24, అక్టోబర్ 2018, బుధవారం

వాట్సాప్ సిత్రాలు


మనలో చాల మంది ప్రొద్దునే నిద్రలేచి ముఖం కడుక్కోకుండా, మొట్టమొదట సెల్ ఫోన్ చూసేవాళ్ళు ఎంత మంది?  వాళ్లలో వాట్సాప్ చూసే వాళ్ళు ఎంత మంది? నేననుకోవటం కనీసం ఒక 95 శాతం ఫోన్ చూస్తే, వాళ్ళల్లో ఒక 95 శాతం వాట్సాప్ (whatsapp) మొదట చూస్తారని. వీళ్ళలో అందరికి కనీసం ఒకటో రెండో గ్రూపుల్లో సభ్యత్వం ఉంటుంది. ప్రొద్దున్నే చూడటం మంచి పనా లేక చెడ్డదా అన్నది కాదు ప్రశ్న. నా ప్రశ్నల్లా  ఏమిటంటే ఇది ఏరకంగా మనకి ఉపకరిస్తోంది అన్నది. 

వాట్సాప్ లో వచ్చే వార్తలని స్థూలంగా ఈక్రింది విభాగాలుగా చూడొచ్చు.  వచ్చే వార్తలన్నీ వీడియోలు, ఆడియోలు, యానిమేషన్లు, సంభాషణలు, సూక్తి ముక్తావళి, వీటిల్లో ఏదైనా కావచ్చు. 

జోక్స్ :
వీటితో ఎవరికి పేచీ లేదు. యేవో కొన్ని సున్నితమైన విషయాలకి సంబంధించినవి మినహాయిస్తే, వీటిని అందరు ఆస్వాదిస్తారేమో. 

దైవ భక్తి:
ఇది కూడా వ్యక్తిగతం కాబట్టి ఎక్కువ భాగం ఇబ్బంది లేదు. ఒకరి దేవుడి మీద ఇంకోడు హాస్యం, బురద చల్లనంత కాలం, లేకపోతే మన అభిప్రాయాలు బలవంతంగా రుద్ధనంత కాలం ఇది బాగానే నడుస్తుంది. లేకపోతే ఎక్కువ పరమత సహనం ఉన్నట్టు నటించవలసి ఉంటుంది. 

దేశభక్తి:
ఒకానొకప్పుడు ఎక్కువ మంది బయటకి చెప్పే అవసరం లేకుండానే దేశభక్తితో రగిలిపోయేవాళ్లు. నిజాయతి ఉన్న ఒక గొప్ప నాయకుడు "జై జవాన్, జై కిసాన్" అని పిలుపిస్తే లక్షల మంది వారితో మమేకమయ్యేరు. ఇప్పుడిది పైకి చెప్పుకోవలిసిన ఫాషన్, సోషల్ మీడియాలో చక్కగా వండబడుతున్న పదార్థం.  

ఆటలు /సాహసాలు: 
సోషల్ మీడియా పుణ్యామా అని క్రికెట్ కాకుండా వేరే క్రీడలు, ఇతర వ్యాసంగాలలో ప్రావీణ్యం చూపుతున్న ఆటగాళ్లు, పోటుగాళ్ళు గుర్తింపు పొందుతున్నారు. వాళ్లకి కూడా స్పాన్సర్స్ దొరుకుతున్నారు, జీవనోపాధి దొరుకుతోంది. చాలా సంతోషించవలసిన విషయం. 

సినిమాలు:
తెలుగు వాళ్ళకి సినిమా, రాజకీయాలు బాగా వంటపట్టాయి అందుకని ఇవి లైట్ తీసుకోవచ్చు. కాకపోతే మీము (meme), దుబ్స్మాషు (dubsmash), అర్థం లేని వీడియోల వల్ల అభిమాన నాయ(కుల) సంఘాల వాళ్ళు దెబ్బలాడుకోవటానికి మరో చక్కటి అవకాశం దొరుకుతోంది. సినిమా ఔత్సాహికులకు, ప్రతిభ ఉండి డబ్బులు లేనివారికి మంచి ప్రోత్సాహం కూడా దొరుకుతోంది. 

కళలు: 
ప్రభుత్వం ప్రోత్సహించట్లేదు అన్న అపప్రథకి గురైన ఈ రంగం ఇప్పుడు కొంచెం కొంచెం పుంజుకొంటోంది. ప్రచారం, గుర్తింపు దొరికి, చాల చిన్న చిన్న కళాకారులు కూడా విదేశాల ప్రయాణాలు చేసి వారి వారి సత్తాని, వ్యాపారాలని వృద్ధి చేసుకొంటున్నారు. 

