7, ఫిబ్రవరి 2017, మంగళవారం

సినిమాకొస్తా మామ.......... అమెరికాలో

సినిమాల పిచ్చి మనకున్నంతగా (భారతీయులకి)  మరే జాతీయులకి ఉండదేమో! అందునా ఈమధ్యన తెలుగువాళ్ళ పిచ్చి ఒక మెట్టు పైనే ఉన్నట్టుంది. నేను వారిలో నుంచి వచ్చినవాడినే కాబట్టి నాకింకొంచెం ఎక్కువే ఉంది. దీనికి ఉదాహరణలు కావాలని మీరెవరు అడగరు అని నాకు తెలుసు. అయినా కొన్ని చూపెట్టటం ద్వారా నేను చెప్పదలచుకున్నది ఇంకాస్త బాగా చెప్పగలనేమో అన్న ప్రయత్నం ఇది. ఆన్లైను పత్రికలూ చూడండి, ఫలానా వారి ఆడియో ఫంక్షన్కి అడ్డబాబు గారొచ్చారు, ఫలానా వారి వీడియో ఫంక్షన్కి నిలువుబాబు గారొచ్చారు,  ఇది హెడ్లైన్ న్యూస్. సరే పత్రికల వాళ్ళకి సర్క్యూలేషన్ అవసరం, పైపెచ్చు ఉచితంగా చదువుకోనిస్తున్నారు కాబట్టి పత్రికల వాళ్ళని వదిలేద్దాము. పాపం ప్రింటులో  వచ్చే దిన, వార, మాస పత్రికల్లో విషయాలు ఇంతకంటే గొప్పగా ఏమి లేవు. బ్లాగ్గులలో ఎక్కువ మంది చూసేవి, చదివేవి సినిమా కబుర్లున్నవే. తమాషా ఏమిటంటే ఇవి క్రొత్త వార్తలు కూడా కాదు, పత్రికలనుంచి తీసుకొన్నవే. సినిమా తారల వ్యాఖ్యలు, బొమ్మలు, బట్టలు, మాటలు వాటికి దొరికే ప్రాచుర్యం, వారిని అనుసరించి అనుకరించే యువకులు, నాలాంటి వృద్దులు కోకొల్లలు. ఇక మన ఎంటర్టైన్మెంట్, మన పాపులర్ కల్చరు  అంతా  కూడా సినిమాల చుట్టూ పరిభ్రమిస్తుంటాయి. ఇప్పుడు కవులు, సాహితీవేత్తలు సినిమాకి ఉపయుక్తంగా ఉంటే వెలుగులోకొస్తున్నారు, లేకపోతే విశ్వవిద్యాలయాలలో ఎవరికి అక్కరలేని, తెలియని, తెలుగు ఉపాధ్యాయులకింద మిగిలిపోతున్నారు. ఇది సినిమా తప్ప ఇతరరంగాలలో పని చేసే ప్రముఖులందరికి వర్తిస్తుందేమో? నేను చెప్పదలచుకొన్న కథ ఇది కాదని మీకు తెలిసిపోయింది.

అమెరికాలో సినిమాల గురించి గతంలో కొన్ని వ్యాసాలు బ్లాగుల్లో వచ్చాయి. సరే వాటి రచయితలు కొన్ని సంగతులు చెప్పటానికి మొహమాటపడినట్టున్నారు. నేను, మా ఆవిడ, ఇద్దరు పిల్లలు కలిసి మొన్న శనివారం "నేను లోకల్" అన్న నాని సినిమా చూడటానికి వెళ్ళాము. సాయంత్రం 6గంటల ఆటని చూడాలనుకున్న మేము 5:45 కల్లా హాలుదగ్గరకి చేరుకున్నాం. ఎక్కడ లైన్లు లేకపోవటం వల్ల టిక్కట్లు సులభంగా కొనుక్కుని గబగబా లోపలికెళ్ళాం. సినిమా ప్రదర్శిస్తున్న థియేటర్ చిన్నది. కొన్ని థియేటర్లలో టిక్కెట్టుపైన ముద్రించిన నెంబరుగల నిర్దేశించిన సీట్లలో కూర్చోవాలన్న నియమం ఉన్నా, అన్ని థియేటర్లలో  లేదు. వెనకాల ఉన్న వరుసల్లో కొన్నిసీట్లు  నిండిపోయాయి, మిగిలిన ఖాళీలలో రుమాలు. ఇదొక  ఫార్సు. దీని వివరణ తర్వాత చెప్తాను. ముందు మూడు వరుసల్లో సీట్లు మాత్రమే మిగిలాయి. మాకు ముందు సీట్లలో సినిమాచూడగలిగే శక్తిలేదు. వెనకాల సీట్లలోని ఖాళీ వాటిని బెదిరించో, దేబిరించో అందిపుచ్చుకొని సామర్థ్యం లేదు. అందుకని వెనక్కొచ్చి, టిక్కెట్లు తిరిగిచ్చేసి, 9:20 గంటల ఆటకి మళ్ళి టిక్కెట్లు కొనుకొన్నాము. అక్కడ నుంచి బయటపడి, వారానికి కావలసిన నిత్యావసరాల షాపింగ్ పూర్తి చేసుకొని, ఒక రెస్టారెంట్లో కడుపునింపుకొని, మళ్లీ 8:20 కల్లా హాలుదగ్గరకొచ్చేసి, లైనులో నిలబడ్డాము. 8:40కి లోపలి పంపించారు, హాలులో మొట్టమొదట వెళ్లిన వాళ్ళము మేమే. చివరి నుంచి ఒక వరుస వదిలి, దాని తర్వాత వరుస మధ్యలో నాలుగు సీట్లు ఎంచుకుని కూర్చున్నాము.  9:20కి ప్రదర్శన అందరికి మొదలైంది, దాని వెనువెనకాలే నాకూ సినిమా మొదలైంది.

