29, నవంబర్ 2017, బుధవారం

Aping the whites

ముందుగా శీర్షికని ఇంగ్లీషులో వ్రాసినందుకు ఏమి అనుకోకండి. తెల్లవాళ్ళని మక్కికి మక్కి అనుకరించడానికి అని చెప్పటానికి వచ్చిన తిప్పలవి. తెలుసుకొన్న కొన్ని సంగతులు యేభాష సరిగ్గా రాని నాలాంటి వాళ్ళు తెలుగులో చెప్పాలని అనుకోవటం సాహసం అనిపిస్తుంది, అంతలోనే వ్రాయాలన్న పూనిక ముందుకు నడిపిస్తూ ఉంటుంది.  ఆ ప్రయోగం యేభాషలో మొదట నాకు తెలిసిందో దాన్నే యథాతధంగా వాడటం మంచిదనిపించింది. ముఖ్యంగా ఒక భాషాప్రయోగం మూలం తాలూకు అర్థం, బలం, ప్రభావం ఏమాత్రం చెడకుండా, తగ్గకుండా చెప్పాలంటే  అదే భాషలో అవే పదాల సముదాయంతో చెప్పటమే ఒక్కోసారి సరైన మార్గం.

పూర్వము ఏకొద్దిమందో తప్పితే, ఎక్కువమంది ఏ ఊరిలో పుడితే ఆవూరులోనే పెరిగి, అక్కడే జీవితమంతా గడిపి అక్కడే తనువు చాలించటం జరుగుతూ ఉండేది. బహుశా గ్రామాలలో స్వయం సమృద్ధి వల్ల  బయటికి వెళ్లే అవసరం ఉండేది కాదేమో! ఆ తర్వాత కొంత కాలానికి తాలూకా పరిధిలో, జిల్లా పరిధిలో వ్యవహారాలు నడిచేవి. ఆతర్వాత మెల్లగా రాష్ట్రస్థాయికి చేరుకొన్నాయి. మెల్లగా బ్రిటిష్ వాళ్ళ పుణ్యామా అని, బస్సులు, రైళ్లు ఏర్పడి, ప్రజల తిరిగే సామర్థ్యం పెరిగి అన్ని చోట్లకి వెళ్ళటం, ఇతర ప్రాంతాల అలవాట్లు నేర్చుకోవటం, వాటిని వారి స్వంత ప్రాంతాలలోకి తీసుకురావటం జరిగాయి. దీంతో మార్పు అనివార్యమయింది. అన్ని మార్పులు మంచివే అయితే నేనిది వ్రాయనక్కరలేదు. ప్రస్తుత పరిస్థితులలో ప్రపంచం అన్ని విధాలుగా చిన్నదవుతోంది. దూరాలు దగ్గరవుతున్నాయి. ఎక్కువ భాషలు నేర్చుకొనే అవకాశాలు పెరిగి, నేర్చుకొనే వాళ్ళు పెరుగుతున్నారు. వాటితో అనేక దేశాలకి వెళ్లే అవకాశాలని సద్వినియోగం చేసుకొనే వాళ్ళు పెరిగారు. అక్కడికి వెళ్లి స్థిరపడి, ఉద్యోగాలు వ్యాపారాలు చేసేవాళ్ళు పెరిగారు.  అక్కడి వాళ్ళు ఇక్కడికి, ఇక్కడ వాళ్ళు అక్కడికి వెళ్లడం రావడం మామూలయిపోయింది. అన్ని దేశాల తినుబండారాలు అన్ని దేశాల నగరాల్లో, పట్టణాలలో, ఇప్పుడు చిన్న ఊళ్ళలో అందుబాటులోకొచ్చాయి. అలాగే కట్టే బట్టలు, ఫ్యాషన్లు, పాషన్లు, తినే తిళ్ళు, చదివే చదువు, నాగరికత అన్ని ఈరాకపోకలతో ప్రభావితం అవటం మొదలయ్యాయి. చాలా మార్పులు స్వాగతించదగ్గవే. కొన్ని మాత్రం తప్పని సరిగా అభ్యంతరకరమే.