పరోపకారం/బోధ: 
ఫలానా వారికి ఆరోగ్యం బాగోలేదు సాయం చేయండి. ఏదో ప్రాజెక్ట్ చేస్తున్నాము, విరాళాలు ఇవ్వండి. నిజంగా ఎంతమంది వీటిలో చిత్తశుద్ధితో చేస్తున్నారో, నిజమైన ఆర్తులకి ఇవి అందుతున్నాయో లేదో చెప్పటం కష్టం. ఈ పని చెయ్యండి, ఫలానా ఫలం దొరుకుతుంది అనే వాళ్ళు బాగానే ఉన్నారు. 

రాజకీయాలు: 
మనం ఎన్ని రకాలుగా చీలిపోవాలో అన్ని రకాలుగానూ చీలిపోయాం కాబట్టి, మన దాస్యభక్తి ప్రకటించుకోవడానికి ఇది అన్నిటిలోకి ముఖ్యమైనది. మర్యాదకోసం నోరు విప్పం, విప్పామో ముఠా గొడవలకి అంతు లేదు. అలాగే ప్రచార కండూతి ఉన్నవాళ్ళకిది వాళ్ళని ప్రకటించుకోవటానికి ఇదొక మంచి మార్గం. 

అభినందనలు: 
పుట్టిన రోజు, పండగ రోజు అభినందనలు  చెప్పుకోవడంలో అభ్యంతరం లేదు. కానీ లేచినపుడొకటి, తినేటప్పుడొకటి, పాడుకొనేటప్పుడొకటి మెసేజ్లు (messages) అవసరం లేదేమో.

విజ్ఞానం:
వాట్సాప్ గూగుల్ తర్వాత ఎక్కువ కష్టపడకుండా విజ్ఞానం పంచె సాధనంగా తయారయ్యింది. ఒకవేళ మీకు వాట్సాప్ లో సభ్యత్వం లేకపోతే ఈ ఒక్క కారణానికి సభ్యుడుగా చేరి పోవచ్చు. అతి తక్కువకాలంలో అన్ని శాస్త్రాలలో అఖండమైన విజ్ఞానం మీ సొంతం అవుతుంది.  

వ్యాపారం:
పేరుకి జనులనుద్దరించడానికి ఉద్భవించాము అని చెప్పుకుని, నిజానికి వ్యాపారం కోసం మాత్రమే వచ్చినవి ఈ ఉత్పత్తుల, సేవల సంస్థలు అన్ని. ఇందులో సందేహం ఏమాత్రము లేదు. మనం ఏది చేసినా, దాన్ని గోప్యంగా ఉంచుతామని చెప్పి వాళ్ళ వ్యాపారాలకు, స్వప్రయోజనాలకు అనుగుణంగా వాడుకొనే సంస్థలు అనేకం. 

ఆరోగ్య చిట్కాలు:
రోజు ప్రొద్దున్నే పరగడుపున ఒక లీటర్ గోరువెచ్చని నీళ్ళు త్రాగండి. మీకున్న సమస్త రోగాలు మాయమవుతాయి అన్న వార్త మీలో చాలా మంది చూసే ఉంటారు. ఇదే జరిగుంటే, ప్రజలంతా రోగరహితంగా ఉండి ఆసుపత్రులు మందుల కంపెనీలు జండా ఎత్తేసేవి.  

