22, సెప్టెంబర్ 2017, శుక్రవారం

పిచ్చి - అతి పిచ్చి

ఒక్కోడికి ఒక్కో పిచ్చి/వ్యసనం ఉంటుంది. మీకస్సలు ఏ పిచ్చి లేదా (మీరు ఈ గ్రహవాసులు కారేమో!)? అయితే ఇక్కడ చదవడం ఆపేసి, ఈ పేజీ మూసేసి వెళ్లిపోండి. డబ్బు పిచ్చి, సినిమా పిచ్చి, కీర్తి పిచ్చి, సీరియల్స్ పిచ్చి, నాటకాల పిచ్చి, ప్రక్కనవాడి తలపై చెయ్యి పెట్టె పిచ్చి, సుత్తేసే పిచ్చి, క్రికెట్ పిచ్చి, పందేల పిచ్చి, క్రమశిక్షణ పిచ్చి, చదివే పిచ్చి ఇలాంటివి కొన్ని. చివరిది పిచ్చేలా అవుతుంది అని అడక్కండి, అనవసరమైనవి చదివి బుర్ర పాడిచేసుకొన్నా, ఎక్కువ చదివి ఏమీ నేర్చుకోకపోయినా అది పిచ్చే. మరికొన్ని బయటికి చెప్తే బావుండదు. అన్ని పిచ్చిలు (ఈ బహువచన ప్రయోగం నాకే నచ్చలేదు, అయినా మీకర్థం అయ్యింది కాబట్టి సర్థుకుపోదాము) ప్రాణాంతకం కాదు, అందువల్ల అన్నింటిని ఒకే గాటన కట్టెయ్యక్కరలేదు. ఎక్కువ భాగం ఆ పిచ్చి ఉన్న వాడిని, వాడి కుటుంబాన్ని బాధిస్తాయి. కొన్ని పిచ్చిలు ధన, మానాలనీ హరించి, వాడిని ఏకాకిని చేస్తాయి.  మిగిలినవి సమాజంలో వారితో బాంధవ్యాలున్న వాళ్ళ జీవితాలని అతలాకుతలం చేస్తాయి.పిచ్చి(లు) మితంగా వాటి పరిమితుల్లోఉంటె సామాన్యులుగా సమాజంలోని మిగిలిన వాళ్ళతో సహజీవనం చేస్తాము.

1982లో భారతదేశంలో మనకి మొదటిసారి ఆసియా క్రీడలు జరిగాయి. మన ప్రజలు ఎక్కువమంది టీవీలు కొనుక్కొని, ఆపోటీలు చూసి బాగుపడిపోతారని కలర్ టీవీల మీద, సీఆర్టీ (CRT - cathode ray tube) పరికరాలమీద దిగుమతి సుంకం బాగా తగ్గించేశారు.  మా ఊళ్లోకి మొట్ట మొదటి టీవీ 1983 లో వచ్చింది. మాఇంట్లోకి రావడానికి మరో 6 ఏళ్ళు పట్టింది. అప్పట్లో దేశం మొత్తం మీద  నాలుగు కేంద్రాల నుంచి ప్రసారం జరిగేది. దక్షిణాదిన మద్రాసు నుంచి వచ్చే అరవ కార్యక్రమాలు సరిగ్గా అందని సిగ్నల్స్ వల్ల, ఒకళ్ళు ఇంటి మీద ఆంటిన్నా (antenna) పట్టుకుని కదిపితే, మిగిలిన వాళ్ళు కనిపించని వినిపించని అర్థం కానీవి చూసే వాళ్ళు. ఎప్పుడైనా తెలుగు సినిమా (వారానికి ఒకటి వేసేవాళ్ళనుకొంటా) వేస్తె టీవీ ఉన్న వాళ్ళ ఇల్లు జనంతో నిండిపోయేది. హైదరాబాద్ నుంచి తెలుగు ప్రసారాలు ప్రారంభం అయినా తర్వాత కథ అందరికి తెలిసిందే. దూరదర్శన్తో, మిగిలిన ప్రైవేట్ చాన్నెల్స్తో మన ప్రగతి చూసి మనం మురిసిపోవలిసిందే. టీవీలు వచ్చిన తర్వాత, వాటితో పాటు పుట్టుకొచ్చిన కార్పొరేట్ స్కూళ్ళు వాటితో మన పిల్లలలో  వచ్చిన మార్పులు అందరికి విదితమే. ఆటా లేదు, పాటా లేదు. చదువు, చదువు, చదువు. లేదా టీవీ, కంప్యూటర్, వీడియో, టాబ్లెట్ గేమ్స్ ఇవితప్ప వేరే లోకం లేదు. దీనితో పిల్లలకి మిగతా పిల్లలతో సంబంధాలు అంతంత మాత్రంగా ఉన్నాయి. 90వ దశకంలో పిల్లలుగా ఉండి  ఇప్పుడు పెద్దలైన వాళ్ళ జీవితాలే ఇందుకు నిదర్శనం.