పశ్చిమదేశాలలో  చాలా చోట్ల స్వతంత్రం హింస సహాయంతో సంపాదించినది. వాళ్ళ దైనందిన విషయాల్లోనూ, దృక్పథంలోనూ చాలా విషయాలు దానితోనూ, మధ్య యుగాలలో వాళ్ళ మతంలో వచ్చిన మార్పులతోను బాగా ముడివేసుకొన్నాయనిపిస్తుంది.  తెల్లవాళ్ళకి కుటుంబవ్యవస్థ లేదు, వాళ్ళకి పెళ్లి మీద నమ్మకం లేదు, వాళ్ళకి చదువు రాక మన వాళ్ళని ఉద్యోగాలలోకి తీసుకొంటున్నారు,  వాళ్ళకి స్వప్రయోజనం తప్ప మరోటి లేదు, వాళ్ళు పచ్చి మాంసం తింటారు, ఎప్పుడు మద్యం మత్తులో ఉంటారు, పిల్లల పెంపకంలో జాగ్రత్తలు తీసుకోరు ఇలా మరికొన్ని అభిప్రాయాలు చాల మంది భారతీయుల్లో తరచూ వింటూ ఉంటాము. ఈమాటలు పూర్తిగా సత్యం కాదు. ఎందుకంటే ఈ తరహా ధోరణులు మన సంఘంలోనూ  (ఆమాటకొస్తే అన్ని సంఘాలలోనూ, అన్ని దేశాలలోను, అన్ని వేళల ఉన్నాయి, ఉంటాయి, ఎక్కువ తక్కువలే తేడా) ఉన్నాయి. కాకపోతే నిష్పత్తుల విషయంలో వాళ్ళు మనకంటే కాస్త ఎక్కువ చెడు వైపే ఉన్నారు.  బయట నుంచి మనం చెడు ఎంత ఉందనుకొంటున్నామో, లోపల అంతకు కొన్ని రెట్లు మంచి కూడా ఉంది. అన్నిటిలోకి ముఖ్యంగా న్యాయము, చట్టము సంఘంలో ఉన్నసామాన్యులు అందరికి అందుబాటులో ఉండటం విశేషమైన సంగతి. ఇదికాకుండా, అన్య మతాలు, దేశాలు, తెగల వారిని గౌరవించటం, ప్రక్కనవాళ్ళకి సహాయం చేయటం, యోగ్యత ఉన్నవాళ్ళని అందలం ఎక్కించటం, పరిసరాల పరిశుభ్రత, ఆస్తుల పరిరక్షణ, ప్రజలకి సంబందించిన అన్ని ప్రభుత్వ విషయాలని పారదర్శకంగా ఉంచటం, ఎంతటి వారినైనా సహేతుకంగా విమర్శించే  హక్కు, ఎంతటి వారి నైనా తప్పు చేస్తే కోర్టుకి లాగి న్యాయ విచారణ చేయటం, ప్రభుత్వ కార్యాలయాలలో పనులు పద్దతి ప్రకారం జరగటం జరిపించుకోగలగటం, అధికారంలో ఉన్నవాళ్ళని చూసి ప్రజలు భయపడకపోవటం లాంటివి కొన్ని. వీటిలో కూడా గతకొద్ది సంవత్సరాలుగా కొంత మార్పు వస్తోంది. దురదృష్టవశాత్తు అది చెడువైపుకి పయనం కావటం గమనించవలసిన విషయం. చెడు గురించి ఎంతైనా చెప్పొచ్చు, కానీ అది ఈ వ్యాసానికి ప్రస్తుతం అవసరం కానందున, అలాగే మన మీడియా నిత్యం ఊదరగొట్టేస్తుంది కాబట్టి దాన్నివదిలేస్తున్నాను.