సోషల్ మీడియా ఆవిర్భావం తర్వాత చాలా మంచి జరిగింది అనే ఒప్పుకోవాలి. 90వ దశకానికి ముందర స్కూళ్ళకి వెళ్లిన వాళ్ళకి, ఎన్నో ఏళ్ళ తర్వాత అనేకమంది స్నేహితులు, బంధువులు దూరంతో సంబంధం  లేకుండా కలిసి, ఉత్తరప్రత్యుత్తరాలు జరుపుకునే వేదిక దొరికింది. అయితే ఉన్న వసతులని ఏదో విధంగా దుర్వినియోగం  చేసే వాళ్ళు రోజు రోజుకి పెరగడమే కానీ తగ్గడం లేదు. సొంతంగా ఒక్క అభిప్రాయము, మాట వ్రాయనివాళ్ళు ఒక రోజులో కొన్ని పదుల మెసేజ్లు (messages) ఫార్వర్డ్ చేస్తున్నారు. పోనీ వాటిలో ఏవైనా వాళ్ళని కదిలించిన, వాళ్ళల్లో భావావేశం, పొంగు తెచ్చి, ఉత్తేజాన్ని నింపే వార్తలు పంపుతున్నారా అంటే అది కూడా కాదు.  అంటే వాళ్ళకి పనికిరాని వార్త మరొకళ్ళకి  పనికివస్తుంది అని కళ్ళుమూసుకొని పంపించేస్తున్నారు. దీని వల్ల ఇంటర్నెట్ మీద ఎంత రద్దీ, ఎంత భారం పడుతోందో, మనం ఎంత డిజిటల్ చెత్త (spam)తయారుచేస్తున్నామో అర్థం కావట్లేదు. అలాగే ఈవ్యర్థాల వల్ల బ్యాండ్విడ్త్ (bandwidth) తగ్గి, నిజమైన అవసరార్థులకి ఎంత అసౌకర్యం కలుగుతుందో ఎవరికి పట్టదు. పనిలో పని ఏ వార్తలు వాళ్ళకి వస్తున్నాయో సరిగ్గా చూడని, చదవని వాళ్ళు, పంపినవే మళ్లీ, మళ్లీ  పంపటం ఒక గొప్ప ఫార్స్. తప్పులు చేసే వాళ్ళు, వాళ్ళని దిద్దేవాళ్ళు, భాషతో భయపెట్టేవాళ్ళు, తప్పుడు వార్తలతో, పుకార్లతో, అబద్దాలతో శోభిల్లే ఇదో వింత ప్రపంచం. వినోదానికి తప్ప మారేందుకు పనికిరాదేమో అని ఒక్కొక్కసారి నిరాశ కలుగుతుంది. ఇంక సెల్ ఫోన్తో జీవితంలో వ్యక్తిగత అభివృద్ధి, బంధాలని తగ్గించుకొని/కోల్పోయి, పిచ్చి పనులు చేసి, కూడని పరిస్థితులలోకి చివరికి జీవితాలు నెట్టబడటం రోజు పత్రికలూ, టీవీ, ఇతర మీడియా సాధనాలు వాడే/చూసే వాళ్ళకి చెప్పనక్కరలేదు!


25 వ్యాఖ్యలు:

 1. మీ పోస్ట్ తప్పకుండా వాట్సాప్ లో fwd చేయాల్సిన పోస్టు :)

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. చంద్రిక గారు ధన్యవాదాలు. సరదాగా పంపిచూడండి.

   తొలగించు


  2. చంద్రిక గారు

   మీ పోస్ట్ తప్పకుండా వాట్సాప్ లో fwd చేయాల్సిన పోస్టు :)

   అంటే మీ ఉద్దేశ్యం eligible for fwd only but not for reading అని అర్థమాండి‌ ? :)   జిలేబి

   తొలగించు
  3. మీ ఈ వ్యాఖ్యకు చివర “నారదా” అని చేర్చవలసింది “జిలేబి” గారూ ☝️.

   తొలగించు
 2. హ్హ హ్హ హ్హ చంద్రిక గారూ 😀. నిజానికి వాట్సప్ లో పెట్టిచూడండి - అది తిరిగి తిరిగి "అన్యగామి" గారికి కూడా చేరుతుంది most probably 😀.

  చక్కటి విశ్లేషణతో వర్గీకరణ చేస్తూ మంచి వ్యాసం వ్రాశారు "అన్యగామి" గారు 👌. భారతదేశంలో ఇంకొక అనర్థం గురించి కూడా తరచుగా వింటుంటాం - అదే .. ఆడపిల్లల్ని వలవేసి ఆకర్షించి మోసం చెయ్యడం.

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. VNR గారు, రోజూ మూడు ముఖ్య తెలుగు పత్రికలూ ఆన్లైన్లో చదువుతాను. అవన్ని నేరాలు, ఘోరాలు మాత్రమే ముందు వరుసలో వేస్తున్నాయి. అందుకని నేను వాటిని ప్రస్తావించలేదు. మీరు చెప్పిన సంఘటన మా కుటుంబాలలోనే జరిగింది. అందరు బాధ పడటం మించి చేసింది ఏమి లేదు. ధన్యవాదాలు.

   తొలగించు
  2. So sorry about that. సోషల్ మీడియా ఆడపిల్లలకు ఒక ట్రాప్ లా తయారైంది. వాళ్ళు కూడా చాలా జాగ్రత్త వహించాలి.

   తొలగించు
 3. టీవీ తర్వాత నేనస్సలు చూడనివి, చదవనివి వాట్సాప్ గ్రూప్ మెసేజెస్. మీ పోస్ట్ చదివాక నేను చాలా విజ్ఞానాన్ని, లోకజ్ఞానాన్ని మిస్ అవుతున్నానేమో అని అనిపించేస్తోందిప్పుడు :))

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. నేను మీమార్గాన్ని అనుసరిద్దామని అనుకొంటుంటే, మీరు ఇటువస్తానంటున్నారు. రాకండి, మీరేమి కోల్పోవడంలేదు.