చివరి వరుసలో ఉన్న సీట్లు గోడకి ఆనిచ్చినట్టుండం వల్ల వాటి నడుముభాగం కదలదు. మిగిలిన అన్నివరుసల్లో వెనక్కి ఆనుకుని, కూర్చొనే వీలు ఉంది (recliner) పడక కుర్చీలోలా. సినిమా మొదలవ్వటానికి ముందు ఒక మనిషి మావెనక వరుసలో కొన్ని సీట్ల మీద రుమాలు వేసి, కొన్ని ఫోన్ కాల్స్ చేసి ఎవరినో పిలిచి ఏసీట్లు తాను దాచేడు చెప్పాడు. ఈలోపల ఆమనిషి బయటికి వెళ్లి వచ్చి, తన అనుంగు జనాలని వాళ్ళ వాళ్ళ సీట్లలో చేర్చి తాను మాత్రం నా వెనకాల సీట్లో  చేరాడు. వాళ్లలో కొంత మంది పిల్లలున్నారు, యేవో కావాలంటున్నారు, అటు ఇటు తిరుగుతున్నారు. నా సీటుని వెనకాల వైపునుంచి తగులుతూ నడుస్తున్నారు. పిల్లలు కాబట్టి వాళ్ళ గురించి వేరే ఏమీ ప్రత్యేకంగా చెప్పుకోవటానికి ఏమి లేదు.  నేను కూడా వెనక్కి తల తగలకుండా కూర్చున్నాను. సినిమా మొదలైన తర్వాత, తల ఆనించి కూర్చున్నాను. వెనక మనిషి కాళ్లతో తన పని మొదలెట్టాడు. కాళ్ళు కదిపినప్పుడల్లా తల సీటుకి తగిలి అదురుతోంది. రెండు మూడు సార్లు వెనక్కి తిరిగి చూసేను, ఏమైనా అర్థం చేసుకొంటాడేమో అని. ఖచ్చితంగా దున్నపోతు అంశతో పుట్టిన మనిషి, ఏమి పట్టనట్టు తన పని తాను చేస్తున్నాడు. కొంత సేపైనా తర్వాత, "మీ కాలు నా సీటుకి తగులుతోంది, వెనక్కి తీసుకోండి " అని చెప్పాను. ఒక నిమిషం తర్వాతా మళ్ళి  కథ మామూలే. ఇంటెర్వల్లో మెల్లగా అదే విషయం చెప్పా.  ముందే చెప్పినట్టు దున్నపోతు కదా, "నాకాళ్ళు ఏమి నీ సీటుకి తగల్లేదు, నీ సీటే వెనక్కి వచ్చి నాకాళ్ళకి తగులుతోంది, మిగిలిన వాళ్ళ ఎవరి సీట్లు వెనక్కి రావట్లేదు చూడు" అని దబాయింపు. భర్తృహరి చెప్పిన్నట్టు మూర్ఖుల మనస్సు రంజింపచేయాటానికి నేనెంత వాణ్ని. సినిమా మిగిలిన భాగం అదే విధంగా కొనసాగిందని  తెలియచెయ్యటానికి చాలా సంతోషిస్తున్నాను. ఎందుకంటారా, అదంతే. సినిమా రెండో భాగంలో నాభార్యకి ఇదే అనుభవం అయ్యిందిట, ఇది ఆ దున్నపోతు పనో లేక ఆపక్కనున్నవాళ్ళ పనో చీకట్లో ఆ పెరుమాళ్ళకెరుక.

