27, జనవరి 2017, శుక్రవారం

మౌనం వీడండి

మీరు మీ తల్లితండ్రులని ఎందుకు ప్రేమిస్తున్నారు?
మీరు మీ పిల్లలని ఎందుకు ప్రేమిస్తున్నారు?
మీరు మీ బంధువులని ఎందుకు ప్రేమిస్తున్నారు?
మీరు మీ ఇరుగుపొరుగులని  ఎందుకు ఆదరిస్తున్నారు?
మీరు మీ ఉపాధ్యాయులని  ఎందుకు గౌరవిస్తున్నారు?
మీకు మీ మాతృభాష అంటే ఎందుకంత ఇష్టం?
మనం మన సంస్కృతిని ఎందుకు కాపాడుకోవాలి?
మన జీవితపరమార్థం ఏమిటి? దేవుడున్నాడా?
సనాతనధర్మం అంటే ఏమిటి? మన ధర్మం ఏమిటి?
మన కర్తవ్యాలు ఏమిటి? బాధ్యతలేమిటి? మతమంటే ఏమిటి?

ఇలాంటివి సగటు మనిషికి తరచూ లేక ఎప్పుడైనా జీవితంలో వచ్చే అనేక సందేహాలు. నేనూ సగటు మనిషినే. 2009లో ఒక దశలో మనస్సు బాగోలేక కొద్ది రోజులు చాలా అవస్థ పడ్డాను. అదేసమయంలో భారతావనికి వెళ్ళటం, మాఇంట్లో మానాన్నగారు చూస్తున్న ఒక ప్రవచనం  ప్రోగ్రాం టీవీలో చూడటం జరిగింది. మా నాన్నగారు మాట్లాడుతున్న వ్యక్తిని పరిచయం చేసి, ఈయన మన పౌరాణికగ్రంథాల మీద అద్భుతమైన ప్రసంగాలు చేస్తున్నారు, వినమని సలహా ఇచ్చారు. సరే ఆయన గురించి తెలియని వారెవ్వరు? వారు ప్రపంచంలో ఉన్న తెలుగు వాళ్ళందరికీ సుపరిచితమైన బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావుగారు.

వెనక్కి వచ్చేసిన తర్వాత కొన్ని వెబ్సైట్లు వెతికి కొన్ని ప్రవచనాలు డౌన్లోడ్ చేసుకొని వినటం మొదలుపెట్టాను. అదొక అమృతఝరి. వినేకొద్దీ ఇంకావినాలి, వినేకొద్దీ ఇంకా తెలుసుకోవాలి అనే ఉత్సాహం ఇనుమడించింది. వింటున్న కొద్దీ శరీరంలో కంపనాలు, కొన్ని పద్యాలు వింటే గొప్ప సంతోషం గొప్ప అనుభూతి, మరికొన్ని సంగతులకి ఓహో ఇంత అజ్ఞానంలో ఉన్నానని సిగ్గు, నాకున్న భాషాపరిజ్ఞానం ఆ అనుభవాన్ని మాటల్లో చెప్పలేనిది. ఆ మాటలు నాలో నిద్రాణంగా ఉన్న బలాలను పునరుద్దరించాయి, నా బలహీనతలను గుర్తుచెయ్యటం మొదలు పెట్టాయి. కొద్దిరోజుల తర్వాత డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.శ్రీచాగంటి.నెట్ ని కనుక్కోవటంతో గురువుగారితో కలిసి నాప్రయాణం మొదలైంది. రోజు ఏదో ఒక సమయంలో కాసేపు వినటం అలవాటు అయ్యింది. చాలా తెలుగు జాతీయాలు, సామెతలు, నుడికారాలు, క్రొత్త పదాలు,  ప్రామాణికమైన ప్రతిపదార్థాలు, పద్యాలు, శ్లోకాలు, మన సంస్కృతీ, మన వైభవం, మన పూర్వీకులు, మన జాతి గొప్పతనం, వ్యక్తిత్వవికాసం ఇది అది అని లేకుండా సువిశాల భారతదేశం,దాని గొప్పదనం, ప్రజలు గురించి నేను చాలా తక్కువ సమయంలో ఎన్నో విషయాలు తెలుసుకున్నాను. ఒకరకంగా ఇది నాకు మళ్ళీ వయోజనవిద్య.  బడికి వెళ్లకుండా ఇంటిదగ్గరనుంచే అనేక క్రొత్త విషయాలు నేర్చుకొనే అవకాశం కల్పించింది.  అతిత్వరగా నా శోకంలోంచి బయటపడ్డాను.

