27, ఫిబ్రవరి 2017, సోమవారం

నమ్మకం - అప్పారావు కథ (ఇది కథ కాదు, నిజ సంఘటన)

మీ దగ్గర భలే పుస్తకాల కల్లెక్షన్  ఉందే అని ఒక పుస్తకం అడిగి, రెండు మూడు రోజుల్లో చదివిచ్చేస్తాను అని పట్టుకెళతారు. తెలుసున్నవాళ్ళు కదా అని పుస్తకం ఇస్తాం.  అవికాస్తా రెండు మూడు నెలలవుతాయి. ఒకసారి అడిగి చూస్తాం. మాదగ్గరనుంచి ఎవరో పట్టుకెళ్లారని సమాధానం వస్తుంది. ఇంకో రెండు మూడు రోజుల్లో తెచ్చిచ్చేస్తామని మళ్ళీ హామీలు పొంది తిరిగొచ్చేస్తాము. కొద్దీ రోజులు పోయాక రెండోసారి అడుగుతాము. అదే సమాధానం. మూడో సారి అడిగినప్పుడు, మన మెతకతనం చూసి మీరెప్పుడిచ్చారో అనో, పోగొట్టామనో, లేకపోతే వాళ్ళింట్లోనుంచి మరెవరో తస్కరించారనో వార్త వస్తుంది. నాలాంటి వాడికి గుండె గుభిల్లుమంటుంది (అది అపురూపమైనది అయితే గుర్తొచ్చినప్పుడల్లా పాత గాయం రేగి మళ్ళి బాధ మొదలవుతుంది). మనుషుల మీద నమ్మకం ఒక్కసారి దబ్బున కుప్పకూలి, వాళ్లందరికీ దూరంగా గ్రహాంతరవాసం చెయ్యాలనిపిస్తుంది. మీలో చాలా మంది పుస్తకప్రియులు కాబట్టి ఇది వెంటనే పట్టేస్తారు. అలాగే డబ్బులు చేబదులు తీసుకొన్న స్నేహితులు, దగ్గర వాళ్ళ నుండి ఇటువంటి అనుభవం నా తరం, అంతకు ముందు వాళ్ళకి బాగా ఉండే వుంటుంది. ఇప్పటి వాళ్ళకి చాలా వరకు పుస్తకాలు (తరగతివి కాకుండా) కొనే ఆసక్తి, అవసరం లేవు. డబ్బులు కూడా పుష్కలంగా దొరకటంవల్ల (వారసత్వంగా కానీ, ఉద్యోగాల వల్ల కానీ) వాటి అనుభవాలు తక్కువనే అనుకొంటున్నాను. ఇంతకీ చెప్పొచ్చేదేమిటంటే మనుషుల మీద నమ్మకం పోగొట్టుకోడానికి ఎక్కువ ఉదాహరణలు అక్కరలేదు. నమ్మకం పెంచుకోవాలంటేనే కావాలి. అటువంటి సంఘటన ఒకటి  నాకెదురైనది మీముందుంచుతాను.

80వ దశకం చివరిలో నేను విజయవాడలో ఇంజనీరింగ్ హాస్టల్లో ఉండి చదువుకొనే రోజులు.  కొంత తెలియనితనం, కొంత ఏదో పొడిచేద్దాం, కొంత సాహసం చేయాలనే వయస్సు. స్వంత లాభం కొంత మానుకొని పొరుగు వారికి తోడుపడవోయి అన్నది పూర్తిగా ఆదర్శాల లిస్టులో మాత్రమే ఉండని రోజులు. మా మెస్సులో ముఖ్యమైన వంట చేసే ఆయన, ఆయన అనుచర గణం (సహాయకులు) ఒక 20 మంది పెద్ద వాళ్ళు ఉండేవాళ్ళు. వాళ్ళు కాకుండా 9 నుంచి 15 ఏళ్ళ దాకా ఉన్న పిల్లలని చిన్న చిన్న పనులకి వాడుకొనేవాళ్ళు.  ఒరే, బాలకార్మికులని పనిలో పెట్టుకొంటే దాన్నెందుకు ప్రశ్నించలేదని/అడ్డుకోలేదని అడక్కండి.  అప్పుడు అడగలేదు, ఇప్పుడు అడగను. నేను వ్యక్తిగతంగా మాత్రం వాళ్ళని పనిలో చేర్చుకోను. కారణాలు మనకి తెలుసున్నవే. ఈ పిల్లలకి జీతాలుఇచ్చే రోజు, వాళ్ళ అమ్మానాన్నలో లేకపోతే అన్నో మరో బంధువో వచ్చి డబ్బులు తీసుకుని వెళ్లిపోయేవాళ్లు. ఇది కూడా ఇళ్లల్లో పని పిల్లల్ని పెట్టుకొన్న వాళ్లకి అనుభవమే. అప్పుడప్పుడు వాళ్ళల్లో కొంతమంది పాత బట్టల గురించో, చిల్లర డబ్బుల గురించో స్టూడెంట్స్ దగ్గరకి వచ్చి అడిగి తీసుకుని వెళ్ళేవాళ్ళు. అందులో ఒకతను ఎప్పుడు ఏదో ఒక మాట చెప్పి రూపాయి, రెండురూపాయలో పట్టుకుపోయేవాడు. ఎందువల్లో అతను అబద్దాలు చెప్పి పబ్బం గడుపుకొంటున్నాడనిపించేది అయినా డబ్బులుంటే ఇస్తూనేఉండేవాళ్ళం.