ఇక మనవాళ్ళ దగ్గరకొద్దాము. ముందే అన్నట్టు ఈ విచారణ హెచ్చుతగ్గుల మీదే కానీ పూర్తిగా ఉన్నాయా లేదా అన్న చర్చ గురించి కాదు.  మనకి వేరే వాటితో ప్రమేయం లేకుండా మనవైనవి మాత్రమే అయిన సమస్యలు చాలా ఉన్నాయి. వీటికి తోడు పశ్చిమంనుంచి దిగుమతి చేసుకొని మనకి హానిచేస్తున్న వాటి గురించి ముచ్చటించుకుందాము. అమ్మ దినం, నాన్న దినం, ప్రేమికుల (వాలెంటైన్స్) దినం ఇవన్నీ మనకు కావలసిన దినాలా? పొద్దున్న లేస్తే  మనకి అమ్మని, నాన్నని తలుచుకొని రోజుంటుందా? ఇప్పుడున్న సాధనాల సహాయంతొ, యెంత దూరంగా ఉన్నా వారానికోమాటు వాళ్ళతో మాట్లాడతాము కదా! చక్కగా మంచి, చెడు చూసి పెళ్లిళ్లు చేసే చోట, సహజీవనము, డేటింగ్, పెళ్ళికి ముందు ప్రేమలు మన సంఘానికి అవసరమా? తుమ్మితే ఊడిపోయే ఈ సంబంధాలలో మళ్ళీ ప్రేమికుల దినము ఒకటి పెట్టుకుని పండగ చేసుకోవటం అర్థరహితం. వీటి మూలంగా కుటుంబ సంబంధాలు దెబ్బ తిని, వీధికెక్కి కొట్టుకుని ఆపై కోర్టులకెక్కే వాళ్ళు తరచూ మనకి తారసపడుతూనే ఉంటారు. పొరపాటున ఈతరహా ప్రేమికుల మధ్య పెళ్ళయితే, పెళ్లయినంత త్వరగాను విడాకుల లైన్లలో నిలబడుతున్నారు. ఈ పాపం ఎవరిది? సినిమా వాళ్ళు నిత్యం జనాలకి ఏదో ఒక  క్రొత్త వింత చూపెట్టడం అనే పరిశ్రమలో ఉన్నారు కాబట్టి, మనకి అతికినా అతకక పోయినా ఏదో ఒకటి చూపెడుతుంటారు. అది తెలియని యువత గుడ్డిగా అనుకరించి ప్రమాదాల్ని కొని తెచ్చుకుంటున్నారు. ఉదాహరణకి తలల మీద జుట్టుని రకరకాలుగా తరిగి, వింతైన ఆకారాలతో వెళ్లే మగ కుర్రకారుని నేను హైదరాబాద్ లో చూసాను. ట్రాఫిక్ పోలీసులకి వీళ్ళని చూస్తే బకరా దొరికిందని ఆపడం కొన్ని సార్లు చూసాను. ఆపిన తర్వాత కథ మీకు సుపరిచితం. ఇంకా చాలీ చాలని బట్టలతో బయటికి వచ్చే వాళ్ళు, వాళ్ళని చూపులతో తడిమేవాళ్ళు, వీటితో ఇబ్బందులలోకి  వెళ్లే వాళ్ళు, అఘాయిత్యాలకు గురయ్యేవాళ్ళు  కోకొల్లలు.  అలాగే ఈ అవతారాలతో గుళ్ళల్లో ప్రత్యక్షం, ఇంకేముంది ఆపైన చెప్పుకోవడానికి?  తిండి దగ్గరకొద్దాం. ఇంట్లో తాజాగా కూరగాయలతో ఆరోగ్యకరమైన పదార్థాలు చేసుకొని తినటం అతిత్వరలో అంతరించిపోయే కళల్లో ఒకటి. లడ్లు, సున్ని ఉండలు, కాజాలు ఇలాంటి తినుబండారాలన్నీ మోటు, బోరు. బర్గర్లు, పీజ్జాలు, చాకోలెట్లు, కూల్ డ్రింకులు ముద్దు. దీనికి తోడు వేళాపాళా లేని ఆహారపుటలవాట్లు ప్రబలుతున్నాయి. దీంతో అరవై, డబ్భై సంవత్సరాలలో వచ్చే రోగాలు ఇరవైల్లోనే వచ్చి, మిగిలిన జీవితాలు మందులతో లాగించవలసివస్తోంది. ఇవాళ ఫైనాన్సియల్ ఎక్సప్రెస్లో ఒక వార్త వచ్చింది.  రోడ్ల మీద తినే తిళ్ళలో బర్గర్లు, సమోసాలలో ఏది మెరుగన్న విషయం పరిశీలించి,  రసాయనాలు వాడి నిల్వవుండేలా చేసే బర్గర్ల కన్నా దేశీసమోసాలు ఆరోగ్యానికి మంచివని తేల్చారు. పెరిగే రోగాలతో వచ్చే జనాలని రక్షించటానికి ఉద్యోగులు, మందులు, వైద్యం ఇతరాత్రా రూపేణా ప్రభుత్వం ఎంత ఖర్చు చేయాలో ఆలోచించండి.  వీటిలో చాలా మటుకు మనం అరువుతెచ్చుకున్నవి. ఇవి మన జీవితచట్రంలో సరిగ్గా ఇమడనివి.  నేను స్పృజించినవి కొన్నే, అయినా ఇవి చాలు ప్రమాదఘంటికల తీవ్రత తెలియచేయడానికి.

