22, సెప్టెంబర్ 2017, శుక్రవారం

ఆమ్వే వాడు - క్రొత్త బూచాడు!

మేము కొత్తగా అమెరికా వచ్చిన రోజుల్లో (ఇది పాతికేళ్ల క్రితం సంగతి),  మా సీనియర్లు ఏది చెయ్యాలో ఏది చెయ్యకూడదో చెప్తుండేవాళ్లు. బయటకెళ్ళినపుడు ఎవరైనా ఇండియన్స్ మీ దగ్గరకి వచ్చి పరిచయం చేసుకుంటే కొంచెం పరాక్కుగా ఉండమని హెచ్చరిస్తుండేవాళ్లు. కొన్ని విని ఆచరించే వాళ్ళం, కొన్నేమో వీళ్ళేదో మనకి కథలు చెప్తున్నారని నవ్వి ఊరుకొనేవాళ్ళం.  విద్యార్థులుగా ఉన్నప్పుడు చేతిలో డబ్బులాడక గుట్టు చప్పుడు కాకుండా ఉండేవాళ్ళం. పనిలో పని ఎక్కడికైనా వెళ్ళినపుడు ఎవరైనా భారతీయ మొహాలు (అమెరికాలో దేశీలు, ఫిరంగులు అన్నవి ప్రాచ్యులు, అప్రాచ్యులు అన్నవాటికి సమానార్థాల్లో వాడే పదాలు - మాయాబజారులో అస్మదీయులు, తస్మదీయులు లాగ) కనిపిస్తే మొహం వాచిపోయి ఏదో విధంగా మాటలు కలిపేవాళ్ళము. అందునా తెలుగు మాట వినిపిస్తే పరవశించి పోయి,  వాళ్ళని పరిచయం చేసుకొని కాసేపు మాట్లాడి వెళ్ళేవాళ్ళం. అందువల్ల కాస్త బెంగ తీరినట్టుగా అనిపించేది.

చదువులయ్యాయనిపించి, కొంత కాలం ఉద్యోగాల వేట తర్వాత ఒక క్రొత్త పట్టణంలో ఏదో ఉద్యోగంలో ఇరుక్కున్నాను. అప్పుడు చేతిలో కారు, డబ్బులుండేటప్పటికి తిరగడం మొదలెట్టాను (జల్సాల కోసం కాదు, కొంత ఏమి తోచక, కొంత క్రొత్త స్నేహాలు ఇంకా కుదరక). అలా ఒక్కొక్కసారి మాల్స్ వైపు వెళ్లి ఏమి కొనకుండా తిరిగిరావటం జరిగేది. ఇది పూర్తిగా విండో షాపింగ్ కూడా కాదు. ఏదో  కాలక్షేపానికి తిరగడం, ఆకలి వేస్తె ఏదోఒకటి కడుపులోకి పంపటం, కాలాన్ని చంపడం (కిల్లింగ్ టైం, విచిత్రం కాకపోతే కాలం నన్ను చంపుతుంది కానీ నేను దాన్ని చంపటం ఏమిటి?), లేకపోతే  ఏదో ఒక ఇంగ్లిష్ సినిమా చూసి వెనక్కురావటం జరిగేది. అప్పుడప్పుడు క్రొత్త నేస్తాలు ఎవరైనా కూడా ఉండేవాళ్ళు.

ఇలా బయటికి వెళ్లిన ఒకానోక సందర్భంలో, ఒక దేశీ ఒకానొక మంగలి షాపులో కనిపించాడు. మా సంభాషణ ఇలా ఇంగ్లీషులో కొనసాగింది.  వీడు క్రొత్త బూచాడు

అజ్ఞాత: Hi! how are you?
నేను: Good! how are you?
అజ్ఞాత:You look familiar. Did I meet you before?
నేను: No, I have not met you before.
అజ్ఞాత: Oh, ok, I am sorry. You look similar to someone I know. Anyway, my name is Sudhakar and I work for Amex.
నేను: I am Anyagaami and I work for MSS.
అజ్ఞాత: We should meet for tea at my home.
నేను: Sure, we can.