ఆరోజుల్లో మాకు మెస్ బిల్ ( తిండికి, హాస్టల్లోఉండటానికి)  400 -  450 రూపాయల మధ్య ఉండేది. ఇంటినుంచి 500 రూపాయలొచ్చేవి. బిల్లు కట్టగా చేతిలో ఉన్న 75 లేక 50 రూపాయలతో నెల ఖర్చులు నడిచిపోయేవి.  బస్సులో వెళ్లి సినిమాలు చూడటానికి,చిరుతిళ్ళకు సరిపోయేవి. ఎలాగో అలాగే సరిపెట్టుకొనేవాడిని. నావెనకాల ఇంకా ఇద్దరికీ నాన్నగారు మెస్సు బిల్లులు కట్టేవాళ్ళు. అందువల్ల చాలకపోవటం అన్న సమస్యే లేదు, ఒకవేళ అలా జరిగితే ఎవరి దగ్గరో తీసుకొని సాధ్యమైనంత త్వరగా వెనక్కి ఇచ్చేసేవాడిని. అప్పట్లో, అప్పారావు అనే 14 ఏళ్ళ కుర్రాడు అందరికి చిన్న పనులు చేసి పెడుతూ సాయంగా ఉండేవాడు.  ఒకరోజు ప్రొద్దున్న హడావిడిగా రూంకి వచ్చి, 100 రూపాయలుంటే ఇవ్వండి మాఅన్నయ్యకియ్యాలి లేకపోతే వాడికి బస్సు వెళ్ళిపోతుంది అని కూర్చున్నాడు. ఈవేళ సాయంత్రానికి జీతాలిస్తారు మళ్ళి ఇచ్చేస్తాను అని అన్నాడు. నాకేమో రెండు రోజుల క్రితం మెస్ బిల్లులు కట్టగా మిగిలిన 110 రూపాయలున్నట్టు గుర్తు. డబ్బులుండి లేవని అబద్దం చెప్పటానికి మనస్కరించలేదు.  సరే 100 రూపాయలిచ్చి, మళ్ళి సాయంత్రానికి ఇచ్చేయి అని మళ్ళి గుర్తుచేసి పంపించాను.

అప్పారావు వెళ్ళిపోయాడు. నాకు బెంగ మొదలైంది. ఇస్తాడా, ఇవ్వడా? ఎవరికైన చెపితే వాళ్ళు తిడతారేమో అని భయం. పనివాళ్ళకి డబ్బులిచ్చినవి ఎప్పుడు తిరిగిరాలేదంటారని ఒక దుగ్ద. రాకపోతే అమ్మానాన్నలకు ఏమి చెప్పి డబ్బులు తెప్పించుకోవాలన్నది మరో ఆలోచన. ఇలా ఎటూ తేలని ఆలోచనలతో ఎలాగో సాయంత్రం దాకా కాలక్షేపం చేసేసాను. రాత్రి భోజనాల వేళ అయ్యింది. మిగిలిన స్నేహితులతో కలిసివెళ్ళి భోజనం చేసాను. అప్పారావు కనిపిస్తాడేమో అని మెస్సులో అన్ని వైపులా చూసాను. అయిపులేడు. అప్పటి దాకా మనస్సు మనస్సులో లేదు, 100 రూపాయలకేనా అనకండి. అదెంత పెద్దమొత్తంలో ఇంతకుముందే చెప్పాను. ఏది ఏమైతే అదే జరుగుతుందని ఇంక రూంకి వచ్చి, వేరే పనుల్లో పడిపోయాను. రాత్రి 10:30 అప్పుడు తలుపు కొట్టిన చప్పుడైంది. వెళ్లి చూస్తే అప్పారావు గుమ్మం ముందున్నాడు. డబ్బులు వెనక్కిచ్చేసాడు. ఇచ్చేస్తూ నాకేసి ఒక చూపు చూసాడు. ఇప్పుడు మనం అనేక భాషల్లో చెప్పే "థాంక్ యు" లు ఎన్నైనా దాని ముందు దిగదుడుపే. వాళ్ళ సూపర్వైజర్ జీతమిచ్చి ఏదో పని చెపితే బయటికి వెళ్ళాడట అందుకని వెంటనే రాలేకపోయాను అని చెప్పాడు. సరే మరేమి పరవాలేదని చెప్పి అతన్ని పంపించేసాను. ఆతర్వాత అతనెప్పుడూ మళ్ళి అప్పు కోసం రాలేదు.  ఎప్పుడు జారిపోతూవుండే మనుషుల మీద నాకుండే నమ్మకాన్ని అప్పారావు ఎంతో పైకెత్తాడు. ఇది జరిగి దగ్గర దగ్గర ముప్పై ఏళ్ళైనా నాకళ్ళకి కట్టినట్లుంది. అప్పారావూ, నీలోని దేవుడికి ఇదే నా నమస్కారం. 