ఇందుమూలంగా మీకందరికీ తెలిజేయునది ఏమనగా, మన తెలుగు సోదరులు ఏదేశమేగినా, ఎందు కాలిడినా దాన్ని భ్రష్టు పట్టించగలరు అనటానికి పైనచెప్పినది ఒక చిన్న ఉదాహరణ.  ఆమాత్రానికే ఎన్ని లేసి మాటలంటున్నావంటారేమో? ఇంకొన్ని కబుర్లున్నాయి, వాటిని మీతో పంచుకొంటాను. బాహుబలి సినిమా రిలీజ్ అయ్యిన రోజుల్లో దానికి ఇలాగే కుటుంబం అంతా ఒక గంట ముందు సినిమాహాలుకి వెళ్ళాము. టిక్కెట్లు తీసుకొని, లైనులో నుంచున్నాము (గంట ముందు).  మా ముందర, ఒక 30, 40 మంది ఉండి ఉంటారు. లోపలి వెళ్లేసరికి,  వెనకాల వరుస సీట్లలో కొద్ధి మంది ఉన్నా, ఖాళీ వాటి మీద రుమ్మాలు  ఉంది. నిజంగా ఉందనుకునేరు, కాదు. ఇద్దరో అంతకంటే ఎక్కువమందో వరుసకు ఆ చివర ఈ చివర కూర్చుని మధ్యలో సీట్లు ఎవరొచ్చినా మావాళ్ళున్నారు అని వేరేఎవ్వరిని కూర్చోనివ్వరు. మన సోదరులే కదాని మనం దెబ్బలాడం, యాజమాన్యానికి ఫిర్యాదు చెయ్యం. సరే నేరుగా పోలీసులకి చెబుదామంటే, అమెరికా వచ్చి సినిమా సీట్ల గురించి తోటివాళ్లతో ఏమి కుస్తీలులే  అనుకొని వదిలేస్తాము. అదే వాళ్ళ పాలిట వరంగా మారింది. ఇది నా అనుభవం. సరే మేము తెరనుంచి మూడో నాలుగో వరుసలో కూర్చున్నాము. మాపక్కన ఒక పెద్దమనిషి ఫోన్లో తాను ఎక్కడ ఉన్నది ఎలా వస్తే ఆయన పక్కనకి రావొచ్చో బయట ఉన్న వ్యక్తికి ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నాడు. ఇది సినిమా మొదలవ్వటానికి 10 నిమిషాలముందర మొదలయ్యి ఆతర్వాత 15 నిమిషాలు కొనసాగింది. అంత సేపు సినిమాలో ఏమిజరిగిందో అన్నది అంతంత మాత్రపు దృశ్య చిత్రమే కానీ (ముందర కూర్చుని చూస్తే బొమ్మలు అసలే భూతాల్లా కనిపిస్తాయి) , శ్రవణ ప్రసారం మాత్రం ప్రక్కన వాడి ఫోన్ గోలే. మాప్రారబ్దం ఏమిటో మాకే ఈరకమైన శాకిని డాకిని  జాతి పిశాచాలు తగులుతుంటాయి.  పైపెచ్చు ఈ క్రొత్త తెలుగు సినిమాలన్నింటికీ దర్శకుడు, నిర్మాత, హీరో గారి దర్జా, ఠీవీ లని బట్టి టికెట్ రుసుముంటుంది. బాహుబలికి మనిషికి పాతిక డాలర్లు లాగేరు, మా అనుభవం మాత్రం ఇలాఏడ్చింది. అప్పటినుంచి మాపిల్లలు తెలుగు సినిమాలకి రామని గొడవ,  మాకేమో అప్పుడప్పుడైనా హాలులో సినిమాచూడాలన్న పిచ్చి,  వెరసి అందరికి పండగ అయ్యిపోతోంది. 