ఇద్దరం ఒకళ్ళ ఫోన్ నెంబర్ మరొకరికి ఇచ్చుకుని అక్కడి నుంచి పనైనా తర్వాత వెళ్ళిపోయాము.  ఒక రోజు అతను కాల్ చేసి, నీకు డబ్బులు బాగా సంపాదించే ఉద్దేశం ఉందా అని అడిగాడు.  ఉందన్నాను. అయితే నా దగ్గర ఒక గొప్ప వ్యాపారానికి సంబంధించి
ఒక రహస్యం ఉంది. నువ్వు మన దేశంవాడివి కాబట్టి నీకు చెబుతాను అన్నాడు. సరే క్లుప్తంగా వ్యవహారమేమిటి అని అడిగాను. నేనొక కంపెనీకి ప్రతినిధి క్రింద పనిచేస్తున్నాను, వాళ్ళు తయారు చేసే నిత్యావసర వస్తువులు నీకు తెలిసిన వాళ్లకి అమ్మి, వాళ్ళని కంపెనీసభ్యుల క్రింద చేర్పించాలి. ప్రతి వస్తువుకి, ప్రతి సభ్యుడికి కంపెనీ కొంత మొత్తం తిరిగి నీకు చెల్లిస్తుంది.  ఆ పని సరిగ్గా చేసుకొంటూ వెళితే, నెలకి అరవై వేల డాలర్లు  దాకా సంపాదించవచ్చు అని చెప్పి ఎవరో కొంత మంది పేర్లు కూడా చెప్పాడు. మనం చేర్పించిన వాళ్ళు మరికొంత మందిని చేర్పించి, మరిన్నీ వస్తువులు అమ్మితే ఇంకా మనం జీవితంలో పని చెయ్యక్కరలేదు. ఊరికినే కూర్చొని డబ్బులు లెక్కపెట్టుకోవడమే అని అరచేతిలో వైకుంఠం చూపెట్టాడు.

ఇటువంటి కథ నా సీనియర్లు ముందే చెప్పటం వల్ల, నేను ఏదో కారణం చెప్పి తప్పించుకొన్నాను. కథ తాలూకు స్క్రిప్ట్ ఇంచుమించుగా అదే బాణీలో సాగుతుంది. నిన్నెక్కడో చూసాను, లేదా నువ్వు ఇంతకూ ముందే నాకు తెలుసు తరహా. కానీ వీళ్ళ లోగుట్టు తెలియని వాళ్ళు, చదువుకొన్న వాళ్లు కూడా ఈ ఉచ్చులో ఇరుక్కుని విలవిలలాడినవారు నాకు తెలుసు. ఈ చిత్రాలన్నింటికి మూలవిరాట్టు కంపెనీ - ఆమ్వే (Amway). ఆ తర్వాత కాలంలో ఇది ఇండియాలో కూడా వ్యాపారం మొదలెట్టింది. దీన్ని పోలిన కంపెనీలు కూడా వీధికి  రెండు చొప్పున బయలుదేరాయి. మాబంధువులావిడ ఒకరు దీంట్లో చేరి మా అమ్మానాన్నలని బలవంతము చేసి మొహమాట పెట్టి, కొన్ని వస్తువులమ్మింది. కొన్నాళ్లయ్యాకా జనాలు తెలివిమీరి ఆవిడకి డబ్బు ఎక్కొట్టటం మొదలెట్టారు. దాంతో ఒక మంచి రోజు చూసుకొని  ఆవిడ ఆ వ్యాపారం కాస్తా మూసేసింది.  ఇలాంటి గొలుసుకట్టు, పిరమిడ్ వ్యాపారాలు ఎన్ని ప్రజలని మోసం చేసినా, ఎన్ని కేసులు వేసినా, కంపెనీ స్థాపకులు దివ్యంగా వెలిగిపోతుంటారు (విజయ మాల్యా లాగ). సామాన్యులు ఇల్లు గుల్ల చేసుకొంటారు. ఎంతైనా మనిషిలో ఆశ ఎంత చెడ్డదో? అందుకని ఎవరైనా సులభంగా డబ్బులు దొరికే మార్గం చెప్తామంటే అక్కడి నుంచి వెంటనే మాయమవ్వండి లేదా వారి చేతిలో మీరు మాయమవటం ఖాయం. 