11 కామెంట్‌లు:



  1. అదేమిటో గానీండి మంచితనమంతా మన గడచిన కాలం లోనే కనిపిస్తోందెందుకనో !

    వర్తమానంలో భూతద్దం పెట్టుకున్నా కనిపించదేమిటి ?

    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జిలేబీ గారు, వర్తమానంలోనూ మంచివాళ్ళున్నారు. వాళ్ళు నా వ్యక్తిగత జీవితంలో చాలా తక్కువమంది అవ్వటం వల్ల లేకపోతే నాకున్న అవలక్షణాలవల్ల చుట్టూ ఉన్న వాళ్ళని గుర్తించలేకపోతున్నానేమో.

      తొలగించండి
  2. చివరి వరకు సస్పెన్స్ బాగా పెట్టారు :). ఇప్పటి లాగా పీజ్జాలు, ఐమాక్సు లు వెళ్లేంత దర్జాలు ఎవరికీ ఉండేవి కాదు . వంద అంటే చాలా ఎక్కువే మరి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. చంద్రిక గారు, మనకున్న తక్కువ వనరులతో బాగా బతకటం తెలిసిన రోజులవి. ఇప్పుడన్నీఎక్కువై రూపాయి/డాలరు విలువ తెలియట్లేదు.

      తొలగించండి
  3. అదేమి దరిద్రమో తెలియదు కానీ నాకు ఇలాంటి వాళ్ళు జీవితంలో చాలా చోట్ల తగిలారు. ఇండియాలో ఉద్యోగం చేసేటప్పుడు ఒక కేరళా అతను, అమెరికా వచ్చిన కొత్తలో మరో అతను అలా చాలా. డబ్బులు తీసుకుంటారు అడిగితే ఏవిటయ్యా డాలర్ కి ఏడిచేస్తున్నావ్ అంటారు. అడక్కపోతే ఇవ్వరు. మరోకడి చేత చెప్పిస్తే "ఆ గుర్తు లేదు" అని మరో అబద్ధం. ఓ పెద్ద మనిషి కేఫె కి వచ్చాడు. లంచ్ తిన్నాక అర్జంటుగా మళ్ళీ ఆకలి వేసింది. జేబులో డబ్బుల్లేవు. ఓ డాలర్ ఇవ్వవోయ్ అని తీసుకున్నాడు. మళ్ళీ దాని సంగతి లేదు. ఎవడబ్బ సొమ్మో? బుద్ధిలేని మనుషులు ఇలాగే ఉంటారు. ఇంకో పెద్ద మనిషి రూమ్మేటు. మూడు నెలలు పచారీ సరుకులకి డబ్బులివ్వలేదు. చివర్లో చచ్చీ ఇచ్చాడు కానీ ఒక వంద తక్కువైంది. వాటికి నీళ్ళధారే. వంద డాలర్లు నేను చదువుకునే రోజుల్లోనూ, ఇప్పుడూ కూడా ఎక్కువే.