ఇవి కాకుండా, గట్టిగా మాట్లాడే వాళ్ళు, ఫోన్లు ఆఫ్ చెయ్యని వాళ్ళు, టెక్స్టులు ఈమెయిలు చూసేవాళ్ళు, సినిమాకత ముందే చెప్పేసే వాళ్లు, సినిమాలో పని చేసినవాళ్ల గురించి, అయిపోయిన సీన్ గురించి పక్క వాళ్ళకి చెప్పే వాళ్లు, అమ్మలక్కల ముచ్చట్లు, ఇరుగు పొరుగు చాడీలు చెప్పుకోవడానికి శరీరం పెరిగి  మెదడు పెరగని తెలుగువాళ్లందరికీ  అమెరికాలో సినిమాహాళ్లు చక్కటి కేంద్రస్థానాలు. పిల్లలకి తెలుగుతో ఉన్న పరిచయం తెగకుండా ఉంటుందని, పిల్లల్ని ఇంటి దగ్గర వదలలేక, వదలాలంటే కాపలాకాసే వాళ్ళకి డబ్బులివ్వ మనస్కరించక, వాళ్ళని నమ్మలేక పిల్లలు వద్దన్నా సినిమాకి యీడ్చుకుపోతాం. అందుకని వాళ్ళ అల్లరికి మనమే బాధ్యులు కాబట్టి వాళ్ళని ఏమి అనక్కరలేదని నా అభిప్రాయం. కానీ వాళ్ళ మాతాపితరుల గురించి ఎంతైనా చెప్పుకోవచ్చు. ఇంత సినిమా పిచ్చి ఉన్న నేను మా మొదటి బిడ్డ పుట్టడానికి 4 నెలల ముందర దాకా సినిమా హాళ్లల్లో ( అప్పటి తెలుగు సినిమాలు హాళ్లలో లేని రోజులు) ఇంగ్లీషు సినిమాలు ప్రతీ వారం చూసే వాడిని. అప్పుడు మానేసిన మేము, గత 4 లేక 5 ఏండ్లుగా అప్పుడప్పుడు బయట తెలుగు సినిమాలు చూడటంతో మా సినిమా కష్టాలు మొదలయ్యాయి. ఈ ప్రహసనంలో ముఖ్యమైన విషయం  ఏమిటంటే ఎవరో ఒకరో ఇద్దరో తప్పితే అంతా సాఫ్ట్ వేరు విద్యావంతులే. పేరుకి మెడచుట్టు చాలా పట్టాలుండవచ్చేమో గాని, సంస్కారం ఇసుమంతైనా లేదు. ఇక్కడున్న సంఘంలో మనమెలా మసలుకోవాలన్న స్పృహ లేదు. అందుకే మనవాళ్ళు చదువుకున్నవాడు కంటే చాకలి మేలు అన్నది. ఇక్కడ అమెరికన్స్ మనల్ని ఈసడించుకోవడానికి ఇవి కొన్ని కారణాలు. ఇవన్నీ చిలికి చిలికి గాలివాన అయ్యి, మన ప్రగతిని ఐశ్వర్యాన్ని చూసి అసూయచెంది, భారతీయుల్ని అమెరికాలోంచి బయటకి పంపాలని చూస్తున్నారని మన పత్రికల ఉవాచ. నేను అబద్దం చెబుతున్నాను అనుకొంటే మీకు పరిచయమున్న ఎవరైనా అమెరికాలో 15 ఏళ్ళ కంటే ఎక్కువ సంవత్సరాలుగా  (2000 కు ముందు వచ్చిన వాళ్ళు) ఉంటున్న వ్యక్తుల్ని కనుక్కోండి. నిజం మీకు తెలుస్తుందని తద్వారా మనం మారితే తర్వాత తరాలు నామోషీ, సిగ్గుతో జీవితం ఇక్కడ గడపకుండా తలెత్తుకు తిరిగే రోజులొస్తాయని ఒక దిక్కుమాలిన ఆశ. నాకు ఇండియాలో ఈ విధంగా సినిమాలు చూడటం బాగానే తెలుసు. కానీ అమెరికాలోను అదే కథ పునరావృతం కావటం నచ్చలేదు. నా సోదర, సోదరీమణుల బాధల నుంచి తప్పించుకోవటానికి నాకున్నవి రెండే మార్గాలు. ఒకటి తెలుగు సినిమాలు బహిష్కరించి, ఇంగ్లీషువి మాత్రమే చూడటం. లేదా అన్ని మానేసి గుట్టుచప్పుడు కాకుండా ఇంట్లోనే అందుబాటులో ఉన్నవి చూడటం. 