   తొలగించు
 4. అన్యగామిగారు,మీకు OK ఐతే మీ వ్యాసం లింకుని రెండు, మూడు వాట్సప్ గ్రూపుల్లో పంచుకోవాలని వుంది.😊🙏

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు

  1. దానికేముందండి

   నిరభ్యంతరంగా పంచుకోండి
   క్రింద పేరు మాత్రం రాయమాకండి :)


   జిలేబి

   తొలగించు
  2. అ.సొ.అ.దా.చే. అన్నట్లుంది మీ అనుమతి “జిలేబి” గారూ 🙂.

   తొలగించు


  3. ఆహా! సోషియల్ మీడియా లో పెట్టేసేక సొ ఒ సో ఒ కదా !


   జిలేబి

   తొలగించు
  4. ☺☺
   అది కరక్టే గానీ "జిలేబి" గారూ, దీని ముందరి వ్యాఖ్యలోని నా భావం ... తన బ్లాగ్ లో "అన్యగామి" గారివ్వవలసిన అనుమతిని అంత ధారాళంగా మీరెలా ఇచ్చేయగలరు ... అని 😠

   తొలగించు

  5. అనుమతి వారిచ్చినా మేమిచ్చినా ఒకటే కదా అనుకుని :)

   అనుమతి లేకుండా బ్లాగులకు బ్లాగులే లేపేసుకు పోతున్న రోజులలో ముచ్చట పడి ఓ టపాకై వైవీయార్ గారు అడిగితేను కొంత జోష్ వచ్చేసె :(


   ఇంతకీ క కు లే దు క పీ కె కో :)


   నారదా
   జిలేబి

   తొలగించు
  6. నారదుడిని పిలిచారూ?
   పట్టించుకోవలసిన వారు మీ చొరవను తెల్లబోయి చూస్తుంటే ... ధర్మాన్ని నిలబెట్టే పోరాటానికి నేను సైతం సమిధనొక్కటి ఆహుతిద్దామనే “దురద” అండీ “దురద” ☝️🙂.
   ఇంతకీ మీరే వారు, వారే మీరా ( // “అనుమతి వారిచ్చినా మేమిచ్చినా ఒకటే కదా అనుకుని :)” // అన్నారు కదా పైన) 🤔? ఆసక్తికరమైన కొత్తకోణం సుమండీ.

   తొలగించు
  7. పైన నా వ్యాఖ్యలో చివరి లైన్ తీసేసి చదువుకోమని మనవి. ఎందుకంటే ... “జిలేబి” గారి మీద రిసెర్చ్ ఆపెయ్యమని చెప్పానా లేదా అంటూ నీహారిక గారు నా మీద కన్నెర్ర చేసే ఆస్కారం ఉందని ఇప్పుడే గుర్తొచ్చింది 🙂.

   తొలగించు

  8. అడిగిన వైవీయారు వారు సైలెంట్
   అనుమతి ఇవ్వాల్సిన వారు సౌండ్ స్లీప్ :)

   మధ్యలో రెండు జగణములు :) జిలేబి... వి..


   జిలేబి

   తొలగించు
  9. 🦁,

   నేను చెపితే మీరు వింటారా ? టౌను పక్కకి వెళ్ళకపోయినా ఆవిడ వచ్చేస్తారు.ఆమాద్మీల్లారా మూడువేల పైగా హరువుల దరువులు వేసాను మీ స్వాతంత్ర్యాన్ని మీరే కాపాడుకోవాలీ అని చెపుతూనే ఉన్నారు కదా ?
   క కు లే దు క పీ కె కో :)

   తొలగించు
  10. తప్పకుండానండి వైవిఆర్ గారు! జిలేబిగారు ఒప్పు అన్నారు. నాది అదే మాట.

   తొలగించు

  11. ఇంతకీ వాత్సాపు అనగానేమి ?


   జిలేబి

   తొలగించు
  12. మాత, మీకు తెలిసి అడిగినారా లేక తెలియక అడిగినారా?

   తొలగించు
 5. తీరిక లేదు వాని పయి దృష్టి నిడంగను , నన్యగామియై
  పోర సమస్త మందు నిలుపోపుననంటిరి , సత్యవాక్య మో
  సార వివేచనా విబుధ ! చక్కని మాటిది , యీశు నన్నిటన్
  పారగ జూచు మీ ప్రతిభ బంగరు మార్గము తేరి జూచినన్ .

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. రాజారావు గారు, మీ దయకి పాత్రుడనైనాను. కృతజ్ఞతలండి.

   తొలగించు
  2. అన్యగామి మాకు నపురూప మిత్రులు
   దయలు గియలు లేవు ప్రియము దప్ప
   మిత్రు లందరు కడు మిళితమై తగనొప్ప
   ప్రేమ గదుర మెలగ క్షేమ మొనరు .

   తొలగించు