6 కామెంట్‌లు:

  1. ఆమ్వే 🙂. ఓ మల్టీ-లెవెల్ మార్కెటింగ్ భూతం 🙂.
    ఓ బ్లాగ్ లో చదివానండీ - బ్లాగర్ / బ్లాగ్ పేరు జ్ఞాపకం రావడం లేదు (మహిళా బ్లాగర్ అనీ, మీ దేశంలోనే Ohio రాష్ట్ర నివాసి అనీ లీలగా గుర్తు . ఎందుకంటే ఆ బ్లాగ్ పోస్ట్ లో గుడి ప్రస్తావన వస్తుంది, ఆ గుడి Dayton Ohio temple అని బ్లాగర్ పేర్కొన్నట్లు గుర్తు). అమెరికాలో ఉంటున్న ఆమె (బ్లాగర్) దగ్గరకు ఆమె తల్లిదండ్రులు వెడతారు. తండ్రిగారు మహా స్నేహాభిలాషి. ఆ ఊళ్ళో వెళ్ళిన ప్రతి చోటా ఎవరైనా తెలుగు మొహాలలాగా కనిపిస్తే పలకరించడానికి ప్రయత్నించేవారట, వాళ్ళు మొహం తిప్పుకుని పక్కకు వెళ్ళిపోయేవారట. ఈయనను చూసి ఒకాయన తనే వచ్చి పరిచయం చేసుకున్నాడట. తరవాత తెలిసిందట అతను ఆమ్వే ఔత్సాహికుడు అని. దాంతో బ్లాగర్ తండ్రి గారికి బోధపడిందట తను పలకరించబోతే ఎందుకు తప్పించుకుంటున్నారో. ఆ తరవాత బ్లాగర్ తండ్రి గారు వినూత్నంగా ఆలోచించి, మర్నాడు గుడికి వెళ్ళినప్పుడు "మేం ఆమ్వే మనుషులం కాదు" అని వ్రాసి తెచ్చుకున్న బోర్డొకటి ఎత్తి పట్టుకుని జనాల్ని పలకరించారట. ఆ ఐడియా చూసి చాలామంది అభినందించారట కూడా 🙂

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. విన్నకోట వారు, మీకున్న పరిజ్ఞానంతో మీరు నాలాంటి వల్ల కోసం ఎంతైనా వ్రాయవచ్చు. ఈ విషయం నాయెఱుకలోకి రాలేదండి. ఏదైనా మంచి విషయం పంచుకున్నందుకు ధన్యవాదాలు.

      తొలగించండి
  2. ఈ పిచ్చ్చి ఎధవలు ఈ మధ్య అతి తెలివి చూపిస్తున్నారు . ఆమ్వే అంటే రావడం లేదని , స్టార్టుప్ ఐడియా ఉంది , ఇన్వెస్ట్మెంట్ ఏమి వద్దు , మీ knowledge చాలు అని చెప్పి మీటింగ్ లకి పిలుస్తున్నారు . నేను బెంగుళూరు లో ఇలానే మోసపోయా . కోరా లో చదివా , ఎవడో hcl లో పెద్ద పొసిషన్ , స్టార్టుప్ పెడుతున్న అని మీటింగ్ కి పిలిచాడంట .

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అనానిమస్, మనం అప్రమత్తంగా లేనంత కాలం మనల్ని గొర్రెలు చేయటానికి చాలా మంది ప్రయత్నిస్తారు. ధన్యవాదాలు.

      తొలగించండి
  3. చాలా కాలం‌ క్రిందటి మాట.
    ఒకడు టీ-షర్టు మీద AMWAY - NOWAY అని ప్రింటు వేయించుకొనీ తిరిగాడని.

    అప్పట్లో నేనూ ఈ AMWAY కహానీ బారిన పడినంత పనీ ఐనది. సకాలంలో మేలుకొన్నాను. కొంతమందిని ఆమ్వే పిచ్చివాళ్ళ బారిన పడకుండా పోరాడి మరీ సాధించాను.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శ్యామలీయం గారు, మీరు అదృష్టవంతులు. వీళ్ళు పెట్టే మొహమాటానికి ఇరుక్కున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎలాగో మీరు కొంతమందిని కాపాడినడి విశేషమే! ధన్యవాదాలు.

      తొలగించండి