మన పూర్వులు దార్శనికులు, ముందు చూపుతో మనకున్న పరిస్థితులకు అనుగుణంగా కొన్ని పద్దతులను ఏర్పాటు చేశారు.  మన వాటికి దూరం జరుగుతూ, పశ్చిమ/తెల్ల వాళ్ళ  పద్దతులకు  దగ్గరయి వాటిని గుడ్డిగా అనుకరిస్తే మన భవిష్యత్తు ఆగమ్యగోచరంగా తయారవుతుంది. మంచిని ఎవరి  నుంచైనా,ఎక్కడి నుంచైనా గ్రహించడంలో అభ్యంతరం ఉండదు. తెలిసి మనకి అక్కరకు రాని వాటిని స్వీకరించటంలో అంతరార్థం అర్థం అవ్వదు.  వ్యక్తి స్వతంత్రం కంటే సమాజ శ్రేయస్సు, ప్రజాభద్రత ముఖ్యమనుకొన్న భారతీయ సమాజానికి ఇవన్నీ మునుముందున్న పెను సవాళ్లు. మనం మేలుకుని ఈవిపత్తు నుంచి తప్పించుకొనే ఉపాయం చేయకపోతే భారతీయ సంస్కృతీ అనేది క్రీ.శ. 2000 ప్రాంతంలో ఉండేదట అనే  కాలం ఎంతో దూరంలో లేదు.

3 కామెంట్‌లు:

  1. మోడల్లు సినీతారలు ఫోటో షూట్ పేరుతో పరమ అసభ్యకరంగా అంగప్రదర్శన చేయడం వల్లే అత్యాచారాలు పెరిగిపోయాయి. పైగా నా బాడీ నా ఇష్టం అనడం. వీల్లను చెప్పులతో కొట్టాలి అన్నట్టు. జబర్దస్త్ లాంటి నీచ నికృష్టమైన బూతు కార్యక్రమాలు.. ఛీ పరమ రోతగా తయారయ్యింది. సమాజంలోకి బూతును విచ్చలవిడిగా నిస్సిగ్గుగా చొప్పిస్తున్నారు.

    రిప్లయితొలగించండి
  2. అమ్మ దినం, నాన్న దినం, ప్రేమికుల (వాలెంటైన్స్) దినం ఇవన్నీ మనకు కావలసిన దినాలా?
    -----------------------
    ఇవన్నీ ఎవరు ఆమ్మో ఎవరు నాన్నో ఎవరు ప్రియురాలో తెలుసు కోవటానికి పెట్టిన 'రోజులు'. ఎందుకంటే ప్రతీ వాళ్ళకీ వాళ్ళు చాలా మంది ఉంటారు కనుక.
    అమెరికాలో అసలు బుద్ధిమంతులు చదువుకుని పెద్ద పెద్ద విశ్వ విద్యాలయాల్లో (హార్వర్డ్ , MIT వగైరా) లో చదువుకుని దేశాన్ని పాలిస్తారు. వీళ్ళని మనము అనుకరించాలి గానీ ఉపయోగం లేని పనికి మాలిన వాటిని అనుసరిస్తే ఒరిగేదేమిటి?

    వ్యాసం చక్కగా వ్రాశారు.

    రిప్లయితొలగించండి
  3. అజ్ఞాత, రామకృష్ణారావు గారు ధన్యవాదాలండి.

    రిప్లయితొలగించండి