ఒకసారి గురువుగారి ప్రవచనాల రుచి తెలిస్తే, ఆ ప్రభావంలోంచి బయటికి రావటం చాలా కష్టం. అవి అన్ని కళ్ళకు కట్టినట్లు మీ మనోనేత్రంలో గోచరమవుతాయి. రాముడి గురించి ఆయన చెప్తే, మీరు రాముడిని చూస్తూ రాముడు చెప్పేది వింటున్నట్టు అనిపిస్తుంది. కృష్ష్ణుడు గురించి ఆయన చెప్తే, మీరు కృష్ష్ణుని చూస్తూ కృష్ష్ణుడు చెప్పేది వింటున్నట్టు అనిపిస్తుంది. ఆయా పాత్రలతో మీరు కలసి మెలసి ఆపనులన్నీ, ఆసంభాషణలన్నీ మీరే చేసినట్టుంటుంది. మీరున్న చోటునుండి కదలకుండా, అన్ని ప్రదేశాలు కాలంతో సంబంధం లేకుండా దర్శించేయొచ్చు. నాతరానికి ఒక పెద్దదిక్కుగా, మంచి చెడు తారతమ్యం  చెప్పేవారుగా వారుండటం నేను చేసుకొన్నసుకృతం.  అమ్మ గురించి ఆయన పలు సందర్భాలలో ఇచ్చిన  సందేశం వింటే మీకు గగుర్పాటు కలిగి, ఇన్నిరోజులు ఎందుకు గురువుగారి వాణి వినలేదని బాధ కలుగుతుంది. ఒకసారి మీరు కూడా వినండి, నేను చెప్పేదాంట్లో అతిశయోక్తి లేదని, వినేకొద్దీ తన్మయత్వం, పరవశం పెరిగి మిమ్మల్ని ఎలా కట్టిపడేస్తారో చూడండి. పైన ప్రశ్నలన్నింటికీ మీకు ఈపాటికి సమాధానం దొరికేపోయిఉంటుంది. దొరకలేదా శ్రద్ధగా మళ్ళీ వినండి. మీరు తెలుసుకోండి, మీ సన్నిహితులతో పంచుకోండి.

ఇంత జ్ఞానం సంపాదించుకుని, దాచుకోకుండా ఎందుకు గురువుగారు అందరికి పంచుతున్నారు? అది సంపాదించుకోవటానికి యెంత తపస్సు, సాధన చేశారు? అంత కష్టపడి నేర్చుకొన్నది ఎందుకు ప్రతిఫలాపేక్ష లేకుండా ఊరికే పంచేస్తున్నారు? వీటన్నింటికి కూడా ఆయనే ఒకచోట సమాధానం ఇచ్చారు. జ్ఞానం పంచుకొంటే వృద్ధిచెందుతుంది. అది ఆయన స్వధర్మం కూడా అని. ఒక మనిషి ఇప్పుడున్న పరిస్థితులలో, తన స్వంత లాభం, తన కుటుంబం బాగు మానుకొని, సమాజానికి అశేషమైన కాలం, శ్రమ దానం చేయటం సామాన్యమైన విషయం కాదు. తాను ఏది ధర్మం, కర్తవ్యం అని నమ్మారో దాన్నే చెబుతున్నారు, పాటిస్తున్నారు.  అంటే తానూ నమ్మిన విలువలు తన జీవితంలోనే ఆచరణాత్మకంగా చూపెడుతున్నారు.

ఇంత చేస్తున్న ఆయనకి మనం తిరిగిచ్చినది ఏమిటి? మనస్తాపం, అపనిందలు. తిట్లు, చీవాట్లు, కేసులు. ఇవి అవసరమా? మనలని ఉద్ధరిద్దామనుకొన్న వ్యక్తికి మనమిచ్చే సత్కారం ఇదేనా? ఆయన చెప్పిన విషయాలని అసంబద్దంగా ముక్కలు చేసి జనాలకి అబద్దాలు చెప్పి ఎన్నాళ్ళు పబ్బం చేసుకొంటారు? పూర్తిగా ఒక విషయం మీద ఆయన చెప్పిన పూర్తి పాఠాన్ని వినండి, అవగాహన పెంచుకోండి, మీకు నచ్చిన వారితో పంచుకోండి, మీ జీవితాలని ఆనందమయం చేసుకోండి, ఇతరులని ఆనందస్వరూపుల్నీ చేయండి.  ఒక అభిమానిగా, సనాతన ధర్మం నమ్మేవాడిగా నా ప్రార్థన ఇంతే. మీకిష్టం లేకపోతె వినొద్దు, వారి జోలికెళ్లొద్దు.  అలాకాదు సగమే వింటాం, మాలాంటి ఇతరులు చెప్పే చెప్పుడు కబుర్లు వింటాం, మాకు తెలిసిన మిడిమిడి జ్ఞానంతో ఆయన్ని అది చేస్తాం ఇది చేస్తామంటారా, మీ పాపం మీరు వండుకొంటున్నారు. ఆయనకీ ఏమి అవదు. ఒకసారి ఆయన అన్నట్టు అన్ని మానేసి, ఇంట్లో వారి సతీమణికి చెప్పుకొన్నా వారిద్దరూ తరిస్తారు. ఏమైనా కోల్పోతే అది మనమే. ఇంతటి మహనీయుణ్ణీ  కించపరిచి, అవమానాల పాలు చేసి మనం బాపుకొనేదేమి లేదు పాపం మూటకట్టుకోవటం, మన పతనానికి గోతులు త్రవ్వుకోవటం తప్ప.