మాకుటుంబానికి  తెలిసిన ఒక మలయాళీ క్రైస్తవ కుటుంబంలో ఇంటిపెద్ద బాగా క్రమశిక్షణతో కూడిన మనిషి. ఇంటిల్లిపాది ఆయన పెట్టిన నియమాలకు అనుగుణంగా నడిచిపోయేది. ఇల్లు, స్కూలు, చర్చి, ఇవి కాకుండా మరో చోట వాళ్ళ పిల్లల్ని చూడటం అసాధ్యం. పెద్దబ్బాయి తండ్రి ఏమి చేబితే అదే చేసే వాడు. స్కూలు పుస్తకాలు చదుకోవడం, బైబిల్ పఠనం అవే  వ్యాపకాలు.   సినిమాలు, బయట మిగతా పిల్లలతో ఆటలాడటం నిషిద్ధం. పక్కా ఆదర్శజీవి. రెండోవాడు వాళ్ళ నాన్నతో దోబూచులాడేవాడు. పదోతరగతి దాకా ఇద్దరు బాగా చదివేరు. ఇంటరులోకి వెళ్ళేటప్పటికి కొత్తగా వచ్చిన స్వతంత్రంతో రెండోవాడు దారి తప్పి సినిమాలు విరగచూసాడు. ఫలితం చెప్పుకోనక్కరలేదు. ఇటువంటి వాళ్ళు కొంతమంది పదో తరగతి దాకా నిర్బంధ హాస్టళ్లల్లో ఉండి చదివి వచ్చి, ఇంటర్లో వచ్చిన వెసులుబాటుతో సినిమాలతో కొట్టుకుపోయిన వాళ్ళు నాకు ఎరుక. పెద్దవాడు సరియైన దోవలో వెళ్లి జీవితంలో చక్కగా స్థిరపడ్డాడు. మరో స్నేహితుడున్నాడు. అతనికి ఇద్దరు పిల్లలు. స్కూల్ చదువుల్లో ఉన్నారు. వాళ్ళకి ఎక్కువ భాగం టీవీ నిషిద్ధం. కంప్యూటర్ వీడియో ఆటలు కూడా పరిమితంగా ఆడనిస్తారు. అయినా పెద్దవాడేమో ఒక్క కొలిక్కి వచ్చి మంచి కాలేజీకి వెళ్ళబోతున్నాడు. రెండోవాడు ఏదోరకంగా ఆటలవైపు తప్పించుకుపోయే ప్రయత్నాలు మానలేదు. మాకు, మాపిల్లలకి ఈబెడద తప్పలేదు.