    లైబ్రరీ నుంచి తెచ్చిన టేపులూ అవీ తీసుకోవడం - నేను రిటర్న్ చేస్తాను అని చెప్పి. అవి రిటర్న్ చేయరు. ఫైన్ నాకు పడుతుంది. వీళ్ళలో అతి తెలివి పెద్ద మనుషులుంటారు. కాఫీ కి డభ్భై సెంట్లు ముష్టి ఎత్తేవారూ, లేకపోతే రెండు డాలర్ల ముఫ్ఫై సెంట్లు అడిగేవారూ, లేకపోతే డ్రైవర్ లైసెన్సు కి పదకొండు డాలర్లు అడిగేవారూను. వాటికి నీళ్ళ ధారే. నేను అప్పట్నుంచీ ఒకటి నేర్చుకున్నాను. ఎప్పుడూ చిల్లర ఇవ్వకండి. ఎప్పుడు యాభై కాయితమో, ఇరవై కాయితమో ఇచ్చి, అదే తీసుకోవచ్చు. ఇరవై ఎక్కువే కనక అడగడానికి మొహమాటపడక్కర్లేదు. మరో మంచి పద్ధతి అసలు ఇవ్వకపోవడం. ఇంకో పెద్ద మనిషి ప్రతినెలా నాలుగేసి వందలు అప్పు అడిగేవాడు. అది రెండువారాల్లో ఇస్తానని చెప్పడం. ఆరు వారాలు పోయాక్కూడా దిక్కు లేదు. మొత్తానికి ఇచ్చాడనుకోండి.

    వీళ్ళు ఎవరనుకుంటున్నారు? పెళ్ళాం డాక్టరు, ఇద్దరేసి ముగ్గురేసి పిల్లలున్న దరిద్రులు. మళ్ళీ అందులో కొడుకు ఎం డి చదువుతున్నాడు కూడా! ముష్టి ఎత్తడానికి మాత్రం సిగ్గులేదు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అనానిమస్ గారు, అమెరికాలో చిల్లరబుద్దులు చూపే మనవాళ్ల గురించి చెప్తే అదొక పెద్ద ప్రహసనం అవుతుంది. కానీ మీరు చెప్పినవన్నీ నాకు అనుభవమే.

      తొలగించండి
  4. అసలు 80వ దశకానికి పిట్జాలు, ఐమాక్సులు రంగప్రవేశం చేసినట్లు లేదు చంద్రిక గారు. ఆ షోకులన్నీ తర్వాత తర్వాత మొదలైనాయి. మీరన్నట్లు ఆరోజుల్లో వంద రూపాయలంటే పెద్ద మొత్తమే. అంతకు ముందు కాలంలో నేను విజయవాడలోనే ప్రసిద్ధ డిగ్రీ కళాశాలలో చదువుకుంటున్నప్పుడు హాస్టల్ బిల్ నెలకు 30 రూపాయలు దాటేదికాదు మరి. ఏమైనా అన్యగామి" గారు చేసినది మంచి పనే - సాటి మనిషికి అవసరానికి సహాయం చెయ్యడం 👏.
    అవసరానికి ఆదుకోవడం వేరు, "అన్యగామి" గారు తన వ్యాఖ్యలో చెప్పినట్లు ప్రతదానికీ కక్కుర్తి పడేవాళ్ళకి డబ్బులువ్వడం వేరు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. నా వ్యాఖ్యలో చివర వాక్యం " "అన్యగామి" గారు తన వ్యాఖ్యలో చెప్పినట్లు ....." "

      సవరణ :- Anonymous గారు తన వ్యాఖ్యలో చెప్పినట్లు ..... అని చదువుకోవాలి.

      తొలగించండి
    2. విన్నకోట వారు, చాల మందికి తమ డబ్బు ఖర్చు అవ్వకుండా పని జరిపించుకొని తత్త్వం. లేని వాళ్ళు అలాచేస్తే ఇబ్బందిగా ఉండదు. అర్థం చేసుకోగలం. ఇప్పుడు ఉన్నవాళ్లు, బాగా సంపాదించుకొనేవాళ్లతోనే వస్తోంది ఈచిక్కు.

      తొలగించండి
  5. Sorry for commenting quite late. I came across your blog today. Great blog and became a fan of your writing style. Keep sharing your wonderful thoughts. Fortunate to be living as contemporary to Sri Chaganti Gaaru, as per his pravachanam, Mana Dharmam will not change based on opposite's person's Dharmam. If my personality is to help out others, it should not change suspecting that others may deceive us. I have the same dilemma. How to balance our apprehension with Sri Chaganti gaaru's Dharmam principle. It's very very tough. Ultimately our ego will defeat us not to practice what we believe in as we don't be get deceived. You need not publish this as I wrote this English.

    రిప్లయితొలగించండి
  6. anonymous, thank you for your comment. As long as we follow the etiquette in social media, I don't see a reason to remove your views. Yes, it is hard to follow one's Dharma, but that is the essence and objective of our lives.

    రిప్లయితొలగించండి