా నాయకుడిని తిట్టావు ఏడుస్తాను. నువ్వు నాకంటే బాగా చదువుతావు ఏడుస్తాను, నువ్వు నాకంటే బాగా వ్రాస్తావు ఏడుస్తాను, నువ్వు నాకంటే అందగాడివి ఏడుస్తాను, నువ్వు నాకంటే బాగా పాడతావు ఏడుస్తాను. అంటే సమస్య ఏదైనా, నచ్చనిది ఏది కనిపించినా సమాధానం ఏడుపే. ముఖ్యంగా సోషల్ మీడియాలో ఈ ధోరణి ఇంకా ఎక్కువగా ఉంది. నాకు భావప్రకటనా స్వేచ్ఛ ఉంది, నామాట సులభంగా అందరికి చేరుతుంది కదా అని ఏదైనా అంటాను అన్న దృక్పథం మెండయింది. అంటే ఈతరహా జనాలకి ఏడవటం జన్మహక్కు అయికూర్చుంది. 

పూర్వం పిల్లలు ఏదైనా తప్పు చేస్తే పెద్దలు దండించేవాళ్లు. ఇందులో విశేషం ఏమిటంటే పెద్దలు ఎవరైనా  కావచ్చు. తల్లితండ్రులు, ఇరుగు పొరుగు, గురువులు, ఊళ్ళో పెద్దలు ఇలాంటి వాళ్లు అన్న మాట.  ఈవిషయంలో మాఇంట్లో వాళ్ళు ఇంకాస్త ముందుకెళ్ళి మాగురించి (పిల్లలం) ఏ ఫిర్యాదు వచ్చినా ముందు మమ్మల్ని దండించి తర్వాత ఏమి జరిగింది అన్నది విచారణ చేసేవాళ్ళు. మాకు ఉక్రోశం,ఎంత బాధ కలిగినా అసలు అటువంటి పరిస్థితిలో ఇరుక్కునందుకు మమ్మల్ని మేమే నిందించుకొని ఊరుకొనేవాళ్ళము. ఒక్కొక్కసారి పిల్లవాడికి సంబంధం లేకపోయినా కొట్టవలసి వచ్చిందని పెద్దలు నొచ్చుకొనేవారేమో! ఇలా ఎందుకు చేసేవారో పెద్దయిన తర్వాత కానీ మాకు అవగాహనలోకి రాలేదు. అంటే చెడు ఆలోచనని ఆదిలోనే త్రుంచేయ్యాలి అన్నది అప్పటి పెద్దల తపన, దానికి అనుగుణంగానే పిల్లలు వృద్ధిలోకి వచ్చారు. సంపాదనలు విపరీతంగా లేకపోయినా, భయం భక్తి ఉండి సంఘవిద్రోహులు కాకుండా మిగలగలిగారు. కానీ పరిస్థితులు ఎంతగా మారిపోయాయి అంటే మొత్తం పద్ధతులన్నీ తలక్రిందులయ్యాయి.

ఎవరు ఇంకొకరిని ఏమి అనటానికి లేదు. పెద్ద చిన్న, మంచి చెడు విచక్షణ లేదు. చెప్పేవాళ్ళు తగ్గారు, చెబితే విని ఆచరణలో పెట్టె వాళ్ళు తగ్గారు. ఇప్పుడు అన్నిచోట్లా మంచి చెప్పటం కూడా తప్పే. మేష్టారుగారు పిల్లవాణ్ని తిట్టినా, దండించిన ఆయనకే అక్షింతలు. కొన్ని చోట్ల కేసులు, ఉద్యోగం ఊడపీకడం, మరికొన్ని చోట్ల తల్లితండ్రులో బందుగులో చేయి చేసుకోవటం, జైళ్ల పాలు కావటం, సంసారాలు విచ్చిన్నం కావటం తరచూ జరుగుతోంది. పశ్చిమ దేశాల పద్ధతులు యెంత మాత్రం అర్థం చేసుకోకుండా దిగుమతి చేసుకుని అమలు చేయటం ఎక్కువ అయిపొయింది. అందరి హక్కులు కాపాడాలి అని బాధ్యతలకు, కర్తవ్యాలకి తిలోదకాలు ఇచ్చేసాము. న్యాయస్థానాలు, ప్రభుత్వాలు, ఇతర ఉన్నత సంస్థలు "మంచిని చెయ్యి" అని చెప్పే నైతికతని నెమ్మదిగా కోల్పోతున్నారు.  అంటే అంతా పూర్తిగా భ్రష్టు పట్టిపోయిందని అనుకొంటే అది కూడా తప్పే.

ఇంతకీ ఏడుపు దగ్గర మొదలెట్టా కదా! దేశభక్తి, నైతికత, నాయకత్వం, సమర్థత, సమభావన, కర్తవ్యదీక్ష కలిగిన వ్యక్తులు ఇంకా భారత భూమిలో పుష్కలంగా ఉన్నారు. పేర్లు కావాలనే చెప్పట్లేదు. అవసరం కూడా లేదు. ఇప్పటి తరంలో మీకు కనిపించక పోతే బాగా వెతకండి. వాళ్ళు మన మధ్యనే సామాన్యుల్లా బ్రతుకుతున్నారు. మన సమకాలీకులని, గొప్పవారిని ఎలాగూ గుర్తించము కనక, కనీసం మన ముందు తరాల్లో ఉన్న వాళ్ళని ఆదర్శంగా తీసుకుందాము. మన జీవితాలని ఉద్దీపనం చేసుకుందాము. అసలైన, సరైన సమస్యలను ఎదుర్కొనే, పోరాడే శక్తిని ఇవ్వమని ఏడుద్దాము, ప్రార్థిద్దాం. అక్కరలేని, మనకు సంబంధం లేని వాటి జోలికి వెళ్ళవద్దు. అంతేకాని మంచి చెప్పే ఉన్నతమైన వ్యక్తులని చూసి ఏడవటం, వాళ్ళని ఏడిపించటం మానేద్దాము. వాళ్ళు చెప్పినది మనకి నచ్చకపోతే మౌనంగా ఉందాము అంతే కానీ ఏడిస్తే అది మనకి సాయం చేయకపోగా అనారోగ్యం పాలుచేస్తుంది అన్నది గ్రహిద్దాము.

మంచిని ప్రోత్సహిద్దాము, అది చెప్పే పెద్దలని గౌరవిద్దాము, తద్వారా మనల్ని గౌరవించుకొందాం, వారి ద్వారా అందరు కోరుకొనే గొప్ప సమాజాన్ని నిర్మించుకొందాము. సర్వేజనా సుఖినోభవంతు!!!

తోక:- ఈమధ్యన ఒక పెద్దమనిషిని మరో అణువంతమనిషి అనకూడని మాటలనటం నా ఏడుపుకి కారణం.