ఇంతకి చెప్పొచ్చేదేమిటంటే ఏదైనా మితంగా ఉంటె, తింటే, చేస్తే ఇబ్బంది లేదు.  లేక పోతే  మన జీవితం చిన్నాభిన్నం అవుతుంది. ఒక్కోసారి కొన్ని విషయాలు చదివినప్పుడు మనమెటు ప్రయాణం చేస్తున్నామో అర్థం కాదు. మనలో చాలామంది చిన్నప్పుడు చీపురు పుల్లలతో, చిన్న కొమ్మల పుల్లల్తో బాణాలు చేసి ఆడుకొన్నవాళ్ళమే. సంతల్లో తుపాకీ బొమ్మలు కొనుక్కొని మిగిలిన పిల్లల్ని కాల్చినట్టు ఉత్తుత్తి ఆటలు ఆడాము. అలా అని ఇప్పుడు పెద్దవి, నిజమైనబాణాలతో, నిజమైన తుపాకులతో జనాలమీద పడి చంపట్లేదు కదా! అవే ఆటలు యిప్పుడు పిల్లలు కంప్యూటర్లలో వీడియోలలో ఆడటం చాలా ప్రమాదకరమని మనస్తత్వ శాస్త్రజ్ఞులు హెచ్చరిస్తున్నారు. ఒక తరంలో తప్పు కానిది మరో తరానికి వచ్చేటప్పటికి పెద్ద తప్పు అయ్యికూర్చుంది. మంచి చెడు ఎప్పుడు ఉన్నాయి. చెడు పాళ్ళు గతంలో కంటే ఇప్పుడు పెరిగినట్టు మీకనిపిస్తోందా? మునుపటికంటే ఆటవిక ప్రవృత్తి పెరిగినట్టనిపిస్తోందా? లోపం ఎక్కడుంది?

13 కామెంట్‌లు:

  1. మీరు కొంచం frequency పెంచాలండీ అన్యగామి గారు. బాగా వ్రాస్తున్నారు. టపాలేమో అప్పుడప్పుడే వస్తున్నాయి. ఈ కంప్యూటర్ గేమ్ లతో చెప్పేదేముందండీ. చాలా అతి అయిపొయింది. మనకి ఏదైనా మితంగా ఉండేది కాబట్టే బావుండేది. ఏకంగా addict అయిపోతున్నారు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. చంద్రిక గారు, వ్రాయాలని ఉంటుంది. బద్ధకం దాని మీద అజమాయిషీ చేస్తుంది. ప్రయత్నం చేస్తానండి. ధన్యవాదాలు.

      తొలగించండి
  2. శ్యామలీయం, వరూధిని, YVR బ్లాగులలో ఈరోజు మీరు చేసిన వ్యాఖ్యలు చూశాను. చిరకాల దర్శనం. పనివత్తిడి ఉంటుంది, అయినా మరీ ఏదో నెలకోసారి కాక వీలు చేసుకొని ఇంకొంచెం తరచుగా కనిపిస్తుండడానికి ప్రయత్నం చేయండి అన్యగామిగారు 🙂. మీకు, మీ కుటుంబానికీ వినాయక చవితి శుభాకాంక్షలు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. విన్నకోటవారు, మీ ప్రోత్సాహానికి కృతజ్ఞతలు. కామెంట్ వ్రాయటానికి ఐదు నిమిషాలే. ఏదైనా స్వంతంగా వ్రాద్దామంటే నాకు తగని బద్ధకం. నా సాకుల్ని మన్నించగలరు.

      తొలగించండి
  3. టపా తిరిగి ప్రచురించినట్లున్నారు. అయినా మంచిమాట ఎన్ని సార్లు చెప్పినా తక్కువే లెండి.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. విన్నకోట వారు, కొన్ని సవరణలు చేసి మార్పులు సేవ్ చేసినందు వల్ల జరిగింది. ఇప్పట్లో మళ్ళీ ప్రచురించే ఉద్దేశం లేదండి.

      తొలగించండి
  4. మీకు, మీ కుటుంబానికీ విజయదశమి శుభాకాంక్షలు, అన్యగామి గారూ 🌹.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ధన్యవాదాలండి. మీకు మీ కుటుంబానికి కూడా కాస్త ఆలస్యంగా.

      తొలగించండి
  5. బాగుందండి మీ టపా అన్యగామి గారూ. ఈ రోజుల్లో పిల్లలకి విడియో గేంస్ ఇవ్వకపోతే తప్పేనేమో! మిగిలిన పిల్లలు ఆ గేంస్ గురించి చెబుతూ ఉంటే వీరొక్కరే తెల్లమొహాలేస్తారు. తప్పదు... కాలానుగునంగా కొన్ని మార్పులు తప్పవు!!

    రిప్లయితొలగించండి