కొసమెరుపు: మొదటిసారి బాహుబలి సరిగ్గా వినపడక, కనపడక చూశామని అసంతృప్తితో, దగ్గరేఉన్న సినిమాహాలు అచ్చిరావట్లేదని 45 మైళ్ళ దూరంలో ఉన్న ఇంకో హాలుకెళ్ళాం (పిచ్చివాళ్లమని ముందే మనవి చేసుకొన్నాను). అర్ధగంట ముందే లైన్లో ఉండి, లోపలికెళితే అదే సీన్ (మీకు అదే దెబ్బ అనిపించిందా? ఏదో ఏంటోడి సినిమా... ) మళ్ళీ మాకళ్ళకి ఎదురయ్యింది.  ఈసారి కొంత సాహసం చేసి వెనకాలకంతా  వరుసలో ఖాళీల దగ్గర ఉన్న పెద్దమనిషిని అయ్యా మాకు రెండు సీట్లు కావాలి ఇవ్వండి అన్నా. కొంచెంసేపు భార్యతో మంతనాలు ఆడి, ఉన్న నాలుగులో రెండు మాకిచ్చాడు. ధర్మాత్ముడు దయతలిచాడు. తర్వాత నాకథ చెప్పి పరిచయం చేసుకొన్నా. ఆయన పాతికేళ్ల క్రిష్టం విద్యార్థిగా వచ్చి, ఇక్కడ కాపురం చేసుకొంటూ, మొట్టమొదటిసారి తెలుగు సినిమా చూట్టానికి వచ్చాట్ట. నాకథ విన్నతర్వాత ఇటువంటి పిచ్చివాళ్ళుంటారా అన్నట్టు చూశాడాయన.  ఇంత మంది దురాత్ముల గురించి చెప్పి, ఒకమంచి వ్యక్తి గురించి చెప్పక పోవటం దోషం. అందుకనే ఈ చివరి పేరా ఆ శ్రీనివాస్ గారనబడే సహృదయుడి కథతో ముగిస్తున్నాను. ఇదంతా స్వానుభవం, కథ కాదు, అంతా వాస్తవమే.

10 కామెంట్‌లు:

  1. ఆ ఎంటీవోడి సినిమా "అప్పు చేసి పప్పు కూడు " అండి - అనేది ఆర్నాగేశ్వర్రావ్ అనే అందమైన విలన్.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. లలితగారు, వయస్సుతో కొన్ని సంగతులు, జ్ఞాపకాలు మరుగున పడిపోతున్నాయి. మీరు సినిమా పేరు చెప్పి మళ్ళీ అవి బయటకి తెచ్చారు. ధన్యవాదాలండి.

      తొలగించండి
  2. చదువుకి సంస్కారానికి లంకె లేదండి! చదువుకున్నకొద్దీ సంస్కారం తగ్గిపోతోంది. మీరింకా హాల్ లో సినిమా చూస్తున్నారంటే.... ఓపికకి జోహార్లే!! నేను సినిమా చూడ్డం మానేసి నలభై ఏళ్ళు దాటింది ( హాల్లోగాని టి.వి లో గాని )

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గురువు గారు ఏమి చెప్పమంటారు, పిచ్చి వల్ల మానలేను. ధన్యవాదాలు.

      తొలగించండి
  3. "ఏ దేశమేగినా, ఎందు కాలిడినా" ......."వెనకటి గుణమేల మాను" 😕
    (కలిపినందుకు రాయప్రోలు వారికి, సుమతీశతకకారుడికి క్షమాపణలతో)

    రిప్లయితొలగించండి


  4. ఏ దేశంబుల కేగినా తెలుగువారే గొప్ప, రారమ్మ రో!
    మాదేశంబున గాంచుడమ్మ సినిమా, మావాళ్ల తీరున్ భళా,
    రాదే యీ యవకా శమిట్ల తమ కాళ్లాటల్ రుమాళ్ళన్ గనన్
    మేధాజీ వులటా బడాయి గదవే మేజోళ్ల రౌడీలు బో :)

    జిలేబి

    రిప్లయితొలగించండి
  5. అన్య గామి గార లన్వర్థ నాములు
    చిత్ర గాము లన్న చిన్న చూపు
    అమెరికాలొ నైన ఆంధ్రాలొ నైతేమి
    తెలుగు చిత్ర వీక్ష కులు తెలుగులె .

    రిప్లయితొలగించండి
  6. కామెంటిన పెద్దలందరికి ధన్యవాదాలు. తోటి వాళ్ళని ఆక్షేపించటం తప్పని తెలిసినా, నా బలహీనతవల్ల వ్రాయక తప్పలేదు. మనోభావాలు దెబ్బతిన్నవాళ్ళు క్షమించండి.

    రిప్లయితొలగించండి
  7. ఎక్కడున్నా తెలుగు వారు తెలుగు వారే :) అమెరికా లో తెలుగు సినిమా పిచ్చి మరీ ముదిరిపోతోంది. సినిమాలు వినోదం అన్నమాట నిజమే. కానీ ఎన్నో వినోదాలని దూరం చేసింది కూడా.

    రిప్లయితొలగించండి