నా ఆక్రోశమల్లా  అందరిని బాగుచేద్దామని కాదు, కొందరిలోనైనా వివేకం గుర్తుచేసి ఎందుకు ఒక మంచి మహనీయుని ప్రోత్సాహించాలో, వారికి ఎందుకు అడ్డుపడకుండా ఉండాలో తెలియచేయటానికి. గురువుగారు మన సమకాలీకులవటం మన అదృష్టం.  ఒకే ఒక్క మనిషి నిస్వార్థంగా, సాత్వికంగా, జనరంజకంగా మన సనాతనధర్మ పరిరక్షణకు అనితరమైన కృషిచేస్తుంటే, వారికి చెయ్యిఅందించాలనుకొంటే దీన్ని నలుగురితో పంచుకోండి. వారికి అన్ని విధాలా సహకారం అందించి మీవంతు పాలుపంచుకోండి. మన జాతిలో ఐక్యతని పెంపొందించండి. భావితరాలకు మన విజ్ఞానం పంచే మహాత్ములని దూరం చేసుకోకండి. ఇటువంటి సత్పురుషులని మీ పిల్లలకి పరిచయం చేయండి. కొద్ది మంది చేసే దుష్ప్రచారాన్ని త్రిప్పికొట్టండి, అటువంటి వాదనలు ఖండించండి. మీకు ఉపయోగపడతాయని క్రింద కొన్ని లింకులిస్తున్నాను. 

సర్వేజనాః సుఖినోభవంతు. 
ఓం శాంతిః శాంతిః శాంతిః!!


శ్రీచాగంటి వారి ప్రవచనాలు దొరికే చోటు 

శరత్చంద్రికగారి బ్లాగ్లో గురువుగారి మీద వ్యాసం 

గురువుగారిని  సమర్థిస్తున్న వారికోసం పిటిషన్ 

6 కామెంట్‌లు:

  1. చాలా బాగా చెప్పారండీ . ఆయన ప్రవచనాలు విని అర్ధం చేసుకున్నవారికే అర్ధమవుతుంది మీరు ఏమంటున్నారో. నా ముఖపుస్తకం లో కూడా పంచుతున్నాను.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ ముఖ పుస్తకంలో ప్రచురించినందుకు, మీ కామెంటుకి, మీ లింక్ ని పంచుకోవడానికి ఇచ్చిన అనుమతికి ధన్యవాదాలు. నేను గురువు గారు చెప్పే కనిపించని గీత దాటకుండా వ్రాసెను, అందువల్ల ఆవేశం అంతా బయట పెట్టలేదు. కానీ ఇది సగటు హిందువు అర్థం చేసుకొని ఆయనకీ మద్దతిస్తే చాలు. మన వంతు పాత్ర అంతే అని నా అభిప్రాయం. .

      తొలగించండి


  2. చాగంటి ప్రవచనములన్
    బాగుగ వినవలె జిలేబి భవితకు మేలౌ !
    ఆ గురు వర్యుల పలుకుల
    సాగర మధనమ్ము జేసి సత్యంబరయన్ !

    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. నిజంగా ఆపలుకుల సాగరమధనం చేస్తే మన అందరిమీద అమృతవృష్టి తథ్యం.

      తొలగించండి


  3. మౌనము వీడి సనాతన
    యానములను పరిహసించి యపహాస్యములన్
    తానము లాడెడి వారల
    మానము గొన నడుము గట్టి మార్పును గానన్!

    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ అభిలాష సత్యమై మానందరికి మేలు చేయుగాక. ధన్యవాదాలండి జిలేబి గారు.

      తొలగించండి